Previous Page Next Page 
సాహసి పేజి 5


    కూతురు పేరు వినగానే ఉలిక్కి పడ్డాడాయన.

    "అవును ముత్యాలూ... చాలా అన్యాయం జరిగిపోయింది. నా చిట్టి తల్లికి కనీసం కాలేజీ ఖర్చుకయినా డబ్బు పంపించలేకపోయాను" నిట్టూరుస్తూ అన్నాడాయన.

    "తోడబుట్టిన వాళ్ళే ఇంత అన్యాయం చెయ్యడం నాకు బాధగా వుందయయా... ఎలాగో ఈ చదువు పూర్తయితే తన కాళ్ళమీద తాను నిలబడ గలుగుతుంది అమ్మాయిగారు..." ముత్యాలు ఓదార్పుగా అన్నాడు.

    కౌశిక భూపతి కళ్ళల్లో అప్రయత్నంగా తడి...

    "స్వార్ధం ముత్యాలూ... స్వార్ధం... విషంకన్నా స్వార్ధం మరింత ప్రమాదకరం. అయినా చిట్టితల్లికి అన్యాయం జరగదు. మా తండ్రిగారికి పాప అంటే ప్రాణం... ఆయన ఆత్మ ఊరుకుంటుందా?" తనని తాను సంతృప్తి పర్చుకునే సమాధానం అది అని తెలుసు ఆయనకు.

    "తండ్రిగారు..." ముత్యాలు ఎదో విషయం గుర్తుకురాగా ఉలిక్కిపడ్డాడు.

    అతని కళ్ళలో ఒకింత వెలుగు...

    "అయ్యా... చిన్న విన్నపం, మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ మీ తాతగారి తాతగారు మరణ సమయంలో అపారమైన నిధి నిక్షేపాలను ఎక్కడో దాచిపెట్టి చనిపోయారని అనుకుంటుండేవారు. ఆ విషయం మీకు తెలుసు అని అందరూ చెప్పుకోవడం నాకు తెలుసు... మీకు ఏమైనా జ్ఞాపకం వుందా?" ముత్యాలు ప్రశ్నకు తలెత్తి నిశితంగా చూశారు కౌశిక భూపతి.

    ఏదో గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం...

    కనురెప్పల్ని ఎడంచేతి వేళ్ళతో రుద్దుకుంటూ, ఏవేవో జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాడాయన... ఎన్నో ఏళ్లనాటి జ్ఞాపకాలు, వరద ప్రవాహంలో ఆయనకు ముంచెత్తాయి. ఇన్నేళ్ళుగా, ఇన్ని బాధలు పడుతున్న తమ నిధి నిక్షేపాల విషయం తనకు ఎందుకు గుర్తుకు రాలేదు?

    ఆయన వేసుకున్న మొట్టమొదటి ప్రశ్న అది.

    ప్రభుత్వం ఆస్తుల్నీ, భూములను లాక్కోగా మిగిలిన వారసత్వపు జవహారీయే ఇన్నేళ్ళూ తననూ, పిల్లల్నీ పోషించింది. భూములు హారతిలా హరించుకుపోయాయి. నగలన్నీ పోయాయి. ఆఖరుకు అతి విలువైన ఫర్నీచర్ ఒక్కొక్కటి పిల్లల చదువుకోసం బయటకు వెళ్ళిపోయింది. మిగిలింది ఇద్దరు కొడుకులూ పంచేసుకుని వెళ్ళిపోయారు. ఒక్కగానొక్క చెల్లెలి విషయమే వాళ్ళు మర్చిపోయారు.

    స్వార్ధం... స్వార్ధం...

    "మనిషికి ముసలితనం రాకుండా వుండి వుంటే ఎంత బాగుండేది?" నెమ్మదిగా అన్నాడు ఆయన.

    "ఏం బాబూ- అలా అంటున్నారు?" ప్రశ్న వేశాడు ముత్యాలు.

    "ముసలితనాన్ని ఆనుకునే మతిమరుపుతనం కూడా వుంటుంది" అని చిన్నగా అనుకుంటూ వరండాలోంచి లోని గదిలోకి వెళుతూ ఒక్కక్షణం ఆగారు.

    "చిట్టితల్లికి అన్యాయం జరగదు. నాకు తెలుసు" అన్నాడాయన చిన్నగా తనలో తానే అనుకుంటున్నట్లుగా.

    గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు ముత్యాలు చేతిలో వున్న స్టీలు కప్పుతో.

    లోన గదిలో మంచంమీద కూర్చుని ఉన్న కౌశిక భూపతితో, ఎన్నో ఏళ్ళనాటి జ్ఞాపకాలు.

    ఒక్కొక్కటీ కళ్ళముందుకు వచ్చి ఎగిరిపోతున్నాయి.

    గంట... రెండు గంటలు... మూడుగంటలు... నాలుగు గంటలు... ఐదు గంటలు... కాలక్రమంగా కరిగిపోయి రాత్రి ఒంటిగంటయింది. చీకటి దుప్పటిని కప్పుకున్న కోట, దాని పరిసరాలు నిశి నిశ్శబ్దంలో స్నానం చేస్తున్నట్లుగా వున్నాయి. కౌశిక భూపతి గదిలో మాత్రం చిరుదీపపు వెలుగు.

    అప్పుడాయనకు తటాలున ఏదో విషయం జ్ఞాపకం వచ్చింది.

    దాంతో వెయ్యిఏనుగుల బలం ఆయన వంట్లో ప్రవేశించినట్లుగా అయింది.


                                        *    *    *    *


    కుడిచేతిలో చిన్న కిరోసిన్ లాంతరు...

    నెమ్మదిగా తన గదిలోంచి బయటకు వచ్చి వరండా దాటి ఎడం పక్కన వున్న గదుల దగ్గరకు వచ్చారు కౌశిక భూపతి.

    ఒకప్పుడవి గుర్రపుశాలలు-

    ప్రస్తుతం వాటిల్లో పనిమనుషులు ఉంటున్నారు.

    ఆ చివర ఉన్న ఒక గది దగ్గరకు వెళ్ళి నిల్చుని "ముత్యాలూ-" అని పిలిచాడు.

    అప్పుడే నెమ్మదిగా, మాగన్నుగా నిద్రపోతున్న ముత్యాలు ఆ పిలుపుతో ఉలిక్కిపడ్డాడు.

    "అయ్యా..." మాటతోపాటే లేచి గాభరాగా బైటకు వచ్చాడు ముత్యాలు.

    ఎప్పుడూ తన గది దగ్గరకు రాని కౌశిక భూపతి...!!

    "దర్బారు హాలు తలుపులు తీస్తావా..."

    దర్బారు హాలు... ఒకప్పుడు కౌశిక భూపతి, తండ్రి తాతలు, ముత్తాతల మంత్రి మండలి సభలు నిర్వహించిన హాలు అది. కౌశిక భూపతికి కూడా పట్టాభిషేకం అక్కడే జరిగింది.

    పట్టాభిషేకం జరిగిన ఐదేళ్ళకే ప్రభుత్వం ఆస్తులు లాక్కుంది.

    రత్నాలు పొదిగిన విలువైన బంగారు మంచాలు... బంగారు హంస తూలికాతల్పాలు, పచ్చలు పొదిగిన ఉయ్యాల... బంగారపు సింహాసనం... అన్నీ అదృశ్యమైపోయాయి. 1810లో కౌశిక భూపతి తాతగారు మమూర భూపతికి నిజాంనవాబు సికిందర్ జా ఇచ్చిన రత్న ఖచిత ఖడ్గం... సింహాసనాలు... 1756లో దక్కన్ ప్రాంతాన్ని, తద్వారా ఆంధ్ర ప్రాంతాన్ని వశం చేసుకోవటానికి బుస్సీ దొర పన్నిన కుట్రలో నిజాం నవాబుకు మద్దతుగా పోరాడిన వీరులు వాడిన ఉక్కు కవచాలు... ఆభరణాలు... నాణేలు... ధరించిన వస్త్రాలు... అన్నీ అన్నీ కళ్ళ ముందే ఎగిరిపోయాయి.

    కౌశిక భూపతి ఇంత అర్ధరాత్రి సమయంలో దర్బారు హాలు ఎందుకు తీయమంటున్నారు? ప్రస్తుతం అందులో ఏముంది? చీకట్లో ముందుకు నడుస్తూనే ఆలోచిస్తున్నాడు ముత్యాలనాయుడు.

    కోట గుమ్మానికి ఎదురుగా అరకిలోమీటరు దూరంలో వుంది దర్బారు హాలు. ముత్యాలనాయుడు ముందు నడుస్తున్నప్పుడు అతని ఆలోచనలు వెనక్కి నడిచాయి.

    దర్బారు హాలుకి అటూ ఇటూ రాజదుస్తులతో అశ్విక దళం మీద ఠీవిగా కూర్చుని రాచరికానికి చిహ్నంగా, వీరత్వానికి ప్రతినిధులుగా నిలిచిన రాజసైనికులు...

    దూరంగా పొగడపూల దండతో వందనం చేయడానికి నించున్న మైసూరుకు చెందిన శ్వేతగజం... ఆ గజ ఘీంకారాలతో పరవశం చెందే పరివారం... మహారాజు నిత్య దర్శనానికి వచ్చే దేశదేశాల రాయబారులు... చరిత్రకారులు... కవులు... సంప్రదాయానికీ, రాచరికానికీ ప్రతీకలా ఉండే రాజదర్బారు.

    మాసిపోయిన సంచీలోంచి పాతకాలంనాటి పొడవైన తాళం చెవి తీశాడు ముత్యాలనాయుడు.

    విశాలమైన బర్మాటేకుతో చేసిన తలుపులు మాసిపోయి మకిలిపట్టి ఉన్నాయి. తాళం తీసి రెండు చేతులతో తలుపులను ముందుకు తోశాడు ముత్యాలనాయుడు.

    ఆ శక్తికి ఆ తలుపులు కదల్లేదు.

    "ఒకప్పుడు ఒంటి చేత్తో ఈ తలుపులను తీసేవాడిని... వయసై పోయింది" తనలో తాను గొణుక్కుంటున్నట్లుగా అన్నాడు ముత్యాలనాయుడు.

    కౌశిక భూపతి ముందుకొక అడుగువేసి తలుపుతోశాడు. నెమ్మదిగా తెరుచుకున్నాయి తలుపులు... లోనికి అడుగుపెట్టాడాయన... లాంతరు వెలుగులో రాజదర్బారు హాలు పెద్ద సర్కస్ గుడారంలా ఉంది. ముందుకెళ్ళి హాలు మధ్యలో నిల్చున్న కౌశిక భూపతికి మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని లక్షల విలువైన ఆభరణాలు... హారాలు... అతి విలువైన వస్త్రాలు, రత్నఖచిత కిరీటం, కరవాలంతో అదే ప్రదేశంలో ఠీవిగా నిలుచున్న రజులు గుర్తుకు వచ్చాయి ఆయనకు... దాంతో గుండె చిక్కబట్టినట్లయింది.

    "నిన్నటి చరిత్రకు నేటి శిధిలాలే గుర్తు..."

    కౌశికభూపతి పెదవుల మీదకు చిత్రమైన చిరునవ్వు ఒకటి వచ్చింది. ఆ నవ్వు అంతలోనే పెను నవ్వుగా మారింది... నవ్వాడు... నవ్వాడు... ఆ నవ్వు... రాజదర్బారు హాలు నిండా ప్రతిధ్వనించింది- నిద్రపోతున్న పావురాలు ఉలిక్కిపడి సవ్వడి చేశాయి. గబ్బిలాలు కీచుమంటూ అరుచుకుంటూ ఎగిరిపోయాయి. నవ్వి, నవ్వి అలసిపోయాడు కౌశికభూపతి- ఆ నవ్వు వెనుక ఎంత దుఃఖముందో ఒక్క ముత్యాలు నాయుడికే తెలుసు.

    ముత్యాలునాయుడు కూడా అంతే దుఃఖంతో మురికి నేలమీద చతికిల పడిపోయాడు.

    "A Fort without an anmy
    A Temple without a god
    Women without beauty
    and jasmine without scent..."

    ఇదే దర్బారులో చాలాకాలం క్రితం ఒక డచ్ కవి అన్న వాక్యాలు గుర్తుకు వచ్చాయి. రాచరికపు సుగంధాల రోజులన్నీ వెళ్ళిపోయాయి. సుశిక్షిత సైనిక దళాలు, దైవసిద్ధి, అందాల ఆనందాలు, గుభాళింపులు... అన్నీ వెళ్ళిపోయాయి. సూర్యోదయం లేని ఉదయంలా ఉంది ప్రస్తుత పరిస్థితి... హాలంతా ఖాళీగా ఉంది పాతబడిన పాతకాలపు కుర్చీలు తమ రాజసింహాసనాలన్నీ ఎప్పుడో ప్రభుత్వ పరమైపోయాయి. కొలంబియాలోని ముజో పచ్చల గని నుంచి వచ్చిన ఒక యాత్రికుడు కానుకగా ఇచ్చిన పచ్చ పూసల హారం... 1747లో అప్పటి ఇరాన్ చక్రవర్తికి, టర్కీ సుల్తాన్ ఓ అమూల్యమయిన పచ్చల పిడిబాకును కానుకగా పంపాడు. ఆ కానుకను అందుకోకుండానే ఇరాన్ చక్రవర్తి చనిపోయాడు. కానీ ఆ పిడిబాకు తన ముత్తాతగారి దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత అది ఏమైందో ఎవ్వరికీ తెలీదు... ఏమైపోయింది ఆ సంపదంతా? దర్బారు హాలంతా చీకట్లో కలియతిరిగి ఒకచోట మెట్ల అంచున కూర్చుండిపోయాడు.  

    "జ్ఞాపకం తెచ్చుకోండి బాబూ... రాజుల సొమ్ము రాళ్ళపాలు అంటారు. కానీ ఆ రాళ్ళ క్రిందే ఈనాటికీ నిధి నిక్షేపాలుంటాయి... మా తండ్రి ద్వారా అలాంటి కథలు నేను ఎన్నో విన్నాను. ఆ కథలు సత్యాలు రాజావారూ మీ పూర్వ వైభవం మీకు మళ్ళీ రావాలి. పోయిన సంపదంతా తిరిగిరావాలి. అపుడు కానీ నేను చావను..." ముత్యాలు మాటల్లో కౌశికభూపతి కుటుంబం పట్ల అపారమయిన ప్రేమ వ్యక్తం అయింది.

    వ్యక్తావ్యక్తమయిన జ్ఞాపకాల సందోహంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు కౌశికభూపతి... ముత్యాలనాయుడు మాటలు ఆయనలో అంతులేని ఆశలు రేపుతున్నాయి. అంతలోనే తీరని నైరాశ్యంలో మునిగిపోతున్నాడు. దానికి కారణం ఏ విషయం స్పష్టంగా జ్ఞాపకం రావడం లేదు.

    "దర్బారు హాలు నుంచి ఫూల్ బాగ్ ప్యాలెస్ కి రహస్యద్వారం ఉండాలి కదా రాజావారూ..." ముత్యాలనాయుడు జ్ఞాపకం చేశాడు.

    "ఫూల్ బాగ్ ప్యాలెస్... ఎప్పుడో కూలిపోయింది. రహస్య ద్వారం అపుడే మూతబడిపోయింది..."

    ఫూల్ బాగ్ ప్యాలెస్ కు ఒకే ఒకసారి తండ్రిగారితో కలిసి రహస్య ద్వారం గుండా వెళ్ళటం జ్ఞప్తికి వచ్చింది కౌశికభూపతికి.

 Previous Page Next Page