Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 44

    "ఊహూ, వెళతాము. మా వాళ్ళకి తెలిసిందంటే చివాట్లు పెడతారు." అంటూ అంతా లేచారు.

    'కరాటే నేర్చుకోటం తప్పుపనా! ఎందుకు వాళ్ళ వాళ్ళంతా తిట్టటం? ఇక్కడికి వచ్చారని తిడతారా! రావటం కూడా తప్పేనా! అది అంతా కానిపనా! ఇందులో నేను చూసిన పాపం ఏమిటి?' దీక్ష వుగ్గబట్టుకుని లేచింది.

    "వెళ్ళొస్తామండి." చెప్పారు వాళ్ళు.

    "మంచిది." ముక్తసరిగా అంది దీక్ష.

    వాళ్ళంతా రెండడుగులు వేసి గిరుక్కున ఇటు తిరిగారు. కరాటే పద్ధతిన నమస్కారం చేస్తూ చేయి కట్టుకుని తలవంచి ఆ తర్వాత "మేమంతా కరాటే నేర్చుకోటానికి వచ్చాము మేడమ్!" అన్నారు ఏక కంఠంతో.

    దీక్ష ఒక్కసారిగా ఖంగు తిన్నట్లు అయింది. ఇంతగా నిర్ఘాంతపోయే సంఘటన చవి చూడలేదు. "ఏమిటి మీరనేది?" ఎలాగో అనగలిగింది.

    "మీరు మొదట్లో పాంప్లెట్లు రకరకాలవి పంచి పెట్టి ఆ తర్వాత ప్రదర్శన కూడా క్విక్ గా చేస్తూ గాభరా పెట్టారు. ఆలోచించుకునే అవకాశం యివ్వలేదు. చాలా పెద్ద సస్పెన్స్ క్రియేట్ చేశారు. అయినా మేము ఏమీ అనుకోలేదు. ఎందుకంటే మీ ప్రదర్శన మాకెంతో నచ్చింది. మాలో చాలా మందిని కరాటే కదిలించింది. మేము నేర్చుకోటానికి పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు.

    మమ్మల్ని మీరు సస్పెన్సులో పెట్టి చంపారు.మేముకూడా మిమ్మల్ని సస్పెన్సులో పెట్టి కంగారు చేద్దామనిపించింది. ఈ విద్య కూడా మీరు నేర్పిందే కదా! మీ ధర్మమా అని మా వాళ్ళు చాలామంది శతృభావం విడనాడి ఈ మధ్య కలసికట్టుగా వుంటున్నారు. అందరూ కలసి ఆలోచించారు. ఈ రోజు రేపు వర్జ్యం లేకుండా మంచిగా వుంది. ఈ రోజు వచ్చి నేర్చుకుంటామని చెప్పటానికి రేపటి నుంచీ నేర్చుకోటానికి ముహూర్తం కూడా నిర్ణయించారు. ఈ వారం రోజులు మీ దగ్గరకు రాకుండా గొప్ప సస్పెన్స్ సృష్టించాము. ఇప్పుడు అదే చేశాము. మీరు మా మాటలు నమ్మారు కదూ మేడమ్! ఇదంతా చనువుగా చేశాము. మీ మనసు నొప్పించి వుంటే క్షమించండి మేడమ్! కరాటే నేర్చుకోటానికి నిజంగా వచ్చాము. ఇది మాత్రం జోక్ కాదు."

    వాళ్ళంతా వివరంగా చెపుతుంటే దీక్ష కళ్ళలో పల్చటి నీటిపొర తిరిగింది. గొంతు మూగబోయినట్లయింది. 'ఇది నిజమా! తన కల ఫలించబోతున్నదా!' దీక్ష కదిలిపోయింది.

    "మేడమ్!" జయంతి ముందుకు వచ్చి పిలిచింది.

    దీక్ష ఉలికిపాటుతో తేరుకుంది. "చాలా సంతోషం." అంది.

    దీక్ష తమ మాటలకి కోపగించుకోకుండా నిబ్బరంగా వుండటం, ఇప్పుడు చలించి ప్రియటం, ఒక వ్యక్తిలోని రెండు భావాలు పిల్లలు బాగానే గమనించారు.

    వచ్చిన అమ్మాయిలలో మంచి వాగ్ధాటి వున్నది జయంతికి వాసంతికి. మాంచి చురుకైన పిల్లలు కూడా. "ఏం చేయాలో మీరు చెపితే అలా చేస్తాము" అంది వాసంతి.

    "ముందు కూర్చుని మాట్లాడుకుందాము." అంది దీక్ష.

    అందరూ వచ్చి మళ్ళీ చాపల మీద కూర్చున్నారు.

    "ముందు మీ విషయం వివరంగా చెప్పండి."

    "మీ ప్రదర్శన చూసి మీరు చెప్పింది విని చాలామందిమి కరాటే నేర్చుకుందామని అనుకున్నాము. కొందరు పెద్దవాళ్ళకి మీ మీద గౌరవం వున్నా కరాటే నేర్చుకోటానికి అంత యిష్టపడలేదు. దానికి కారణం వాళ్ళ ఇళ్ళళ్ళో పరిస్థితి అంతే, మా తర్వాత పెద్దవాళ్ళు కూడా కొందరు వస్తానన్నారు. ముందు మేము పదిమందిమి చేరుతాము. నెమ్మదిగా మరికొందరు వచ్చి చేరుతారు. రేపటి నుంచీ ఇంకా బాగుందిట. మీరు పాఠాలు రేపే ప్రారంభిస్తే...."
    "అలాగే, ఇలాంటి విద్యలు ఉదయానే ప్రారంభిస్తే బాగుంటాయి మీరు రాగలరు కదా!" దీక్ష అడిగింది.

    "వస్తాము. కొందరికి పొద్దుట పూట కుదరదనుకోండి అప్పుడు."

    "ఆ విషయం ఏం చేస్తే బాగుంటుందో వివరంగా చెపుతాను. లేవటానికి బద్ధకం లేనివాళ్ళు పట్టుదలగా నేర్చుకునే వాళ్ళు తెల్లవారు ఝామునే లేచి రాగలిగితే అది చాలా మంచి సమయం. తెల్లారేసరికి శిక్షణ పూర్తి చేసుకుని ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. మొదట్లో తెల్లవారు ఝామున లేవటానికి కష్టంగా వున్నా అలవాటు అయిం తరువాత మంచి ఫలితాలు. మనసుకు ప్రశాంతత ఆరోగ్యం అన్నీ చేకూరతాయి. ఈ వివరాలన్నీ రేపు పాఠం ప్రారంభంలో చెపుతాను."

    "కరాటే దుస్తులు ఎప్పుడు కుట్టించు కోవాలండీ!" ఉమ ఉబలాట పడిపోతూ అడిగింది.

 Previous Page Next Page