Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 4


    అప్పటికి పాచిక పారకపోతే మరో కవిత ఎత్తుకుంటుంది సుందర సుకుమారి.


    పార్కులో కవితలు పాడకూడదన్న రూల్స్ లేవు కదా! ఎవరిష్టం వాళ్ళది. సుందరసుకుమారికి కవిత్వం వచ్చు కాబట్టి సొంత రాగంతో పాడుతుంది. ఆ రాగం అప్పండేన్ తో ఉంటుంది. ఆ రాగానికి మిత్రురాళ్ళు ముగ్గురూ మూర్ఛపోరుగాని అక్కడ కూర్చుని వినేవాళ్ళు మాత్రం నరకయాతన పడతారు.


    పార్కు కొచ్చేది కాస్తంత హాయిగా ఊపిరి పీల్చుకోవటానికిగాను నరకయాతన పడటానికి కాదుకదా! ఈ బాదెందుకని అక్కడనుంచి వాళ్ళు లేచిపోతారు. పాచిక పారిన మిత్రురాళ్ళు వెళ్ళి ఆ చోటును ఆక్రమించుకుంటారు.


    ఇవాళ అక్కడ అలాంటి ప్రమాదమేమీ జరగలేదు. ఆ చోటు ఖాళీగానే ఉంది. నలుగురు కూర్చుని కబుర్లు మొదలెట్టారు.


    "ఎంతవరకు వచ్చింది మన ప్రయాణం?" ప్రమద అడిగింది.


    "మా ఇంట్లో చిన్న సైజు వార్ జరుగుతున్నదిలే" తలకాయ ఎగరేసి చెప్పింది వందనాదేవి.


    "యుద్ధమా! దేనికి?" ప్రమద అయోమయంగా అడిగింది.


    "మన నల్గురం ఆడపిల్లలం కదా! మనం చేసేది చిన్న సైజు సాహసయాత్ర కదా! ఐనా మమ్మీ ఇంత చిన్న విషయాన్ని అర్థంచేసుకోకపోగా నేనేదో ఒంటరిగా సప్తసముద్రాల్ని ఎదురీదుతున్నట్టుగాను- సముద్రములలో వున్న జలచరాలన్నీ నన్ను కబళించడానికి మీదకి వస్తున్నట్టుగాను...నేను వాటితో యుద్ధంచేసి ప్రమాదానికి లోనయినట్టు...ఇలా ఇలా ఊహించుకొని మమ్మీ భయపడిపోతోంది. "ఆడపిల్లలేంటి? సాహసయాత్రలేంటి?" అని కోప్పడింది కూడా.


    డాడీకి ముందరే అన్ని విషయాలు చెప్పాను. నన్ను ఒంటరిగా పంపించడం డాడీకి అంత ఇష్టంలేదు. డాడీ నేను కలిసి మమ్మీని సగందాక ఒప్పించాం.


    "సగందాకా ఒప్పించడమేమిటే" నిజంగా అర్థంగాకనే రాణి కాస్త అయోమయంగా అడిగింది.


    "నేను...డాడీ కలిసి బోలెడు అబద్ధాలు చెప్పి మమ్మీని కొంతవరకు ఒప్పించగలిగాం. మమ్మీ చిన్న లిటిగేషన్ పెట్టింది. "మీ ఇళ్ళల్లో మీ పెద్దవాళ్ళు కూడా ఒప్పుకుంటే తనకి పెద్దగా అభ్యంతరం లేదని చెప్పింది. అది కూడా పైపైన ఒప్పుకోవడమే మమ్మీకి ఇంకా ఆశే మీ-మీ ఇళ్ళల్లో మీ పెద్దవాళ్ళల్లో ఎవరో ఒకరు ఈ ప్రమాదానికి అడ్డుపెడతారని మమ్మీ కొండంత ఆశతో ఉంది. ఇప్పుడు మనం నల్గురం మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళని పూర్తిగా ఒప్పించడం మీదనే మన టూర్ ఆధారపడి ఉంది. నా పరిస్థితి అది మరి నీ సంగతేమిటి రాణీ?" వందన అడిగింది.


    "అమ్మా నాన్న ముందు మన ప్రయాణం విషయం చెప్పగానే కాస్త గొణిగారు. "నీ పెళ్ళి చూపులకి బోలెడుమంది రానున్నారు. ఇప్పుడీ ప్రయాణమేమిటి? పనిలేకపోతే సరి" అన్నారు.


    అన్నయ్య, వదిన ధైర్యం చెప్పి అమ్మా నాన్నని ఒప్పించగలిగారు. నా లైన క్లియరయింది" రాణీ చెప్పింది.


    "అమ్మయ్య! ఒకళ్ళ ఇంట్లో ఆమోదం లభించింది. రాణి విషయంలో పూర్తి లైన్ క్లియరయి పోయింది. ఇంక నీ సంగతేమిటే ప్రమద.


    "మా నాన్నగారి సంగతి నీకు తెలిసిందే కదా! పరులకి అపకారం చేయనంతవరకు ఎవరిష్టాలు వాళ్ళకుండటం...అవి చెల్లించుకోవచ్చనే చెబుతూంటారు. "నీ కిష్టమయితే నలుగురితోపాటు వెళ్ళిరా" అన్నారు. మా అమ్మకి మాత్రం పిరికిపాలు ఎక్కువ. "ఆడపిల్లలు...ఒంటరిగా ఈ ప్రయాణమేమిటి?" అంది. సందు దొరికితేచాలు మాట వేయటం మా వదిన బుద్ధి. "ఆడపిల్లలు బయటికెళితే రౌడీలవల్ల అలాంటి ఆపదలు ఇలాంటి ఆపదలు..." అంటూ సినిమా కథలు చెప్పి మా అమ్మని భయపెడుతున్నది. తమాషా ఏమిటంటే మా వదిన పోట్లాడదు... మాట్లాడుతుంది అంతే. కాకపోతే ఆ మాటలు విన్న పక్కవాళ్ళు పోట్లాడుకుంటారు అంతే."


    ప్రమద చెప్పిన తీరుకి ముగ్గురు ఫక్కున నవ్వారు.


    "మరేం ఫరవాలేదు ఈ ప్రయాణానికి మా అమ్మ కూడా ఒప్పుకుంటుంది. నాకా నమ్మకం ఉంది. మీ ముగ్గురు మా ఇంటికి వచ్చి మీ ఇళ్ళల్లో వాళ్ళు ఒప్పుకున్నారని చెబితేచాలు. వెంటనే మనం అనగా నేను తట్టా బుట్టా...పెట్టె బేడా ప్రయాణానికి సర్డుకోవడమే ఆలస్యం అనుకో!"


    "నాకన్నా మీ ఇద్దరి పని హాయిగా ఉందే. ఈ ప్రయాణం పెట్టింది నేను. ముందుగా ఆమోదం లభించింది నీకు. ఇంకా మిగిలింది సుందర సుకుమారి. చూడమ్మా సుందర సుకుమారీ! మీ బామ్మ ఏమందే తల్లీ!" వందన తమాషాగా మాట్లాడుతూ అడిగింది.


    సుందర సుకుమారి అమూల్ బేబి లాంటి శరీరంతో మొహం ముద్దుగా బొద్దుగా వున్న బొండుమల్లెలా వుంటుంది. మొహం అందంగా వున్నా కాయంచూసి పురుషులెవరూ జోలికిరారు. "ఇదీ ఒక గిఫ్టే" అంటుంది సుందర సుకుమారి. మాటకు ముందు కవితలల్లేస్తుంటుంది. అల్లటమే ఆలస్యం కక్కేస్తుంటుంది.


    సుందర సుకుమారి కవిత్వానికి చాలామంది తల వంచుకున్నారు. సుందర సుకుమారి తల్లి దండ్రి  ఒక యాక్సిడెంట్ లో ఆమె చిన్నప్పుడే పోయారు. అప్పట్నించి వాళ్ళ బామ్మే కళ్ళల్లో వత్తులు వేసుకొని చూస్తూ పాలు... మీగడ... నేతుల్లో ముంచి తేలుస్తూ నోరుతెరిస్తే "ఆకలి కాబోసు" అని అర్థం చేసుకుంటూ అడ్డమయిన గడ్డీ ఆమె కడుపులోకి పంపి మహా గారాబంగా నడిస్తే పాదాలు కందిపోతాయేమో, ఎత్తుకుంటే ఎదగదేమో అన్నంత గారాబంగా పెంచి పెద్దచేసింది. 

 Previous Page Next Page