Previous Page Next Page 
లక్ష్యం పేజి 6


    ఇద్దరు ఇక్కడుండి, మరో ఇద్దరు అక్కడలేక- అక్కడుండి కూడా లేనట్లుగా ప్రవర్తిస్తున్నవారు మధుకర్, మహతి.

 

    లేనివాళ్ళు మేరీ, విజయ్. "ఇక్కడ హీనాతిహీనంగా, హేయంగా ఎవర్ని చూస్తారో తెలుసా?" ఉన్నట్లుండి, అసంకల్పితంగా, పెద్దగా అంది మహతి తదేకంగా ప్లేస్ కేసే చూస్తూ.

 

    అప్పటివరకు మౌనిలా ఉన్న మహతి ఒక్కసారి అలా మాట్లాడేసరికి అందరూ ఆమె వైపు విస్మయంగా చూసారు.

 

    "చెప్పండి, అప్పుడే మర్చిపోయారా?" తిరిగి అంది బిట్టర్ గా.

 

    "సోమరిపోతుల్ని" ఎవరూ అనకపోయేసరికి లెక్చరరే తిరిగి అన్నారు.

 

    మహతి చటుక్కున మధుకర్ వైపు చూసింది.

 

    అతని ముఖం వివర్ణమయింది.

 

    "Better to die on your feet than live on your knees..." అనే సత్యాన్ని ఇక్కడ బాగా విశ్వసిస్తారు. కదా మాస్టారు...? ఎక్కడయినా దాన్నే కదా విశ్వసించాలి?" డ్రీమీగా అంది మహతి.

 

    ఆమె సడన్ గా అలా ఎందుకందో?

 

    ఆ మాటలు ఎందుకు మాట్లాడుతుందో... అర్థంకాలేదు వారికి.

 

    కాని మధుకర్ కి అర్థమయింది.

 

    కొన్ని రోజుల క్రితం మహతి తన డైరీలో రాసుకున్న వాక్యాలు కూడా అతనికి గుర్తుకొచ్చాయి.

 

    ప్రేమ నీ స్థాయికి దిగిరాదు.... నీవే ప్రేమస్థాయికి ఎదగాలి.

 

    గాఢంగా ప్రేమించుకొనే యువతీ యువకుల ప్రేమ ప్రపంచానికి నటిస్తున్నట్లుగా కనబడుతుంది.

 

    ప్రేమను నటించేవాళ్ళు నిజమైన ప్రేమికులుగా కనిపిస్తారు. అదే ప్రేమలోని విచిత్రం!

 

    తనదైన ప్రపంచం చిన్నదైనా, తనకోసం, తను కోరుకున్న వారికోసం బ్రతకాలనిపిస్తుంది.

 

    ప్రేమని, ఆరాధనని, అనుబంధాన్ని, ఆవేదనని, అవసరాల్ని, బాధల్ని, భయాల్ని నిర్భయంగా వెలిబుచ్చటం జరుగుతుంది.

 

    తనకు కావాల్సిందేమిటో తనను ప్రేమించేవారికి అవసరమైందేమిటో అవగతమవుతుంటుంది.

 

    అప్పుడే మొదలవుతుంది జిజ్ఞాస...

 

    తనకు తెలిసిన ప్రపంచం చిన్నదని.

 

    తను తెల్సిన వ్యక్తులు తక్కువని...

 

    ఆ జిజ్ఞాస ఏ అంచుకు తీసుకువస్తుందో తెలుసుకోకుండానే తన చిన్ని ప్రపంచపు హద్దుల్ని చెరిపేసుకుంటూ, అతి పెద్ద ప్రపంచంలోకి అడుగు పెడుతుండగానే వింత వ్యక్తులు, విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి.

 

    నిజానికి తనకవసరం లేని ప్రపంచం గురించి తెల్సుకోవాల్సిన అవసరం లేదు.

 

    కాని... అర్థం లేని జిజ్ఞాసతో అంతరంగంలో దాగి వుండే అతి మెత్తని... సుతిమెత్తని ప్రేమైక సామ్రాజ్యపు పొరకి నిర్ధాక్షిణ్యంగా నిప్పు పెట్టేసుకుంటారు.

 

    ఆపైన వారి మాటల్లో, చూపుల్లో, కదలికల్లో మొరటుదనం కనిపిస్తుంది. మెత్తదనం ఇరిగిపోతుంది. నాజూకుతనం అంతరించిపోతుంది. స్పందించే మనసు చైతన్యాన్ని కోల్పోస్తుంది.

 

    అప్పటినుంచే ఆత్మవంచన ఆరంభమవుతుంది. అర్థరహితమైన గంభీరత వ్యక్తిత్వాన్ని కప్పేస్తుంది. తన మానసిక అవసరాలకు కపట పరిపూర్ణత ముసుగుని, శారీరక అవసరాలకు ఆత్మవంచన కవచాన్ని తొడిగేసుకుని జీవితాన్ని అపురూపమైన జీవితాన్ని అనంత విశ్వంలోకి తోసివేసి ఎడారిగా మిగిలిపోతారు.

 

    అందుకే మనిషి ఎప్పుడూ రెండుగా విడిపోవాలి. బరువు బాధ్యతల్ని మోసేందుకు, బ్రతుకుదెరువును సులభతరం చేసుకొనేందుకు తనది కాని, తనకు ఎదుట నిలిచే ప్రపంచానికి డిప్లోమేట్ గా కనిపించాలి, వ్యవహరించాలి.

 

    అనుభూతించగలిగే తనలోని తన ప్రపంచానికి మాత్రం, పసిగానే, మొగ్గగానే, బోసినవ్వుతోనే స్వాగతం పలకాలి.

 

    తను బ్రతుకే ప్రపంచం...

 

    తనను బ్రతికించే ప్రపంచం...

 

    రెండూ విడిపోయే మనగలగాలి.

 

    బుష్ ప్రపంచానికి అమెరికా ప్రెసిడెంట్... తన భార్యకు....? ప్రెసిడెంట్ కాదు... ప్రేమించి, ఆరాధించే అతి సుందర స్వభావుడు- ప్రేమికుడు.

 

    వాటిమధ్య సరిహద్దుని చెరిపేస్తే?!!

 

 

    ప్రేమించటానికి అర్హత అక్కర్లేదేమో... కాని ప్రేమింపబడటానికి అర్హత కావాలి.

 

    ఎందరో ఆడపిల్లలకి డబ్బున్న అత్తా, మామలు చాలేమో....

 

    కాని నాకు మాత్రం డబ్బు సంపాదించగలిగే మొగుడు కావాలి, డబ్బున్న అత్తామామలు కాదు. నాకు నువ్వు కట్టే తాళి నీ కష్టార్జితంతో కొన్నదై వుండాలి.

 

    నే పెట్టుకోవాల్సిన మల్లెపూలు...

 

    కట్టుకోవలసిన శోభనం చీర...

 

    నోరు తీపి చేసుకోవలసిన స్వీట్స్...

 

    మన అనురాగాన్ని, అనుబంధాన్ని పంచుకోవటానికి తాగేపాలు... అన్నీ నీకై నీవు నీ కష్టార్జితంతో తెచ్చినవే కావాలి.

 

    ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, వ్యక్తిత్వంతో సమ్మిళితం కాని ప్రేమకి పునాదులుంటాయంటే నేను నమ్మను.

 

    కేవలం వయస్సు, వ్యామోహం, కాంక్ష, ఆకర్షణ ప్రాతిపదికగా ఏర్పడే ప్రేమ, పుట్టే ప్రేమపై నాకు గౌరవం లేదు.

 

    ఎవరి కష్టార్జితమైతే నేమిటి? అనుభవిస్తే పోలే... అనే వాళ్ళంటే నాకు అసహ్యం. అలాంటి స్త్రీ జాతిమీద నాకు మరింత అసహ్యం.

 

    నామీద నీకున్న ప్రేమ వివేకవంతమైనదే, నిజమైనదే అయితే, నీకోసం నీ తండ్రి కూడబెట్టిన అపార సంపదను వదిలి రోడ్డుమీదకు రా.

 

    మరో విషయం... అది త్యాగమనుకొనేవు... కాదు- ప్రేమకి నీవిచ్చే గౌరవం.

 

    విచిత్రమైన అభిప్రాయాలు... వింత వ్యక్తిత్వం.

 

    తల విదిలించి లేచాడు మధుకర్.

 

    ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయిన మహతికి అంత లోతయిన మనస్సుందని, భావాలున్నాయని తెలీని మధుకర్ షాక్ తిన్నాడు. నా మనస్సుకు అద్దం నా డైరీ చదువు అని తను కాఫీ తెచ్చేందుకు వంటింట్లోకి వెళ్ళినప్పుడు తను చదివిన వాక్యాలు అవి- తను చదివిన ఆమె మనస్సది.

 

    తన వెనుక గుట్టలుగుట్టలుగా పడివున్న సంపదను ప్రశ్నించే వాక్యాలవి. తనను మూగివున్న సుఖాన్ని, సౌఖ్యాల్ని సమస్త వస్తు సంపదను దూదిపింజల్ని చేసే సుడిగాలిని మోసుకొచ్చిన వాక్యాలవి. అవన్నీ గుర్తుకొచ్చిన మధుకర్ గిరుక్కున వెనుతిరిగాడు. అంతే- ఆ మరుక్షణమే ఆ గెస్ట్ హౌస్ ని ఎవరికీ తెలీకుండా ఖాళీచేసి మార్కెరా టు బెంగుళూరు బస్ ఎక్కాడు.

 

    తన మాటలు మధుకర్ లో ఎంత తుఫాను రేపి వుంటాయో మహతి సరీగ్గానే ఊహించగలిగింది.

 

    కానది ఎంతటి విపరీత ఘటనలకు దారితీస్తుందో ఆమె ఊహించలేదు. మధుకర్ లేడని వాళ్ళు గ్రహించేసరికి అతను శొంఠికొప్ప టౌన్ ని దాటేశాడు.

 

                                   *    *    *    *

 Previous Page Next Page