'వచ్చిందే నిన్ను చూడాలని. నీతో ముచ్చటించాలని. ఏళ్ల కొద్దీ దప్పిగొన్నవాడు ఎంత పిపాస ఉన్నా సరే ఏటి నీరంతా తాగలేడు కదా! మీ లోకంలో అయినా ఎంత ఆకలిగా ఉన్నా రెండు చేతులతో భుజించలేడు కదా! ఎంత గుండె నిండుగా కోరిక ఉన్నా దానికీ పరిమితి ఉంటుంది కదా! అది తీరేదాకా ఇంతే!'
'అంత కోరిక ఉంటే యింత ఆలస్యం దేనికీ?' సూటిగా అడిగింది అహల్య.
ఆ ప్రశ్నకి ఉలిక్కిపడింది ఇంద్రసఖి. ఇదే ప్రశ్న తనను కాక తన ప్రభువునే నిలదీసి ప్రశ్నించినట్లు అనిపించింది.
అవును, ఏం జవాబు చెప్పగలదు?
'మాకంటే యీ లోకంలో ఎన్నో కార్యాలు. మేం ఆశ్రమ వాసులం. ప్రతిదీ సంతరించుకోవాలి. యజ్ఞమో! యాగమో! తలపెడితే సమీప రాజ్యాన్నేలే రాజులను ఆశ్రయించి అవసరమైనవన్నీ తెచ్చుకోవాలి. ఒక్క జప తపాలు మాత్రం మా ఇష్టం. వాటికి ఎవరినీ ఆశ్రయించనక్కర్లేదు. ఏ వేళకేది లభిస్తే దాన్నే తింటూ జీవిస్తాం. ఏ నార చీరలో ధరిస్తాం. కాబట్టి వాటికోసం ఎవరినీ యాచించనక్కర్లేదు.
మిగతా దేనికయినా నేలనేలే రాజుల్ని ఆశ్రయించవలసిందే కదా! మీకా అవసరం ఏముంది! అమృతం తాగినవాళ్ళు కదా! అన్నపానాల అవసరం లేదు. అలాగే వస్త్రధారణ. నగలు- ఇంకేం ఉంది. నిత్యం నృత్య గాన వినోదాలలో తేలియాడటమే కదా!
మరి కొంపలు మునిగే రాచకార్యాలేవో ఉన్నట్లు చెపుతున్నావే? మనస్సుంటే మార్గం ఉండదా! పైగా నీవు కామచారివి. సంకల్ప మాత్రంగా అక్కడినుంచి ఇక్కడికి రాగలవు. మాకు అలా కాదు కదా!'
అహల్య అలా అడగ్గానే- ఇంద్రసఖి క్షణంపాటు విభ్రాంతికి లోనయ్యింది. అయినా దేవకాంత కాబట్టి అనిమేషత్వం సహజం కాబట్టి అహల్య ఆ విషయం గుర్తించలేదు.
గలగలా పారే సెలయేరులా నవ్వింది ఇంద్రసఖి 'అహల్యా! నా నివాసం ఇంద్రలోకం. సత్యలోకం కాదు వైకుంఠమూ కాదు. ఈ రాక్షసులున్నారే వీళ్లంతా విష్ణుద్వేషులు! వైకుంఠం వారికి గిట్టదు. విష్ణువు పేరును కానీ, ఆయన పేరుకి పర్యాయ పదం కానీ పలకరు. పలికితే సహించరు. నిజానికి వాళ్ళ బద్ధశత్రువు విష్ణువే అయినా వాళ్లు దండెత్తేది ఇంద్రుడి పైకి. జయించేది ఇంద్ర లోకాన్ని. పారద్రోలేది అక్కడి సుర రాజును, దేవతలను! వాళ్ళు వైకుంఠం పైకి దండెత్తరు. విష్ణువుకి ఎవరు ప్రీతికరమో, వాళ్ళపైకి దండెత్తుతారు. నిజమే అనిపిస్తుంది. నిన్ను బాధించేకన్నా నీకు అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్లను బాధిస్తే నీవు పడే బాధ ఎక్కువ! తల్లిని కొడితే ఆ తల్లి పడే బాధకన్నా ఆ తల్లి కన్న సంతానాన్ని కొడితే ఆ తల్లి పడే బాధ పదింతలు! వందరెట్లు! వెయ్యింతలు! సహస్రాధికమైన ఆ బాధని గుణించలేం! అలాగే ఇదీనూ.
పేరుకి స్వర్గం అనీ- స్వర్గ సుఖం అని భ్రమే గానీ, అక్కడ అనుక్షణం భయమే! మా సుర రాజుకు ఏ లోకంలో ఎవరు తపస్సు ప్రారంభించినా భయమే! ఆ తపో బలంతో- ఆ తపస్సులకు మెచ్చి ముందూ వెనుకా ఆలోచించకుండా శివుడో బ్రహ్మో ఇచ్చే వరాలకు అడ్డూ అదుపూ లేకుండా రాక్షసులు ఎక్కడ తన పదవిని ఆక్రమిస్తారో, ఎక్కడ తన లోకాన్ని కొల్లగొడతారోనని ఎప్పుడూ భయమే!
ఇక ఇప్పుడు చెప్పు. మేం సుఖంగా ఉన్నామా? నువ్వన్నట్లు అమృతం తాగుతూ అచ్చెర మచ్చెకంటుల ఆట పాటలతో వినోదిస్తూ ఎల్లకాలం గడుపుతూ ఉంటామా?'
ఇంద్రసఖి మాటలకు అహల్య నవ్వేసింది.
'ఏమ్మా! నా మాటలు నవ్వులాటగా ఉన్నాయా?'
'ఊహూ! యిక్కడ అనుకుంటూ ఉంటారులే! ఎంత చెట్టుకు అంతగాలి అని. రాక్షస బాధ మాకే కాదు. మీకూ ఉంది. మామూలు నరులకే కాదు. మునులకు కూడా ఉందిక్కడ! మా తపస్సు మా జపం మా యజ్ఞ యాగాదులు భంగపరుస్తూ ఉంటారు! ఏదో ఒక రోజున రాక్షస బాధ తొలగిపోతుందని మేము ఆశతో జీవిస్తూ ఉంటాం.
మేమూ అంతే! బలిసిపోయి ప్రబలిపోయి దుర్మార్గం పండిపోయిన నాడు శ్రీమన్నారాయణుడే వాడ్ని హతమారుస్తాడులే అనే ఆశతో ఉంటాం. సరే! స్వర్గానికి వెళ్ళినా సవతి పోరు తప్పలేదన్నట్లు మీ స్వర్గంలోనూ యిలాంటి బాధలే ఉన్నాయన్న విషయం ఒప్పుకుంటాను. కానీ విశేషాలేమయినా ఉంటే చెప్పరాదూ!'
'ఒకటే విశేషం! రావణ సంహారానికి రాఘవుడిగా అవతరిస్తాడట ఆ వైకుంఠవాసి!'
'ఇక్కడా అలాంటి వార్తలే వినవస్తున్నాయి. విభాండక మహర్షుల వారి పుత్రుడు ఋష్యశృంగ మహర్షుల వారు దశరధ మహారాజుల వారితో పుత్రకామేష్టి చేయిస్తారనీ- ఆ యాగఫలంగా ఆ దేవదేవుడు అవతరిస్తాడనీ అనుకుంటున్నారు. ఇంకా ముహూర్తాలు నిర్ణయించలేదట!'
'కాలం కలిసిరావాలిగా దేనికయినా!'
'అవునవును!'
'దేనికయినా సమయం సందర్భం కలిసిరావాలిగా!'
'అవునవును!'
'దేనికయినా అదృష్టం ఉండాలిగా!'
'అవునవును!'
'అదృష్టం ఉండాలి అనడానికి మీ దాంపత్యమే గొప్ప ఉదాహరణ!'
తెల్లబోయి చూసింది అహల్య 'అదేమిటీ? అవతార విషయాల నుంచి అదృష్టరేఖల ప్రస్తావన నుంచి మా దాంపత్య విషయాలకి దూకేశావేమిటీ?'
'ప్రబల ఉదాహరణ కాదూ మీ జీవితం! నీ పుట్టుకకి మూల కారణం మా దేవరాజు. నిన్ను ఇంత అందాల సుందరిగా ఆ బ్రహ్మ రూపు దిద్దడానికి హేతువు మా త్రిలోకాధిపతి అయినా పందెంలోనూ ప్రధముడుగా వచ్చినా అదృష్టం మహర్షి గౌతముల సొత్తుగా ఉంది. కాబట్టి ఈ జగదేక సుందరి మా సుర రాజుకు దక్కలేదు. ఆయన సురాధిపత్యం, ఇంద్రలోక పాలన అన్నీ ఈ జడదారి అదృష్టం ముందు తేలిపోయాయి. అండపిండ బ్రహ్మాండాలు పట్టనంత అధికారంకన్నా ఆవగింజంత అదృష్టం మిన్న అని ఋజువు చేశాయి'