Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 43

    ఒక్కరు కూడా కరాటే నేర్చుకోటానికి రాలేదు. రాలేదు సరికదా, మర్యాదగా వచ్చి వాళ్ళలో ఒక్కరైనా "మేము కరాటే నేర్చుకోటానికి రాము, ఏమీ అనుకోకండి. మాకంత యిష్టం లేదు." అని చెప్పినట్లయితే తనకంత బాధ వుండేది కాదు. ఎవరూ తిరిగి చూసిన పాపాన పోలేదు కాబట్టి తన ప్రయత్నం పూర్తిగా ఫెయిలయినట్లే.

    ప్రదర్శన పూర్తయి వారం రోజులవరకూ ఎవరూ రాకపోయే సరికి దీక్ష ప్రాణం వుసూరుమంది. ఎలా బతకాలి? చేతిలోవున్న కాసిని పైసలు అయిపోతే ఏం తినాలి?

    నరనరాన నిరాశ అవరించగా దీక్ష ఉదయం వంట చేసుకోలేదు. ఆ గదిలోకి ఈ గదిలోకి తిరిగింది. కడుపులో ఎలుకలు పరుగెత్తాయి. నాలుగు గ్లాసులు చల్లని మంచినీళ్ళు పట్టించి నిస్సత్తువగా మంచం మీద వాలిపోయింది.

    మధ్యాన్నం మూడు అయింది.

    లేచి కాఫీ అన్నా తాగుదాము అనుకుంటూ వుండగా వాకిట్లో పిలుపు. దీక్ష స్ప్రింగ్ లాగా మంచం మీదనుంచి లేచింది. మంచం దిగుతూనే "ఎవరూ?" అంటూ వాకిట్లోకి నడిచింది.

    వరండాలో పదిమంది అమ్మాయిలు.

    దీక్షని చూస్తూనే వాళ్ళంతా ఒకేసారి "నమస్తే" అన్నారు.

    "నమస్తే" అంది దీక్ష.

    అందరు కలసికట్టుగా వచ్చేసరికి కాస్త తబ్బిబ్బయింది దీక్ష.

    "రండి, ఇలా కూర్చోండి." చాపలు పరుస్తూ చెప్పింది.

    అందరూ బుద్ధిగా కూర్చున్నారు. వాళ్ళలో ఒక్కరూ పెదవి కదపలేదు. ఏదో రాకపోతే బాగుండదు అని వచ్చినట్లుగా వుంది. దీక్షకి ఏం మాట్లాడాలో తెలియలేదు. కరాటే నేర్చుకుంటామని చెప్పి పోవటానికి వచ్చారా అనుకుందామంటే వాళ్ళ ముఖాలలో అలాంటి ఉషారు కళ ఎక్కడా కనిపించటం లేదు. అలాంటప్పుడు 'కరాటే నేర్చుకుంటారా! ఎప్పటి నుంచి వస్తారు?' అని ఎలా అడుగుతుంది.

    "చెప్పండి." అంది దీక్ష అంతకుమించి ఏమడగాలో తెలియక.

    "మరి.... మరి... నీవు చెప్పవే రాజ్యం!" అంది ఓ అమ్మాయి.

    చెప్పబోయి పెదవి కదిపావుగా పెద్ద నాపసానిలా! నువ్వే చెప్పు" అంది రాజ్యలక్ష్మి.

    నువ్వే అంటే నువ్వేలోకి దిగారు. కాని విషయం ఎవరూ చెప్పలేదు.

    దీక్ష ఓర్పుగా తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో కూర్చుంది.

    చివరికి నెమ్మదిగా జయంతి పెదవి కదిపింది. "మా అందరికి కరాటే యిష్టం." అంది.

    "గుడ్!" అంది దీక్ష ఉప్పొంగిపోతున్న సంతోషాన్ని ఉగ్గబట్టుకుంటూ.

    "మా అందరికి నేర్చుకోవాలని వుంది."

    "చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు." అభినందించింది దీక్ష.

    "కాని.." జయంతి బిడియంగా ఆగిపోయింది.

    "కాని.. ఏమిటి?"

    ".... .... ...."

    "ఫరవాలేదు చెప్పు."

    "మాకు కరాటే నేర్చుకోటం యిష్టం. కాని మా యింట్లో ఎవరూ ఒప్పుకోటం లేదు. ఆడాళ్ళు ఏమిటి మగాళ్ళ లాగా ఎగిరెగిరి తన్నటం ఏమిటి! అన్నారు. మాకు కరాటే నేర్చుకునే యోగం లేదు. మా వాళ్ళెవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చాము. ఈ విషయం చెప్పి పోదామని.." జయంతి చెప్పలేక చెప్పలేక చెప్పింది.

    దీక్ష రాతిబొమ్మలా కూర్చుని నిగ్రహంగా వింది. జయంతి చెప్పే ఒక్కొక్క మాట పిడుగుల్లా తగిలినట్లయాయి. అయినా చలించలేదు. కరాటేతో పాటు దీక్ష యోగసాధన చేసింది. "మంచిది, మీరు మటుకు ఏం చేస్తారు!" నిర్లిప్తంగా అంది చివరికి.

    "మేము యిలా చెప్పటానికి వచ్చాము. మీకు కోపంగా లేదుగా!"

    "ఉహూ"

    "అయితే యిక వెళతాము."

    "ఊ.." అనబోయిన దీక్ష సంస్కారంతో, "కాసేపు కూర్చుని వెళ్ళండి." అంది.  

 Previous Page Next Page