తన వలపుల ఏలిక అహల్య... ఆ అహల్య కూడా భూలోక వాసిని. ఆమెకు ఈ లక్షణాలన్నీ వర్తిస్తాయా? ఆమె గౌతమ పత్ని. ఋషి పత్నిగా ఆశ్రమ జీవనం గడుపుతోంది. ఆమెకూ ఈ లక్షణాలూ తప్పవా?
ఆమె బ్రహ్మ ఏరి కోరి సృష్టించిన యువతి! ఆయన చేత కన్యగా వరం పొందిన సౌభాగ్యవతి.
ఆమెకూ యీ లక్షణాలన్నీ వచ్చేస్తాయా? ఆమె కూడా ముదిమితో బాధపడుతుందా? ఊహూ!
ఆ ఊహే చేదుగా ఉంది. ఆ భావనే విషతుల్యంగా ఉంది. తల విదిలించాడు ఇంద్రుడు.
'సఖీ!' పిలిచాడు ఆర్ధ్రంగా.
'ప్రభూ! ఆ పిలుపుకి నోచిన వారు వేరే ఉన్నారు' చప్పున అంది ఇంద్రసఖి.
'నన్ను త్వరపెడుతున్నావే దూతీ!'
'కాలం ఎవరికోసమూ ఆగదు ప్రభూ! నిరీక్షణలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి'
'మేం విరహంతో వేగిపోతున్నామే!'
'నాకు అలా అనిపించడం లేదు ప్రభూ! క్షమించండి. ప్రభువ్వారిచ్చిన చనువుతో ఇంత మాట అనగలిగాను. అందుకు నన్ను శపించినా యీ పైలోకం నుంచి కింది లోకానికి నెట్టి వేసినా ఆనందంతో అంగీకరిస్తాను. కానీ ప్రభువులు తమకి తాము ఎంతటి ఆనందాన్ని దూరం చేసుకుంటున్నారో గ్రహిస్తే చాలు!'
'చాలు! చాలు! ఇక మేం బయలుదేరుతున్నాం!'
'ఆగండి ప్రభూ! లేడికి లేచిందే పరుగని ఆ ఆంధ్ర దేశంలో అంటారని అహల్యాదేవి చెప్పింది. తమరిలా ఆఘమేఘాల మీద బయలుదేరి వెళితే అక్కడ ఆశ్రమంలో ఆమె ఎలా ఉందో. ఆమె స్థితి ఏమిటో! గతి ఏమిటో! వారి కాలమానం ప్రకారం నేను వెళ్ళివచ్చి ఎన్నేళ్ళయిందో! ఏయే సంఘటనలు జరిగాయో ఏమో. ఇవన్నీ తమరు లెక్కించకుండా వెళితే...'
'అవునవును! కొన్నింటికి సుముఖం కాదు. రాయబారమే రమణీయం. సరే! నువ్వు వెళ్ళి రా... నీవిటు రాగానే నీ ద్వారా విషయాలు తెలుసుకోగానే నేను బయలుదేరి వెళ్ళి- ఆమె ముంగిట ఆమె పాదాల చెంత వాలతాను. సరేనా!'
'ఆశ్రయానికి చరణాలే శరణం ప్రభూ!' అంటూ నవ్వి అదృశ్యమైంది ఇంద్రసఖి.
29
గౌతమమహర్షి ఏకాంతంలో ఏదో ఆలోచిస్తున్నారు. అహల్య ఒంటరిగా శాక పాక సముపార్జనలో నిమగ్నమయింది.
ఆమెకు మొన్ననే అంజన గురించిన కొంత వర్తమానం అందింది.
కూతురి ముచ్చట చూసి రావాలనే సామాన్యమైన కోరిక ఆమె మదిలో మెదిలినా, నిత్య సత్రయాగంలా సాగుతుంటే విద్యాదానం- అన్నదానం కార్యక్రమంలో ఆమెకి ఆశ్రమం వదిలి కాలు కదిపే అవకాశమే లేదు.
అటు అతిథి అభ్యాగతుల సేవ, ఇటు విద్యార్థులకు తగిన సదుపాయాలు- వాటి మధ్య తన జపం- తన తపం- తన అధ్యయనం- ఆమె ఇటీవలనే న్యాయ సూత్రాలను నేర్వడం ప్రారంభించి అదో లోకమైపోయిందామెకు. పనిలో ఉన్నా, పాటులో ఉన్నా ఆమె శాస్త్రాన్ని మననం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడూ అంతే! మంచి మంచి కూరలు ఏరుతూ ఉన్నా మదిలో మననం సాగుతూనే ఉంటుంది.
'ఎలా ఉన్నావు అహల్యా!'
ఎలుపు విని చప్పున తలతిప్పి చూసింది అహల్య.
ఇంద్రజ! ఆమెను చూడగానే అహల్యలో రెండు భావాలు మేము మేము అంటూ తొందరించి గుండెను ఊపేశాయి.
ఒకటి- ఎన్నాళ్లకెన్నాళ్ళకు ఆమెను చూశాననేది. మరోటి- ఇన్నేళ్ళుగా తానెందుకిటు తొంగి చూడ లేదని.
ఆ రెండు భావాలను చదివేసిందానిలా అంది ఇంద్రజ 'ఏమ్మా కోపమా! ఇన్నేళ్ళూ ఏమయ్యానని, ఎందుకు రాలేదని కోపమా! చెప్పాగా! మేం అనిమిషులం. మా నిముషాలు మీకు రోజులో మాసాలో, మాకూ మీకూ లెక్క కుదరదు. మీ సంవత్సరం మీ పితృ దేవతలకే ఒక పగలు, మా లెక్కకెక్కడ కుదురుతుంది?'
అహల్య అదోలా చూసింది. చూసి చూసి యిలా అంది నిష్టూరంగా 'నీవు ఇప్పుడే చెప్పావుగా! పితృ దేవతలకొక లెక్క ఉంటుందని. అలాగే మీ లోకంలో మీ లెక్క కూడా! ఆ పద్ధతిలో అయినా నన్ను చూసి పలకరించి ఎంతో కాలమయిందని అనిపించలేదు కదూ! గగనానికీ యిలకూ బహుదూరం అనిపించిందా? మనస్సుండాలే గానీ మార్గం ఉండదా?'
పక పక నవ్వింది ఇంద్రసఖి. నవ్వుతూ నవ్వుతూ ఆమె అహల్య వద్దకు వచ్చింది. సమీపంలో చూసి అహల్య అందానికి ఆశ్చర్యపోయింది. బ్రహ్మ సృష్టించడం- తమ సత్యలోకంలో- కాబట్టి ఈమెకు దేవ కాంతల లక్షణాలు వచ్చాయా! అనుకుంది.
'ఏమిటలా చూస్తున్నావ్!'
'నిన్నే! నీ అందాన్నే! నీ మేని సోయగాలనే! నీ మేని మెరుపునే! నీ కనుతుదల విరిసే విరుపునే! నీ పెదవిపై కదలాడే నవ్వునే! ఆ అరక్షణంలో కనిపించీ కనిపించకుండా మిలమిలలాడే నీ పలువరుస!'
'చాలు చాల్లేవమ్మ! అంత దూరం నుంచి పనిగట్టుకుని వచ్చింది నన్నూ నా అందాన్నీ పొగిడేందుకేనా!'
'మరింకెందుకనుకున్నావు?' నవ్వుతూ అంది ఇంద్రసఖి.
'ఇంకేంపనీ లేదా ఇక్కడ?'