సెర్చిలైట్ తాలూకు కాంతిపుంజం అస్పష్టంగా అప్పుడప్పుడు ఆ వరండాని ఓ పక్క తాకి వెళ్ళిపోతోంది.
సెంట్రీల బూట్ల నాడాల శబ్దం.... కోడ్ వర్డ్స్ ధ్వని తరంగాలు....
జైలు ఆవరణ బయటనుంచి వినవచ్చే కీచురాళ్ళ రొద....
ఇవేమీ ఈ కుర్రాడికి వినిపించడం లేదా?
అనిపించటంలేదా? అదెలా సాధ్యం?
రామదాసు మొట్టమొదటిసారి వివేక్ గురించి ఆలోచించటం మొదలెట్టాడు.
కాలం కసిగా కరిగిపోతూనే వుంది.
సుదూరంలో ఓ కుక్క హృదయవిదారకంగా అపశకునాన్ని అంచనా వేస్తున్నట్లుగా మొరిగింది. అదీ రామదాసుకి వినిపించింది.
సమయం తెల్లవారుఝాము నాలుగు గంటలు కావడానికి మరో ఐదు నిమిషాలే వుంది.
ఆలోచనలకు పరిశీలన పదును పెడుతుంది. నిజమే....తనన్న మాటలే. తనే ఇంతవరకు అప్లై చేయలేదు. ఆ ఆలోచన వస్తూనే రామదాసు వివేక్ కేసి పరిశీలనగా చూస్తూ ఆలోచించసాగాడు.
అప్పటివరకు- ఆలోచనల జోలికి వెళ్ళనంత వరకు చలికి గజగజా వణికిపోయిన ఈ యువకుడు అసలు చలే తెలీనట్లు, చలిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించటం రామదాసుకి కొత్త అర్ధాన్ని అందించే ప్రయత్నం చేసింది.
అసలు రామదాసు చలిని మర్చిపోవడానికే బస్కీలు తీసింది. బస్కీలు తీస్తే బాడీలో హీట్ జెనరేట్ అయి చలిని తట్టుకోగల నిరోధక శక్తి ఉద్భవిస్తుందనే అలా చేశాడు. అదే విషయాన్ని వివేక్ కి చెబుదామనుకున్నాడు.
వెంటనే అంత తేలిగ్గా చెప్పడం ఎందుకని ఆలోచించమని, పరిశీలించమని చెప్పాడు.
వివేక్ పరిశీలన మానేసి ఆలోచనా లోతుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ పైన చలిని మర్చిపోయాడు.
అంటే....చలిని తట్టుకొనేందుకు శరీరంలో హీట్ ని జనరేట్ చేసుకోనక్కర్లేదు- ఆలోచనల్ని వేడెక్కించుకోగలిగితే చాలనేగా ఈ యువకుడు చెప్పేది.
ఆ ఆలోచన వస్తూనే రామదాసు ఓ విచిత్రమైన వుద్వేగానికి లోనయ్యాడు.
చలినే కాదు-మనిషి దేన్నయినా తట్టుకొనేలా చేయగల కొత్త మందు డైవర్షన్. మనస్సుని, ఆలోచనల్ని డైవర్ట్ చేస్తే....దారి మళ్ళిస్తే? వేరే విషయం మీద కేంద్రీకరిస్తే? చలినికానీ, బాధనికానీ, భయాన్నికానీ మనిషికి తెలియజెప్పేది మెదడు. ఆ మెదడుకి వేరే పని కల్పిస్తే?
ఆ పని కల్పించడమన్నది ఎక్కువ మోతాదులో వుంటే చలినే కాదు బాధల్ని, భయాల్ని, అవమానాల్ని, అనుమానాల్ని, పెనుభూతాల్ని చివరకు పెనుతుఫానులాంటి సంఘటనల్ని సైతం తట్టుకొని మనిషి నిలబడగలడన్నమాట.
నాడీమండలంపై నియంత్రణ....
మునులు, సాధువులు, యోగులు సాధించేది అదేనా? తన ఆలోచనలన్నీ ఓ కొలిక్కి వచ్చాక రామదాసు తిరిగి వివేక్ స్థితిపై దృష్టిని కేంద్రీకరించాడు.
వివేక్ ఇంకా చలిని ఎలా తట్టుకోవచ్చనే ఆలోచిస్తున్నాడు.
"ఏం దొరవారూ! ఇంకా మేల్కొనే వున్నారా?" రామదాసుని చూసి సెంట్రీ సర్ క్కాస్టిగ్గా ప్రశ్నించాడు వినయాన్ని నటిస్తూ.
రామదాసుకి తెలుసు సెంట్రీ ఎందుకలా ప్రేమని నటిస్తున్నది.
అయినా రామదాసు ఏం మాట్లాడలేదు.
"ఆ యాభై లక్షలతో ఏం చేద్దామని ఆలోచిస్తున్నావా?" సెంట్రీ ఒకింత చనువుగా అన్నాడు.
ఎవరి పని వాళ్ళు చేసుకుపోవడం మంచిదేనా?" రామదాసు కూడా ఒకింత వ్యంగ్యంగానే అంటించాడు.
"అవునవును" అని కంగారుగా అంటూ సెంట్రీ ముందుకు కదుల్తూ యధాలాపంగా కుడివైపు సెల్ లో వున్న వివేక్ ని చూశాడు.
రామదాసు వ్యంగ్యానికి పురెక్కివున్న సెంట్రీ ఆ కోపాన్ని వివేక్ మీద చూపించాలనుకున్నాడు. "ఎన్నిసార్లు చెప్పినా నిద్రపోకుండా జపం చేస్తున్నావా? లేక జైల్లోంచి ఎలా తప్పించుకోవచ్చని ఆలోచిస్తున్నావా" అంటూ పెద్దగా రంకెలేస్తూ తుపాకీ మడమతో కటకటాలపై మోదాడు.
దాంతో పెద్ద శబ్దం వచ్చింది.
అయినా వివేక్ ఏకాగ్రత చెదరలేదు. సెంట్రీ చర్యని ఆపాలనుకుంటే రామదాసు ఆపగలడు. కానీ వివేక్ ఏకాగ్రతకి చిన్న పరీక్ష ఎదురయితేనే మంచిదని మిన్నకుండిపోయాడు.
ఠాంగ్ మంటూ ఆ వార్డ్ మొత్తానికి వినిపించేంత శబ్దమయినా వివేక్ కదలలేదు.
సెంట్రీ అతని నుంచి రెస్పాన్స్ లేకపోవటంతో మరింత రెచ్చిపోయాడు.
కటకటాల మధ్యనుంచి తుపాకిని దూర్చి వివేక్ నెత్తిమీద ఒక దెబ్బ వేయాలనే ఉద్దేశంతో సెంట్రీ బేరల్ ని తనవైపు తిప్పుకొని మడమని సెల్ వైపు తిప్పుతుండగా రామదాసు తేరుకున్నాడు. "అతన్ని వదిలేయ్" అన్నాడు రామదాసు సెంట్రీ నుద్దేశించి గంభీరంగా.
సెంట్రీ మంత్రించినవాడిలా వెంటనే తన ప్రయత్నాన్ని మానుకొని ముందుకు సాగిపోయాడు లోలోన పచ్చిబూతులు తిట్టుకుంటూ.
ఏ మనిషినైనా మొదట్లో ఏ చిన్న సమస్యయినా, నష్టమైనా తెగ బాధ పెట్టేస్తుంది. వ్యాకులతకి గురి చేస్తుంది. ఆ సమస్యకన్నా, నష్టం కన్నా పెద్దవి ఎదురయితే మొదట వాటిని మర్చిపోతాడు. అసలవి గుర్తుకే రాకపోవచ్చు. చిన్న గీతకింద పెద్దగీత- ఆ పెద్ద గీత కింద అంతకంటే పెద్దగీత-మనిషి అలవాటు పడతాడు. మనసు రాటు తేలుతుంది. చివరికి అదే అబ్సెషన్ అయితే....?
మానసిక వ్యాధి నిరోధక శక్తి రెట్టింపవుతూ పోతుంది.
ఎమోషనల్ ప్రిజిడిటీ....
స్పందనారాహిత్యం....
స్థిమితంగా బ్రతకటం అలవాటవుతుంది. సంయమనం దానికి సరైన పేరు కాకపోయినా ప్రత్యామ్నాయపదం అవుతుంది.
మనస్సుని వేరే పనిమీదకు గానీ, విషయం మీదకుగానీ మళ్ళిస్తే, లగ్నంచేస్తే, అప్పటివరకు అతన్ని వేధించే సమస్య తాలూకు తీవ్రత తగ్గిపోతుంది.
ఒక కొత్త నిజం బయటకొచ్చిందనుకున్నాడు రామదాసు.
జైలు అంతా ప్రశాంతంగా, భద్రంగా ఉందని ఆ జైలు సిబ్బంది భావిస్తున్న ఆ సమయంలో రామదాసు మెదడులో ఓ ప్రమాదకరమైన పథకమొకటి క్రమంగా ఓ నిర్దుష్టరూపాన్ని సంతరించుకోసాగింది.
ఆ జైలు తలుపులు ఒకరికోసం ఒక్కసారి తెరుచుకుంటే నగరానికి నగరమే అతలాకుతలమైపోతుంది. రామదాసు ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తున్నాడు.
ఆ జైలుకొచ్చిన ఐదు సంవత్సరాల తరువాత రామదాసు తొలిసారిగా అలా ఆ మార్గంలో ఆలోచిస్తున్నాడు.
అప్పటికి వివేక్ సమాధిలోకెళ్ళి గంటన్నరకిపైగా అయింది.
రామదాసు తన దగ్గర మిగిలి వున్న బ్రెడ్ ముక్కని చేతిలోకి తీసుకొని చేతిని, తన సెల్ తలుపుల ఊచలోంచి బయటకు చాపి, గురిచూసి వివేక్ కి తగిలేలా విసిరాడు.
అది సరిగ్గా వెళ్ళి వివేక్ ముఖానికి తగిలింది.
వివేక్ ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు.
జరిగిందేమిటో ముందుగా అతనికి అర్ధం కాలేదు.
కొద్ది క్షణాలకి అర్ధమయింది.
అర్ధం కాగానే రామదాసు కేసి సిగ్గుపడుతూ చూసి- "సారీ! తెల్సుకోలేకపోయాను." అన్నాడు చాలా నెమ్మదిగా.
రామదాసు సమాధానం చెప్పకుండా టెస్ట్ లోని చివరి పరీక్షకు సిద్ధమయినవాడిలా వివేక్ కేసే చూడసాగాడు. కొద్ది క్షణాలయింది. అంతే....వివేక్ తిరిగి చలికి ఒణికిపోసాగాడు.
రామదాసు పెదాలమీద లీలమాత్రంగా చిరునవ్వు, దాన్ని వెన్నంటే కసి.
ఎన్నో ఏళ్ళుగా అణగారిపోయిన ఆశలు, పథకాల పొరల్లో చిన్న కదలిక....
రామదాసు ఎందుకలా తనకేసే దీక్షగా చూస్తున్నదీ వివేక్ కి అర్ధంకావటంలేదు.
కుందేళ్ళకేం తెలుసు- మనుష్యులు, మందుల కంపెనీల్లో తమమీదేం ప్రయోగం చేసేది? ఎలుకలకేం తెలుసు ఆ ప్రయోగాల ఫలితమేమిటన్నది! కోతులకేం తెలుసు ఫలితాల ప్రయోజనం?
"ఎందుకు ఏమిటని అడక్కు. ముందు ముందు నీకే తెలుస్తుంది. అంబాడే నీకు ఒక్కసారే ఆవకాయ తినిపించటం శ్రేయస్కరం కాదు. ఇప్పుడు చెప్పు నువ్వెవరివి? ఏ నేరంమీద జైలు కొచ్చావ్....?" రామదాసు పద్మాసనం వేసుక్కూర్చుంటూ అడిగాడు.
రామదాసు ప్రవర్తన వివేక్ కి వింతగా తోచింది. ఆ మాత్రమైనా ఆ జైల్లో ఆప్యాయంగా పలకరించేవాళ్ళు లేక అలమటించిన వివేక్ కళ్ళవెంట తడి, ఆపైన నోటివెంట మాటలు వెలువడసాగాయి.
"హత్యానేరం మీద...." నిర్లిప్తంగా అన్నాడు వివేక్.
"హత్యా....? నువ్వా...! జోకులేస్తున్నావా?" పెద్దగా నవ్వుతూ అన్నాడు రామదాసు.
* * * *
వివేక్ మౌనంగా వుండిపోయాడు. లోలోన రోదన మొదలైంది. దాని తాలూకూ ఎక్స్ ప్రెషన్ అతని ముఖంమీద నీడలా కదలాడింది.
"హత్య....అనే అక్షరాల్ని ఉచ్చరించటానికీ, నాలుగు బొట్ల రక్తాన్ని చూడటానికి భయపడేవాడిలా వున్న నువ్వు. హత్య చేశావా? హత్య చేయటం, చేశానని చెప్పడమంత తేలిక కాదు. దానికి చాలా తెగువ కావాలి. రాక్షసత్వం కావాలి. అవి నీలో లేవు. నీ కళ్ళలో వాటి తాలూకు ఛాయలే కనిపించటం లేదు. నిజం చెప్పు....ఎందుకు జైలుకొచ్చావ్?"
రామదాసు మాటల్లో ఆసక్తిలేదు - ఆరా వుంది.