Previous Page Next Page 
సీతాచరితం పేజి 4


    ధన స్వామ్యపు మరొక ప్రధాన లక్షణం నిరుద్యోగం. ధనస్వామ్యపు ఉత్పత్తి ప్రధానంగా పట్టణాలలో జరుగుతుంది. భూస్వామ్యానికి మూలం గ్రామాలనుకుంటే, ధనస్వామ్యానికి మూలం పట్టణాలు. పరిశ్రమలు పట్టణాలలో వుండటం వల్ల ధనస్వామ్యులకు ప్రయోజనం చాలా వుంది. అందువల్ల పట్టణాలు కేంద్రాలుగా గలది ధనస్వామ్యం. పట్టణాలలోని పరిశ్రమలు, గ్రామ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి నిరుద్యోగం కల్పించింది. అది ఎలా జరిగిందంటే మళ్ళీ నేతపనివాణ్నే ఉదాహరణగా తీసుకుంటే ఒకడు పరిశ్రమలో ఉత్పత్తి చేసే బట్ట, నేత మగ్గం మీద పదిమంది ఉత్పత్తి చేసిందానితో సమానం. అంటే ఒకనికి పని కల్పించిన పరిశ్రమ తొమ్మిది మందిని నిరుద్యోగులను  చేసింది. వస్తు వినిమయం ధనస్వామ్య సమాజంలో ఎక్కువ జరిగేది నిజం. అంటే భూస్వామ్య సమాజంలో తలసరి బట్ట వినియోగం రెండు గజాలనుకుంటే ధనస్వామ్య సమాజంలో అది రెండింతలు కావచ్చు! లేదా, మూడింతలు, నాలుగింతలు కావచ్చు. అలా జరిగినపుడు ఎక్కువమంది కార్మికులకు పని దొరుకుతుందనుకోవడం భ్రమ. ఎందుకంటే ఈ సమాజంలో శాస్త్రపరిశోధనకు ప్రాధాన్యత మెండు. వస్తు ఉత్పత్తి తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి జరగడానికి నిరంతరం కృషి జరుగుతుంది? ఈ కృషి వల్ల ఉద్యోగావకాశాలు పెరుగవు. కాని ధనస్వామ్యులకు లాభాలెక్కువ వస్తాయి.


    మళ్లీ నేతకారుణ్నే ఉదాహరణ తీసుకుంటే ఒక నేతపరిశ్రమలో పదిమంది కార్మికులు వేయిగజాల గుడ్డ ఉత్పత్తి చేస్తున్నారనుకుందాం. శాస్త్ర పరిశోధనలవల్ల ఈ వేయిగజాల బట్ట ఐదుగురే ఉత్పత్తి చేయడం సాధ్యమయింది. అలాంటప్పుడు ఆ పరిశ్రమలో చేసే 5 గురు కార్మికులు నిరుద్యోగులవుతారు. ఈ విధంగా శాస్త్రపరిశ్రమ 'కంప్యూటరైజేషన్' పెరిగినకొద్దీ నిరుద్యోగం పెరుగుతుంది. ఈ వ్యవస్థలో కీలకమైనవాడు ధనస్వామి. అతనికి లాభాలతో తప్ప వేరే నిమిత్తంలేదు. ఈ వ్యవస్థ పెట్టుబడి పెట్టేవారిపైననే ఆధారపడి వుంటుంది. అతని శ్రేయస్సు కాపాడ్డమే సమాజపు ప్రధాన లక్షణం. నిరుద్యోగం పెరిగినా జనం తిండికి అల్లాడినా, ఆకలి చావులు ఎక్కువుగా ధనస్వామ్యానికి కనికరం లేదు. అతడు నిరుద్యోగాన్ని సృష్టిస్తూనే పోతాడు. ధనస్వామ్య వ్యవస్థలో అందరికి ఉద్యోగాలు దొరకడం పుక్కిటి పురాణాలు. నిరుద్యోగాన్ని, దారిద్ర్యాన్ని నిర్మూలించిన ధనస్వామ్య దేశాలులేవు. మనిషికి మనిషికి అంతరాలు పెంచడం, ధనస్వామ్య వ్యవస్థ లక్షణం.


    ధనస్వామ్య వ్యవస్థ సృష్టించిన వ్యవస్థలలో మధ్యతరగతి ఒకటి. ఇది భూస్వామ్య సమాజంలో లేదు. ఇది ధనస్వామ్యపు సృష్టి మాత్రమే. భూస్వామ్య సమాజపు ఉత్పత్తి విధానానికి మధ్య తరగతి అక్కరలేదు. ఆ సమాజపు ఉత్పత్తి, విధానం సులభమైంది. అంత క్లిష్టంకాదు. ఆ సమాజపు ఉత్పత్తి దశలుగురించి ఇదివరకే చర్చించుకున్నాం. ధనస్వామ్యపు ఉత్పత్తికి అటు ధనస్వాములు, ఇటు శ్రామికులు మాత్రమే సరిపోరు. పరిశ్రమలో ఉత్పత్తి పనికి సమానంగా వ్రాతపని కూడా జరగాలి. పరిశ్రమలు స్థాపించడంలో నైతేనేమి, నిర్వహించడంలో నైతేనేమి, వ్రాయసగాళ్లు, ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులు, డాక్టర్లు, టీచర్లు, ఈ విధంగా అనేకమంది 'కాయకష్టం కాని శ్రమ' అవసరమవుతుంది. వీళ్లు శ్రామికులు కారు. అంటే కాయకష్టం చేయరు. అలా అని ధనస్వాములు కారు. వీరికి తమశ్రమకు తగిన ఫలితం లభించదు. ఐన వీరి స్థితి శ్రామికులు కంటే మెరుగ్గా, ధనస్వాముల కంటే అధ్వాన్నంగా వుంటుంది. ఈ వర్గం తమను శ్రామికులు అనడానికి అంగీకరించరు. ధనస్వామ్యులు కాలేరు. అటు ఉట్టికి, ఇటు స్వర్గానికి ఎక్కలేని వర్గమిది. ఐతే ఇది మేధావి వర్గం. ఆలోచించగలవారు వీరిలో చాలామంది వుంటారు. కళలు, సాహిత్యం ఈ వర్గాన్నుంచే వస్తాయి. ఈ వర్గాన్ని గురించే వ్రాస్తాయి.


    ధనస్వామ్యం మానవుని ఆలోచన విధానాల్లో అనంతమైన మార్పుని తెచ్చింది. రాజకీయంగా రాచరికాన్ని ఓడించి, ప్రజాస్వామాన్ని సృష్టించింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రాజరికాన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టించడానికి, జరిగిన పోరాటాల్లో ప్రధానపాత్ర వహించింది ధనస్వామ్యులు అనే విషయం గమనించడం అవసరం. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య సంగ్రామముల్లో ధనస్వాములు కీలకమైన పాత్ర వహించారనే విషయము అందరికి తెలిసిందే. ఈ ధన స్వాములు నిన్నటి భూస్వాములే. భూస్వామ్య వ్యవస్థను పూడ్చి పెట్టిన గౌరవం కూడా భూస్వాములకే దక్కాలి. ప్రపంచానికి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పరచిన గౌరవంకూడా ధనస్వామ్యానికి దక్కాలి. బానిస విధానాన్ని అంతంచేసి మనిషి ఆలోచనా విధానంలో 'మానవులంతా ఒక్కటే' అనే సిద్ధాంతాన్ని నిర్వచించింది కూడా ధనస్వామ్యమే. ఈ సమాజం కులమతాల కట్టుగోడల్ని కూల్చివేసింది. ప్రపంచంలోని దేశాలను దగ్గర చేసింది. మనిషికి మనిషికుండే అంతరాలను ఆర్థికంగా తప్ప మిగతా విషయాల్లో చాలవరకు తగ్గించింది. ఇది పిడివాదాన్నీ మూఢనమ్మకాల్ని పారద్రోలడానికి ప్రయత్నించింది.


    ధనస్వామ్యవర్గం మేధావివర్గపు ఆలోచనల్లో గొప్ప సంచలనాల్ని రేకెత్తించింది. యథాతథా వాదాన్ని(orthodoxy)కి స్వస్తిచెప్పించే ప్రగతి వాదానికి దారితీసింది. మేధావులు హేతువాద పద్ధతిలో ఆలోచించడం ప్రారంభించారు. ప్రతి పాత విలువను గురించి, మూఢ విశ్వాసాలను గురించి ప్రశ్నించారు, ధిక్కరించారు. లౌకికతను గురించి ఆలోచించడం ప్రారంభించారు. ధనస్వామ్యం ఆలోచనా స్వేచ్ఛను ప్రసాదించింది. ఆర్ధికరంగంలో అన్ని రంగాల్లో కొంతలో కొంత స్వేచ్ఛ నిచ్చింది.


    పాత విలువలను ప్రశ్నించడం, హేతువాదంతో ఆలోచించడం, ధనస్వామ్యం ప్రసాదించిన ఒక గొప్పవరం. మేధావులు మూఢవాదాన్ని ధిక్కరించడంలో శాస్త్రప్రగతి మూడుపూలు ఆరుకాయలుగా కొనసాగింది. భూమి గుండ్రంగా వున్నందున గెలీలియొను ఉరితీసిన కాలంపోయింది. సర్వం దైవప్రసాదం అనే మూఢవిశ్వాసానికి భరతవాక్యం పలకడం జరిగింది. ప్రతిదీ మానవ మేధస్సుపైనే ఆధారపడి వుందని ప్రకృతిని లోబర్చుకోవడం చేయవచ్చునని మేధావులు కనుగొన్నారు. శాస్త్రజ్ఞులు, మేధావులు, పురోగామి దృక్పథంతో ఆలోచించడం ప్రారంభించారు. దానితో శస్త్రవిజ్ఞానం అనంతంగా పెరిగిన శాస్త్ర విజ్ఞానంతో మారిన జీవితం భూస్వామ్యదశ నుండి పోల్చుకోరానిదిగా పరిణమించింది.


    మానవజీవితాన్ని మహిమాన్వితం చేయడానికి ధనస్వామ్యం సాధించిన ప్రగతికి అభినందించక తప్పదు. కాని ఈ ప్రగతి సాంతం ఎవరికి అందుతోంది? దీన్ని ఎవరు అనుభవిస్తున్నారు? అని ప్రశ్న వేసుకుంటే, ఇందువల్ల లాభం పొందుతున్నవారు ఏ కొద్దిమందో ధనాధిపతులు అని తేలుతుంది. అత్యంతమైన ఆధునిక దేశాల్లో సైతం, డబ్బులేని వారికి ఈ శాస్త్రవిజ్ఞానం ఎంతవరకు ఉపకరిస్తుందనే విషయం ఆలోచించాలి. ఈ సమాజంలో గల సౌకర్యాలన్నీ సంపన్నులకే చెందుతున్నాయేమో, సామాన్య మానవుడు ప్రగతి పథంలో పయనిస్తున్న శాస్త్రవిజ్ఞానాన్ని చూస్తు కూడా "అంగట్లో అన్నీ వున్నాయి. అల్లుని నోట్లో శనివుంది" అన్ని సామెతలో పరిణమించినట్లు కనిపిస్తుంది.


    ధనస్వామ్య సమాజంలో మానవసంబంధాలకు ధనం ప్రధానమైన అడ్డుగోడ. ప్రతి మానవ సంబంధానికి డబ్బు, అంతస్తు అడ్డువస్తాయి. ఇచ్చట ప్రేమకు అనుబంధానికి, ఆత్మీయతకు, అనురాగానికి విలువలేదు. ఈ విలువలన్నీ డబ్బుచుట్టు పరిభ్రమిస్తుంటాయి. డబ్బు అంతస్థులను నిర్ణయిస్తుంది. ఆదాయాలను బట్టి వర్గీకరించబడిన సమాజంలో మనిషికీ, అతని విలువకు స్థానముండదు. తల్లికి, బిడ్డకు, భర్తకు, మిత్రునికి, ఉన్న ఘనిష్టమైన సంబంధాలు కూడా డబ్బునెపంతో చెడిపోవడం, చెదిరిపోవడం జరుగుతుంటాయి. మనిషిని మనిషిగా కాక మనిషికున్న ఆస్థినిబట్టి విలువలు నిర్ణయించడం జరుగుతుంటుంది. రచయితలు, కళాకారులు, శాస్త్రజ్ఞులు, వీరి విలువలను సైతం వారికున్న ప్రతిభను బట్టిగాక వారికి వచ్చే ఆదాయాన్ని బట్టి వారి అంతస్తును నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా సకల రంగాల్లో సంపద పెత్తనం చెలాయించడం జరుగుతుంది. ఈ విధంగా సకల రంగాల్లో సంపద పెత్తనం చెలాయించడం ఈ సమాజలక్షణం. భూస్వామ్యంలో అధికారం నుంచి సంపద ఉద్భవిస్తే - ధనస్వామ్యంలో సంపద నుంచి అధికారం ఉత్పన్నమవుతుంది. సకలానికి సాధనం కాబట్టి ఇది ధనస్వామ్యం అయింది.

 Previous Page Next Page