"చూడు మిస్టర్! ఆవేశపడకు. నువ్వు మోసం చేశావని నేను అనడం లేదు. సాధారణంగా ఇలాంటి ట్రిక్కులన్నీ చేసేది కండక్టర్లే. అయితే ఆ విషయం స్పష్టంగా తేలాలి కదా! మీరు ఓమారు డిపోకి వచ్చి స్టేట్ మెంట్ రాసిచ్చి వెళ్ళండి. నెక్ట్స్ స్టేజీలో మాతోపాటు మీరూ దిగండి. జస్ట్ పదినిమిషాలకి మిమ్మల్ని పంపించేస్తాం" చెకింగ్ అధికారి రిక్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పాడు.
టైమ్ చూసుకున్నాడు నరేష్. ఆరుంబావయ్యింది. మరో పది నిమిషాలంటే ఫరవాలేదు. ముందు ఈ పీడ విరగడయితే చాలనుకుని అలాగేనని తలూపాడు.
వెనుకనున్న బ్రహ్మానందానికి విషయం అర్థమైంది. పరిస్థితి చేయి దాటిపోతున్నట్టు అనిపించింది. ఇక తను ఊరుకుంటే లాభం లేదని సీట్లోంచి లేచి చెకింగ్ అధికారి దగ్గరకొచ్చాడు.
"ఏమైంది సార్?" ప్రశ్నించాడు అమాయకంగా.
"ఈయన దగ్గరున్నది పాత టిక్కెట్టు. ఇది ఎలా వచ్చిందో విచారించాలి" చెప్పాడు చెకింగ్ అధికారి.
"ఇతను ఎవరో నాకు తెలియదు సార్! అయితే ఇతను కండక్టరుకు డబ్బులిచ్చింది నేను చూశాను. కండక్టరు కక్కుర్తిపడి పాత టిక్కెట్టు ఇచ్చుంటాడు. ఏమయినా యాక్షన్ తీసుకోవాలనుకుంటే కండక్టరు మీద తీసుకోండి. ఇతన్ని వెళ్ళనివ్వండి. పాపం ఎన్ని పనులు వున్నాయో ఏమో" నరేష్ వైపు జాలిగా చూస్తూ అన్నాడు బ్రహ్మానందం.
"అది ఓకే సార్! అయితే ఎవరు తప్పు చేశారో ఖచ్చితంగా తెలియాలి కదా! జస్ట్ టెన్ మినిట్స్. ఆయన దగ్గర స్టేట్ మెంట్ రాసుకుని పంపించేస్తాం."
వెంటనే బ్రహ్మానందం అన్నాడు. "ఆ స్టేట్ మెంట్ ఏదో ఇక్కడే రాసుకోండి ఒక ప్రయాణీకుడ్ని ఇలా మీ యిష్టం వచ్చిన దగ్గరకి తీసుకుపోవడం చట్ట విరుద్ధం."
ఈ మాటలకు చెకింగు అధికారి సీరియస్ అయిపోయాడు. "చూడండి మిస్టర్! ఏది చట్టమో ఏది చట్ట విరుద్ధమో మాకు తెలుసు. మాతోపాటు రావడానికి ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు?"
తనను రక్షించడానికి వచ్చి చీవాట్లు తిన్న బ్రహ్మానందంవైపు నిస్సహాయంగా చూశాడు నరేష్. ఆ తరువాత తను కూడా కొద్దిగా కోపం తెచ్చుకుని చెకింగు అధికారిని సీరియస్ గా చూస్తూ "మీతో రావడానికి నాకు అభ్యంతరం లేదని చెప్పానా? నాకు అవతల చాలా అర్జెంట్ పనుంది. కావాలంటే రేపు వచ్చి స్టేట్ మెంట్ రాసిస్తాను" అన్నాడు.
చెకింగు అధికారి ముఖాన్ని ఎరుపు చేసుకుని చెప్పాడు "చూడండి మిస్టర్ ! మీరు ఈ విషయంలో మాతో సహకరించకపోతే మిమ్మల్ని పోలీసులకు అప్పగించాల్సి వుంటుంది. మీరు స్టేట్ మెంట్ రాసివ్వనని వెనక్కి తగ్గుతున్నారంటే ఈ ఫ్రాడ్ మీరే చేసినట్టు అనుమానం వస్తోంది."
పోలీసులు, కేసు అంటేనే వణుకు పుట్టింది నరేష్ కి. ఇక తప్పదని "అయితే పదండి, నన్ను మరో పదినిమిషాల్లో పంపించెయ్యాలి" అన్నాడు.
"అలానే" అని చెకింగు అధికారి ముందుకు నడిచాడు.
బ్రహ్మానందం తల పట్టుకుని తన సీటువైపుకి కదిలాడు.
నరేష్, ఆ ఇద్దరు అధికారులు కిందకు దిగగానే బస్సు కదిలింది.
"మరి నాతో పాటు కండక్టరు రావాల్సిన పనిలేదా?" అడిగాడు నరేష్ కదిలిపోతున్న బస్ ను చూస్తూ.
"అవసరం లేదు. మీరు ఏం జరిగిందో స్టేట్ మెంట్ రాసిస్తే ఆ తరువాత ఎంక్వైరీ చేస్తాం. దొంగ టికెట్టు వుంది మీ దగ్గర. కాబట్టి దర్యాప్తు మీతోనే ప్రారంభించాలి."
వీరిని చూసి పక్కన వున్న డిపార్ట్ మెంట్ జీప్ అక్కడకు వచ్చింది.
ముగ్గురూ ఎక్కగానే జీప్ ను నడిపించాడు డ్రయివర్.
టైమ్ ఆరూ నలభై అయిదయింది. మరో పావుగంటకు ఈ స్టేట్ మెంటు గొడవంతా ముగిసి, తను పార్కు దగ్గరకు వెళ్ళడం ఇంపాజిబుల్ అనిపించింది నరేష్ కు. దాంతో అతనికి ఏడుపు వచ్చినంత పనైంది. ఏదో బాధ, నిరుత్సాహం అతన్ని కుంగదీశాయి. అచేతనంగా సీటుకు వాలిపోయాడు.
మరో పదినిమిషాలకి ఆర్టీసీ డిపోకి వచ్చింది జీప్.
ముగ్గురూ 'విచారణ' దగ్గరకు నడిచారు. 'విచారణ' పైన వేలాడుతున్న గడియారం నిద్రలో ఓ చేయినీ, కాలునీ ఇష్టం వచ్చిన రీతిలో చాపినట్టు చిన్నముల్లును ఏడు దగ్గర. పెద్ద ముల్లును పన్నెండు దగ్గర పెట్టుంది.
దానిని చూస్తూనే నరేష్ పూర్తిగా నీరు కారిపోయాడు.
శివపార్వతుల విగ్రహం దగ్గర కూర్చుని నిమిషానికో మారు వాచీ చూసుకుంటూ క్షణానికోసారి చూపులను గేటు దగ్గర పారేస్తున్న సువర్చలే అతని కళ్ళ ముందు కనిపిస్తోంది.
తనకోసం చూసీ, చూసీ విసిగిపోయిన ఆమె ముఖాన్ని వూహించుకుంటున్నాడు.
"ఇదిగో మిస్టర్ - పేపర్, పెన్ బస్సులో జరిగింది రాసివ్వు" అని చెకింగు అధికారి లెటర్ పాడ్ నూ, పెన్ నూ అతని ముందుకు తోశాడు.
అందులో నాలుగు ముక్కలు రాసి, సంతకం చేసిచ్చాడు.
సరిగ్గా అదే సమయానికి పార్కులో సరళ తల వంచుకుని కూర్చుంది. ఆమె ముఖం వాడిపోయి, రేకులు పెరికేసిన పువ్వులా వికారంగా వుంది. ఆమె కళ్ళు ఓటమితో కుచించుకుపోయి, ఆముదపు గింజల్లా అయిపోయాయి. ఆమె ఒళ్ళు వానకి తడిసిన గొడుగులా చెమటతో నిండిపోయి అసహ్యంగా తయారైంది.
"ఇప్పుడయినా ఒప్పుకుంటావా నరేష్ కి ఆ దొంగబుద్ధి లేదని" లోపలి నుంచి ఆనందం పైకి ఉబుకుతుంటే ప్రశ్నించింది రజని.
"నేను ఒప్పుకోను" స్థిరంగా అంది సరళ. ఆమెలో దుఃఖం సుళ్ళు తిరిగినట్టు గొంతే చెబుతోంది.
ఆమెవైపు వింతగా చూసి "ఎందువల్ల?" అని అడిగింది రజని.
పౌరుషంగా తల ఎగరేసి "అదంతే! ఆ గుణంలేని మగవాడు వుండడాన్ని నేను ఒప్పుకోను. నరేష్ కూడా ఆ కోవకే చెందుతాడు. అందమైన ఆడపిల్ల పిలిస్తే ఎవడయినా రెక్కలు కట్టుకుని వాలతాడు. నరేష్ రాకపోవడం నాకు వింతగా లేదు. మధ్యలో వూహించని అవాంతరం వచ్చి ఆగిపోయి వుంటాడని అనుకుంటున్నాను నేను. అందుకే మరోసారి ట్రై చేస్తాను. అప్పుడూ నరేష్ రాకుంటే అతన్ని నమ్ముతాడు. అంతే తప్ప మీలాగా నేను తెల్లనివన్నీ పాలనీ, నల్లనివన్నీ నీళ్ళనీ అనుకొనే రకాన్ని కాను" అని ముగించింది.