Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 44


    "ఏ ఐశ్వర్యం చూసుకుని మీరు నన్ను అవమానించారో ఆ ఐశ్వర్యాన్ని వదిలి గేతేహ కట్టుబట్టలతో నా యింటికి రావాలి. గీత మీ కుమార్తెనన్నమాట మరిచి నా భార్యగా, నా బిడ్డకి తల్లిగా బ్రతకడానికి అంగీకరించాలి..."
    ఒక్కక్షణం నిశ్శబ్దం - "బాబూ ఈ డబ్బు .... ఈ ఆస్థి....మరెవరికోసం -" రంగారావు ఆందోళనగా ఏదో అనబోయారు.
    "అనాధ శరణాలయానికి యివ్వండి -డబ్బిస్తే పుచ్చుకునేవారు చాలామంది వుంటారు" స్థిరంగా దృఢ నిచయంగా అన్నాడు ప్రభాకర్ - అన్నపూర్ణ, రంగారావు మొహాలు చూసుకున్నారు-ఏం జవాబు చెప్పాలో తెలియనట్టు.
    మేడమీదగదిలో పరదా చాటున స్థాణువులా నిలబడి అంతా విన్న గీత ఏదో నిశ్చయించుకున్న దానిలా నెమ్మదిగా క్రిందికి దిగిరావడం మొదలుపెట్టింది. అంతా ఆమెవంక ఆరాటంగా చూశారు. ఈ అరగంటలో ఆమె మొహం గుర్తుపట్టలేనంతగా వివర్ణమయింది. ఆమె ఎటూ చూడకుండా తిన్నగా ప్రభాకర్ వద్దకు వచ్చి "పద, వెడదాం" అంది-అంతా ఆశ్చర్యంగా చూశారు. ప్రభాకర్ అనుమానంగా చూస్తూ - 'ఎక్కడికి?' అన్నాడు.
    "నీ ఇంటికి కాదు, మన యింటికి" గీత స్థిరంగా అంది.
    "బాగా ఆలోచించుకున్నావా?" ఇంకా నమ్మకం కుదరలేదు అతనికి.
    "గీతా -" ఆరాటంగా వచ్చారు రంగారావు దంపతులు ఏదో చెప్పబోయారు.
    గీత సూటిగా తండ్రివంక చూస్తూ "డాడీ నా జీవితం యిప్పటికే చిందరవందర అయింది. యిప్పటికయినా నన్ను సరిదిద్దుకోనీయండి" స్థిరంగా అని ప్రభాకర్ వంక తిరిగి "నేనంతా నిర్ణయించుకున్నాను - పద వెడదాం" అంది ప్రభాకరం ఆమెని రెండు క్షణాలు పరికించి చూశాడు ఆమె మొహంలో కన్పించిన నిజాయితీకి సంతృప్తి పడి "పద" అన్నాడు.
    గీత వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా ప్రభాకరం చేయిపట్టుకుని ముందుకు అడుగువేసింది. జరుగుతున్నది కలో నిజమో అర్ధంకానట్టు రంగారావు అన్నపూర్ణమ్మ అచేతనంగా నిలబడ్డారు. కృష్ణమోహన్ చటుక్కున ముందుకువచ్చి ప్రభాకరం చేయిపట్టుకుని "విష్ యూ గుడ్ లక్ మిష్టర్ ప్రభాకరం" విష్ చేస్తూ అభినందించాడు - గీతవంక తిరిగి "గీతా!-" అన్నాడు. గీత మొహం అరక్షణం సిగ్గుతో కందింది. ఆ వెంటనే ఆ భావం మార్చేసి చిరునవ్వుతో "మీ కోరిక తీరినట్లేగా" అంది - కృష్ణ మోహన్ అర్ధంకానట్టు చూశాడు.
    "ఆశ్చర్యం నటించకండి. మీరిదంతా ఎందుకు చేశారో తెలుసు. విష్ యు సక్సెస్ - సరోజ మీకోసం ఎదురు చూస్తూంటుందేమో" అంది కవ్వింపుగా నవ్వి. ఆమె మాటల కర్ధం బోధపడగానే ప్రభాకరం కొంటెగా నవ్వాడు కృష్ణమోహన్ కాస్త సిగ్గుపడి "నీవు-నీకు" తడబడ్డాడు. గీత నవ్వేసి "నాకు తెలుసు అంతా చెప్పాలని అనవసరంగా ప్రయాసపడకండి-" అంది.
    "గీతా - నామీద నీకేం కోపం లేదుగదూ" అన్నాడు కృష్ణమోహన్.
    "ఊహు-లేదు ఆ గీత కాదు ఈ గీత - ఆ గీతే అయితే మిమ్మల్నింత సుళువుగా వదిలేదాన్నా - నన్ను కాదన్నందుకు పగ సాధించేదాన్ని కాని ఇప్పుడు ఆ గీత చచ్చిపోయింది." అంది ఉదాసీనంగా గీత. కృష్ణమోహన్ వింతగా చూశాడు ఆమె ముఖంలోకి.
    గీత ప్రభాకరం ముందుకి నడిచారు.
        
                                      *    *    *
    
    కృష్ణమోహన్ చాలా ఉషారుగా, పెద్ద ఆపద నెత్తి మీదనుంచి దిగిపోతే ఎంత సంతోషంగా ఉల్లాసంగా వుంటాడో అంత ఉషారుగా యింటికి వచ్చాడు. అతని ఉత్సాహం అంతా పొంగే పాలమీద నీళ్ళు చిలకరించినట్లు గుమ్మంలోనే ఎదురయిన తల్లి చెప్పినమాట వినగానే అణిగి పోయింది.
    "సరోజ వెళ్ళిపోయిందిరా. ఎంత చెప్పినా వినకుండా క్షణంకూడా నిలబడకుండా తన పెట్టి పట్టుకుని వెళ్ళిపోయిందిరా-ఏం జరిగిందిరా, ఎంత అడిగినా ఒకమాట చెప్పలేదు. ఇంక వుండలేను క్షమించండి అన్నమాట తప్పించి మరేమాట చెప్పకుండా వెళ్ళిపోయిందిరా, నీవే మన్నా అన్నావా" సరస్వతమ్మ గుమ్మంలోనే ఎదురయి ఆరాటంగా అడిగింది కృష్ణమోహన్ ఒక్కక్షణం నిర్ఘాంత పోయి నిలబడ్డాడు.
    "వెళ్ళిపోయిందా-ఎక్కడికి-ఎంతసేపయింది" ఆత్రుతగా అడిగాడు.
    "గంటపైనే అయింది. వెళ్ళరా ఊరికి వెళ్ళిపోతుందేమో స్టేషనుకెళ్ళి చూడు" కృష్ణమోహన్ వాచి చూసుకున్నాడు. ఊరు వెడితే ఎక్స్ ప్రెస్ లో వెళ్ళాలి - ఇంకా టైముంది-గిరుక్కున తిరిగి కారెక్కాడు కృష్ణమోహన్.
    రైలు బయలుదేరడానికి సిద్దంగావుంది. ఆ మూల నించి ఈ మూలవరకు రెండుసార్లు ప్రతి కంపార్టుమెంటు ఆరాటంగా వెతికాడు కృష్ణమోహన్. రైలు కదిలింది. హతాశుడై కృష్ణమోహన్ నిలబడిపోయాడు.
    అదే సమయంలో హైదరాబాదునించి బయలుదేరిన బస్సులో సీటుకి జారగిలబడి కళ్ళు మూసుకుని కూర్చుంది సరోజ.
    
                                        *    *    *
    
    వీధి అరుగుమీద కూర్చుని మర్నాటి కూరకి గోరు చిక్కుడుకాయలు వలుస్తున్న పార్వతమ్మ వీధి గుమ్మం లోంచి వస్తున్న వ్యక్తిని చూసి కెవ్వున కేకేసి ఒక్క ఉదుటునలేచి "బాబూ రామం" అంటూ కౌగలించుకుని "ఏమయిపోయావురా నాయనా యిన్నాళ్ళూ, మమ్మల్ని విడిచి ఎక్కడి కెళ్ళావురా" అంటూ పిచ్చిదానిలా ఏడుస్తూ అంది. పార్వతమ్మ కేకకి లోపలినించి వచ్చిన సరోజ ఆ దృశ్యం చూసి చకితురాలైపోయింది. ఒక్కక్షణంలో తేరుకుని 'అత్తయ్యా' అంటూ ముందుకువెళ్ళి ఆమెని పట్టుకుంది. "బావకాదత్తయ్యా-ఆయన-ఆయన నేనుండేదాన్నని చెప్పానే కృష్ణమోహన్ గారు - డాక్టరుగారు" అంది కృష్ణ మోహన్ ఆ హఠాత్ సంఘటనకి ఒక్కక్షణం అలా నిలబడిపోయాడు. పార్వతమ్మ చటుక్కున కృష్ణమోహన్ ని వదిలి ఆరాటంగా ఎగాదిగాచూసి- "అవును నాపిచ్చి గాకపోతే బూడిద అయిన రామం మళ్ళీ ఎలావస్తాడు-" అంటూ తనలో తను గొణుక్కుంది. "బాబూ-ఏమనుకోకు నాయనా, చచ్చిపోయిన నా రామాన్ని చూసినట్టు అనిపించింది-" కళ్ళు వత్తుకుంటూ అంది పార్వతమ్మ కృష్ణమోహన్ చలించిపోయాడు. చప్పున ముందుకు వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకున్నాడు. "అమ్మా-నన్ను మీ రామమే అనుకోండి. మీ కొడుకులాంటి వాడినే" అన్నాడు ఆర్ద్రంగా. "అంత మాటన్నావు చాలు నాయనా. మా సరోజ మీ గురించి అంతా చెప్పింది. మీ అమ్మగారు, నీవు దానిపట్ల చూపించిన ఆదరం మేం మరిచి పోలేం బాబూ, రా నాయనా లోపలికి" అంది పార్వతమ్మ సంబరంగా-సరోజ ప్రశ్నార్ధకంగా అతని వంక చూసింది. సరోజ చూపులని గమనించనట్లే కృష్ణమోహన్ పార్వతమ్మ వెంట లోపలి కెళ్ళాడు చలపతిరావుగారు పార్వతమ్మలాగే అతన్ని చూస్తూ నోట మాట రాక ఒక్కక్షణం ఉండిపోయారు. పార్వతమ్మ వివరించాక ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ దగ్గిర కూర్చోపెట్టుకుని కొడుకు గురించి చెప్పి, సరోజని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు పదే పదే చెప్పారు. సరోజ చెప్పకుండా వచ్చేసిందని, ఆమె కోసం వచ్చానని చెప్పగానే ఆయన నొచ్చుకున్నారు.

 Previous Page Next Page