ఇంతవరకు బాగానే వుంది. సమస్య ఎక్కడంటే మేం ఇచ్చిన పబ్లిసిటీ మూలంగా స్త్రీలు విపరీతంగా వస్తున్నారు షాపింగ్ కి. అలా వచ్చినవారు గ్రౌండ్ ఫ్లోర్ లో వున్న లిఫ్ట్ దగ్గర గుమిగూడిపోవటంతో తొక్కిసలాట మొదలయింది. ఎవరికి వారే తామే త్వరగా పైకి వెళ్ళాలనే తొందరలో మరింత గందరగోళం సృష్టిస్తున్నారు. షాపింగ్ చేయటం మర్చిపోయి లిఫ్ట్ దగ్గర సిగపట్లు పడుతున్నారు.
కొందరయితే నాలుగురోజులు ప్రయత్నించినా పై ఫ్లోర్స్ లోకి వెళ్ళలేకపోయారట.
దాంతో వారు రెచ్చిపోయి మాకో అల్టిమేటమ్ ఇచ్చారు. మెకు నెలరోజులు టైమ్ ఇస్తున్నాం. ఈలోపు ఆ లిఫ్ట్ ప్రోబ్లమ్ పరిష్కరింపబడాలి. లేదంటే చెడుగా ప్రచారం ప్రారంభిస్తామని. ఏ వ్యాపార సంస్థకైనా బేడ్ ప్రోపగాండా మంచిదికాదు.
దీన్నిబట్టి మీకనిపించవచ్చు. లిఫ్ట్ పరిణామాన్ని పెంచవచ్చు గదా అని. లిఫ్ట్ వైశాల్యాన్ని పెంచి ఆ ప్రాబ్లెమ్ సాల్వ్ చేయవచ్చు. మరో లిఫ్ట్ ఏర్పాటు చేయవచ్చు.
కానీ అలా వీలుకాదు. ఎందుకంటే మా బిల్డింగ్ చుట్టూ అంగుళం స్థలం కూడా లేదు. మూడుప్రక్కలా రోడ్లు, నాలుగోప్రక్క ఓ దేవాలయం వుంది. మూడువేపుల ఆక్రమించుకోవడానికి ప్రభుత్వం ఒప్పుకోదు. మరోవేపు అయితే భక్తులు వూరుకోరు. సో! ఇక లిఫ్ట్ వైశాల్యం పెంచే అవకాశం అసలే లేదు. ఎందుకంటే గ్రౌండ్ నుంచి వున్న లిఫ్ట్ ని పై అంతస్థు వరకూ పెంచుకుంటూ పోతే పాతికలక్షలు ఖర్చవుతాయి. పైగా సెల్లింగ్ కౌంటర్స్ కి, లిఫ్ట్ కి మధ్య కస్టమర్స్ అటూ, ఇటూ తిరిగేందుకు వున్న స్థలం ఇరుకైపోతుంది.
కేవలం పైకి క్రిందకి వెళ్ళేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరుకయి నందువల్లనే ఇంత గలాభా జరిగితే, లిఫ్ట్ ని పెంచినందువలన అయ్యే ఖర్చు అలా వుంచి, కౌంటర్స్ ఇరుకయి మరింత గందరగోళం ఏర్పడుతుంది.
ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్నదే మా సమస్య. మీరు పరిష్కారం కనుగొనేముందు కొన్ని నిబంధనలు దృష్టిలో పెట్టుకోవాలి.
బిల్డింగ్ పడగొట్టమనే సలహా ఇవ్వొద్దు.
ప్రభుత్వంతో పైరవీలు నడిపి, లంచాలిచ్చి, కోర్టుకెళ్ళి మూడువేపులా వున్న రోడ్డును ఆక్రమించుకోమనే సలహా ఇవ్వొద్దు.
దానివలన ప్రయోజనం లేదని రుజువయింది.
మీరు చూపించే పరిష్కారం లక్షరూపాయల ఖర్చుకి లోబడి వుండాలి.
ఏదైనా గోడ పగులగొట్టమన్నా, మేం ఆ పనికి సిద్ధం. కాని తిరిగి కట్టేవరకూ అయ్యే ఖర్చులన్నీ లక్షలోపే కావాలి. మరొక నిబంధన ఏమిటంటే, పడగొట్టి కట్టడం లాంటి మార్పులో కాంప్లెక్స్ ఎక్స్ టీరియర్ బ్యూటీ చెడిపోగూడదు.
మీ తెలివితేటలకో పరీక్ష. తెలివిగలవాళ్ళు ముందుకు రండి. పరిష్కారాల్ని ఒకరికి మించి కనుక్కోగలిగితే ఎవరి పరుష్కారం వలన మాకు తక్కువ ఖర్చవుతుందో వారికే మా బహుమతి.
కె. విశ్వేశ్వరయ్య, చైర్మన్, డైనమిక్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, 3-2-424, రోడ్ నెం.8, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 034.
ఆ ప్రకటన చదవటం పూర్తిచేసి ఓసారి తలెత్తి క్లాసంతా కలియజూసింది మాలిని.
మరో వారంలో జరగబోయే 'హాఫ్ యర్లీ ఎగ్జామ్స్' కి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెబుతుందనుకుంటున్న మేడమ్ ఆ ప్రస్తావనే తీసుకురాకుండా ఆరోజు దినపత్రికొకటి తెచ్చి ఆ ప్రకటన చదివి వినిపించి తమాషాగా తమవేపు చూడటం వింతగా అనిపించింది స్టూడెంట్స్ కి.
క్లాసంతా నిశ్శబ్దంగా వుంది.
పక్క క్లాసులోంచి హోరు వినిపించేంత నిశ్శబ్దంగా వుంది.
"మీలో ఎవరన్నా ఈ ఛాలెంజ్ ని ఎదుర్కొనగలరా?"
మాలిని కంఠం నుండి 'స్లో మోషన్ బుల్లెట్' లా వచ్చి తగిలిందా ప్రశ్న.
ఆ ఛాలెంజేమిటో తెలియకుండా ఎదుర్కొనగలం అని చెప్పగల ధైర్యం ఆ క్లాసులో ఎవరికీ లేదు. ఆ క్లాస్ కాదు. మాలిని వెళ్ళే ప్రతి క్లాసులోనూ ఆమెతో డేర్ గా బిహేవ్ చేయడం ఏ విద్యార్ధివల్లా కాదు.
ఏ రోజైనా ఈమెకు ఎదురు తిరగాలని స్థయిర్యాన్ని కూడగట్టుకొని వచ్చి కూడా కొంతమంది నీరుగారిపోతుంటారు.
మాలిని ఆ కాలేజీలో చేరిన కొత్తలో పెద్ద సంచలనం చెలరేగింది.
ఆ సంచలనానికి కారణం ఆమె అద్వితీయమైన సౌందర్యం కావచ్చు. ఆమె మోములో కనిపించే గాంభీర్యం కావచ్చు. రోజులో ఎక్కువ భాగం నిశ్శబ్దంగా వుండే ఆమె తీరుకావచ్చు. ఆమె నడక తీరు కావచ్చు. కట్టు, బొట్టు కావచ్చు. వెడల్పయిన ఆమె ఫాలభాగంపై కనిపించే ఎర్రటి సింధూరం కావచ్చు. ఎదుటి మనిషి అంతరంగాన్ని క్షణాల్లో చదవగల చురుకైన ఆమె చూపులు కావచ్చు. ఆమె వయసెంతో చెప్పలేని పాలరాతి విగ్రహంలాంటి ఆమె అవయవాల పొందిక కావచ్చు.
రెండువేలమంది దాకా స్టూడెంట్స్, వందమందిదాకా లెక్చరర్స్ వున్న ఆ కాలేజి ఆమె రాకతో సద్దుమణిగింది. వరదలా ఒడిదుడుకులతో వుండే ఆ కాలేజి సముద్ర గాంభీర్యాన్ని ఆశ్రయించింది.
కేవలం మాటలతో మంత్రించగలదు.
చూపులతో శాసించగలదు.
తమకు తెలియకుండానే తాము అలవాటుపడ్డ క్రమశిక్షణకు సిగ్గుపడే కొందరు స్టూడెంట్స్ కి, విద్యార్ధి జీవితపు హేంగోవర్ నుంచి ఇంకా బయటపడని కొందరు కుర్ర లెక్చరర్స్ కి మాలినిని చూస్తుంటే న్యూనతా భావం కలుగు తుంటుంది.
అలా అని ఆమేదో తమను అవమానించిందని కాదు, ఆమె ప్రత్యేకత పట్ల జెలసీ.
విద్యార్ధుల ముఖాలు బ్లాంక్ గా వున్నాయి.
ఆ తెలివితేటలు మీలో లేవా? అని తమను కొట్టిపారేసేందుకు సిద్ధపడుతున్న భావన ఆమె ముఖంలో కనిపించింది.
అప్పుడు లేచిందో యువతి. 'ఛాలెంజేమిటో చెప్పకుండా ఎదుర్కోగలరా అని అనడం..." అస్పష్టంగా తగ్గుస్థాయిలో వున్న ఆమె మాటలు మధ్యలోనే ఆగిపోయాయి.
మాలిని నవ్వింది. ఆ నవ్వుకున్న ప్రత్యేకత చిత్రమైంది. ఎదుటివాడు తనను పరిహసించినా క్షమిస్తున్నానన్న ఫీలింగ్ ఆ నవ్వులో స్పష్టమవుతుంది.
మాటకు మాట బదులు చెప్పడం కన్నా ఓరిమిని ప్రదర్శించేవారిని భరించటమే కష్టం.
"నీ అస్పష్టతకు రూపం ఇవ్వనా ప్రియాంకా?"
ప్రియాంక ఉలిక్కిపడి చూసింది.
"ఛాలెంజేమిటో చెప్పకుండా ఎదుర్కోగలరా అని అనటం స్టుపిడ్ నెస్- ఇడియాటిక్ - మోస్ట్ డిజ్ గస్టింగ్ క్వశ్చన్. ఇవే కదా నీవు పూర్తి చేయాలనుకున్నది?" మాలిని పెదవుల నుండి నవ్వు ఇంకా విడివడలేదు.
ప్రియాంక ముఖం అవమానంతో ఎర్రబడింది.
"అవును..." అంది విసురుగా ప్రియాంక.
ఎంతకాలంగానో ఏదో విధంగా మాలినిని అవమానించాలనుకుంటున్న కొందరు విద్యార్ధులకు ప్రియాంక విసురు హుషారు కలిగించింది.
మిగతా వారు తమ మేడమ్ తన 'స్టుపిడ్ నెస్' ని ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటే ఇంతకాలం ఆమెను సపోర్టు చేస్తూ వస్తున్నందుకు తాము పరిహాసాలపాలవుతారేమో?
'ఎలా?' అని వూపిరి బిగపట్టి చూస్తున్నారు.
మాలిని కుర్చీలోంచి లేచింది. ప్రియాంక వైపు 'పిచ్చిపిల్లా' అన్నట్లు చూస్తూ "ఆత్మవిశ్వాసం లోపించినవారు రానున్న గడ్డు కాలంలో నెగ్గుకు రావటం కష్టం. ముఖ్యంగా మీ తరానికి కావల్సింది అదే. అది ఇక్కడే మీకు అలవడాలి. ఈ చదువు కాస్తా పూర్తయ్యాక సమసమాజ సమరంలోకి దూకాలి మీరు. అప్పుడిక మీకు మీ అనుభవాలు నేర్పేది ఫ్రస్ట్రేషన్ ఫాల్స్ ప్రెస్టేజ్ - డిప్రెషన్.
మీలో నిండుగా ఆత్మ విశ్వాసం వుందనే నా నమ్మకం. నా నమ్మకము నిజమైతే మీరు ఏ ఛాలెంజ్ నైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. అందుకే ఛాలెంజ్ ఏమిటన్నది ముందు చెప్పలేదు..." మాలిని ఓసారి తలెగురవేసింది. అది ఆమె మేనరిజమ్. కాని దాన్ని ఆమె పొగరుగానే గుర్తించారు అంతా.
ప్రియాంక అందమైన మోము ముడుచుకుపోయింది. ముడుచుకుపోయిన ఆమె కనురెప్పల అందమైన కదలికను ఎన్నో కళ్ళు ఆస్వాదిస్తున్నాయి రహస్యంగా.
తన తెలివితక్కువతనానికి దెబ్బతింటుందనుకున్న మేడమ్ తమనే చావుదెబ్బ తీయటంతో కిక్కురుమనలేకపోయారు ఆ కొందరు.
"అంటే- ఈ రోజునుంచి ముప్పైరోజులన్న మాట" తనలో తాను అనుకుంటున్నట్లుగా చిన్నగా అంది మాలిని.
క్లాసులో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. ఎవరి ముఖంలోనైనా పరిష్కారం కనుక్కోగలనన్న ఆశాభావం కనిపిస్తుందేమోనని ప్రతి ఒక్కర్ని చూస్తోంది మాలిని.
క్లాస్ ఫాస్ట్ వచ్చే జోషి అనే విద్యార్ధి దగ్గర కొద్ది క్షణాలు ఆగిపోయాయి ఆమె చూపులు.
జోషికి పరిష్కారం కనుక్కోగలనన్న నమ్మకం కుదరకపోయినా ఈ స్థితిలో కనుక్కోగలనని ముందుకు రాకపోతే పరువు పోతుందని లేచాడు.
జోషి చెప్పబోయేది ముందుగానే వూహించినట్లు మాలిని చిరుమందహాసం చేసింది.
మరలా ఆమె చూపులు కదిలాయి. అవి అలా అలా కదిలి అమ్మాయిల బెంచీవైపు తిరిగాయి.
అప్పుడు ఠక్కున లేచింది ప్రియాంక- ఆమె ప్రక్కనున్న అమ్మాయిలూ ప్రియాంక ధైర్యానికి ఆశ్చర్యపోయారు.
"వెరీగుడ్ ప్రియాంక! లేడీస్ సైడ్ నుంచి నువ్వొక్క దానివన్నా లేచావు" అంటూ ఓ క్షణం ఆగి "ఎనీమోర్" అంది మాలిని.
అందరూ తలలు వంచుకున్నారు.
"జోషి, ప్రియాంకలకు ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోగలమన్న ధైర్యం వెంటనే కలిగింది. మీకు రేపు కలగవచ్చు. ఎల్లుండి కావచ్చు. అందరూ ప్రయత్నించండి. మన కాలేజీ పరువు నిలబెట్టండి. పరిష్కారంలో ప్రాక్టికాలిటి కొంతైనా వుందని నాకనిపిస్తే నా ఖర్చులతో మిమ్మల్ని అక్కడకు తీసుకెళతాను. మీరు వెళ్ళలేరని కాదు- కాని నేను తీసుకెళ్ళటం మీకో రివార్డు అవుతుందని."
మిగతా మాటలు వినిపించకుండా బెల్ మోగింది.
మాలిని లేచి అందరివైపూ మరోసారి కలియచూసి- "మీరు తెలివిగల వాళ్ళని ప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తాను" అంటూ వడివడిగా బయటకు నడిచింది.
ఆ వెంటనే నిశ్శబ్దం బ్రద్ధలయింది.
అప్పటికప్పుడే ప్రియాంకను ఆమె ఫ్రెండ్స్ చుట్టుముట్టారు.
"ఎలా చెప్పగలవే?" అని ఒకరు.
"పెద్ద ధైర్యంగా లేచావుగాని- ఎలా పరిష్కరిస్తావ్?" అని ఇంకొకరు, తలా ఓ రకంగా ప్రియాంకను నిలదీశారు అక్కడికక్కడే.
"పరిష్కారం కష్టమే నాకు తెలుసు. అలా అని మేడమ్ ముందు ఓడిపోవటాన్ని కూడా నేను సహించను..." ఓ క్షణం ఆగింది ప్రియాంక.
"మరి?" నలుగురైదుగురు ఒక్కసారే తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
"గడువు నెల. దాన్ని రెండు గడువులుగా విభజిస్తాను. మొదటి గడువుకి టైమ్ 25 రోజులు. దీన్ని నేను తీసుకుంటాను. 25వ రోజుకి నేను కనుక్కోలేకపోతే మిగతా ఐదురోజుల్లో పరిష్కారం కనుక్కోను. కొనుక్కుంటాను" అంది గర్వంగా తలెగురవేస్తూ ప్రియాంక.
"అది అసాధ్యం" అందో అమ్మాయి నిర్లక్ష్యంగా.
ప్రియాంక కోపంగా చూసింది ఆమె వైపు.