Previous Page Next Page 
లక్ష్యం పేజి 5


    వాటిమధ్య తన సున్నితమైన పాదాల్ని అడ్డుపెట్టి ఆడుకుంటోంది చిన్నపిల్లలా, చిన్న ప్రవాహాన్ని ఆపి వదులుతోంది. తడుస్తోంది ఆస్వాదిస్తోంది, అనుభూతిస్తోంది.

 

    ఆమె నల్లటి, చిక్కటి జుత్తు తడిచి పసిడివెన్నెల పాలరాయిలాంటి ఆమె వీపు మీద పర్చుకుపోయి నీరును ఒడుస్తోంది.

 

    బాపుబొమ్మా, పికాసో పెయింటింగ్, మైఖెలాంజిల్ మధురోహ, ఏమ్. ఎఫ్. హుస్సేన్ కల, ఫలక్ నూమా ప్యాలస్ పాలరాతి విగ్రహం... జీవం పోసుకుందా? సజీవమై కళ్ళెదుట నిలిచిందా? ఏ గంధర్వ కన్యో అటుగా ఆకాశమార్గాన ప్రయాణిస్తూ మడికెరి అందాలకు మతిపోగొట్టుకుని దిగిందా? కామోసు... అన్నట్లుగా వున్న మహతిని చూసి మధుకర్ తన మతిని పోగొట్టుకున్నాడు.

 

    వర్షం నుంచి తలదాచుకోటానికి వచ్చిన మధుకర్ ఆ విషయాన్నే మర్చిపోయాడు.

 

    "ఏమైందిరా వీళ్ళకు? మొన్నటిదాకా తెగ ప్రేమించేసుకున్నారు. ఇప్పుడేమో అపరిచితుల్లా మసలుతున్నారేమిటి?" విజయ్ వాళ్ళిద్దరికేసి చూస్తూ ఆశ్చర్యపోతూ అన్నాడు.

 

    "అదే నాకు అర్థం కావడం లేదు. పోనీ చనువుగా అడుగుదామా అంటే... ఇద్దరూ ఉన్నంతసేపు ఫ్రెండ్లీగా వుంటారు. లేదంటే గంభీరంగా వుంటారు. వాళ్ళకిష్టంలేని విషయం అడిగితే కోపపడతారు" అన్నాడు సురేష్.

 

    "ఏమిటి, కదలరా..." ఎకనామిక్స్ లెక్చరర్ మందలిస్తున్నట్లుగా అన్నాడు.

 

    నిధిదయాళ్ చూపుడువేలితో మహతిని చూపించాడు.

 

    "మహతీ... మహతీ..." లెక్చరర్ పిలిచాడు.

 

    "కోర్టులో జవాన్ పిలిచినట్లు ఆ మాడ్యులేషన్ ఏమిటి..." ఎవరో ఒకరన్నారు.

 

    అది అందరికీ వినిపించింది.

 

    లెక్చరర్ కి కూడా.

 

    కాని, నిధిదయాళ్ నవ్వాడు కిసుక్కున.

 

    "పీపాలా, ఏమిటిరా ఆ నవ్వు" లెక్చరర్ విరుచుకుపడ్డట్లుగా అన్నారు.

 

    మొత్తంమీద మరో అయిదునిమిషాలకు కదిలి కర్నాటక స్టేట్ టూరిజమ్ డిపార్ట్ మెంట్ కి చెందిన గెస్ట్ హౌస్ లో విడిదిచేశారు.

 

    వర్షం పెరిగింది. సాయంత్రమయింది.

 

    మంచుపొగ మరింత సాంద్రతని పెంచుకుంది. వర్షం జోరున కురవటం ఆరంభించింది. "సంవత్సర కాలంలో ఆరేడు నెలలు జూన్ నుండి డిసెంబర్ వరకు వాతావరణం ఇంతే. జనవరి నుండి మార్చి వరకు విపరీతమైన చలి, మంచు. కేవలం ఏప్రిల్, మే నెలలే ఒకింత పొడిగా వుండేది" లెక్చరర్ చెప్పుకుపోతున్నాడు.

 

    ఫైర్ ప్లేస్ నుండి వేడి వస్తోంది.

 

 

    అందరూ ఆ వెచ్చదనాన్ని అనుభూతిస్తున్నారు. చీకటి దుప్పటి సాయంత్రమవుతూనే ఆ ప్రాంతాన్ని కప్పేస్తుంది. ఆ పైన దట్టమైన పొగ మంచు, ఫాగ్ లైట్స్ లేకుండా వెహికల్స్ అంగుళమైనా కదలవు.

 

    అందరూ ఫైర్ ప్లేస్ ముందు గుమికూడి వుంటే, మహతి మాత్రం వారికి దూరంగా కూర్చుని మంటకేసే తదేకంగా చూస్తోంది.

 

    మధుకర్ తనను తాను సమీక్షించుకుంటున్నాడు. లెక్చరర్ చెప్పుకుపోతున్నాడు.

 

    "ది రిచ్చెస్ట్ క్రాప్... అంటే కాఫీనే. పర్ ఇయర్, ఒక్కోసారి ఎకరాకి లక్ష రూపాయలు ఆదాయం కూడా రావచ్చు. దానికి తోడు మిరియాలు, యాలకులు, జీడిపప్పు, కమలాలు సెకండరీ క్రాప్ గా పండిస్తుంటారు.

 

    పడిన చినుకు పడినట్లు జారిపోయే ఈ ఎర్రమట్టి కొండల్లో బంగారం పండుతుంది. లో టెంపరేచర్. నీరుని జార్చే వాలు వున్న కొండలు, చలి, మంచు కాఫీ తోటలకి శ్రేష్టం.

 

    ఇక్కడి వారిమీద బ్రిటీషర్స్ ప్రభావం ఎక్కువ.

 

    రాజసం, హుందాతనం ఇక్కడ ప్రతివారిలో కనిపిస్తాయి.

 

    దక్షిణ భారతదేశీయుల్లాగే కూర్గీస్ కూడా ద్రవిడయన్ రేస్ నుంచి వచ్చినవారే.

 

    17వశతాబ్దం వరకు వీరి ప్రిన్సిపాల్ లాంగ్వేజ్ కొడగు.

 

    హాలేరీ రాజుల కాలం నుంచి కొడగు భాష... మలయాళం భాష ప్రభావం తగ్గిపోయి, విచిత్రమైన సమ్మేళనాన్ని సంతరించుకుంది.

 

    ఇంట్రస్టింగ్ అమాల్గమేషన్ ఆఫ్ నైబరింగ్ లాంగ్వేజెస్... లైక్ తుళు, తెలుగు, కన్నడ, తమిళం అండ్ మలయాళం.

 

    ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తులు రెండే...

 

    ఒకటి మిలటరీలో చేరటం, రెండు వ్యవసాయం.  

 

    మనలాంటి పేదరైతుల అరా, కొరా వ్యవసాయం కాదు.ఆల్ హైలీ రెమ్యునరేటివ్ క్రాప్స్. లక్షలు తెచ్చిపెట్టే పంటలు.

 

    ఇక్కడ రైతుల మారుతీ 118, కంటెస్సా డిక్కీల్లో ఎరువులు, ఫెస్టిసైడ్స్ వేసుకుని వెళ్తారు.

 

    బాగా తింటారు, తాగుతారు కూడా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫైర్ ప్లేస్, డైనింగ్ టేబుల్స్, ఫోర్క్స్, డెలీషియస్ ఐటమ్స్, నేప్ కిన్, టిష్యూ పేపర్స్ వాడుతారు. వీరిమీద వున్న బ్రిటీషర్స్ ప్రభావం మూలంగానే వారి అలవాట్లు కూడా మారిపోయాయి.

 

    చేతినిండా డబ్బు, ఇంటినిండా కార్లు, అయినా బాగా కష్టపడతారు.

 

    ఇక్కడ హీనాతిహీనంగా, హేయంగా ఎవర్ని చూస్తారో తెలుసా? సోమరిపోతుల్ని.

 

    ఇక్కడి ప్రజలు ఒకరినుంచి ఒకరు అప్పు తీసుకుంటే ప్రామ్ సరీ నోట్స్ రాసుకోవటం వుండదు.

 

    సాంప్రదాయకంగా వస్తున్న బ్రాస్ ఆయిల్ లాంప్ ముందు లావాదేవీలు జరుగుతాయి. ఇంపార్టెంట్ ఫ్యామ్లీ డెసిషన్స్, ముఖ్యమైన సంఘటనలు, అగ్రిమెంట్స్, పెళ్ళి నిశ్చితార్థాలు కూడా ఆ లాంప్ ముందే జరుగుతాయి.

 

    ఇక్కడున్న ప్రతి ఇంటిలో అలాంటి దీపం ఒకటుంటుంది. దాన్ని ఉదయం, సాయంత్రం వెలిగిస్తుంటారు.

 

    అప్పు ఎగ్గొట్టడం మహాపాపం క్రింద పరిగణిస్తారు. ఆ పైన వదిలేస్తారు.

 

    దీపం ముందు ఇచ్చిన మాట తప్పటం మహానేరంగా పరిగణిస్తారు.

 

    ఇక్కడ ప్రతి ఒక్కరూ నాన్ వెజిటేరియన్స్. మనం ఒక రోజంతా తినే ఆహారాన్ని వీళ్ళు ఒక్కసారే చాలా తేలిగ్గా తినేస్తారు.

 

    ఇక్కడి ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కువ. మనకు ఎంతో కొంత ఇవ్వవలసి వుండి అవతలి వ్యక్తి అదిచ్చినప్పుడు దాన్ని మనం నమ్మి వెంటనే జేబులో పెట్టుకోవాలి. వారిముందే లెక్కేస్తే, దాన్ని వాళ్ళు తీరని అవమానంగా భావిస్తారు.

 

    ఎంత కష్టపడతారో అంతగా తింటారు, తాగుతారు. జీవితాన్ని అనుభవిస్తారు. నీతినిజాయితీలంటే ప్రాణమిస్తారు. ఆత్మాభిమానం, ఆభిజాత్యం కోసం చచ్చిపోతారు.

 

    "వీళ్ళకు వేరే రకం వినోదం లేదు. కావాలనుకున్నప్పుడు అటు బెంగుళూరో ఇటు మంగళూరో వెళ్లి ఒక వారం గడిపి వస్తారు."

 

    లెక్చరర్ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సాంప్రదాయాల్ని, మానవ విలువల్ని కలిపి చక్కగా వివరిస్తుంటే నలుగురు తప్ప అందరూ శ్రద్ధగా వింటున్నారు.

 Previous Page Next Page