వాళ్ళంతా లోటాలతో నీళ్లు తెచ్చుకుని ఆర్చుకు ఆర్చుకు తాగుతున్నారు. మకిలి పట్టిన ఆ సత్తు లోటాతో నీరు తాగటానికి ముందు మనస్కరించలేదు పద్మినీకి దాహం ఆపుకోలేక చివరికి ఆ నీళ్ళే తాగింది. వేడిగా ఉన్నాయ్ ఆ నీళ్ళు. ఎప్పుడూ ఫ్రిజ్ వాటర్ తాగే పద్మినికి ఆ నీరు నలనలకాగే వేణ్ణీళ్ళులా అనిపించాయి.
అన్నింటికి పట్టుదల ముఖ్యం పట్టుదల చాలా బలాన్నిస్తుంది.
మాట కోసం నిలబడాలనుకున్న పద్మిని బాధని భరిస్తూ పట్టుదలగా అలా కూర్చుండిపోయింది.
యజమాని కూతురు అందాల బొమ్మ తమ మధ్యలో వుండేసరికి వాళ్ళకిమాత్రం ఎక్కడలేని శక్తీ వచ్చింది. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కొందరు కూర్చుంటే కొందరు మహావిష్ణువు ఫోజులో పవళించారు. మధ్య మధ్య నినాదాలు మాత్రం మానలేదు. గొంతుకలు అర్చుకుపోయేలా, చెవులు డబ్బెళ్ళు పడేలా అరుస్తూనే వున్నారు.
మధుసూదనరావు దిగిరాలేదు.
నెమ్మదిగా సాయంత్రం అయింది.
అందరూ ఇళ్ళకీ వెళ్ళడానికి లేచారు సూరిబాబు లాంటి నాయకులు మాత్రమే టెంటులో వుండిపోయారు.
"అమ్మాయిగారూ, మీరు ఇంట్లోకెళ్ళిపోండి" వాళ్ళలో ఓ ముసలి తాత కాస్త ధైర్యం చేసి చెప్పాడు.
మీ కోర్కెలు నెరవేరేదాకా యజమాని దిగివచ్చేదాకా నే నా ఇంట్లో అడుగుపెట్టను. నేను మీ గూడెంలో ఉంటాను, మీతోపాటే కలో గంజో తాగుతాను. కొన్ని విజయాలు సాధించాలంటే శారీరకంగా మానసికంగా కష్టపడాలి అని ఒక మహాకవి చెప్పాడు. ఈ సందర్భంలో నేను ఆమాట పాటిస్తున్నాను" పద్మిని నీరస స్వరంతో గంభీరంగా చెప్పింది.
ఆ పిల్ల చెప్పిన మాటలేమిటో పూర్తిగా యెవరికీ అర్ధంకాకపోయినా ఒకటిమాత్రం బాగానే అర్ధం అయింది. అమ్మాయిగారు తమతో పాటు వచ్చి తామున్న చోటనే ఉంటుందని. అది అయ్యేపని అవునో కాదో వాళ్ళకీ తెలీదు. అయినా సరేననక తప్పదు కాబట్టి "సరే! మీ ఇష్టం అమ్మాయిగారూ" అన్నాడు.
వాళ్ళందరితో కలిసి నడుస్తూ వాళ్ళు వివరిస్తున్న ప్రదేశానికి చేరింది పద్మిని.
అక్కడంతా పడిపోయిన పాకలు...కాస్త బాగున్న గుడిసెలు__ఒకటికి రెండు పెంకుటిళ్ళు. గోనెపట్టాలు పరదాలుగా కట్టిన రేకుల కొంపలు...మురికితో కూడిన పిల్ల కాల్వలు...పందులు వాటి సంతానం, కోళ్ళు, నాలుగైదు మేకలు, చీమలు, దోమలు మొత్తానికి అదో చిన్న ప్రపంచము అక్కడ ఏర్పడి వుంది.
ఆ కొత్త ప్రపంచంలోకి తొలిసారిగా కాలుపెట్టింది పద్మిని ప్రియదర్శిని.
3
సినిమాల్లో అయితే
లక్షాధికారి అయిన హీరోయిన్ ని పైసారి కాణాలేని హీరో ప్రేమించి పెళ్ళాడి తన గూడేనికి తీసుకువస్తాడు. అక్కడ నివసించే అందరూ బీదవాళ్ళు అయినా మంచి మంచి చీరలు కట్టుకుని ఉంటారు.
పైకి చిన్న గుడసె లోపలికెళితే పెద్ద పెద్ద గదులు. ఉన్న సామాను చౌకబారువయినా నీటుగా సర్ది వుంటుంది. వాకిలిముందు పెద్ద పెద్ద ముగ్గులు, బీదరికం కూడా ఆర్టుగానే ఉంటుంది.
ఇంక పాత్రధారుల విషయానికివస్తే సరేసరి, అన్నా, చెల్లీ అంటూ ఆప్యాయంగా పిలుచుకోవటం, మావోయ్ అంటూ పరాచికాలు. అమ్మా, నీ కోసం ణా ప్రతి రక్తం బొట్టు ధారపోస్తాననే కొడుకు తాగినా తమాషాగా వుండే మనుషులు.
సినిమా కథలే వేరు, ఆ వాతావరణమే వేరు.
ఇది సినిమా కాదు నిజ జీవితం.
ఇక్కడి కథలే వేరు.
యజమానిగారి కూతురి లక్షాధికారి పుత్రిక ముచ్చటైన అతి సుకుమారంగా వున్న అందాల భరిణె ముద్దుగుమ్మ. తమ గూడేనికి రావటం వాళ్ళకి తమాషాగాను వుంది. పెద్దవాళ్ళతో ఎందుకొచ్చిన గోల అన్న భయం వుంది.
అమ్మాయిగారు వచ్చిందని తెలిసి అంతా బయటికి వచ్చారు. గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.
సినిమాలలో బీదతల్లులు నిర్మల అన్నపూర్ణ, వరలక్ష్మి పుష్పలతలాంటి ముఖాలు మచ్చుకయినా ఒక్కటంటే ఒక్కటి ఆ ముఖాల్లో కనపడలేదు. వాళ్ళల్లో ఎవరిని పలకరించాలో అర్ధంకాలేదు పద్మినికి.
కాస్త చురుగ్గావున్న ఒక అమ్మాయిని ఎన్నుకుంది పద్మిని. "చూడు చెల్లీ" అంది ఆప్యాయంగా.
ఆ పిల్లకి కంగారు వేసింది. "అయ్యోయ్" అంది తన తండ్రిని పిలుస్తూ.
"పిచ్చి మొగమా! అమ్మాయిగారు నిన్ను పిలుస్తుంటే అలా గాబరాపడతావేంటే" అని పద్మినివేపు తిరిగి "అమ్మాయిగారూ, నా కూతురు అచ్చమ్మ! ఉత్త పిచ్చిమాలోకం" అంటూ పేరుతో సహా కూతుర్ని పరిచయం చేశాడు ఎలమందయ్య.
"ఎప్పటినుంచి పిచ్చి. అసలు ఏ కారణాన మతి చలించింది? చూడటానికి బాగానే వుందే!" అచ్చమ్మని చూస్తూ ఆశ్చర్యం వెళ్ళబుచ్చింది పద్మిని ప్రియదర్శిని.
"నా కూతురికి పిచ్చా?" అనుకున్న ఎలమందయ్యకి బుర్ర గిర్రున తిరిగింది.
"నాకేం పిచ్చి లేదు" కోపంగా అంది అచ్చమ్మ.
వాళ్ళల్లో తెలివిగల గురవయ్య పొరపాటు యెక్కడ జరిగిందో గ్రహించాడు. "మా అమ్మాయి ఉత్త పిచ్చిమాలోకం అని నీవే అమ్మాయిగారితో చెప్పావుగందా ఎలమందయ్యా" అని చెప్పి పద్మినివేపు తిరిగి "ఆడలా చెప్పటం వలన మీరు పొరపడ్డారు అమ్మాయిగారూ! అచ్చమ్మ చాలా అల్లరిపిల్లండోయ్. నోరు తెరిచిందంటే చినిమా కబుర్లే కబుర్లు. కిట్టిగాడంటే పడిచస్తుంది. అంతేగందా అచ్చమ్మా" అంటూ చెప్పి అచ్చమ్మతో పరిచికంగా అన్నాడు.
"పో..." అంటూ అచ్చమ్మ అరడజను మెలికలు తిరిగింది.
"నేను వీళ్ళింట్లో వుంటాను" వార్ డిక్లేర్ చేసినట్లు తన నిర్ణయం ఠాప్ మని చెప్పేసింది పద్మిని ప్రియదర్శిని.
"మా ఇల్లు చిన్నది" ఎలమందయ్య కంగారుప్ పడిపోతూ చెప్పాడు.
"మీ ఇల్లు చిన్నదా, పెద్దదా? అని నేనడగలేదు" గంభీరంగా అంది పద్మిని.