నెగిటీవ్ గా ఆలోచించే వాళ్ళకు-
నిరాసక్తత, నిర్లిప్తతని ఆశ్రయించి, ముసుగెట్టి పడుకొనే వాళ్ళకు- నష్టపోయినవాడు దెబ్బతిన్నవాడే ఉదాహరణగా కనిపిస్తాడు. జీవితంలో నష్టపోయినవార్ని, సర్వం కోల్పోయినవార్ని ప్రత్యక్షంగా చూసి భయపడిపోతాడు.
ఆబ్జక్టివ్ స్టిమ్యులస్...
ఫలానావాడు అయిపోయాడట, నష్టపోయాడట, ఆరిపోయాడట అని విని మరోసారి భయపడిపోతారు.
సబ్జెక్టివ్ స్టిమ్యులస్...
ఇక, ఈ మానసిక రుగ్మతలే మనిషి జీవితాన్ని పూర్తిగా ఆక్రమించుకుపోతే ఇక సాధించేదేమిటి? ఒరగబట్టేదేమిటి?
* * * * *
బెంగుళూరులో బస్ బయలుదేరిన ఐదుగంటలకు కొడగు జిల్లా పరిధిలోకి ప్రవేశించింది.
చిన్న చిన్న పర్వతశ్రేణులు ఆకుపచ్చ పట్టు తివాచీని మీద పర్చుకున్నట్లున్నాయి. మనోహర దృశ్యం... మనస్సును భావోద్వేగానికి గురి చేసే పసిడి దృశ్యం.
అప్పటివరకు బస్సులో నానా అల్లరి చేసిన విద్యార్థిని, విద్యార్థులు తలలు పక్కకి తిప్పి కనులపండుగగా కనిపిస్తున్న దృశ్యాన్ని తిలకించటంలో తన్మయులయిపోయారు.
బస్ మరో అరగంట ప్రయాణించాక కుషాల్ నగర్ టౌన్ లోకి ప్రవేశించి డీజల్ కోసం బంక్ ముందాగింది.
అక్కడినుండే ప్రకృతి అందాలకు అద్దంపట్టే కూర్గ్- నిజమైన పరిసరాలు ఆరంభమౌతాయి.
పదినిమిషాలకు తిరిగి బస్సు బయలుదేరింది. కుషాల్ నగర్ సరిహద్దులు దాటగానే మొదలయ్యాయి కాఫీతోటలు...
అక్కడక్కడా వాటి మధ్య రిజర్వ్ డ్ ఫారెస్ట్.
ఆ ఫారెస్ట్ లో వరుసగా వేల సంఖ్యలో ఉన్న టేకువృక్షాలు, నిలువెత్తు పొదలు... పచ్చికబయళ్ళు... ఐదడుగుల ఎత్తులో పొదల్లా కనిపించే కాఫీ మొక్కలు... వాటి మధ్య నీడ కోసం పెంచిన తునిసి, కోడిసి, దేవదారు, సింధూర, జమ్మి, బండారు, ఏగిస చెట్లు... వాటికి అల్లుకుపోయిన పెప్పర్ క్రీపర్స్ (మిరియాల మొక్కల తీగలు) యేలకులు, జీడి మామిడి వృక్షాలు...
అందమైన ఆడపిల్ల వాలుజడ పాయల్లా మెలికలు తిరిగిన రోడ్లు, లోయలు... శిఖరాలు... చల్లని ఈదురుగాలులు... చిరుజల్లులు...
మధ్య మధ్యలో బెంగుళూరు పెంకుల కప్పులతో కనిపించే చిన్న చిన్న ఇళ్ళు... సన్నటి ఎర్రమట్టి కాలిబాటలు.... ఫీస్ట్ టు ఐస్... రెండు కళ్ళూ చాలవు... కొండల్ని మధ్యగా తొలిచి దారిచేసినట్లున్న రోడ్ పొగమంచుకి, చిరుజల్లుకి తడిచి మెరుస్తోంది. రోడ్ కి ఇరువైపులా ఎర్రమట్టి ఒడ్లు... విరిగి రోడ్ మీద పడతాయేమోనన్నట్లుగా వున్నాయి. ముదురు ఆకుపచ్చ కాఫీ మొక్కలు జూలై నెలకి చిగుర్లు తొడిగి, కందిగింజ పరిమాణంగల కాఫీకాయలు కలిగి వుంటాయి... గుత్తులు గుత్తులుగా కాయలు.
ఆ ప్రకృతిని చూసి పరవశించని వార్ని గిరీశం మాటల్లో చెప్పాలంటే ఉత్త వెధవాయిలు... బడుద్ధాయిలు... ఒకింత కరుకుగా చెప్పాలంటే దున్నపోతులు, దున్నపోతుల మీద పడే చిరుజల్లు... పొగమంచు... తడిసిన నేలవాసన ఏ అనుభూతిని కలిగించగలవు?
వర్షపు చినుకుల్ని సమ్మిశ్రితం చేసుకున్న పొగమంచు ఆ పర్వతశ్రేణుల్ని కమ్ముకుపోయి వుంది. ఉండుండి చిరుజల్లు... అది పెరిగి కొద్దిపాటి వానగా మారి బద్ధకంగా కురుస్తోంది.
బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్న ఆ ప్రాంత ప్రజలు రెయిన్ కోట్స్, హేట్స్ తో అక్కడక్కడా కనిపిస్తున్నారు... హడావిడిగా వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నమై తిరుగుతున్నారు. మహతి పరిసరాల్ని, బాహ్య ప్రపంచాన్ని ఎప్పుడో మరిచిపోయింది. తియ్యటి భావోద్వేగపు ప్రకంపనాలు ఆమెను పరవశింప చేస్తున్నాయి. సౌతిండియన్స్ స్విట్జర్లాండ్... ఏస్....
ఘాట్ రోడ్... ఎత్తయిన ప్రదేశానికి ఎక్కుతున్న బస్సు స్ట్రెయిన్ తీసుకుంటోంది.
అంతలో కనిపించింది మార్కెరా ఒన్ కిలోమీటరు అన్న బోర్డు... తుప్పు పట్టిన ఐరన్ షీట్ మీద తెల్లటి అక్షరాలు...
కూర్గ్ జిల్లా హెడ్ క్వార్టర్స్...
ది లాండ్ ఆఫ్ ది మిలటరీ జనరల్స్.
కరియప్ప. తిమ్మయ్యలాంటి అసాధారణ మిలటరీ జనరల్స్ జన్మస్థలం అది.
ధైర్యసాహసాలు, నీతి నిజాయితీలు ఆ ప్రాంత ప్రజల సొత్తు...
మరో పదినిమిషాలు ప్రయాణించిన బస్సు కూర్గ్ ఆర్.టి.ఓ. ఆఫీస్ ముందాగింది.
ఆకుపచ్చగా కనిపించే అనంతమైన పర్వతశ్రేణుల పైకి దృష్టిని సారించిన కొద్దీ నీలిరంగుకి మారి, ఆ పైన వెండి రంగు మబ్బులతో కలిసిపోయి నింగి నేల ముద్దాడినట్లున్న అపురూప దృశ్యం.
కొండలపై మెట్లు నిర్మించినట్లుగా వున్న చిన్న చిన్న ఇళ్ళు... వాటిముందు ప్రకృతే పరచినట్లున్న పచ్చటి లాన్స్... ఇంత అందమైన, అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడే వున్నాయా! మనదేశంలోనే!?
ఇంటిచెట్టు వైద్యానికి పనికిరాదా?
వస్తుంది. చూడగలిగే కళ్ళు, అనుభూతించగలిగే మనసు వుంటే పనికి వస్తుంది.
ఇదేనేమో స్వర్గం అంటే... ఈడెన్ ఆఫ్ ది నేచురల్ లవర్స్... షాంగ్రిలా ఆఫ్ ది నాన్ మెటీరియలిస్టిక్ ఎమోషనల్ పీపుల్.
"బస్ నుంచి దిగకుండా ఈ దిక్కుమాలిన వర్షమేమిటి?" సుధారాణి అంది ఒకింత చిరాకును ప్రదర్శిస్తూ.
"ఇలా అయితే ఏం ఎంజాయ్ చేస్తాం...? చలికి చచ్చి వూరుకుంటాం" నిధి దయాళ్ అన్నాడు.
"అమ్మో జలుబో... ఫ్లూనో... న్యుమోనియానో వస్తుంది" మరొకరన్నారు.
నవ్వుకుంది మహతి వారి అసహనాన్ని, అసంతృప్తిని చూసి.
పూర్ క్రీచర్స్...
వీళ్ళలో ఏ భావమూ నిజమైనది కాదు.
ఏ ఫీలింగ్ కి ఫర్ ఫెక్షన్ వుండదు.
దేవుడి గర్భగుడిలోకి వెళ్లినా, చేతివేళ్ళ ఉంగరాల్ని- ఉన్నాయో, లేవో అని తడుముకొనే పిచ్చి జనం.
పుట్టింది కేవలం తిండి, నిద్ర, సెక్స్, పేరు ప్రతిష్టలు, సంపాదన, ఆత్మవంచనకే అనుకొనే నిర్భాగ్యులు.
స్పందించే హృదయాన్ని సమాధి చేసుకున్న పుట్టు దరిద్రులు, అనెమోషనల్ అంధులు...
బస్ దిగుతూనే అందరూ ప్రక్కనే వున్న షాప్స్ లోకి వెళ్ళి తడవకుండ తలదాచుకుంటుంటే మహతి అంగుళమైనా కదల్లేదు. వర్షపు నీరు సన్నటి నీటి పాయలుగా కాళ్ళ మధ్య నుంచి ప్రవహిస్తూంది.