Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 42

    "కాఫీతో పాటు నా ఆలోచన పూర్తి అయింది. ఇప్పుడే కదా మీరు కాఫీ తాగటం ఆలోచనల్లోంచి బైట పడ్డదీను?" అన్నాడు పృధ్వీరాజ్.

    'ఇతను చాలా తెలివికలవాడు, బైట పడడు.' అనుకున్న దీక్ష చిరుకోపంతో "నేను ఆలోచిస్తున్నానని ఎవరు చెప్పారు!" అంది కప్పులని దూరంగా పెడుతూ.

    "అలా అనుకున్నాను. సాధారణంగా మౌనంగా మనం వున్నా మన మనసు వుండదు కదండి!"

    పులిమీసాల 'కిరిపి'కి మాటలు బాగావచ్చు. చాలా తెలివి కలవాడే అనుకుంది. పృధ్వీరాజ్ కి 'కిరిపి' అని నిక్ నేమ్ పెట్టుకుంది. ఆమాట తిప్పి చదివితే పిరికి అని వస్తుంది. దీక్ష అలా అని పైకి చెప్పలేదు. "మీరు జాబ్ చేస్తున్నారా, చదువుకుంటున్నారా?" అడిగింది దీక్ష.

    "ఎమ్మే పూర్తి అయింది. జాబ్ కోసం ట్రై చేస్తూ ఈ లోపల కాలక్షేపంగా వుంటుందని గోళ్ళు గిల్లుకుంటున్నాను. గోళ్ళు తరిగి చిగుళ్ళు బైట పడుతున్నాయి గానీండి జాబ్ మాత్రం దరిదాపుల్లో వున్నట్టు కానరావటం లేదు."

    మీరు మందార వర్ధని గారింట్లో కదూ వుంటున్నానని చెప్పారు."

    "అవును. నేను వాళ్ళింట్లో ఒక గదిలో అద్దెకుంటున్నాను."

    "మరీ మీ వాళ్ళు...."

    "అదో పెద్ద కథ లేండి. మరోసారి చెపుతాను. ఇంతకీ మీ విషయం చెప్పండి. కరాటే నేర్చుకోటానికి ఎవరూ రాకపోతే ఏం చేద్దామని?"

    "ప్రస్తుతం మీరు చేస్తున్నపనే."

    "వద్దండి. మీ అందమైన వేళ్ళ చిగుళ్ళు పాడవు .... సారీ దీక్షగారూ! తొందరలో చనువుగా...."

    "ఈ తొందర మీకు కరాటే నేర్చుకోటంలో వుంటే బాగుండేది."

    "కొంపదీసి ఇప్పుడు కరాటే బెల్టుతో నన్ను వుతికేరు. ఎవరూ రాలేదు మీరైనా కరాటే నేర్చుకోండి అనరుకదా!" పృధ్వీరాజ్ భయపడుతూ అన్నాడు.

    "నేర్చుకోమని చెపుతా కానీండి నేర్పను."

    "అదేమి పాపం! మీలాంటి అమ్మాయి కరాటే నేర్పుతానంటే మగవాళ్ళు వచ్చి క్యూలో నుంచుంటారు." పృధ్వీరాజ్ నవ్వుతూ అన్నాడు.

    "అందుకనే నేర్పంది." దీక్ష నవ్వుతూ చెప్పింది.

    మరి కొద్దిసేపు వుండి వెళతానని లేచాడు పృధ్వీరాజ్. అతనితో పాటు వాకిలిదాకా నడిచిన దీక్ష "వుంటాను, పృధ్వీరాజ్ గారూ! ఇటు వచ్చినప్పుడు వస్తుండండి." అంది.

    పృధ్వీరాజ్ ముఖంలో చిన్న మెరుపు మెరిసి మాయమైంది.

    అది గమనించి 'పిచ్చి మారాజు, పులి మీసాల కిరిపి.' అనుకుంది దీక్ష.

    పృధ్వీరాజ్ వెళ్ళిపోయాడు.

    దిగులుగా బరువుగా వున్న దీక్ష మనసు పృధ్వీరాజ్ రాకతో తెరిపిగా మబ్బు విడిచినట్లు తయారయింది. మంచి స్నేహం మంచి కబుర్లు మనసు మీద టానిక్ లా పనిచేస్తాయి అంటారు. అలానే చేశాయి దీక్షకి.

    పృధ్వీరాజ్ వీధి చివరికెళ్ళి వెనుతిరిగి చూశాడు.

    గుమ్మంలో నుంచుని పృధ్వీరాజ్ ని చూస్తున్న దీక్ష కంగారుగా లోపలికి పరుగుతీసింది.


                                         - 19 -

    "దీక్షగారూ!"

    'మేడమ్!"

    వాకిట్లోంచి వినవచ్చిన ఈ పిలుపులు వింటూనే దీక్ష మంచం మీద నుంచి చటుక్కున లేచింది.

    కడుపులో కాలుతుంటే కాళ్ళు ముడుచుకుని మంచానికి అంటి పెట్టుకుని పడుకుంది దీక్ష.

    తను కరాటే శిక్షణాలయం తెరవటానికి కొన్ని తమాషాలు చేసింది. పబ్లిసిటీ ఎప్పుడూ పనిచేస్తుంది. అందుకే తను చక్కగా ప్లానువేసి డీప్ గా ఆలోచించి అందమైన పబ్లిసిటీ గాక సస్పెన్స్ థ్రిల్లింగ్ పబ్లిసిటీ కొత్తరకంగా చేసింది. అది నూటికి నూరుపాళ్ళూ సక్సెస్ అయింది. అందరూ ప్రదర్శనకి కలసి చూడటానికి వచ్చారు. అది తొలి ప్రయత్నం ఫలవంతం కావటానికి గుర్తు.
    కాని.... కాని....

 Previous Page Next Page