Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 46

    "మీ ఫీజు .... !" బిడియంగా అడిగింది జయంతి.

    "నా ఫీజుకన్నా మీరంతా నా దగ్గరకు వచ్చి కరాటే నేర్చుకోటం నాకు వెయ్యి ఏనుగుల బలం. లాటరీలో లక్ష లొచ్చినంత అయినా.... నేను బతకటానికి మరో ఆధారం లేదు కాబట్టి డబ్బు అవసరమే. ఎవరికి తోచింది వారు ఎంతో కొంత యివ్వండి. బలవంతం లేదు. మరో విషయం మీకు ముందే చెప్పాను. ఒక నెల రోజులు నేర్చుకుని చూసి ఆ తర్వాత నేర్చుకోవాలని వుంటే కరాటే నేర్చుకుంటూ అప్పుడు ఫీజు మీ యిష్ట మొచ్చినంత యివ్వండి. మీ శక్త్యానుసారం యివ్వవచ్చు. ఒకళ్ళు తక్కువే యివ్వగల వారు వుంటారు. అందుకే ఎంతో కొంత. ఆఖరికి రూపాయి యిచ్చినా సరే నేను ఏమి అనుకోను." దీక్ష చెప్పింది.

    జయంతి ఇరవై రూపాయలు తీసి దీక్ష కివ్వబోయింది. అన్నీ అయిదులే. "ఇదేమిటి?" దీక్ష నోట్లు తీసుకోకుండా అడిగింది.

    "టైపుకి ఫీజు ఇరవై యిస్తున్నాను. మీ ఫీజు కూడా యిద్దామని...."

    దీక్ష నెమ్మదిగా నవ్వింది .ఆప్యాయంగా జయంతి భుజం మీద తట్టింది. "టైపుకి అంత యిస్తున్నానని దీనికి యింత యివ్వాలని ఏమి లేదు. నీ శక్తి నీ యిష్టానుసారమే ఇద్డువుగాని. అదీ యిప్పుడు కాదు. నెల తర్వాత." అంది.

    "లేదు మీరు తీసుకుంటే నాకు సంతోషం." అంది జయంతి.

    "తీసుకోండి మేడమ్! మాలో ఎవరమో ఒకరం యిస్తే మా అందరికీ తృప్తి." మిగతా వాళ్ళు అన్నారు.

    దీక్ష నాలుగు అయిదు రూపాయల నోట్లలోంచి ఒకే అయిదు రూపాయలనోటు తీసుకుంది, తీసుకుంటూ చెప్పింది "ఇది ఫీజు కాదు. మీ తృప్తికోసం తీసుకుంటున్నాను. ఫీజు మీ యిష్ట మొచ్చినంత మీరే నిర్ణయించి నెల తర్వాత యివ్వండి. జయంతీ! ఫీజు తీసుకోలేదని ఏమి అనుకోకు."

    "థాంక్స్ మేడమ్! నాకు చాలా ఆనందంగా వుంది." జయంతి అంది మిగతా మూడు అయిదునోట్లు బుల్లి పర్స్ లొ పెట్టుకుంటూ.

    మర్నాడు వుదయం వస్తామని చెప్పి అందరూ శలవు తీసుకుని వెళ్ళిపోయారు.

    వాళ్ళంతా వెళ్ళిన తరువాత దీక్ష అయిదు రూపాయల నోటు మీద బుల్లిబుల్లి అక్షరాలతో రాసింది "ఇది నా మొదటి సంపాదన. నా విద్యని గౌరవించి యిచ్చిన గిఫ్ట్. జయంతి అమ్మాయి పేరు."

    దీక్ష ఆ నోటుని పెదవుల కానించుకుంది తీసుకెళ్ళి పెట్టె అడుగున వున్న బుల్లి పెట్టెలో పెట్టింది. భద్రంగా దాచి యివతలికి వచ్చింది.

    "నా ప్రయత్నం ఫలించింది. ఫలిస్తుంది." తృప్తిగా అనుకుంది.

   
                         - 20 -

    ఉదయం ఆరున్నర.

    మొత్తం పన్నెండు మంది వచ్చారు. వాళ్ళకి యింట్లో పని చేసే వాళ్ళు వున్నారు. వాళ్ళకి నేర్చుకోవాలని గట్టి పట్టుదల వుండబట్టే రాగలిగారు. కొందరు కాలేజీకెళ్ళే వాళ్ళు వున్నారు పదిగంటలకి.

    దీక్ష ముందే చెప్పింది కొందరికి ఉదయం పూట వీలుగాక పొతే తెల్లవారు ఝామున రమ్మని. ఇంట్లో పని పాటలు చేసుకునే ఇల్లాళ్ళకి టైము ప్రకారం క్లాసులకి వచ్చే వీలు కాకపోవచ్చు. వాళ్ళు ఆరోగ్యం కోసము, ఆత్మరక్షణకి అవసరం వచ్చినప్పుడు చిన్న చిన్న పట్లు నేర్చుకుని వుంటే తమకి తాము ఎంతో కొంత అపాయం లోంచి వుపాయంగా తప్పించుకోవచ్చు. ఇల్లాళ్ళు వీలయినప్పుడు వస్తే అలాంటి పట్లు నేర్పటం జరుగుతుంది. వాళ్ళకది చాలు. లేదు మేము కరాటే నేర్చుకుంటాము అంటే కాస్త టైము తీసుకుని శ్రమపడితే చాలు.

    ఈ విషయాలన్నీ దీక్ష ముందుగానే చెప్పింది.

    చాలామంది ఇల్లాళ్ళు ఆ రోజు దీక్షయిచ్చిన కరాటే ప్రదర్శన చూసి కరాటే నేర్చుకుంటే ఎంత బాగుండును అనుకున్నారు. కొందరికి కుదరక మరికొందరు సిగ్గుతో విరమించుకున్నారు. వాళ్ళు చేసిన మంచిపని ఏమిటంటే కరాటే నేర్చుకోటానికి దీక్ష దగ్గరకి తమ పిల్లలని పంపిద్దామన్న నిర్ణయం తీసుకోటం. చాలామంది మీద సినిమాల ప్రభావం వుంది. కరాటే ఫైట్స్ లేని సినిమా లేదు. దాంతో తమ పిల్లలు కూడా కరాటే నేర్చుకుని వుంటే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది.

    ఇదీ ఒక విద్య. చదువుకుంటే (విజ్ఞానం మాట దేముడెరుగు) జాబ్ వస్తుంది. టైపు నేర్చుకొంటే టైపిస్ట్ గా నైనా వస్తుంది. నాట్యం నేర్చుకుంటే! అందరికి కూడు పెట్టదు. కరాటే మిగిలింది యిహ.

    కరాటే నేర్చుకొని పదిమందిని తన్నటానికి కాదు. స్టేజీ ఎక్కి ప్రదర్శనలు యివ్వటానికి కాదు. కరాటే నేర్చుకుంటే ఆ విద్య కూడు పెడుతుందని కాదు. మారుతున్న సమాజ పరిస్థితులని బట్టి మారుతున్న కాలాన్ని బట్టి స్త్రీ పురుషులు కరాటే నేర్చుకోటం మంచిది.

    కరాటే నేర్చుకోటం మంచిపని. నాకీ విద్య వచ్చు అని చెప్పుకోటానికి కూడా ఆడపిల్లలకి గొప్పగా వుంటుంది. పూర్వం తలుపు చాటున వుండే తల్లులు ఆ తల్లుల చాటున వుండే ఆడపిల్లలు ఆ కథలు వేరు. ఇప్పటి తల్లిపిల్లల అభిరుచులు వేరు. ప్రతివాళ్ళు పేరు కోసం పాకులాడే వాళ్ళే.

    ఇప్పుడు కరాటే నేర్పుతానన్నది ఒక ఆడపిల్ల. పైగా ఆమె ఎంతో కొంత యివ్వండి అంది. దీక్ష యింతని ఫీజు నిర్ణయించక పోవటం వాళ్ళ కెంతో నచ్చింది. కనుకనే దీక్ష ప్రయత్నం ఫలించింది.

    మొదటి రోజే నేర్చుకోటానికి పన్నెండుమంది వచ్చారంటే ఇంకా ముందు ముందు చాలామంది రావచ్చు. ఆ నమ్మకం దీక్షకి ముందే వుంది. యిప్పుడు బలపడింది.

    వాళ్ళంతా వచ్చిన తరువాత దీక్ష కరాటే దుస్తులు వేసుకుంది. అయితే అవి ప్రదర్శనలో చూసినట్లు వదులుగా లేవు. శరీరాన్ని అంటి పెట్టుకుని వున్నాయి.

    "ఇవీ కరాటే దుస్తులేనా మేడమ్!" ఒకమ్మాయి అడిగింది.

    "ఉహూ, వదులుపాటి దుస్తుల్లో నేను కాళ్ళూ చేతులూ వంచేది మీకు సరీగా అర్ధం కాదని ఇవి ధరించాను. నేను మొదట్లో పాఠాలు నేర్పేటప్పుదు ఇవి మాత్రమే ధరిస్తాను. మీకు విద్య వంట పడుతున్న కొద్దీ నా డ్రస్ మారిపోతుంది. కరాటే దుస్తులు వేసుకుంటాను." దీక్ష నవ్వుతూ చెప్పింది.

    మరి కొద్దిసేపటికి....

    దీక్ష వాళ్ళందరిని కూర్చోమని వాళ్ళ ఎదుట నిలబడింది.

    దీక్ష ముందుగా చిన్న స్పీచ్ యిచ్చింది. ఆ తర్వాత బోధ లాంటిది చేస్తూ కరాటే సాధన ముందు చేయవలసిన పనులు తను చేసి చూపించింది.

    "కరాటే నేర్చుకోటం అంటే ముందే హహ్హాలు నేర్చుకుని అరవటం కాదు. శరీరాన్ని మనం చేతిలోకి తీసుకోవాలి. మనం ఎలా చెపితే అలా అది వినేటట్లు వుండాలి. ఎటుపడితే అటు అవయవాలు తిరగాలి.

    ముందుగా మెడ ఎటు పడితే అటు తిరగటం ముఖ్యం. ఇలా పైకి కిందకి తల తిప్పాలి. నెమ్మది నెమ్మదిగా వర్తులా కారంగా తిప్పటం ఆ తర్వాత ఇలా చేయాలి. శరీరాన్ని అటూ ఇటూ యిలా కదపాలి. ఇలా రెండు కాళ్ళూ దూరంగా పెట్టి నిలబడాలి. వంగుతూ లేస్తూ కుడిపాదాన్ని ఎడం చేత్తో ఎడంకాలి పాదాన్ని కుడి చేత్తో పట్టుకుని వదిలేస్తుండాలి. ఇలా కొద్దిగా వెనక్కి ముందుకి పక్కలకి కాళ్ళు నేలకి నిగడద నిలబడి నడుం పై భాగమే కదిలిస్తూ చేయాలి. ముందుగా కొన్నాళ్ళు బొటనవేలి మీద ఇలా నిలబడటం సాధన చేసి శరీరం బరువుని బొటనవేలు మోయగల శక్తిని సాధించిన తర్వాత బొటనవేలు మీద నిలబడి ఇలా గిర్రున తిరగగలగాలి...."

 Previous Page Next Page