ఒక గ్యాంగ్ స్టర్ కి పుట్టింది తను. గ్యాంగ్ స్టర్స్ మధ్య పెరిగింది. చాలా గ్యాంగ్ వార్స్ చూసింది.
ఆ నెత్తుటికూడు మీద చిన్నప్పుడే వైముఖ్యం కలిగి సొంతంగా తన కాళ్ళమీద తాను నిలబడాలనే కోరికతో నిద్రాహారాలు మానేసి రాత్రింబవళ్ళు చదివింది తను. స్కాలర్ షిప్పులు తెచ్చుకుంది. మెడిసిన్ లో సీటు సంపాదించుకుంది.
డాక్టరయ్యింది. ప్రాణాలు తీసే మనుషుల మధ్య పుట్టిన తను ప్రాణాలు పోసే వృత్తిని స్వీకరించింది.
వచ్చిన మొదటి అవకాశాన్నే వదులుకోకుండా, అందుకని పుట్టి పెరిగిన ఊరికి దూరంగా వెళ్ళిపోయి ఈ ఢిల్లీకి వచ్చి ఇక్కడ దాదాపు సెటిలయిపోయింది. సాధ్యమైనంత సింపుల్ గా బతికేస్తోంది.
కానీ మళ్ళీ ఇప్పుడీ టెలిగ్రామ్.
ఏమయి వుంటుంది!
వెనక్కి తిరిగి చూసింది సుధ.
యాంగిల్ ఇంకా మారింది.
బ్యాగు బొత్తిగా కనబడడంలేదు ఇప్పుడు. అసలు ఉందా పోయిందా?
తమ హాస్పిటల్లో ఒక రోగి మృత్యువుతో ముఖాముఖి అన్న స్థితిలో వున్నాడు.
అతని కోపం తెప్పించింది తను ఆ మందులు.
అవి హాస్పిటల్ లో లేవు. ఉండవు, కొనరు.
అందుకని తన సేవింగ్స్ లో నుంచి తన సొంత డబ్బుతో తెప్పించింది వాటిని.
డబ్బు ముఖ్యంకాదు. మనిషి ప్రాణాలు ముఖ్యం.
ఆ మందులు పోతే....
ఈలోగా మళ్ళీ తన వాళ్ళ మీదకు మళ్ళింది ఆలోచన. కాసేపు అటు....కాసేపు ఇటు....
ఊళ్ళో ఏమయ్యింది?
అక్కడ అందరూ కులాసానా? కాదా?
ఆలోచనలోనే కౌంటర్ దగ్గరికి వచ్చేసింది డాక్టర్ సుధ.
లక్కీగా టిక్కెట్ దొరికింది.
ఓ.కే. టికెట్.
సాయంత్రం ఫ్లయిట్ కి.
రిలీఫ్ గా ఫీలవుతూ టికెట్ తీసుకుని గబగబా తన బ్యాగ్ ఉన్న చోటికి వచ్చేసింది డాక్టర్ సుధ. అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది.
అక్కడంతా గందరగోళంగా వుంది సీన్.
అందరూ ఆదుర్దాగా తన బ్యాగ్ వైపే చూస్తున్నారు.
గుండె ఆగినంత పనయ్యింది సుధకి.
ఏమయ్యింది? ఏమయ్యింది?
యూనిఫారంలో వున్న ఒక సెక్యూరిటీ గార్డు తన బ్యాగ్ దగ్గరే నిలబడి ఉన్నాడు.
దగ్గరకెళ్ళింది సుధ.
"ఈ బ్యాగ్ మీదేనా" అన్నాడు సెక్యూరిటీ ఆఫీసర్ కఠినంగా.
"అవును" అంది సుధ తడారిపోయిన గొంతుతో.
ఆమె అవును అని చెప్పగానే అప్పటిదాకా శ్వాస బిగపెట్టి చూస్తున్న జనమంతా ఒక్కసారిగా గుండెలనిండా గాలి పీల్చుకున్నారు. తర్వాత అందరూ ఆమె వైపు ఆరోపణగా చూశారు.
సెక్యూరిటీ ఆఫీసర్ తీవ్రంగా అన్నాడు__
"దిస్ ఈజ్ నాట్ గుడ్! చాలా కన్ ఫ్యూజన్ క్రియేట్ చేశారు మీరు! టెర్రరిస్టులెవరో బ్యాగులో బాంబులుపెట్టి ఇక్కడ వదిలేసి వెళ్ళి ఉంటారని భయపడ్డాం. ఈమధ్య చాలా జరిగాయి యిలాంటి సంఘటనలు. తెలిసో తెలియకో ఎవరన్నా బ్యాగుని కదిలిస్తే బామాబు పేలిపోతుంది. దారుణం జరిగిపోతుంది. ఇంకో అయిదు నిమిషాలు వుంటే ఎక్స్ ప్లోజివ్స్ ఎక్స్ పర్ట్స్ వచ్చి వుండేవాళ్ళు. మిమ్మల్ని ఇంటరాగేషన్ కి లాక్కెళ్ళి వుండేవాళ్ళు. అందరికీ అన్ ప్లెజన్ ట్ నెస్ కలిగి వుండేది తెలుసా?"
"ఐయామ్ సో సారీ!" అంది డాక్టర్ సుధ అందరివైపూ అపాలజెటిక్ గా చూసి. బ్రీఫ్ కేస్, బ్యాగు చేతిలో పట్టుకుని బయటికి నడిచింది.
ఆ ఒక్క సంఘటనతో దేశం ఏ స్థితిలో వుందో అర్ధమైపోయింది ఆమెకి.
ఒకప్పుడు ఇలాంటి సంఘటనల గురించి ఎక్కడో పేపర్లలో వార్తలు కనబడుతుండేవి. ఐర్లాండ్ లో తీవ్రవాదులు, ఆఫ్రికాలో తిరుగుబాటుదారులు, బనానా రిపబ్లికుల్లో గెరిల్లాలు ఇలా మారణహోమం చేస్తుండేవారని_
ఇప్పుడవి ఎక్కడో సుదూర ప్రాంతపు వార్తలు కావు.
ఇక్కడే నిత్యజీవితంలో ఎదురయ్యే అనుభవాలుగా మారిపోతున్నాయి.
ఏ క్షణాన ఎక్కడేం జరుగుతుందో తెలియదు.
అర్దరాత్రిపూట ఎవరు తలుపు తడతారో తెలియదు. తలుపు తీస్తే ఏం జరుగుతుందో తెలియదు.
మన పక్కన నడుస్తున్న వాడెవరో తెలియదు. మరో నిమిషంలో వాడేం చేయబోతున్నాడో తెలియదు.
తెలిసింది మాత్రం ఒక్కటే.
వయొలెన్స్! వయొలెన్స్! వయొలెన్స్!
ప్రతోచోటా భీభత్సం!
మనుషుల్లో, మనసుల్లో కూడా!
అన్నిటిమీదా, అందరిమీదా అనుమానం.
గొంతు పూర్తిగా తడారిపోయింది సుధకి.
తక్షణం కూల్ డ్రింక్ ఒకటి తాగాలనిపించింది.
కూల్ డ్రింక్ పార్లర్ వైపు నడిచింది.
హఠాత్తుగా అక్కడ కనబడ్డాడు సుధకి_ ఎత్తుగా, అందంగా, అందమైన పిశాచంలా_ అతను!
పరీక్షగా చూసింది. అతనే! డౌట్ లేదు! మరిడేశ్వరరావు కొడుకు.
తన తండ్రికి శత్రువైన మరిడేశ్వరరావు కొడుకు.
ఆ రాక్షస రాజ్యానికి యువరాజు.
అఖిల్!
చటుక్కున ఆగిపోయింది డాక్టర్ సుధ. వెనక్కి తిరగబోయింది.
అప్పుడు వినబడింది.
భూమి బద్దలయినట్టు, బ్రహ్మాండమైన బాంబు ప్రేలుడు!
ఎర్రటి వేడి క్షణంలో వ్యాపించి అనేకమందిని దహించేసింది.
ప్రేలిన బాంబు తాలూకు శకలాలు తగిలి తెగిన కాళ్ళు చేతులు కొన్ని మొగవాళ్ళవి, కొన్ని ఆడవాళ్ళవి, కొన్ని అన్నెం పున్నెం ఎరుగని పసి పాపలవీ ఆకాశంలోకి ఎగిరాయి. అలా ఎగిరిన శరీర భాగాల్లో ఒక ఆవు పొదుగు, ఒక మేక కొమ్ము కూడా వున్నాయి.
చిందిన రక్తం, చిరిగిన లోహంపై నుంచి వర్షంలా కురిశాయి.
ఆ విస్పోటనానికి కొద్ది క్షణాలపాటు డాక్టర్ సుధ కళ్ళు బైర్లు కమ్మినట్లయ్యింది. చెవులు దిబ్బెళ్ళు వేశాయి. మెదడు మొద్దుబారిపోయింది.
ఏ అవయవమో తెలియని ఒక మాంసఖండం వేడిగా, తడిగా తన మీద పడగానే ఉలికిపాటుతో మెలకువ వచ్చింది సుధకి. తక్షణం, తను ఒక డాక్టర్ ని అన్న స్పృహ కలిగింది. అప్రయత్నంగానే తన చేతిలోని బ్యాగ్ వైపు చూసుకుంది. అదృష్టవశాత్తు మందులన్నీ చెక్కు చెదరకుండానే ఉన్నాయి. ఆలోచించకుండా ముందుకు కదిలింది సుధ. చనిపోయినవాళ్ళు కొందరు, చనిపోబోతున్నవాళ్ళు కొందరు, కళ్ళు పోయినవాళ్ళు, కాళ్ళు పోయినవాళ్ళు, స్పృహలేకుండా పడి ఉన్నవాళ్ళు, స్పృహలో ఉండి బాధ భరించలేక దుర్భరంగా కేకలు పెడుతున్నవాళ్ళు, షాక్ లో ఉండి బాధ తెలియక, కదల్లేక మెదల్లేక పడి వున్నవాళ్ళు....
ఆక్రందనలు, ఆర్తనాదాలు, అరుపులు, కేకలు....
భీతి గొలిపేలా వుంది ఆ దృశ్యం! భీభత్సంగా ఉంది. అక్కడే నిలబడి ఉన్న ఒకతను కడుపులో తిప్పినట్లయి వాంతి చేసుకుంటున్నాడు.
మెకానికల్ గా మందులు బయటికి తీసింది సుధ. రాతి గుండెతో ఉన్న రాబోట్ లాగా ప్రొఫెషనల్ గా, అలవాటయిపోయిన కదలికలతో కొందరి గాయాలకి బ్యాండేజ్ చేసింది. కొందరికి ఇంజెక్షనులు ఇచ్చింది. ఇంకొందరికి ఇంకొన్ని మందులు ఇచ్చింది.
మళ్ళీ అక్కడే ఇంకో బాంబు పేలే అవకాశం ఉందేమోనన్న భయంతో అందరూ అక్కడినుంచి పారిపోతున్నారు. ఎవరూ ఎవరి సంగతీ పట్టించుకునే స్థితిలో లేరు.
ఒక మోకాలిమీద బరువు ఆనించి నేలమీదే కూర్చుని, రక్తసిక్తమై ఉన్న ఒంటితో వున్న ఒక్కొక్క మనిషినీ ట్రీట్ చేస్తూ నెమ్మదిగా ముందుకు కదులుతోంది డాక్టర్ సుధ.
హఠాత్తుగా ఆమె కళ్ళకి రెండు కాళ్ళు కనబడ్డాయి.
చటుక్కున తల ఎత్తి చూసింది.
ఎదురుగా నిలబడి ఉన్నాడు అఖిల్!
అఖిల్!
మరిడేశ్వరరావు కొడుకు!
అతన్ని చూడగానే, ఒకే ఒక్క క్షణంలో గత నాలుగేళ్ళ చరిత్రా ఆమె మనసులో ఫ్లాష్ అయినట్లు అయ్యింది!
రాధక్కయ్యా, రాజూ దారుణంగా చంపబడ్డ తర్వాత, రాజు తండ్రి మరిడేశ్వరరావు గుండె మండింది.
దెయ్యం పట్టిన రాక్షసుడిలా ఊగిపోయాడట అతను.
ఆ గ్యాంగు తాలూకు ఇన్ ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు ఈ గ్యాంగుకు తెలిసిపోతూనే ఉంటుంది ఆఘమేఘాలమీద.
ఆ ఏర్పాట్లు పకడ్భందీగా చేసే ఉంచాడు నాన్న.
అలాగే ఇక్కడి సంగతులన్నీ అక్కడవాళ్ళకి తెలిసిపోతూనే ఉంటాయి. వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకునే ఉంటారు.
ఆర్గనైజ్ డ్ క్రైమ్ ఇది!
పకడ్భందీగా ఉండాలి ప్రతిదీ!
ఇన్ ఫార్మర్ల ద్వారా ఇన్ ఫర్మేషన్ క్షణాల మీద అక్కడికీ, ఇక్కడికీ చేరిపోతూనే ఉంటుంది.
అది పగల సెగలని మరింతగా రాజుకునేటట్లు చేస్తూ ఉంటుంది!