దీక్ష చెపుతూ అర్ధమయేలా చేసి చూపించింది.
"ముఖ్యంగా పొట్ట వుండకూడదు. దానికి వ్యాయామం చేయవలసి వుంటుంది. కరాటే నేర్చుకునే ముందు కొద్దిపాటి వ్యాయామం నేర్చుకుంటే శరీరం మన చెప్పు చేతల్లో వుండి మనం చెప్పినట్లు వింటుంది. ఇలా వంగిలేస్తూ నెమ్మదిగా తలని మోకాళ్ళ మీద ఆన్చాలి. ఈ విధంగానే కూర్చుని కూడా చేయాలి. మోకాళ్ళ మీద తల ఆన్చి కాళ్ళవేళ్ళని చేతులతో పట్టుకోవాలి.
తొందరగా విద్య రాలేదని నిరాశ విచారం ముఖ్యంగా కూడని విషయం. మరో విషయం ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. జంకు అనేది అసలు వుండకూడదు. చూపులో తీక్షణత, కదలికలో చురుకుదనము, గంభీరమైన నడక వీటికి తోడు ఆహారము నిద్ర నియమబద్ధంగా వుండాలి. ఆహారం తీసుకునే తీరు కూడా ఓ పధ్ధతి ప్రకారం.... ...."
దీక్ష వివరంగా చెప్పింది.
"ఒకేసారి అంతా నేర్చుకోవాలనే తొందరతో శక్తికి మించిన శ్రమ చేయకూడదు. దానివల్ల శరీరం బాధకి లోనవుతుంది. దాంతో ఎందుకొచ్చిన గోల హాయిగా తిని కూర్చోక అనిపిస్తుంది. చివరికి అదే చేయటం జరుగుతుంది. ఆసనాల వల్ల ఆరోగ్యము కరాటే వల్ల ఆత్మరక్షణ రెండింటికి కొన్ని విషయాలలో సంబంధం వుంది. అందువల్ల యోగా కూడా ముఖ్యం. ఇప్పుడు నేను కొన్ని ఆసనాలు వేసి చూపిస్తాను చూడండి." అంది.
దీక్ష కొన్ని రకాల ఆసనాలు వేసి చూపించింది.
దీక్ష వేసి చూపిన ఆసనాలు చాలా నచ్చింది అందరికీ.
"పగటి నిద్ర, రాత్రి జాగరణ, అతి నిద్ర, అనిద్ర యెంత మాత్రం పనికిరావు. అలాగే జీవించుటకే తినాలిగాని తినుటకు జీవించకూడదు. కొన్ని విద్యలు ముఖ్యంగా యిలాంటివి నేర్చుకోవాలంటే మంచి నియమాలు పాటించటం ముఖ్యం."
దీక్ష వాళ్ళకి విసుగు కలక్కుండా మధ్యమధ్య సున్నితంగా బోధలు చేసింది. ఎన్నో విషయాలు వివరించింది.
గంటకాలం తెలియకుండానే అయిపోయింది.
"నేను చెప్పిందంతా గుర్తుంచుకోండి. ఇక యిప్పుడు మీకు ఏం చేయవలసింది చెపుతాను. లేచి నిలబడండి." అంది దీక్ష.
అంతా లేచి నిలబడ్డారు.
ముందుగా వాళ్ళంతా రోజూ ఏం చేయవలసింది చెప్పింది. ఎలా చేయవలసింది చూపించింది. వాళ్ళలో కొందరు నిలబడటం చేతులు చాచటం సరీగా లేకపోతే సర్ది సరిగా చేయి చాచటం ముడవటం కాళ్ళు ఎలా పెట్టి స్టడీగా నిలబడటం మళ్ళీ మళ్ళీ చేయించింది. కరాటే నేర్చుకునే వాళ్ళు కరాటే చేసే వాళ్ళు హా.. హ్హూ... అని అరుస్తుంటారు. హు.. అనేటప్పుడు చేయి ఎలా పెట్టాలి హూ.... అనేటప్పుడు ఎలా చేయి వుంచాలి చూపించింది. లంగ్స్ ఆరోగ్యంగా వుండటానికి గాలి ఎలా పీల్చి వదలాలి అన్న విషయం కూడా చేసి చూపించింది.
మరో గంటకి పాఠం బోధన పూర్తి అయింది.
"ఈ రోజు కాస్త ఎక్కువ టైము తీసుకున్నాను. మొదట్లో మీకు అర్ధం గావటానికి టైము తీసుకుంటాను. ఆ తర్వాత నా దగ్గర సాధనకి మీరు గంట తీసుకుంటే చాలు. ఇంట్లో మీ వీలుని బట్టి సాధన చేయండి. ఇక్కడికే వచ్చి సాధన చేస్తామంటే మరీ మంచిది." అంది దీక్ష ముగిస్తూ.
మరికొద్ది సేపటికి వాళ్ళంతా శలవు తీసుకుని వెళ్ళి పోయారు.
దీక్ష కరాటే నేర్పుతుంది. పాతిక నిండకుండానే మందుగా పన్నెండు మంది అమ్మాయిలకి గురువయింది.
పన్నెండు మంది కరాటేకాలు దీక్ష కరాటే శిక్షణాలయంలో మొదటి రోజే చేరారు.
దీక్ష ఆ కాస్తకే తన జన్మ ధన్యం అయింది అనుకుంది.


