Previous Page Next Page 
సాహసి పేజి 4


    తెల్లవారితే పన్నెండు వందలు ఫీజు కట్టాలి. ఇంటినుంచి డబ్బు వస్తుందనుకుంటే అనూహ్యమయిన విషయాన్ని మోసుకుంటూ ఉత్తరం వచ్చింది.

    ఎనిమిదివేల ఎకరాల తమ సంస్థానం కళ్ళముందే మాయమయిపోయింది- కోట్లకు కోట్లు ఖరీదుచేసే నగలు, పురాతన వస్తువులు, అపూర్వ కళా సంపద అదృశ్యమైపోయింది. రాజభరణాలు రద్దయిపోయాయి. త్రైమాసిక భరణం కనుమరుగయిపోయింది.

    ఆ సంపద... ఆ ఠీవి... ఆ దర్పం... ఆ అధికారం.. అంతా- అన్నీ చూస్తుండగానే, చేతివేళ్ళు మధ్య నుంచి ఇసుకలా జారిపోయాయి.

    పాతబడి, పాడుబడిపోయిన రాజభవనం మాత్రం గతకాలపు వైభవానికి ప్రతీకలా మిగిలి ఉంది- అందులో బిక్కు బిక్కుమంటూ తన వాళ్ళు... వాటిని తలుచుకుని వ్యధ చెందే తన తండ్రి...

    నిశ్శబ్దంగా రెండు కన్నీటిచుక్కలు కనుకొలుకొల్లోంచి జారి కిందబడ్డాయి.

    ఆమె తనను తాను సమాధానపర్చుకొని బెడ్ వేపు నడుస్తుండగా రూమ్మేట్ వైశాలి బెడ్ మీంచి లేచింది.

    అది చూసిన ఇందుమతి కలవరపాటుగా తలతిప్పుకొని బెడ్ మీద వాలబోతుండగా-

    "నాలుగయిదు రోజుల్నుంచి చూస్తున్నాను. నీలో నీవే బాధపడటం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఆ ఉత్తరంలో ఏముంది? అసలేమయింది?"

    "మాకు చెప్పగూడదా..? నీ బాధని మేం షేర్ చేసుకోగూడదా..?" వైశాలి ఒకింత నిష్టూరంగా అంది. ఇందుమతి చటుక్కున తల తిప్పి వైశాలివైపు చూసింది ప్రేమగా.

    "ఐదేండ్లుగా మనం చేస్తున్న స్నేహానికి అర్ధమే ఉండదు- మన స్నేహానికి అందమైన అర్ధాన్ని ఇవ్వాలంటే నీ సమస్యేమిటో నాకు చెప్పాలి. ప్లీజ్" వైశాలి బెడ్ మీంచి లేచి ఇందుమతి దగ్గరకు వచ్చి అనునయంగా అడిగింది.

    ఇందుమతి కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత చెక్కుచెదరని గంభీరతతో అంది "నేను చదువు మానేసి వెళ్ళాలనుకుంటున్నాను..."

    ఇందుమతి అన్నదేమిటో ముందు వైశాలికి అర్ధం కాలేదు. అర్ధం కాగానే షాకింగ్ గా చూసింది.

    "ఒక్కరూపాయి ఉత్తరం నీ అందమైన భవిష్యత్ ని శాసించటం కలవరపాటుగా ఉంది నాకు... అసలేమైంది..?"

    "పన్నెండొందల ఫీజు.. ఎనిమిదివందలు హాస్టల్ కి కట్టలేని స్థితిలో ఉన్నాను. నా స్థితినే- నాకు తెలీని స్థితినే ఆ ఉత్తరం తెలియజేసింది..." అంది భారంగా ఇందుమతి.

    వైశాలి షాక్ మీద షాక్ కి గురైంది. "ఎస్... ఇటీజ్ ట్రూ... కట్టలేనప్పుడు చదువుకునే అర్హత ఎక్కడుంటుంది? నా పరిస్థితిని అర్ధం చేసుకోలేని వాళ్ళ ముందు నవ్వులపాలు కావటం నాకిష్టంలేదు- అందుకే..."

    వైశాలి గుండె బరువెక్కింది. బాధగా ఇందుమతివైపు చూసింది.

    "నీ కొచ్చినపుడు నువ్వు నాకు బంగారపు తొడుగే తొడుగుదూగాని- రేపు ఫీజు, మెస్ ఛార్జెస్ నేను కడుగుతున్నాను, దట్సాల్... ఇది నీకు, నాకు మధ్య మాత్రమే ఉంటుందని ప్రమాణం చేస్తున్నాను. ఇంకేమీ మనస్సులో పెట్టుకోకు- పరీక్షలు బాగా రాయబోతున్నాం- దట్సాల్..." అంటూ వైశాలి ఇందుమతిని చిన్నపిల్లలా లాలిస్తూ, అభయమిస్తూ బెడ్ మీదకు చేర్చింది.

    అయినా, ఇంకా ఆలోచిస్తూనే వుండిపోయింది ఇందుమతి. ఇందుమతి ఆస్తులు హరించుకుపోయాయని బాధపడుతోందా? వైశాలికి అర్ధం కాలేదు. ఆమెనెలా అర్ధం చేసుకోవాలో.

    పడుకోబోతూ చటుక్కున లేచింది ఇందుమతి. ఆమె మెడలో వుండే ఒంటిపేట గొలుసును తీసి వైశాలి మెడలో వేసింది.

    "కాదంటే నీనుంచి సహాయాన్ని అందుకోను" అంది గంభీరంగా ఇందుమతి.

    "ఇదే నీ వ్యక్తిత్వంలోని విశిష్టత- ఈ రాజసం మీ రక్తంలో ఐదొందల సంవత్సరాలుగా సమ్మిళితమై వస్తోంది" అంది ఆ గొలుసు చివర వున్న లాకెట్ ని ఎత్తిపట్టుకొని కళ్ళ దగ్గరకు తెచ్చుకొని.

    "ఆ లాకెట్ వయస్సు నాలుగొందల సంవత్సరాలు తెలుసా..? మా తాతగారు నా చిన్నప్పుడు దాన్ని నాకు బహూకరించారు..." అంది ఇందుమతి బెడ్ మీద వాలిపోతూ- తన చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చుకుంటూ.

    ఎంతో విచిత్రంగా వున్న ఆ లాకెట్ నే చూస్తూ నిద్రలోకి జారుకుంది వైశాలి. తన ఏడో ఏట ఆ లాకెట్ ని తన మెడలో వేస్తూ- తన తాతగారు ఏదో అన్నారు. ఏమిటది...? ఎంత ప్రయత్నించినా ఇందుమతికి గుర్తుకు రాలేదు.

    చాలాసేపు ప్రయత్నించింది-

    అప్పుడు గుర్తుకొచ్చాయి అన్ని మాటలు-

    "ఎంతో గర్వించదగ్గ మన రాజ కుటుంబపు పరువు- ప్రతిష్టలకు, నాగరికతకు, సంస్కృతికి, జీవన విధానానికి, అపూర్వ జ్ఞానసంపదకు యిది ప్రతీక. దీని విలువ మనం కట్టలేం- మన పూర్వులు మనకిచ్చిన అతి విలువైన వస్తువిది. దీన్ని కాపాడుకోగలిగి- దీని మర్మాన్ని తెలుసుకోగలిగితే ఇది మనల్ని అందలం ఎక్కిస్తుంది. మనరాజ్యం- రాచరికం హరించుకుపోయినా ఇది మన పూర్వవైభవాన్ని తిరిగి మనకందిస్తుందని మరువవద్దు..."

    ఇంకేదో కూడా చెప్పారు. తన తాతగారు చనిపోయే ముందు తనని దగ్గరకు తీసుకుని- ఆర్తిగా తన గుండెల కత్తుకొని, చమర్చిన కళ్ళతో తనకేసి తప్పు చేసినవాడిలా చూస్తూ- నేను నీకు మిగిల్చి వెళుతున్నది ఇదే తల్లి- ఈ పేద తాతని క్షమించు- అని అనటం మాత్రం తనింకా మర్చిపోలేదు.

    ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లాకెట్ ని నీ మెడలోంచి దూరం చేసుకోనని తనతో ప్రమాణం కూడా చేయించుకున్నారు- కాని తనకొచ్చిన ఇబ్బందిని అప్పట్లో ఆయనేం ఊహించగలరు? ఆలోచనల్లోనే నిద్రలోకి జారుకుంది ఇందుమతి.


                                       *    *    *    *


    విశాఖపట్టణానికి వందమైళ్ళ దూరంలో గోస్తనీ నది ఒడ్డున...

    కొండలమధ్య జేగురు రంగులోని దేవులపల్లి మహారాజ ప్రసాదం ఒకప్పటి వైభవానికి ప్రతీకలా ప్రస్తుతం ఒంటరి నిశ్శబ్దంలో మునిగి వుంది.

    ఆ కోట వయస్సు ఐదువందల సంవత్సరాలు. సున్నాన్నీ, బెల్లాన్నీ, కోడిగుడ్లనీ వేసి, మైదాగా గానుగ ఆడించి, జిగురుతో రామన్నపేట బ్రౌన్ స్టోన్ తో కట్టిన శత్రు దుర్భేద్యమైన కోట అది...

    వంద ఎకరాల విశాలమైన మైదానంలో నిర్మించిన ఆ రాజ ప్రాసాదం చుట్టూ పెద్ద కందకం... కోట ముఖద్వారం నుంచి రెండు కిలోమీటర్ల వరకూ విశాలమైన మట్టిబాట...

    అక్కడ నుంచి కొండలు... దట్టమైన అడవి...

    మూడొందలు గదులు, యాభైకి పైగా దర్బారుల్లాంటి వరండాలతో రెండు నిలువుల ఎత్తు దర్వాజాలతో కిటికీలతో, చలువరాళ్ళతో, పాలరాతి ఫౌంటెన్ లతో, చూపరుల దృష్టిని చూసిన మరుక్షణం కట్టిపడేసే అద్భుత రాజప్రాసాదం. కోట ముఖద్వారం తలుపులు తాటిచెట్టంత ఎత్తుగా, బలిష్టంగా వున్నాయి. రాజులు, రాణులు వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు మాత్రమే ఆ తలుపులు తెరుచుకునేవి. ఆ తలుపులను తెరవటానికి రెండు ఏనుగులు ప్రత్యేకంగా వుండేవి. ప్రస్తుతం ఆ తలుపులను తెరవటానికి ఏనుగులు లేవు- అంత బలిష్టమైన మనుషులూ లేరు- ప్రధాన ద్వారం పక్కన చిన్నద్వారం వుంది ఇప్పుడు రాకపోకలు ఆ ద్వారం గుండానే జరుగుతున్నాయి.

    ఆ ద్వారానికి కుడివైపు అటూ- ఇటూ చిన్నస్తంభాల మధ్య పెద్ద ఇత్తడి పళ్ళెం ఉండేది సమయాన్ని సూచించటానికి అక్కడొక జవాను గంటలను కొట్టేవాడు. ఆ కోటగంట అవశేషాలుగా ఇప్పుడా స్తంభాలు మాత్రమే వున్నాయి.

    ఒకప్పుడు కోటచుట్టూ వున్న కందకం నిండుగా నీళ్ళతో మొసళ్ళతో వుండేది. ఇప్పుడు నీళ్ళూ లేవు, మొసళ్ళూ లేవు...  

    ఒకప్పుడు వెయ్యిమంది జవాన్లతో, ఆశ్వరధాలతో గజ ఘీంకారాలతో పసిడి పారాణుల రాజుల మందస్మితాలతో పాలపుంతలా వెలిగిన- దేవులపల్లి కోటలో...

    ప్రస్తుతం నలుగురే నలుగురు మనుషులు బిక్కుబిక్కుమంటూ వున్నారు.

    ఒకరు...

    దేవులపల్లి కోట యజమాని-

    రాజా కౌశిక భూపతి... ప్రస్తుతం ఆయనకు అరవై ఐదేళ్ళు...

    మిగతా ముగ్గురూ ఆ మాజీ రాజును నమ్ముకున్న సేవకులు..

    కౌశిక భూపతి తెల్లగా, ఎత్తుగా బాగా నెరసిపోయిన జుట్టుతో వర్చస్సుతో ఉంటారు.

    ఆయన్ని చూడగానే సరిహద్దు గాంధీ... ఎం.ఎఫ్. హుస్సేన్ లు గుర్తుకు వస్తారు. పెద్ద కళ్ళజోడు... చెవులకు తమ్మెట్లు... మాసిపోయిన తెల్లటి లాల్చీ... పంచె, విశాలమైన వరండాలో ఒకపక్క పాతకాలపు పొడవాటి కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నారాయన.

    గత వైభవపు జీవితం ఆయనకు రెండే రెండు వరాలు ఇచ్చింది. ఒకటి దిగులు, రెండు ఆలోచన- ఆ సమయంలో అక్కడకు వచ్చాడు ముత్యాలు. ముత్యాలుకు ఎనభై ఏళ్ళుంటాయి. కౌశిక భూపతి తండ్రికి ఆప్తమిత్రుడు ముత్యాలు నాయుడు. ముత్యాలు ఒకప్పుడు పేరుమోసిన వస్తాదు. ప్రపంచ ప్రఖ్యాత వస్తాదు కోడి రామ్మూర్తినాయుడి శిష్యుడు. ముత్యాలు చేతిలో చిన్న స్టీలు కప్పు వుంది. ఆ కప్పులో చిన్న చెంచా- ఆ చెంచాలో కోడెత్రాచు విషం. తేనెలో కలపటం వల్ల ఆ విషం మెరుస్తోంది.

    "అయ్యా..." ఆ పిలుపుకు వెంటనే తలతిప్పలేదు కౌశిక భూపతి.

    మళ్ళీ పిలిచాడు ముత్యాలు... అప్పుడు తలతిప్పాడాయన.

    ప్రతిరోజూ కౌశిక భూపతి చెంచాడు విషం తీసుకుంటాడు. నలభై ఏళ్ళుగా ఆయనకు అది అలవాటు- ఒకపూట భోజనం చేయకపోయినా ఇబ్బంది పడడు కానీ, విషం లేకపోతే బాధపడతాడు. ఆ అలవాటు ఆయనకు, తండ్రిగారి దగ్గర నుంచి వచ్చింది. (ఇదే అలవాటు నిజామ్ నవాబులకు కూడా ఉండేది) అంతరంగిక శత్రువుల బారినుంచి తమని తాము నిత్యం రక్షించుకోవటానికి నాటి పాలకులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొనేవారు. ఏకైక వారసులు ఉన్నప్పుడు, విషాహారం పెట్టి శత్రువులు చంపే ప్రమాదం వున్నప్పుడు, ఆ విష ప్రయోగానికి విరుగుడుగా చిన్నప్పటి నుంచీ విషాన్ని ముందుగా వాడటం అలవాటు.

    స్టీలు కప్పుని వినయంగా అందించాడు ముత్యాలు.

    నెమ్మదిగా చెంచాలోని విషాన్ని చప్పరిస్తున్నారు కౌశిక భూపతి.

    "కౌశిక రాజా... చిన్న విన్నపం..." పక్కన బీటలు వారిన రాతినేలమీద కూర్చుంటూ అన్నాడు ముత్యాలు.

    ఆ మాటలను పట్టించుకోలేదు కౌశిక భూపతి.

    "అయ్యా! ఇందుమతిగారి గురించి నేను మాట్లాడేది..." మళ్ళీ అన్నాడు ముత్యాలు.

 Previous Page Next Page