Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 43


    "అందుకు ఇతన్ని సమిధగా చెయ్యాలనుకున్నారు." ప్రభాకరం కటువుగా అన్నాడు.
    "అలా అనకు నాయనా, మా స్థితిలోవున్న తల్లి దండ్రులు యింతకంటే ఏం చెయ్యగలరు. ఆలోచించు బాబూ నే చేసిన తప్పుకి దాని జీవితాన్ని బలి యివ్వలేను గదా-కన్న కూతురు జీవితాంతం మోడుగా వుంటే చూసి భరించగలామా. బాబూ ప్రభాకరం మమ్మల్ని క్షమించు" రంగారావు ప్రభాకరం చేతులు పట్టుకొన్నాడు దీనంగా. ప్రభాకరం తిరస్కారంగా చేతులు వదిలించుకుని "నా క్షమాపణతో మీకేం పని, యిప్పుడు నా క్షమాపణకి అర్ధమూ లేదు ఒక్క సంగతి చెప్పండి. ఆ బిడ్డ నెక్కడ వదిలారు. ఎడ్రసు చెప్పండి. కన్నతల్లి అయి కూడా ఆ బిడ్డని గురించి పట్టించుకోకుండా మీ అమ్మాయి నిబ్బరంగా వుండగలుగుతుందేమోకానీ, ఆమాట విన్న దగ్గిరనించి ఎక్కడో నిర్భాగ్యుడిగా, అనాధగా నా బిడ్డ పెరుగు తున్నాడన్న విషయం ఊహిస్తే నా గుండె మండిపోతూంది. చెప్పండి దయచేసి?" తీక్షణంగా అన్నాడు ప్రభాకరం. రంగారావు దోషిలా వివర్ణమయిన మొహం దించుకున్నారు.
    "అనాధగా విడిచి పెట్టేసినా ఆరా కనుక్కుంటూనే వున్నాను బాబూ - వాడికి ప్రత్యేకం పోషణకి డబ్బు పంపిస్తున్నాను నాయనా..."
    సంజాయిషీ యిస్తున్నట్లున్నాడు రంగారావు, ఆ మాట వినగానే ప్రభాకరం మొహం పాలిపోయింది. ఒక్క నిట్టూర్పు విడిచి "హుఁ! ఎంత నిర్భాగ్యుడు!.....తల్లీ తండ్రి ఉండి అనాధగా పెరుగుతున్నాడన్న మాట!" అన్నాడు ఆవేదనగా.
    కృష్ణమోహన్ గాఢంగా నిట్టూర్చి లేచి నిల్చుని కదిలాడు..."బాబూ," ఆరాటంగా ఎదురువెళ్ళి చేతులు పట్టుకున్నాడు రంగారావు "నాయనా! ఏం చెప్తావ్. ఏం అడగాలో తెలియడం లేదు-" తడబడుతూ అన్నాడు.
    "చెప్పవలసింది. అడగాల్సింది ఏమన్నావుంటే ఇంక నాకుకాదు....ప్రభాకరానికి చెప్పాలి మీరు....ఈ క్షణం నించి నా స్థానంలో అతనుంటాడు-"
    "బాబూ, మా అపరాధానికి ఈ శిక్ష వేస్తావా...మా పరువు మర్యాద అంతా నీచేతుల్లో ఉంది. నిశ్చయం అయిన ఈ పెళ్ళి తప్పిపోతే..." అనలేక అన్నాడు రంగారావు కృష్ణమోహన్ ఆశ్చర్యంగా చూచాడు. "ఏమిటి యింకా యిఇపెల్లి జరుగుతుందనే అనుకుంటున్నారా మీరు. ప్రభాకరాన్ని ఎదురుగా ఉంచుకుని మీరీమాట ఎలా అనగలుగుతున్నారు-" విస్మయంగా అడిగాడు.
    "లోకానికి నన్నేం చెప్పమంటావు నాయనా..."
    "పెళ్ళికొడుకు మారాడని చెప్పండి-మనసులు కలసినవారిని విడదీసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా యిద్దరికీ వెంటనే పెళ్ళి జరిపించండి. అంతకంటే మీరు చేయగల్గింది, చేయతగ్గదీ ఏమీలేదు." కృష్ణమోహన్ అన్నాడు.
    ప్రభాకరం కోపంగా "కృష్ణమోహన్ గారూ-నన్ను గురించి మీరేం అనుకుంటున్నారు? నాకు డబ్బు లేక పోవచ్చు గాని ఆత్మాభిమానం ఉంది. ఒకసారి కాదని కుక్కలా తరిమికొట్టినవారికి తిరిగి అల్లుడనయేటంత హీనుడిలా కన్పిస్తున్నానా?" తీవ్రంగా అన్నాడు.
    "ఛా, ఛా....అదికాదు మిస్టర్ ప్రభాకరం- గీత...మీరు గీత"
    "నా గీత ఎప్పుడో నాలో చచ్చిపోయింది. కృష్ణమోహన్ గారూ-యీ గీత ఎవరో నాకు తెలియదు. తెలుసుకో నక్కరలేదుకూడా..." కరకుగా అని వెళ్ళబోయాడు.
    "బాబూ, నీవు కూడా దాన్ని కాదంటే దానిగతి ఏమిటిబాబూ?" రంగారావు చప్పున ముందుకు వచ్చి దీనంగా ప్రభాకరం చేతులు పట్టుకున్నాడు.
    "ఓహో అంటే కృష్ణమోహన్ గా రెటూ అంగీకరించరు గనక యింక నేను మిగిలా నన్నమాట. ఇప్పుడు నేను కంటికి ఆనానన్నమాట. మీ ఉదారతనానికి థేంక్స్! కాని మీ కోరిక అంగీకరించలేనందుకు విచారిస్తున్నాను. సరోజగారి మీద యీయన వేసిన ఆరోపణలకి సమాధానం చెప్పాలని వచ్చాను. అంతే, నాపని అయిపోయింది యింక" వెనుదిరిగాడు ప్రభాకరం.
    "ప్రభాకరంగారూ, తొందర పడకండి. గీతని గూర్చి ఒక్కక్షణం ఆలోచించండి. ఇందులో ఆమె నేరం ఏం లేదు. మిమ్మల్ని ప్రేమించింది. మనసు, తనువు అర్పించింది. కాని మీరుమోసంచేశారన్న కోపంతో మిమ్మల్ని ద్వేషించింది. మిమ్మల్ని మరిచి మరొకరితో ముడిపెట్టుకోడానికి అంగీకరించింది. అంతేకాని మీపట్ల ఆమెకేం ద్వేషం లేదు. జరిగిందేదో జరిగింది, ఇప్పుడు గీతని కాదంటే ఆమె జీవితం ఏమవుతుంది. తండ్రిచేసిన తప్పుకి ఆమెను శిక్షించండి" అన్నపూర్ణమ్మ, ప్రభాకరం ముందుకువచ్చి కళ్ళనీళ్ళతో ప్రభాకరానికి చేతులు జోడించింది.
    "బాబూ-మా తప్పు క్షమించు. ఇవి చేతులుకావు. దాని బతుకన్యాయం చేయకు, ఒక్కగా నొక్క బిడ్డ దాని కన్యాయం జరిగితే మాకింక బ్రతుకేముంది? నామాట కాదనకు నాయనా" కళ్ళ నీళ్ళతో ప్రార్దించింది. ప్రభాకరం కాస్త చలించాడు. అంతా ఆరాటంగా ప్రభాకరాన్ని చూస్తున్నారు.
    అన్నపూర్ణమ్మని  చూస్తూ ప్రభాకరం ఇదివరకటి కంటే కటువుగా మాట్లాడలేక పోయాడు. ఆలోచిస్తూ నిలబడ్డాడు. గీతని గీతకోసం కాకపోయినా అనాధగా పెరుగుతున్న బిడ్డ కోసమన్నా అంగీకరించాలి. తనబిడ్డ తల్లిగా ఆమెని అంగీకరించక తప్పదు.
    "ఒక షరతుకి గీత అంగీకరిస్తే..."ప్రభాకరం ఆఖరికి అన్నాడు సాలోచనగా.
    "చెప్పు నాయనా...నీవేం చెప్పినా సరే" రంగారావు అన్నపూర్ణమ్మ ఒక్కసారే అన్నారు.

 Previous Page Next Page