తన కోడల్ని జులాయి వెధవలు ఏడిపిస్తుంటే తను, తన కొడుకు ఏం చేయలేక పోలీసులకు చెప్పుకుంటే వాళ్ళు మాకు ప్రభుత్వాలిచ్చే జీతాలు చాలటం లేదు. మీరు మామూళ్ళు ఇస్తే మీ కోడలికి బెడద తొలిగిస్తామన్నారు. కంప్లయింట్ ఇవ్వమన్నారు- జులాయిల్ని గుర్తించమన్నారు- మీ కోడలు సెక్సీగా వుందా అని అడిగారు.
విసుగుపుట్టిన సమయంలో ఎవరో యిచ్చిన సలహా విని అభిరామ్ ని నా కోడల్ని రక్షించవా అని అర్ధించాడు.
ఆ తర్వాత ఆయన కోడలు నిర్భయంగా బయటకెళ్ళి వుద్యోగం చేసుకోగలుగుతుంది.
మరలాంటప్పుడు ప్రిన్సిపాల్ అభిరామ్ చదువు గురించి అడిగి అతని ఆగ్రహానికి ఎందుకు గురవుతాడు?
కొత్తగా కాలేజీలో చేరిన ఒక లెక్చరర్ ని కాలేజీ కమిటీ ఆరు నెలలు తరువాత ఉద్యోగంలోంచి పీకిపడేస్తే, అతనెళ్ళి అభిరామ్ చేతులు పట్టుకున్నాడు.
అంతే! ఆ తర్వాత వారం రోజులు కాలేజీ నిర్మానుష్యమైపోయింది. రెండు వేల మంది విద్యార్ధులు, విద్యార్ధినులు కాలేజీ ఆవరణ బయటున్న చెట్ల క్రింద వూసులాడుకున్నారు. ఆటలాడుకున్నారు. గెంతారు, గోల చేశారు.
కమిటీ కంప్లెయింట్ ని చెవికెక్కించుకుని పోలీసులు రంగంలోకి దిగారు.
కాని ఎవర్ని అరెస్టు చేయాలి? చేస్తే ఏ ఆధారంతో చేయాలనే ప్రశ్నలకు సమాధానం దొరకక పిచ్చెక్కిపోయి పిచ్చాపాటి వేసుకోగా వాళ్ళకు ఓ విషయం తెలిసింది, సూత్రధారి అభిరామేనని దాని తర్వాత మరి కొన్ని విషయాలు తెలిపారు- అభిరామ్ నగరంలోని అన్ని కాలేజీల స్టూడెంట్స్ కి హీమాన్ అని, ఐడెంట్ ఫై చేసుకునే హీరో అని- అతన్ని ఏదైనా చేస్తే లా అండ్ ఆర్డర్ ని పోలీసుల చేతుల్లోంచి స్టూడెంట్స్ లాగేసుకుంటారని.
దాంతో పాపం ఆ లెక్చరర్ కి ఉద్యోగం యిచ్చినట్లే యిచ్చి పీకేస్తే మరో వుద్యోగం ఇవ్వడానికి పోలీసు డిపార్టుమెంట్ లో ఖాళీలు లేవని కమిటీకి ఓ సలహాపడేసి కంప్లయింట్ ని చించి చెత్త బుట్టలో వేసి స్టూడెంట్స్ దగ్గర సిగరెట్స్ అడిగి తీసుకొని కాల్చడం మొదలెట్టారు పోలీసులు.
పూర్ స్టూడెంట్స్ ఫీజు కట్టడానికి డబ్బు లేక కాలేజీ గేటు దగ్గరే జాలిగా కాలేజీ కేసి చోస్తూ ఒకరోజు నిలబడితే, రెండో రోజు గేట్ మెన్ ఫీజు కట్టి కూడా గేటు దగ్గరే ఎందుకాగాలో అని అడిగిన సందర్భాలెన్నో.
"చదువురాకపోతే ఏమవుతారు?"
డిగ్రీ అయినా పూర్తి కాకపోతే ఎలా బ్రతుకుతావని చదువుకున్న ఫ్రెండ్స్ అడిగితే అభిరామ్ నవ్వి నా ఒక్కడికి చదువురాకపోయినా మీ అందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకోగలుగుతున్నారు. నేను చదువులో తలదూర్చితే మీ గతేమిటి? అని అడుగుతాడు. అందుకే ఆ ప్రశ్న వేయడం దాదాపు అందరూ మర్చిపోయారు.
చాలామంది కాలేజీ అమ్మాయిలు అతన్ని చూసి ఇష్టపడ్డారు. మరి కొంత మందయితే మరో అడుగు ముందుకేసి ప్రేమించామనుకున్నారు. ఇంకొందరు నిజంగానే ప్రేమించారు. అందులో కొందరు మూగగా, మరి కొందరు ప్రత్యక్షంగా.
అయినా అతనేం పట్టించుకోలేదు.
వారిపట్ల, వారి ఇష్టం పట్ల, వారి ప్రేమ పట్ల స్పందించలేదు.
సన్నగా, ఐదడుగుల పదంగుళాల ఎత్తులో ఛామన ఛాయలో వుంటాడతను. గొప్ప అందగాడు కాదు. కానీ ఏదో తెలీని ఆకర్షణ అతనిలో దాగి వుంటుంది.
అతని కదలికలు షార్ప్ గా వుంటాయి.
చూపులు శత్రువు వేసే ఎత్తును స్కాన్ చేసేలా వుంటాయి. స్నఫ్ కలర్ మఫ్లర్ ఒకటి ఎప్పుడూ అతని కంఠం చుట్టూ మెలివేసుకుని వుంటుంది.
అతని కండరాల్లో కొవ్వు లేదు. కర్కశత్వం వుంది.
అతని కదలికల్లో కాలయాపన వుండదు. కాఠిన్యం, కదనుదొక్కే వేగం, అప్రమత్తత దాగి వుంటాయి.
రోజులో ఎక్కువ కాలాన్ని మౌనంగానే గడుపుతుంటాడు.
అభిరామ్ చూపులు మరల్చకుండా టీవీ స్క్రీన్ కేసి చూస్తున్నాడు.
అతనితో పాటు వచ్చిన మిత్రులు అనుచరులు కూడా ఉత్కంరనే ఊపిరిగా చేసుకుని టీవీ కేసి చూస్తుండగా ఓ యువకుడు పరుగెత్తుకుంటూ వచ్చి అభిరామ్ మీద పడినంత పని చేశాడు.
చాలా దూరం నుండి పరుగెత్తుకు వచ్చినట్లు అతను తెగ ఆయాస పడిపోతున్నాడు.
అతనేదో అభిరామ్ కి చెప్పాలని ఆరాటపడుతున్నాడు. కానీ ఆయాసంతో చెప్పలేకపోతున్నాడు.
అతని కళ్ళలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది.
ఎక్కడో.....ఎవరికో....ఏదో జరిగిందని అభిరామ్ వూహించి చటుక్కున కుర్చీలోంచి లేచి అతన్ని అనుసరించాడు.
అతను ఆయాసాన్ని కంట్రోల్ చేసుకుంటూ "మీ షాపు దగ్గర దౌర్జన్యం జరుగుతోంది. అచ్చుత్ ముఠా-" అతని మాటలింకా పూర్తి కాలేదు, అప్పటికే రోడ్ మీదకు దూసుకుపోయాడు అభిరామ్.
అతని అనుచరులు జరిగిందంతా అతని ద్వారా తెలుసుకుని రోడ్డు మీదకు వచ్చేసరికే అభిరామ్ ఎక్కిన మోటార్ బైక్ వందగజాల ముందుకు దూసుకుపోయింది.
క్షణాల్లో అభిరామ్ అనుచరులంతా దొరికిన వాహనం దొరికినట్లు ఎక్కి అభిరామ్ తండ్రి నడిపే రెడీమేడ్ బట్టల షాప్ కేసి దూసుకుపోయారు. మిలటరీ కవాతు చేస్తున్నట్లు.
"తెలిసో తెలియకో అభిరామ్ వాళ్ళ ఫాదర్ నడిపే షాప్ వేపు అచ్యుత్ తన ముఠాతో వెళ్లుంటాడు. తన సహజ ధోరణిలో మామూలు ఇవ్వమని దౌర్జన్యం చేసుంటాడు. ఆయన ఎదురు తిరిగుంటాడు సో....ఈ రోజుతో అచ్యుత్ ఆయువు మూడినట్లే" షాప్ లో వున్న ఓ వ్యక్తి ఆ షాపు యజమానితో అన్నాడు ఆనందంగా.
"అచ్యుత్ గాడి వ్యవహారం చూట్టానీకా అభిరామ్ వెళ్ళింది?" అలా అడగటంలో అతనిలో ఆనందం, ఆశ్చర్యం రెండూ వ్యక్తమయ్యాయి.
"వ్యాపారవేత్త అన్న ప్రతివాళ్ళూ ఉద్యోగస్థులు అందరూ అచ్యుత్ కి మామూళ్ళు కట్టినవాళ్ళే. కట్టక తప్పని వాళ్ళ పరిస్థితి వాళ్ళకే ఒకసారి దయనీయంగా వుంటుంది.
"రావణాసురుడు చంపబడ్డాడంటే ఆనందించే వాళ్ళు ఎక్కువ మంది ఉండటానికి అదే కారణం...." ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకున్నారు.
* * * * *
బైక్ సుడిగాలిలా వెళ్ళి మేఖల రెడీమేడ్ బట్టల షాప్ ముందు ఒక్క జర్క్ తో ఆగింది. అప్పటికే ఆ షాపు దగ్గర ఓ పదిహేనుమంది దాకా గుమిగూడారు.
అభిరామ్ వాళ్ళకు తెలీదు. అభిరామ్ సంగతి కూడా వాళ్ళకు తెలీదు.
"ఈ రోజు నిన్ను వదిలేస్తే రేపు మరొకడ్ని వదిలేయాల్సి వస్తుంది. ఎల్లుండి మరికొంతమందిని ఇలా రోజుకు కొంతమందిని వదిలేస్తూ వెళ్తే మా కలెక్షన్స్ దెబ్బతినటమే కాదు మా పలుకుబడి దెబ్బతినిపోతుంది. ఈ నగరం మీద మాకు పట్టుపోతే మేమిక బ్రతక గలమా? మర్యాదగా చెబుతున్నాను, మా బాస్ అచ్యుత్ రంగప్రవేశం చేయకముందే నాలుగు వేల నూట పదహార్లు ఇచ్చేయడం నీకు క్షేమం...." అచ్యుత్ అనుచరుడు అన్న మాటలను మిగతావాళ్ళు సపోర్టు చేశారు.
అభిరామ్ కి ఆ వార్త చేరవేసిన యువకుడు అభిరామ్ భుజాన్ని తడుతూ వాళ్ళే అన్నట్లు చూపులతోనే వాళ్ళను చూపించాడు.
వాళ్ళు పదిహేనుమంది దాకా వున్నారు.
ఒక్కొక్కరు తెగ బలిసివున్నారు.
చందా వసూళ్ళు, చేసుకోవడం తమ హక్కు అన్నట్లు ధీమాగా షాప్ ముందు పచార్లు చేస్తున్నారు.
అభిరామ్ మఫ్లర్ ని మెడ చుట్టూ బిగుతుగా బిగించుకున్నాడు. చుట్టూ ఓసారి పరికించి చూశాడు.
చుట్టు ప్రక్కల షాపులవాళ్ళు బిక్కుబిక్కు మంటూ ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని చూస్తున్నారు. ఒక్కరి ముఖాన్ నెత్తురు చుక్కలేదు.
అప్పుడు సమయం- మధ్యాహ్నం మూడున్నర గంటలు షాపింగ్ కి వచ్చే వాళ్ళతో ఎప్పుడూ సందడిగా వుండే ఆ వీధి ఇప్పుడు గంభీరంగా వుంది. భయంగా వుంది. బిక్కు బిక్కు మంటోంది.
స్మశాన వైరాగ్యం, నిశీధి నిశ్శబ్దం ఇప్పుడక్కడ తాండవిస్తోంది.
యుద్దానికి ముందుండే ప్రశాంతత ఇప్పుడక్కడ అలుముకుంది. అభిరామ్ అనుచరులింకా రాలేదు. వాళ్ళు వచ్చే వరకు ఆగితే బాగుండని అభిరామ్ తో వచ్చిన యువకుడి ఆలోచన. అదే బయటకు అన్నాడు....అభిరామ్ అతని మాటలు విని ఫర్వాలేదన్నట్లు తలూపుతూ ఒక్కో అడుగే షాపువేపు వేయసాగాడు.
అభిరామ్ ఆ షాప్ యజమాని అరుణాచలం కొడుకని ఆ వీధిలోని షాపుల యజమానులకు తెలుసు. వాళ్ళకి తెలిసింది అంతవరకే.
అతని కాలేజీ ఏక్టివిటీస్ వాళ్ళకు తెలీదు.
అందుకే అచ్యుత్ అనుచరుల మధ్య నుండి షాపువేపుకి వెళ్తున్న అభిరామ్ ని చూసి వాళ్ళు జాలిపడ్డారు.
తాము ఓ ప్రక్క పనిలో వుండగా అలాంటిదేమీ పట్టనట్లు నిర్భీతిగా తమ మధ్యనుండే లోపలకు వెళ్తున్న అభిరామ్ ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు.