Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 45

    "కలర్ బెల్టులు మీరు యిస్తారా! మేమే కొని తెచ్చుకోమా!" శకుంతల అడిగింది.

    "నన్ చాకు బజారులో అమ్ముతారా మేడమ్!" వాసంతి అడిగింది.

    వాళ్ళ ఆతృత చూస్తుంటే దీక్షకి ముచ్చట వేసింది. నవ్వు వచ్చింది. "మీ వీలు వెంట తొందరలోనే దుస్తులు మాత్రం కుట్టించుకోండి. లేకపోతే పెద్ద పెద్ద రెడీమేడ్ షాపుల్లో దొరకవచ్చు, తెప్పించుకుందాము. కలర్ బెల్ట్, నన్ చాకుకి యింకా చాలా టైము వుంది!" మృదువుగా చెప్పింది.

    "మీరు ఎన్నాళ్ళు నేర్చుకున్నారు మేడమ్!"

    "నాది కొన్నేళ్ళ సాధన." ముక్తసరిగా చెప్పింది దీక్ష. తను ఏదో సాధించాలనే పట్టుదలతో తెల్లవారు ఝామున మూడు దాటుతూనే లేచి ఏకబిగిన మూడు గంటల సాధన చేసేది. పట్టుదల, దీక్ష తన ప్రయత్నం మీద అచంచలమైన విశ్వాసం వుండబట్టే దీక్ష బ్రౌన్ బెల్ట్ సాధించగలిగింది. అదేమి వాళ్ళతో చెప్పలేదు.

    వాళ్ళంతా రకరకాల ప్రశ్నలు వేశారు.

    అన్నింటికి చిరునవ్వుతో సమాధానం చెప్పింది దీక్ష.

    "మాకు కొన్ని తెలుసుకోవాలని వుంది. అడగమా మేడమ్! మీకు పని ఏమైనా వుంటే వెళ్ళిపోతాము. ఫరవాలేదు చెప్పండి."

    "ఈ సమయంలో పనా! ఉహూ, ప్రస్తుతం పెద్ద పని మీ ప్రశ్నలకి జవాబు యివ్వటం, మీ అనుమానాలు తీర్చటమూను." దీక్ష నవ్వుతూ అంది. వాళ్ళందరిని చూస్తుంటే కడుపు నిండినట్లు అయింది. ఆకలి మర్చిపోయింది.

    "కరాటే లాంటివి ఎన్ని వుంటాయి మేడమ్. అంటే యిలాంటి పోరాట విధానాలు అన్నమాట....!" జయంతికి అడిగింది.

    "దేశదేశాలలో రహస్య పోరాట విధానాలు సర్వేలో తెలిసింది రెండు వందల తొంభై ఆరు. కాని ఈ లెక్క కూడా సరి అయింది కాదు. నేర్చుకునే శిష్యులు నేర్పే గురువులేక కొన్ని రకాల రహస్య పోరాటాలు మూడో కంటికి తెలియకుండా మరుగున పడిపొయ్యాయి. చేతిలో ఆయుధాలు లేకుండా వుత్తి చేతులతో పోరాడే విధానాలు కూడా పెద్ద సంఖ్యలోనే వున్నాయి.

    కరాటే కుంగ్ పూ జూడో బాక్సింగ్ రెస్లింగ్ మల్ల యుద్ధము పట్లు కత్తి తిప్పటము, ముష్టి యుద్ధము ఫిస్ట్ ఫైటింగ్ అంటే కేవలం పిడికిలితో మాత్రమే మోది ప్రత్యర్ధిని చిత్తు చేయటం అన్నమాట. కార్క్ స్క్రూ అన్నది కూడా వుంది అయితే ఇది ప్రాణం అప్పటికప్పుడు తోడేది అనవచ్చు. ఇది మంచి పధ్ధతి కాదు." అంది దీక్ష.

    "అదెలాగో చెప్పరా!" ఓ అమ్మాయి ఉత్సాహంగా అడిగింది.

    "పిడికిలి బిగించి బలమంతా వుపయోగించి శతృవు పొట్టలోకి పొడవాలి. ఆ పోటు ఎంత బలంగా తగలాలి అంటే పిడికిలి ఆయుధంలా మారి కడుపు చీల్చుకుని లోపలికి వెళ్ళాలి. అలా వెళుతూనే వేళ్ళు కొద్దిగా తిప్పాలి. వంపున్న గరిటలా తయారవుతాయి. కార్కు స్క్రూలా మళ్ళీ చెప్పాలంటే చల్ల కవ్వంలా తిప్పి ఆ చేతిని అలాగే బైటికి లాగితే కడుపులో పేగులన్నీ వేళ్ళను చుట్టుకుని బైటికి వస్తాయి."

    "అమ్మో!" అంది ఒకమ్మాయి.

    "మీకు ఈ విద్య వచ్చా!" అంది మరొక అమ్మాయి.

    "రాదు. ఆత్మరక్షణకి సాహసానికి విద్య నేర్చుకోవాలి గాని పరుల ప్రాణం మొరటుగా తీయటానికి కాదు. ఏ విద్య ఎందుకు వుపయోగ పడుతుందో, ఏ విద్య ఎలా నేర్చుకోవాలో తెలుసు. నేను సాధన చేసింది మాత్రం కరాటే. మరికొన్ని పైపై సాధనాలు చేసి వదిలేశాను." దీక్ష చెప్పింది.

    వాళ్ళ ప్రశ్నలతో, కబుర్లతో గంటన్నర కాలం అవలీలగా గడిచింది. వెళ్ళటానికి అందరూ లేచారు.

    "ముందు తెలుసుకోవలసింది, నేర్చుకోవలసింది చాలా వుంది. రేపు ఉదయం మీరు వచ్చేటప్పుడు టిఫిన్ తినే అలవాటు వున్న వారు కాస్త లైట్ గా టిఫెన్ తిని రండి. కరాటే నేర్చుకోటానికి సాధన ఒక్కటే చాలదు. మంచి ఫలితం సాధించాలంటే ఆరోగ్యం, ఆహారం నియమబద్ధ జీవితము కూడా అవసరం. అదెలాగో రేపు బోధిస్తాను. మీ మీ వీలును బట్టి ప్రయత్నంలో సరిచేసుకుందురు గాని." అంది దీక్ష.

    ఆడవాళ్ళకి కొన్ని కొన్ని వీలుకావు. అవన్నీ సర్దుకుంటూ కరాటే నేర్చుకోవాలి. ఏ అడ్డంకి లేని వాళ్ళు ఎలా అయినా నేర్చుకోవచ్చు. ఈ విషయం దీక్షకి బాగా తెలుసు. అందుకే ముందు బోధ అవసరం ఆనుకుని చెప్పింది.

 Previous Page Next Page