రజనీ ఏమీ మాట్లాడలేకపోయింది. నరేష్ నిజంగా రాలేదో, లేదూ మధ్యలో ఆగిపోయాడో, ఏదో కారణం చేత రాలేదో ఆమె నిర్ధారించుకోలేకపోతోంది. కానీ ఎక్కడో ఏ మూలో అనుమానం వున్నా తన మాటలు అతని మీద బలీయమయిన ప్రభావాన్నే చూపించుటాయని, ఆ వంకర బుద్ధిని సరిచేసుకుని వుంటాడనే ప్రగాఢంగా నమ్ముతోంది.
ప్రేమ వేరూ, మోహం వేరూ అనుకుని ఆడపిల్ల పిలిస్తే వచ్చే నీచమైన గుణం నరేష్ లో వుంటుందని ఆమె వూహించలేకపోతోంది.
అందుకే ప్రేమంటే మనకు నచ్చిన గుణాలు ఎదుట వ్యక్తిలో వున్నాయని భ్రమపడడమేనంటారు పెద్దలు.
"అంటే మరో లెటర్ రాస్తావా?" అడిగింది రజని సరళను.
"అవును! రేపే రాద్దాం నెక్ట్స్ సండేకి ఇదే ప్లేస్ కి రమ్మని. అప్పుడూ 'సువర్చలా' అంటూ చొంగ కార్చుకుంటూ అతడు రాకపోతే నమ్ముతాను."
సరళ ఎందుకంత సీరియస్ గా జవాబులు చెబుతుందో అర్థం కాలేదు రజనీకి. నరేష్ రాకపోవడంతో ఆమె అహం దెబ్బతిన్నదని అనుకుంది.
"అయితే ఓకే! మా ముందు అదే సువర్చల పేరుతో ఉత్తరం రాయి - సరేనా! ఇక వెళదాం ఏడున్నర దాటింది."
నరేష్ రాకపోయినందుకు విమల, సబిత కూడా ఆనందించారు.
నలుగురూ పైకి లేచారు.
పార్కు బయటికొచ్చాక కారులో కూర్చున్నారు.
కారు తనలో తాను గొణుక్కున్నట్టు శబ్దం చేస్తూ కదిలింది.
అది మలుపు తిరిగిందో లేదో నరేష్ పార్కులోకి కాలు పెట్టాడు. బస్ డిపోనుంచి రెండు బస్సులు మారి, బస్టాప్ నుండి పరుగులాంటి నడకతో రావడంవల్ల ఆయాసం గుండెలను ఎగతడుతోంది.
ముఖాన్నుంచి కారుతున్న చెమటను కూడా తుడుచుకోకుండా శివపార్వతుల విగ్రహం దగ్గిరకు మూడు అంగల్లో చేరుకున్నాడు.
అక్కడ ఎవరూ లేకపోవడంతో నిరుత్సాహం కిందకు గుంజితే అలానే కూర్చుండిపోయాడు.
* * * * *
ఔట్ హౌస్ లో కూర్చుని శ్రీనివాసరావు స్కాచ్ తాగుతున్నాడు. అప్పటికి రెండు లార్జ్ పెగ్గులు పూర్తిచేసి మూడవ రౌండ్ లోకి వచ్చాడు.
బ్రహ్మానందం రాకకోసం ఆయన చాలా ఈగర్ గా చూస్తున్నాడు. ఈపాటికి నరేష్ పార్కుకు వచ్చుంటాడని, అతడ్ని చూసి రజనీ కోపంతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని వచ్చేస్తుందని ఆయన వూహిస్తున్నాడు. అలా అనుకోవడంతోనే ఆయన ఒళ్ళు ఆనందంతో జర్క్ లిస్తోంది. ఆ శుభవార్త బ్రహ్మానందం నోటివెంట వినాలని ఆయన ఎదురుచూస్తున్నాడు.
ఆయన కెదురుగ్గా కూర్చుని జీడిపప్పులు తింటున్న విజయ ఆయన కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ అడిగింది "ఒకవేళ అమ్మాయిగారు నరేష్ ను క్షమించేస్తే మన ప్లాన్ ఫెయిలవుతుంది కదా!"
"ఆడపిల్ల యావ వున్నవాడ్ని రజని భరించదు. మగవాడిలో ఏ దుర్గుణాన్ని అయిన క్షమించేస్తుందేమో కానీ ఈ వక్రబుద్ధిని మాత్రం సహించదు. పవిత్రతకు అంత విలువిస్తుంది తను" గర్వంగా చెప్పాడు శ్రీనివాసరావు.
"అమ్మాయిగారు కూడా నాలాగానే అన్నమాట" అంది విజయ వయ్యారాలు పోతూ.
దీంతో కోపం నషాళానికి అంటింది ఆయనకు. "ఛీ నోర్ముయ్. మా అమ్మాయికీ నీకూ పోలికేమిటి? రాత్రంతా నీతో గడిపిన మగవాడు వుదయం లేచి బట్టలేసుకుంటుంటే 'ఛీ పాడు! నా ముందు బట్టలేసుకోకు! నా పాతివ్రత్యం పాడయిపోదూ' అనే రకం నువ్వు. నీకూ, రజనీకి పోలికేమిటి! మరో మారు ఆ మాట అన్నావంటే నాలుక చీరేస్తాను" అన్నాడు.
"ఎందుకండీ అంత కోపం? ఇప్పుడు నేను ఏమన్నానని! నా పాతివ్రత్యం ఏమిటో కువాయిట్ లో వున్న మా శ్రీవారికి తెలుసు" అంది మూతి మూడు ఒంపులు తిప్పుతూ.
"సరే ఇక ఆపు. ఇప్పుడు పార్క్ లో ఏం జరిగిందోనన్న ఆందోళనలో వున్నాను నేను. ఎలాగయినా ఆ అనాథ వెధవను రజనీ పెళ్ళి చేసుకోకుండా చూడాలి. అది ఆలోచించు" అన్నాడాయన కోపాన్నంతా దిగమింగుకుని.
"మీకొక్కరికేనా ఆ బాధ వుంది. నాకూ వుంది. రజనీ నాకు కూతుర్లాంటిది కాదూ!" అంది రాగం తీస్తూ ఆమె.
"ఆ వరుసలు కలపకు" మళ్ళీ చికాకు తెచ్చుకున్నాడు శ్రీనివాసరావు.
అంతలో డోర్ కర్టెన్ తొలగింది.
బ్రహ్మానందం లోపలికి అడుగుపెట్టాడు.
ముఖమంతా చెమటతో, అలజడి నిండిన కళ్ళతో, ఏదో చెప్పాలనే ఆతృతతో వస్తున్న బ్రహ్మానందాన్ని చూస్తేనే తమ పథకం బెడిసికొట్టిందని అర్థమయింది శ్రీనివాసరావుకి. నిషా అంతా తలనుంచి కిందకు దిగింది.
"ఏమైంది?" ఆందోళనగా అడిగాడు ఆయన.
"ఫెయిలయింది సార్! నరేష్ పార్కుకి రాలేదు" బ్రహ్మానందం తన బాస్ రియాక్షన్ కోసం ఆగాడు.
"ఎందుకు రాలేదు? రజనీ మీద ప్రేమతో ఆ లెటర్ ను ఖాతరు చేయలేదా?" శ్రీనివాసరావు బ్రహ్మానందం దగ్గరకొచ్చి ప్రశ్నించాడు.
"అదేంకాదు సార్! లెటర్ చూస్తూనే కరిగిపోయాడు అతను. ఆ బలహీనత అటువంటిది. అయితే అనుకోని ఓ సంఘటన జరగడంతో అతను ఏడుగంటలకి పార్కుకి వెళ్ళలేకపోయాడు."
"ఏం జరిగింది?"
బ్రహ్మానందం మొత్తం జరిగిందంతా చెప్పి "అలా బస్సులో దొంగ టికెట్టు నరేష్ దగ్గిర దొరకడంతో స్టేట్ మెంటు రాసివ్వమని చెకింగ్ ఆఫీసర్ డిపో కి తీసుకెళ్ళాడు. అక్కడే ఏడైపోయింది. అక్కణ్నుంచి పార్కుకి వచ్చేసరికి అప్పటికే అమ్మాయిగారు వచ్చేశారు" అని ముగించాడు.


