బస్టాండ్ చేరుకునే సరికి టైమ్ ఆరయ్యింది.మరో పావుగంటకు తను పార్కులో శివపార్వతుల విగ్రహం దగ్గరుంటాడని అనుకున్నాడు.
ఏది ఏమైనా రజనీకి తెలియకుండా ఈ వ్యవహారాన్ని నడపాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఏ కోణం నుంచి చూసినా తను సువర్చలను కలుసుకోవడం రజనీకి తెలియదని అనుకున్నాడు. తాము కలసి నడుస్తున్నప్పుడు రజనీ ఎదురుపడితే ఏం చెప్పాలో కూడా రిహార్సల్స్ వేసుకున్నాడు. అబద్ధం ఆడితే నిజమేమిటో తెలియనంత అద్భుతంగా వుండాలని రకరకాలుగా ఆలోచించి పెట్టాడు. కాబట్టి రజనీకి తన చాటుమాటు సరసం తెలిసే అవకాశం లేదని సరిపెట్టుకున్నాడు.
బస్సు రాకపోవడంతో పదే పదే వాచీ చూసుకుంటున్నాడు.
ఇంతకీ సువర్చల ఎలా వుంటుందో వూహకు అందడం లేదు. కళ్ళు బండి చక్రాల్లా ఎటుపడితే అటు దొర్లుతుంటాయా! ఆ ముక్కు సంపెంగ మొగ్గలా అందంగా వుంటుందా! పెదవులు దొండపండ్లలా ఎర్రగా పండుంటాయా! ఆ బుగ్గల సిగ్గుల బురఖాలను వేసుకొని మెరుస్తుంటాయా! జుట్టు చీకటి పొదలా వుంటుందా? ఆ కంఠం....? ఉపమానం దొరక్క అంతటితో ఆగిపోయాడు. కంఠం నుంచి కిందకు దిగి ఆలోచించే గ్రంథసాంగుడు కాదతను. అందుకే అక్కడితో అతని ఆలోచనల గొలుసు తెగింది.
దూరంగా బస్సు కనపడడంతో బస్టాప్ లో నుంచి రోడ్డుమీద కొచ్చాడు.
బట్టలు నలిగిపోతాయన్న శంకతో ఆటోలో వెళదామని ఓ క్షణం అనుకున్నాడు. అంతలో బస్సు రావడంతో ఆటోలో పోవాలన్న నిర్ణయాన్ని మార్చుకుని ఎక్కేశాడు.
బస్సు పెద్ద రష్ గా లేదు ఫ్యాంట్ పాడవకుండా సీట్లో అతి జాగ్రత్తగా కూర్చున్నాడు.
రజనీని తొలుత కలిసేందుకు వెళ్ళేప్పుడు అంతే జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు రజనీతో ఎక్కువసార్లే తిరగడంతో అంత పట్టించుకోవడం లేదు. ఆ విషయాన్ని అతను గుర్తించనూ లేదు.
మళ్ళీ ఇప్పుడు అంత జాగ్రత్తగా మసులుకుంటున్నాడు, పక్క సీటు వ్యక్తి తగిలితే చొక్కా ముడతలు పడి నలిగిపోతాయని సీట్లో ఒదిగి కూర్చున్నాడు.
కండక్టర్ టికెట్ ఇచ్చి, చిల్లరను చేతిలో పోశాడు. మామూలుగా అయితే లెక్కవేసుకునేవాడేగానీ మెదడంతా ఆక్రమించుకున్న సువర్చల అందుకు వీలివ్వలేదు.
చిల్లరను జేబులో వేసుకున్నాడు.
మరో పదినిమిషాల్లో సువర్చలను కలుసుకోబోతున్నానన్న ఆనందం అతని ముఖాన్ని వెలిగిస్తోంది. బస్సులో వున్న వాళ్ళందరిలోకి తనే సంతోషంగా వున్నానని పొంగిపోతున్నాడు. తను తప్ప ఇంత గ్రేట్ టెన్షన్ తో ప్రయాణించే జీవి మరొకడు ఈ బస్సులో లేడనుకున్నాడు.
అతని అంచనా తప్పు.
తమ ప్లాన్ సక్సెస్ అవుతోందో లేదోనన్న ఉద్వేగంతో వెనుక సీట్లో వున్న బ్రహ్మానందం వూగిపోతున్నాడు.
అతనూ నరేష్ తో పాటే బస్సెక్కాడు. నరేష్ పార్క్ కు వెళ్లడం అక్కడున్న రజని నరేష్ ని అసహ్యించుకుని ఇంటికి వచ్చెయ్యడం గ్యారెంటీ అనుకుంటున్నాడతను. అయితే ఎక్కడో ఓ మూల ఇదంతా సవ్యంగా జరుగుతుందా అన్న సందేహమూ వుంది.
నరేష్ చిన్నగా విజిల్ వేసుకుంటూ విండోలోంచి అటూ ఇటూ చూస్తున్నాడు.
బస్సు సడన్ గా ఆగింది.
అది స్టేజి కాదు, మరెందుకు ఆగిందా అని నరేష్ దిక్కులు చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు బస్సెక్కారు.
కండక్టర్ వాళ్ళకి సెల్యూట్ చేసి, ఎస్.ఆర్. అందించాడు. ఆ ఇద్దరిలో ఒకరు కండక్టర్ సీట్లో కూర్చుంటే మరొక వ్యక్తి ప్యాసెంజర్ల దగ్గరున్న టిక్కెట్లను తీసుకుంటున్నాడు.
మధ్యలో ఈ బ్రేక్ ఏమిటి? ఈ చెకింగ్ ఇప్పుడే జరగాలా అనుకుంటూ నరేష్ అసహనంగా సీట్లో కదిలాడు.
బ్రహ్మానందం విసుగ్గా వాచీ చూసుకున్నాడు.
టిక్కెట్లు చెక్ చేస్తున్న వ్యక్తి నరేష్ దగ్గిరకొచ్చి "టికెట్ ప్లీజ్" అని చేయి చాచాడు.
నరేష్ టికెట్ అందించాడు.
ఆ వ్యక్తి టికెట్ ను అటూ ఇటూ తిప్పి చూసి "ఎక్కడ ఎక్కారు?" అని సీరియస్ గా అడిగాడు.
అతని ముఖం చూస్తూనే ఏదో జరిగిందని నరేష్ కి అర్థమైంది.
"ఇందిరానగర్."
"ఎంత ఇచ్చారు?"
"పదిరూపాయలు."
"కండక్టర్ చిల్లరా, ఈ టిక్కె ట్టూ ఇచ్చాడా?"
అవునన్నట్టు తల వూపాడు నరేష్.
"ఇది దొంగ టికెట్టు పాత సిరీస్ టికెట్టు యిది. ఆర్టీసీని మీరు మోసం చేశారా? కండక్టర్ చీట్ చేశాడా అన్నది తేలాలి."
ఆ మాటలకు ఖంగుతిన్నాడు నరేష్.
కండక్టర్ తనకిచ్చింది పాత టికెట్టా? తను యిచ్చిన డబ్బును కండక్టర్ జేబులో వేసుకున్నాడా? ఏం జరగబోతూ వుంది ఇప్పుడు? తను ఏడు గంటలకల్లా పార్కుకు చేరుకోగలడా?
అతని ముఖంలో చెమట వూరింది. కాళ్ళల్లో సన్నగా వణుకు ప్రారంభమయింది.
నరేష్ గొంతు పెగల్చుకుని చెప్పాడు. "నేనేమీ మోసం చేయలేదు. డబ్బిచ్చాను, కండక్టరు టికెట్ ఇచ్చాడు. ఆ టికెట్టు సక్రమైంది కాదంటే అందుకు నేను బాధ్యుడ్ని కాను. అవతల నాకు అర్జెంట్ పని వుంది. ముందు బస్సు పోనివ్వండి. ఈ మేరకు నేను స్టేట్ మెంట్ రాసి ఇస్తాను."