Previous Page Next Page 
అహల్య పేజి 44


    అహల్య ఏమీ అనలేకపోయింది.


    'ఆనాటి నుంచీ మా దేవనాధుడు తన దురదృష్టానికి వగచని క్షణం లేదు.'


    ఆ మాట విని అహల్య తెల్లబోయింది.


    'నీ యీ అడవి కాపురాన్ని తలుచుకుని విచారించని క్షణం లేదు'


    'ఇంద్రసఖీ!'


    'నన్ను చెప్పనీవమ్మా తల్లీ!'


    ఆమె మాటలు సాగనివ్వ లేదు అహల్య 'వద్దు! కులకాంతల ముందు పర పురుషుల ప్రసక్తీ! ఆ పర పురుషుడు ఈ కుల కాంతల గురించి చేసే ప్రస్తావనా కూడనివే- ఆ విషయం వదిలేయ్!'


    'ఏవమ్మా! మీరు భూలోక వాసులేనా?' నిష్టూరంగా అడిగింది ఇంద్రసఖి.


    ఆ ప్రశ్నకి ఆశ్చర్యపడి 'అదేం ప్రశ్న?' అంది అహల్య.


    'మీకేదయినా రాక్షస బాధో, మరేదో కలిగితే మీమీ రాజులకి చెప్పుకోరా? వారు వచ్చి తీర్చరా?'


    'ఊ!'


    'ఆ రాజులు అప్పుడప్పుడూ మీ ఆశ్రమాలకి వచ్చి మిమ్మల్ని దర్శించుకుని మీ యోగక్షేమాలు విచారించుకోరా?'


    'ఈ అజనాభదేశంలో ఎన్నో రాజ్యాలున్నాయి. కోసల దేశం మీది! మీ సమీప దేశం మిథిల. అలాగే ఎన్నెన్నో రాజ్యాలు. ఇది భూలోకం. ఇలాంటి లోకాలు స్వర్గ మర్త్య పాతాళాలకు ప్రభువు మా ఏలిక. ఆయన ఏలుబడిలోని వాళ్ళు మీరు. ఆయన మీ యోగ క్షేమాలు విచారిస్తే తప్పా?'


    అహల్య మాట్లాడలేదు. కొద్దిసేపు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.


    'మా ప్రభువే- తానే స్వయంగా వచ్చి నీ కాపురం ఎలా ఉందో విచారించి వెళ్ళాలని కుతూహల పడ్డాడు. నేనే ఆపాను'


    చప్పున ఇంద్రసఖి ముఖంలోకి చూసింది అహల్య.


    'సరే! నే వెళ్ళి వస్తానమ్మా! నేనక్కడ ఉండకపోతే ఆయనకి క్షణం తోచదు. శచీదేవమ్మకి అసలే తోచదు' అంది ఇంద్రసఖి.


    'అప్పుడేనా!' ఏదో కొరత కలిగినట్లుగా అంది.


    'ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు, మళ్ళీ మళ్ళీ వచ్చిపోతుంటానులేవమ్మా! లేదా మా ప్రభువులే వచ్చి పలకరించి వెళతారు!'


    'దే... వ... నా... ధు... లా?'


    'ఊ!' అంటూ అదృశ్యమైంది ఇంద్రసఖి.


    అహల్య అలాగే నిలుచుండిపోయింది.


                             *    *    *    *


    గౌతమాశ్రమంలో అదృశ్యమైన ఇంద్రసఖి స్వర్గం చేరుకోగానే తన ప్రభువు సన్నిధికి కదిలింది. దారివెంట ఎవరెదురుపడినా పలుకరించలేదు. సాటి చెలిమికత్తెలు ఎదురయి చిరునవ్వు చిందిస్తే తిరిగి చిరునగవుతో మన్నించి ముందుకు సాగింది. ద్వార పాలకులను మందస్మితంతో మన్నించింది.


    అలా సాగి సాగి...


    తన ప్రభువు సన్నిధికి చేరి వినయంతో నమస్కరించింది.


    మహేంద్రుడు సింహాసనం లాంటి పీఠంపై అలవోకగా ఆశీనుడై విశ్రాంతిననుభవిస్తున్న వాడల్లా- ఆమెను చూడగానే నడుం నిక్కించి కూర్చుని- కనులలో కాంక్ష అంతా ప్రతిబింబించేలా చూశాడు.


    'ప్రభూ! తొలకరి చినికింది! నేల పదునయింది! ఇక తమరు వెళ్ళి వలపుని విత్తడమే తరువాయి! అది తక్షణమే మొలకెత్తి ననలు సాగి తీగలుగా సాగి పూచి ఫలిస్తుంది. అహల్యాదేవి తమరు తననెలా తలుచుకుంటున్నారో తెలుసుకున్నది'


    ఒక్కొక్క పదంలోని ఒక్కొక్క అక్షరం మన్మధుడి పదునైన బాణంలా దేవేంద్రుడి మనస్సులో నాటింది.


    ఆయన నోట మాట రాలేదు.


    కళ్లలో కాంక్షతో పాటు ఆనందాన్ని వర్షించాయి.


    'ప్రభూ! తమరు ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసినా అహల్యాదేవి అందం చూడటంలో తమకు తమకం తీరదు. తనివి ఉండదు'


    'భళా!' అన్నట్లు చూశాడు మహేంద్రుడు. చప్పున పీఠం నుంచి లేచాడు దేవేంద్రుడు.


    వెళ్ళి రండన్నట్లు తల వంచి నమస్కరించింది ఇంద్రసఖి.


    ఇంద్రుడు అక్కడ మాయమయ్యాడు.


                                      30


    అహల్య ఒంటరిగా అలాగే నిలుచుంది.

 Previous Page Next Page