Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 4

    "రెండు గంటలయ్యింది నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని. నీ గదిలోంచి ఏదో పని చేస్తున్నట్లు చప్పుళ్లు వినవస్తూ వుంటాయి. తలుపులు వేసుకుని నువ్వు లోపల చేసే ఘనకార్యం ఏమిటి?" బోసుబాబు అన్న లక్ష్మణమూర్తి అడిగాడు.

    "చెప్పాలా?" బోసుబాబు మామూలుగా అడిగాడు.

    "చెప్పాలి! చెప్పి తీరాలి. ఈరోజు ఎలా అయినా సరే నీ నోట్లోంచి నిజం తెలుసుకోటానికి...."

    తండ్రి మాటలకు అడ్డుతగులుతూ "ఓహో! నేనేదో చేస్తున్నానని అదేదో చాలా భయంకరమైన పని అని ఆ పరమరహస్యం తెలుసుకోటానికి మన కుటుంబ సభ్యులంతా నాకోసం ఎదురు చూస్తూ ఈ హాల్ లో సమావేశం అయ్యారన్నమాట!" వ్యంగ్యంగా అన్నాడు బోసుబాబు.

    "ఏమీ లేకపోతే ఎందుకు తలుపు వేసుకోవాలిరా?" తండ్రి జగన్నాధం అడిగాడు.

    "ఏదన్నావుంటే తలుపు వేసుకుంటారని, లేకపోతే వేసుకోరని నాకు తెలియదులే!" అన్నాడు బోసుబాబు.

    "అడిగిన దానికి నిదానంగా జవాబు చెప్పలేవురా? బోసూ!" అంది కల్యాణమ్మ.

    ఆవిడ పేరుకే కల్యాణమ్మ. ఆవిడ జీవితం మటుకు నిత్యకల్యాణం పచ్చతోరణం కాదు. మాటకుముందు చిర్రుబుర్రు లాడే భర్త, డిగ్రీ పూర్తికాగానే మంచి ఉద్యోగం వచ్చిందని మాటకు ముందు గర్వం ప్రదర్శించే పెద్దకొడుకు. ఒకప్రక్క ఇంటర్ చదువుతున్నా సినిమాలూ నవలలే జీవితధ్యేయమనుకునే కూతురు సుమిత్ర. తెల్లారిలేచింది మొదలు ఏదోఒక వంక వెతుకుతూ మాటలతో ఎత్తి పొడుస్తూ మాటకి ముందు మూతి తిప్పే కోడలు సామ్రాజ్యలక్ష్మి, ఫస్ట్ క్లాస్ తో డిగ్రీ పూర్తిచేసి, టైపు, షార్ట్ హాండు ఎన్నో రకాల గేమ్స్, అన్నింటా బహుమతులు పొందికూడా నిరుద్యోగిగా మిగిలిపోయిన బోసుబాబు.... ఇదీ ఆ కుటుంబం.

    గత రెండేళ్ళబట్టి ఉద్యోగవేటలో పూర్తిగా అలసిపోయాడు బోసుబాబు. అతని తెలివితేటలు ఉద్యోగమిచ్చే ఎవరికీ పనికి రాలేదు. తెలివితేటలు ఎక్కువగా వుండటం వలన కూడా ఒకరమైన అసమర్ధతే అన్న సత్యం బోసుబాబుకి కొద్దికాలం క్రితంనుంచే అర్ధమయ్యింది. అర్ధమయిన తరువాతనే అతనిలో చాలా మార్పు వచ్చింది.

    బోసుబాబు పూర్వం బోసుబాబు కాదు.

    అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు.

    అతనిలో వచ్చిన ఆ మార్పేమిటో తెలియకనే ఆ ఇంటిలోవాళ్ళు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

    గోరంతలు కొండంతలుగా చేసి చెప్పుకునేది లోకులని, అందరికీ తెలిసిన సత్యమే. కానీ, ఈ కుటుంబంలో మాత్రం ఆ కుటుంబ సభ్యులే ఆ కుటుంబంలో జరిగిన సంఘటనే తీసుకుని, గోరంతలు కొండంతలుగా చేసుకుని నానా గందరగోళం పడుతూంటారు. రోజుకి ఒకసారయినా వాళ్ళు అలాపడకపోతే వాళ్ళకే పిచ్చి ఎక్కినంత పనిగా వుంటుంది.

    ఈమధ్య బోసుబాబు ఎక్కడెక్కడో తిరిగివస్తున్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేయటం లేదు. ఒక్క ఉద్యోగానికీ అప్లికేషన్ పెట్టడంలేదు. చాలా నిర్లక్ష్య వైఖరి అతనికి ఏర్పడింది.

    ఆ కుటుంబానికి సొంత కొంపంటూ ఒకటి వుండబట్టే బోసుబాబుకి అంటూ ఒక గది వుంది. అతను తన గదిలోకి వెళ్ళి ఒక్కోసారి తలుపు వేసుకుంటే గంటా రెండు గంటలదాకా తలుపు తియ్యడు. మధ్యలో ఎవరన్నా పిలిస్తే పలకడు.

    అదేపనిగా పిలిస్తే విసురుగా తలుపు తీసి ముఖం మాత్రం తలుపు సందులోనుంచి బయటపెట్టి "నేను ఇంటిలో లేనపుడు పిలవరుకదా! ఇంటిలో వున్నాను కాబట్టే పిలుస్తున్నారు. తలుపులు వేసుకుని నేను గదిలో వున్నప్పుడు నేను ఇంట్లో లేననుకోండి. అంతేకానీ తలుపులు కొట్టి పిలిస్తేమాత్రం సహించను. నాకడ్డం రాకండి" అని అరిచి ఫెడేలున మళ్ళీ తలుపు బిగించుకునేవాడు.

    "తలుపులు గడియవేసుకుని బోసుబాబు గదిలో ఏం చేస్తున్నట్లు?"

    "గదిలోంచి కాయితాలు చింపుతున్న చప్పుడు, చెక్కలకి మేకులు కొడుతున్న చప్పుడు, తప్, తప్, మని ఏదో చదును చేస్తున్నట్లు వచ్చే శబ్దాలు!"

    "ఈ చప్పుళ్ళన్నీ దేనికి సంబందించినవి?" అడిగితే బోసుబాబు సూటిగా సమాధానం చెప్పడు.

    ఒక్కోసారి అయితే అసలు సమాధానమే చెప్పడు.

    ఏదో ఒకసారి మాత్రం "నేను ఎలా ఛస్తే మీకెందుకు?" విసుక్కుంటూ అనేవాడు.

    పోనీ,

    బోసుబాబు ఇంట్లోలేనప్పుడు బోసుబాబు గదిలోకి వెళ్ళి చూద్దామా అంటే, అది జరిగేపనిలాగా కనపడలేదు.

    బోసుబాబు గదిలోంచి బయటకు వస్తూనే ఆ గది తలుపులకి తాళం బిగిస్తాడు. ఆ తాళం చెవి ఎప్పుడూ అతని దగ్గరే వుంటుంది.

    బోసుబాబుకి పిచ్చో, వెర్రో, చేయరానిదేమైనా చేస్తున్నాడో అదేదో అతని మూలానే తెలుసుకుందామని ఈరోజు యింటిలో వాళ్ళంతా పట్టుబట్టి పనిగట్టుకుని హాల్ లో సమావేశమయ్యారు. బోసుబాబు చాలా తెలివిగలవాడు. ఆవలిస్తే ప్రేగులు లెక్కపెట్టడమేకాక, ఆ ప్రేగుల వయస్సు కూడా నిర్ణయించగల మేథావి.

    హాల్లో సమావేశమయిన వాళ్ళను చూసి జరగబోయేదేమిటో గ్రహించాడు. అతనికి చిర్రెత్తుకు వచ్చింది. ముఖం గంభీరంగా పెట్టుకుని వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

    "నాకంటే అదృష్టం బాగుండి, డిగ్రీ పూర్తి కాగానే ఉద్యోగం వచ్చింది. నీకలా రాలేదు. అంతమాత్రంచేత దిగులు, నిరాశ, నిస్పృహలు దేనికి?" లక్షణమూర్తి అన్నాడు.  

    "మీకు పట్టిన అదృష్టం మరిదిగారికి పట్టలేదు గదా! అందుకులేండి!" అంది సామ్రాజ్యలక్ష్మి.

    "కొట్లో పద్దులురాసే గుమస్తాపని అయితేమాత్రం తప్పేమిటి రా! నాన్నగారు గురవయ్యని అడిగారుట. "మీ అబ్బాయిని పంపించండి. మా కొట్లో పద్దులు రాస్తాడు. నెలకి రెండువందల యాభయి ఇస్తాను." అన్నాడుట. ఈ కరువురోజుల్లో రెండువందల యాభయి మాత్రం తక్కువటరా!" అంది కల్యాణమ్మ.

    చిన్నదో, చితకదో ఏదో ఒక పనిలో కొడుకుదూరితే ఓ మార్గాన పడతాడని కల్యాణమ్మ ఆశ.

    "ఏంరా! రేపటినుండి వెళతావా? గురవయ్యకి చెబుతాను!" జగన్నాథం అడిగాడు.

    "రెండువందలయాభయి! నెలకి నాలుగు క్షవరాలకి పదిసార్లు గడ్డం గీసుకునే బ్లేడ్లకి సరిపోతుంది. నా క్షవరం ఖర్చులు మిగులుతాయని ఉదారంగా నాకో ఉద్యోగం చూపిస్తున్నారన్న మాట ఆహాహా! ఏమి ఔదార్యం!" వ్యంగ్యంగా అన్నాడు బోసుబాబు.

    "ఉద్యోగాలు దొరక్క ఛస్తుంటే ఈ కరువు రోజుల్లో నీకు రెండువందల యాభయి రూపాయలు క్షవరం ఖర్చుగా కనపడుతోందా? మాట్లాడే దానికైనా ఒక అర్ధం వుండాలి" జగన్నాథం అన్నాడు.

 Previous Page Next Page