జరిగింది కలేమో అన్నట్టు ఒక్క క్షణం అలా చూస్తూ నిల్చుని తరువాత నెమ్మదిగా కదిలింది సరోజ.
* * *
కారుదిగి లోపలికి వస్తున్న గీత, ప్రభాకరం, కృష్ణ మోహన్ ని చూడగానే రంగారావుగారి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎదురుచూసిన ప్రళయం ముంచుకు వచ్చినట్లు భయంతో ఆయన వణికాడు. గీత ఉపోద్ఘాతం ఏం లేకుండానే "డాడీ - ఆరోజు ప్రభాకరం మనింటికి వచ్చాడా వస్తే నీవు అవమానించి పొమ్మన్నారా?" అంది స్థిరంగా చూస్తూ - రంగారావు కలవరపడుతూ, మాటలకి తడుముకుంటూ కృష్ణమోహన్ వంక చూశాడు. "ప్రభాకరా....ఏ ప్రభాకరూ, నేనవమానించడం ఏమిటీ!" ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు.
"డాడీ - కృష్ణమోహన్ గారికి అంతా తెల్సింది- నేనడిగిన దానికి జవాబు చెప్పు-" తొణక్కుండా బెణక్కుండా అడిగింది. ఆ మాట వినగానే ఆయన హతాశుడై పోయాడు- మొహం నల్లబడింది. కంగారుగా ఏదో అనబోయాడు.
"రంగారావుగారూ, మీరింకా ఈ విషయం దాచాలని ప్రయత్నించకండి - యిప్పటికయినా నిజం చెప్పండి-" కఠినంగా అన్నాడు కృష్ణమోహన్.
"హు-ప్రభాకర్ ఎవరూ అంటున్నారు. నేను - ఆరోజు మీ యింటికి వచ్చాను. నన్ను నిలబెట్టి ఎగాదిగా చూసి "ఎవరు నీవు? గీతని పెండ్లాడడానికి వచ్చావా... నీవు చదివింది బి.ఏ నా, నీవు చేయబోయేది గుమస్తాగిరీ ఏనా - ఆ చూడు నీ గుమస్తా జీతం మా గీత, యింట్లో కట్టుకునే చీర ఖరీదంతకూడా వుండదని నీకు తెలుసా- ఇదిగో ఈసోఫా ఎంతో తెలుసా. నీజన్మలో చూశావా-ఫోం పరుపంటే ఏమిటో విన్నావా. యిలాంటి యిల్లు సినిమాలో తప్ప మామూలు జీవితంలో చూశావా అసలు? ఇలాంటి యింట్లో పుట్టిన గీతని-ఫోం పరుపుల్లో పడుకోబెట్టి పెంచిన గీతని-పళ్ళు, ఫలాలు, టోస్టులు తినే మా గీతని నీ కిచ్చి పెళ్ళిచేయడానికి నేనంత పిచ్చివెధవని కాదు. గెటౌట్ - మళ్ళీ యీ యింటి దరిదాపుల్లో కనిపించావంటే పోలీసు లకి అప్పగిస్తా - డబ్బున్న పిల్ల కనపడగానే ప్రేమమాటలు చెప్పి దాన్ని మోసగించి ఈ యింటికే అలుడవవుదా మనుకున్నావా. అది చిన్నపిల్ల. దానికి తెలివితేటలు లేవు. కాని నేనింకా బతికున్నా నా కంఠంలో ప్రాణం వుండగా యిది జరగదు. అర్ధమైందా - నౌ - యూ గెటౌట్ -" అన్నది నాతో నేనని. ఆ మనిషి ఈ ప్రభాకర్ అని గుర్తు తెచ్చుకోండి. పాపం మరిచిపోయి వుంటారు." ప్రభాకరం వ్యంగ్యంగా అన్నాడు. రంగారావు దెబ్బతిన్న పక్షిలా విల విల్లాడాడు, సోఫాలో కూలిపోయాడు.
"చచ్చిన పాముని యింకా చంపకు నాయనా - ఆరోజు నా అహంకారానికి తగిన ప్రాయశ్చిత్తం ప్రతి క్షణం అనుభవిస్తూనే వున్నాను. నిన్ను కాదని అవమానించిన ఆ క్షణం నించి నా జీవితంలో శాంతి అన్నది లేకుండా పోయింది బాబూ."
"అయితే ప్రభాకరం రాలేదని అబద్దం చెప్పావన్న మాట. డాడీ ఎందుకలా చేశావు- నా కెందుకంత అబద్దం చెప్పావు" గీత కోపంగా బాధగా అంది.
"ఎందుకంటే ఏం చెప్పినా నీకర్ధం కాదు తల్లీ- కడుపుతీపి. నా కడుపున ఏకైక బిడ్డగా పుట్టి, అల్లారు ముద్దుగా పెంచుకున్న నిన్ను తీసికెళ్ళి ఓ గుమస్తా చేతికి ఎలా అప్పగించ గలనమ్మా నీ ప్రేమ నీ కళ్ళు కప్పితే, నా ప్రేమ నన్ను స్వార్ధపరుడ్ని చేసింది. తెలిసి తెలియని ఈ వయసులో ప్రేమలు ఎల్లకాలం నిలవవని ఆ వేడి పొంగు చల్లారాక నీ వెంత పొరపాటు చేసావో గ్రహించి వగస్తావని, నిన్నా దుర్దశలో పడనీయకూడదని, నీకు తెలియకుండా ప్రభాకరాన్ని అవమానించి పంపేశాను. నాలుగు రోజులు బాధపడ్డా తరువాత నీవే సర్దుకుంటావని అనుకున్నాను. అందుకే ప్రభాకరం రాలేదని నీకు అబద్దం చెప్పాను. వూర్లోంచి వెళ్ళిపోయాడని తెలుసుకుని నిన్ను దగా చేశాడని, వంచకుడు, మోసగాడు అని నిందించావు. నాక్కావలసింది అదే గనక ఆ క్షణంలో ప్రభాకరం పీడ అంత సుళువుగా వదిలినందుకు సంతోషించాను. కాని నా సంతోషం మూడునాళ్ళ ముచ్చటే అయింది. గీతా నీవు నెలతప్పావన్న సంగతి తెలియగానే పిడుగు పడినట్లయింది. కాళ్ళుచేతులు ఆడలేదు. ఈ సంగతి ముందు తెలిస్తే ప్రభాకరంతోనే నీ పెళ్ళి జరిపించి యిల్లరికం వుంచుకునే వాడిని - మీ ప్రేమ కేవలం ఏదో సినిమాలకి, షికార్లకి పరిమిత మయిందనుకున్నాను తప్ప, ఇంత దూరం వెళ్ళిందనుకోలేదు. అప్పుడింక గత్యంతరం ఏముంది. ప్రభాకరాన్ని పిలిచి నిన్నిచ్చి గప్ చిప్ గా పెళ్ళి చేసి పరువుకాపాడుకోవాలనుకున్నాను. హు - కాని అనుకున్నది అనుకున్నట్లు జరిగితే యింకేం కావాలి. ప్రభాకరం ఎక్కడికి వెళ్ళాడో, అతని అడ్రసేమిటో, అతనేవూరి వాడో, ఇంటి పేరేమిటో, అతని స్నేహితులు ఎవరూ చెప్పలేకపోయారు. చదువయి పోయింది, వాళ్ళ అక్కగారి వూరు వెళ్ళాడు. ఏ వూరో తెలియదు అన్నారు. హతాశుడనై పోయాను. ఎక్కడ వెతకను. వూరిపేరన్నా తెలియనిదే ఏం వెతికించగలను. అప్పటికే కాలాతీతం అయింది. వెంటనే డాక్టరు దగ్గరకి తీసికెళ్ళాను. ఇప్పుడింక పెద్ద ప్రాణానికే ముప్పురావచ్చు అని డాక్టరు యిష్టపడలేదు. అప్పుడింక ఏం చెయ్యడం. ఏదో సాకుపెట్టి వూరు వదిలి మరోవూర్లో నాలుగైదు నెలలు తలదాచుకుని, రహస్యంగా నీకు కాన్పు చేయించి..."
"ఆ బిడ్డని ఏం చేశారు?" తీక్షణంగా అడిగాడు ప్రభాకర్.
"ఏం చేస్తాంనాయనా. పెళ్ళికాకుండా బిడ్డని కన్న ఆడది ఈ సమాజంలో బ్రతకగలదా బాబూ అందుకే తీసికెళ్ళి అనాధ శరణాలయంలో వదిలి వచ్చాను." ఖిన్నుడై అన్నాడు రంగారావు. గీత ప్రభాకరాన్ని, కృష్ణమోహన్ ని దోషిలా సిగ్గుపడుతూ చూసి యింక వినవలసింది. ఏం లేనట్లు ప్రాణంలేని బొమ్మలా నడుస్తూ మేడమెట్లు ఎక్కింది. అన్నపూర్ణమ్మ కళ్ళు వత్తుకుంటూ "బాబూ, నిన్ను కాదన్న మా అహంకారం ఆ భగవంతుడు అణిచేశాడు. కన్నకడుపు కనక దాని తప్పు కడుపులో దాచుకుని-తిరిగి దాని బతుకు చక్కదిద్దాలనుకున్నాం."