Previous Page Next Page 
ఉషోదయం పేజి 4

    స్కూల్ మానెయ్ అనేవారు - అప్పుడు ఆయనమాట విని మానేసి వుంటే ఓ జూనియర్ కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ అన్న హోదా దక్కేదా నాకు. శారదకి మంచి లాయరుగా పేరుంది. ఎందుకు మానాలిరా తను, తనకో గుర్తింపు కావాలని ప్రతి స్త్రీ కోరుకోవడంలో తప్పులేదు" సత్యవతి కోడలి తరుపున వకాల్తా తీసుకుంది.
    "నీ అండ చూసుకునే ఆవిడ మరీ ఆడుతోంది. నీకు నాకంటే కోడలే ఎక్కువ" ఎప్పుడూ పాడే పాటపాడి ఉడుక్కుంటూ వెళ్ళిపోయాడు.
    రాహుల్ కి తక్కువ మార్కులు వస్తే ఆవిడకి వాడి చదువుకంటే ఉద్యోగం ముఖ్యం. రాహుల్ అన్నం తిననని మారాం చేస్తే ఈనాటి ఆడవారికి పిల్లలని లాలించి, ప్రేమగా తినిపించే తీరిక ఎక్కడ అని వ్యంగ్యం....కొన్నాళ్ళు బాధపడ్డా అలవాటై, అతని తత్వం అర్థం అయ్యాక పట్టించుకోవడం మానేసింది.
    ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ప్రకాషేనా తన వెంటపడి, ఆరునెలలు తిరిగి ప్రేమించానంటూ కబుర్లు చెప్పి, పెళ్ళిప్రపోజల్ తెచ్చి ఒప్పుకునే వరకు వీర ప్రేమికుడిలా పోజుకొట్టాడు!
    తండ్రికెందుకో తనని జర్నలిజం కోర్సు చేయించి తన తరువాత తన పత్రిక 'ఉషోదయం'ని నడపాలని కోరిక. 'ఉషోదయం' పత్రిక అందరికీ శుభోదయం పలకాలన్న కోరిక వుండేది. తను 'లా' చదువుతా నన్నప్పుడు ఆయనకాస్త నిరాశపడ్డారు.
    చిన్నప్పటినుంచి సినిమాల్లో లేడీ లాయర్లు నల్లకోటు వేసుకుని యువరానర్ అంటూ వాదించడం ఆసక్తిగా చూసేది. ఆ ఆసక్తి కోరికగా మారి 'లా' చదవాలనుకుంది. తండ్రి నిరాశపడ్డా తన ఇష్టాన్ని కాదనలేదు.
    "మీ చిన్నకూతురుందిగా అది చదువుతుందిలెండి" అంది లలితమ్మ.
    "అవును డాడీ, మీ పత్రిక నాది. చూస్తూ వుండండి దాన్నెలా నడుపుతానో" ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న నీరద గొప్పగా అంది. "ఇంకేం డాడీ మీరు రిటైరయ్యేలోగా నీరద అందుకుంటుందిలెండి" అంది శారద.
    "ఇందులో రిటైర్మెంట్ అనేది వుండదు, ఓపిక వున్నన్నిరోజులు నడపడమే."
    "అదే డాడీ, నీరద కోర్సుచేసి మీ కింద పనిచేసి అన్నీ నేర్చుకున్నాక అప్పుడు మీరు అప్పచెపుదురుగాని  మీ మాసపత్రిక బాధ్యత."
    అన్నట్లుగానే నీరద జర్నలిజమ్ చేసి 'ఉషోదయం' పత్రిక నిర్వహణలో తండ్రితో పాలుపంచుకుంటోంది. తను 'లా' అవగానే సీనియర్ లాయరు విశ్వనాథంగారి దగ్గర జూనియర్ గా చేరింది. "విశ్వం, నా కూతురిని నీకప్పగిస్తున్నాను.... దాని బాధ్యత నీదే... పని నేర్పు రెండు మూడేళ్ళు" తన మిత్రుడికి అప్పగించారు కూతురిని నారాయణమూర్తిగారు.
    ఓ రెండేళ్ళు ఆయన దగ్గర జూనియర్ గా వున్నప్పుడే, ప్రకాష్ అప్పటికే ఆయన దగ్గర రెండేళ్ళనించి పనిచేస్తుండేవాడు. అక్కడే పరిచయం, కలిసిమెలసి పనిచేయడంతో స్నేహం, సాన్నిహిత్యం పెరిగింది ఇద్దరి మధ్యా. విశ్వనాథంగారికి వున్న బ్లడ్ ప్రెషర్ కి తోడు, బాగా డయాబెటీస్ మొదలవడంతో మనిషి డీలాపడి డాక్టర్ల సలహాతో పని ఒత్తిడి తగ్గించుకున్నారు.. దాంతో ముఖ్యమైన కేసులు తప్ప మిగతావన్నీ ప్రకాష్ కి, తనకి అప్పగించడం మొదలుపెట్టేవారు. ముఖ్యంగా ఆడవాళ్ళ కేసులు తనని డీల్ చెయ్యమనేవారు.
    రెండు సంవత్సరాలు కలిసి పనిచేసినపుడు సాన్నిహిత్యం పెరిగి స్నేహానుబంధం ఏర్పడటం సహజం. ప్రకాష్ ని సీనియర్ గా భావించి సలహాలు, సంప్రదింపులు చేసేది - తనకీ అతనిపట్ల ఆకర్షణ వుందన్న భావం ప్రకాష్ లో బలపడి మాగాడు తనే ముందంజ వేయాలన్నట్టుగా, ఓరోజు పుట్టినరోజంతా హోటలుకి డిన్నరుకి పిలిచి పెళ్ళి ప్రసక్తి తెచ్చాడు. ప్రకాష్ పట్ల అప్పటివరకు అలాంటి ఆలోచన రాకపోయినా అతనడగ్గానే కాదనడానికి ఏమీ కారణం కనిపించలేదు. అయితే అంత హఠాత్తుగా అడిగేసరికి తడబడిపోయింది. తెల్లబోతూ చూసింది.
    "అదేమిటి అంత షాక్ అయిపోయావు!" ఏకవచన సంబోధన. అంత చనువు తీసుకున్న ప్రకాష్ కి ఏం చెప్పాలో అర్థంకాలేదు.
    "నేనింకా ఎప్పుడూ పెళ్ళి గురించి ఆలోచించలేదు" తలవంచుకుని గొణిగింది.
    "పోనీ, ఇప్పుడాలోచించు, ఏదన్నా అభ్యంతరం వుందా! రెండేళ్ళు మన పరిచయం చాలలేదా ఒకరి గురించి ఒకరం తెలుసుకోవడానికి... ఇద్దరిది ఒకేలైను. రాపోమాపో స్వతంత్రంగా ప్రాక్టీసు పెట్టుకోగల స్థాయి వచ్చింది. పెళ్ళిచేసుకోడానికి ఈ అర్హతలు చాలవా" మొహంలో భావం వెతుకుతున్నట్టు పట్టిచూశాడు.
    "కాస్త టైము... ఆలోచించుకోవాలి. అమ్మానాన్నలతో మాట్లాడాలి" నెమ్మదిగా అంది శారద.
    ప్రకాష్ తేలిగ్గా నవ్వాడు. "ఆలోచించే చెప్పు.... ఇప్పుడే ఎవరికీ చెప్పకుండా చేసుకుందాం ఆనా నా ఉద్దేశం" క్యాజువల్ గా, రిలాక్స్ డ్ గా వెనక్కి వాలి మెరుస్తున్న కళ్ళతో శారదని చూస్తూ హాస్యంగా అన్నాడు.
    తలూపింది శారద, చిన్నగా నవ్వి.
    ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పినప్పుడు ఇద్దరూ ఎదురు చూసిన విషయమే అన్నట్టుగా ఆశ్చర్యపడలేదు. నారాయణమూర్తి నవ్వి "ఇంకా ఈ కబురు చెప్పలేదే అనే అనుకున్నాను. మీ ఇద్దరూ ఇష్టపడితే అక్షింతలు చల్లడమే మా పని - ఇద్దరిదీ ఒకే లైను. కలిసి ప్రాక్టీసు చెయ్యచ్చు ... అతనిలో ఎంచడానికి లోపాలేం కనబడలేదు. మంచి ఫ్యామిలీ. నీవు 'ఊ' అంటే మేం వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడివస్తాం. ఆడపిల్ల తల్లిదండ్రులుగా వెళ్ళి అడగడం మా బాధ్యతగదా!" అన్నారు.
    తలూపింది శారద.
    తరువాత సంఘటనలు చాలా తొందరగానే జరిగి నెలా పదిరోజులలో ముహూర్తం కుదిరి భార్యాభర్తలయ్యారు. ఇంకా కొత్త మోజు తీరకముందే అతను చాలా షార్ట్ టెంపర్డ్ అని తెలిసిపోయింది. ఆ కోపంలో ఇతరుల మనసు బాధపడుతుందేమోనన్న ఆలోచన అతనికి వుండదన్నది తెలిసింది. తల్లి అయినా, తానైనా, పనివాళ్ళు అయినా అతనికి తేడా లేదు. ఇంకో చెడ్డగుణం అందరి ముందు వెనకాముందు చూడకుండా ఏమాటపడితే ఆ మాట అనేస్తాడు. అలాంటప్పుడు ఎంతో ఇబ్బందికర పరిస్థితి ఎన్నిసార్లో ఎదుర్కొంది..... అవీ చిన్నవిషయాలకి.                               

 Previous Page Next Page