Previous Page Next Page 
జన్మభూమి పేజి 43

    అలాంటి తరుణంలో ముఖ్యమంత్రి మాటలు నా భవిష్యత్తు కార్యాచరణ పథకానికి నాంది పలికాయి. నా బరువు బాధ్యతలు పిల్లల్ని తీర్చిదిద్దడం అయింది. జీవితంలో మిగిలిన ఇంకొంత భాగం నా జన్మభూమి రుణం తీర్చుకోడానికి వినియోగించాలని నిర్ణయించాను. నా ఆలోచనని ముఖ్యమంత్రి ఎంతో అభినందించి ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని హృదయపూర్వకంగా ఆహ్వానించారు.
    ఈ ఏడాదిలో...ఈ వూరు వచ్చిన ఈ ఏడాదిలో ఒక సత్యం నాకు అర్ధమైంది. లోకాన్ని, సమాజాన్ని, జనాన్ని నీవు ఏది అడగకుండా ప్రతిఫలం ఆశించకుండా నీపని నీవు చెయ్యి. లోకం నీ కాళ్ళముందు వాలుతుంది. ఏదన్నా అడిగావో, ప్రతిఫలం ఆశించావో జనం కొండెక్కి కూర్చుంటారు.
    మనం ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్ధ సేవ అందిస్తున్నామన్న నమ్మకం జనానికి కలిగితే తమంతట తామే వచ్చి సహాయం, సహకారం అందిస్తారు అన్న నిజం అర్ధం అయింది. నేను ఈ వూరికి చేస్తున్నది స్వచ్చంద సేవ అన్నది ప్రజలకి అర్ధమైంది. డబ్బు కోసం, పదవి కోసం కాదన్నది ప్రజలు అర్థం చేసుకుని నాకు అన్ని విషయాలలో సహకారం అందించారు. నా పెద్దరికాన్ని అంగీకరించారు. వారి సహాయ సహకారాలు లేకపోతే నేనేమీ చెయ్యలేకపోయేవాడిని.
    సాధారణంగా పల్లెలలో గ్రూపులు, కక్షలు, తగాదాలు వుంటాయంటారు. నా అదృష్టం కొద్దీ ఈ వూరి పెద్దలందరూ నాకు అండగా నిలిచారు. అంచేత ఈనాడు ఈ వూరికి మేం రోడ్లు సమకూర్చుకున్నాం. బోర్ వెల్స్ వేసుకున్నాం. పాఠశాల నిర్మించుకున్నాం. స్వచ్చందంగా చదువు చెప్పడానికి ముందుకొచ్చారు కొందరు. హరిజనవాడ శుభ్రపడింది. వూరిలో పిల్లలు క్రమం తప్పకుండా బడికి వెళ్ళేట్టు చేశాం. వయోజన విద్య ఆరంభ శూరతం కాకుండా పటిష్టంగా క్రమం తప్పకుండా జరిపిస్తున్నాం. సహకార సేద్యానికి రైతులందరూ కలిసివచ్చారు. పెద్ద చిన్న రైతులందరూ కలిసి పంట పండించి లాభాలు ఆర్జించారు.
    కొత్తగా రైసు మిల్లు పెట్టి మా పంట మేమే అమ్ముకుంటున్నాం. నూతన వ్యవసాయ పద్ధతుల కోసం హారెస్టర్ లాంటి ఆధునిక పరికరాలు కొన్నాం. ఈ వూరిలో ఆస్పత్రి లేని ప్రజల యిబ్బందిని తొలగించడానికి ఆస్పత్రి ఆరంభించాం. ఇప్పుడు చుట్టుపక్క గ్రామాలన్నింటినుంచి ఇక్కడికి వైద్యానికి వస్తున్నారు.
    జన్మభూమి కార్యక్రమం ద్వారా మాకు రోడ్లు వేసుకోవడానికి, స్కూలు ప్రహరీగోడ కట్టించడానికి, స్కూలు మరమ్మత్తులకి ప్రభుత్వం సహాయం అందించింది. ఇదంతా నా ఒక్కడి వల్ల అవలేదు. ఇందులో ఎందరో భాగస్వాములున్నారు. స్కూలులో పిల్లలకి చదువు చెప్పడంలో, మహిళలకి చదువు, మహిళా స్వయంఉపాధి పథకంలో నా శ్రీమతి ఎంతో సహాయ సహకారం అందించింది.
    వూరికి వచ్చాక ఏమీ తెలియని నాకు కుడిభుజం అయి నిల్చిన నా మేనల్లుడు రంగా, తనకి వచ్చిన కొద్దిపాటి చదువుతోనే పిల్లలకు చదువు చెప్తున్న అతని భార్య సుగుణ, యువకుడు అయిన వాసు పట్టణం వదిలి యిక్కడ వుండి వూరిలో డబ్బు వ్యవహారాలు చూసిపెడుతూ నాకు ఆసరాగా నిలిచారు.
    డాక్టర్ శ్యామల పల్లెటూరు వచ్చి తన సేవలందిస్తూ నాకెంతో సహాయం అందిస్తుంది. అలాగే నర్సు విమలమ్మ తమ అనుభవంతో మాకు ఎంతో అండగా నిల్చింది. రిటైరయిన అగ్రికల్చర్ ఆఫీసర్ కృష్ణమూర్తిగారు నన్ను చూసి ప్రభావితుడై ఈ వూరిలో సెటిల్ అయి వ్యవసాయ రంగానికి సేవలందించడానికి సిద్ధపడ్డారు.
    ప్రెసిడెంట్, కరణం, మునసబు ఒకరేమిటి, ప్రతివారు తమ వంతు సహకారం అందించబట్టే ఈనాడు ఇది ఒక మోడల్ విలేజ్ గా తయారయ్యింది. ఇంకా కొన్నిపనులు మరుసటి ఏడు చేపట్టాల్సి వుంది. ఇక్కడ ఒక పశు వైద్యశాల లేదు. ప్రభుత్వం అది ఏర్పరచగలిగితే సంతోషం. లేని పక్షంలో మేమే ఏర్పరచుకోవాలి.
    రక్షిత మంచినీరు ఒక టాంక్ కట్టించి ఇళ్ళకి పైపుల ద్వారా నీరు అందించాలి. ఒక పౌల్ట్రీ ఫారం, ఒక డెయిరీ ఫారం, నిరుద్యోగ యువకుల కోసం ఏర్పరచాలన్న ఆశ వుంది. అది ఈ సంవత్సరం చేస్తాము. ఇవి మేము సాధించినవి, సాధించబోయే కార్యక్రమ వివరాలు ఇదంతా వూరి గురించిన వివరాలు ఇచ్చాను ఇప్పటివరకు.
    ఈ సందర్భంలో మరొక చిన్నమాట. ఈ వూర్లో మేం ఆస్పత్రి నిర్వహిస్తున్న భవంతి యజమానురాలు ఆ ఇల్లు మాకు ఆస్పత్రి కొరకు వూరికే ఇచ్చారు. మేం ఈరోజు కార్యక్రమానికి ఆమెని రమ్మని ఆహ్వానించాము.
    ఎనభయ్ రెండేళ్ళ వయసులో వుండి, తన యిల్లు ఒక మంచి ప్రయోజనం కోసం దానం యివ్వడానికి అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వరలక్ష్మమ్మగారికి చంద్రునుకో నూలుపోగులా సన్మానించుకుంటాం" అంటూ వరలక్ష్మమ్మగారిని వేదికమీదికి ఆహ్వానించారు కేశవరావుగారు. ఆమెని కుర్చీలో కూర్చోపెట్టి ముఖ్యమంత్రిచేత దండ వేయించి, శాలువా కప్పించారు కేశవరావు.
    "గత 35-40 సంవత్సరాలుగా మా ఇల్లు మూతపడింది. నా పిల్లలెవరూ ఈ పల్లెటూరిలో వుండరు. వారందరూ జీవితంలో బాగా స్థిరపడ్డారు. ఈ ఆస్థి వారికి ఒక లెక్కలోది కాదు. అది ఇన్నాళ్ళకి ఒక ప్రజాహిత కార్యక్రమానికి పనికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా వుంది.
    డాక్టర్ కేశవరావులాంటి వారు ఇక్కడికి వచ్చి అట్లాంటి ఆస్పత్రి పెట్టి రోగుల సేవ చేస్తుండడం చూసి ఆ ఇల్లు పూర్తిగా ఆస్పత్రికి దానం ఇవ్వాలని నిర్ణయించాను. నాది ఒక్క కోరిక. నా భర్త రామచంద్రరావుగారి పేరు ఆ ఆస్పత్రికి పెట్టగలిగితే సంతోషిస్తాను. పండు ముసలి అయిన వరలక్ష్మమ్మగారి కోరిక విని అంతా చప్పట్లు కొట్టారు.
    "తప్పకుండా. మీ కోరిక తప్పకుండా తీరుస్తాను. మీ యిరువురి పేర్లు కలిపి రాయిస్తాం" కేశవరావు అభయహస్తం యిచ్చారు. ముఖ్యమంత్రి ఆవిడ్ని మరోసారి అభినందించారు. "ఈ ఆస్పత్రికి ఇంకా పెద్దదిచేసి, నవీనపరిచి ఇంకా డాక్టర్లు, నర్సులని అపాయింట్ చేసి ఈ చుట్టుపక్కల ప్రజలు పట్టణాలకి వైద్యానికి వెళ్ళక్కరలేకుండా చేస్తాం."
    "ఇంతసేపు వూరి గురించి అయింది. యిప్పుడు నేను ముఖ్యమంత్రిగారి గురించి నాలుగు మాటలు చెప్పదలిచాను. ఇలాంటి యువకుడు,కార్యదక్షుడు, రోజుకి పద్దెనిమిది గంటలు శ్రమపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకునే ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్రదేశ ప్రజల అదృష్టం అని మరోసారి నొక్కి చెపుతున్నాను."
    ఆయనని మనం పదికాలాలపాటు ముఖ్యమంత్రిగా నిలుపుకోడానికి కృషి చెయ్యాలి. ఆయనని మనం వదులుకుంటే ఆయనకంటే మనకు నష్టం అన్నది ప్రజలు గ్రహించాలన్నది నా విజ్ఞప్తి. ఒక పనిచేసే ముఖ్యమంత్రిని వదులుకుంటే నష్టం ప్రజలది. ఆయన చేపట్టిన కార్యక్రమాలు మధ్యలో ఆగిపోతే జరిగే చెడు రాష్ట్రానికి.
    ప్రభుత్వంలో ఒక పని చెయ్యాలంటే ఎంత కష్టమో ఎంత సమయం పడుతున్నది నాకు తెలుసు. ఆర్ధిక వనరులు సమకూర్చుకుని ఒక ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఆటంకాలు, ఎంత జాప్యం జరుగుతుంది. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టు ప్రభుత్వ యంత్రాంగంలో అలక్ష్యం, సిబ్బంది నిర్లిప్తత ముఖ్య కారణాలు. ఆయన ఈనాడు వేసిన విత్తులు మొలకెత్తి, వృక్షాలై ఫలాలు చేతికి అందిరావడానికి కనీసం పదేళ్ళు పడుతుంది.
    ప్రగతి ఏ ఒక్క సంవత్సరంలోనో జరగదు. విత్తు వేయగానే ఫలాలు చేతికి రావడానికి ఆయన మాంత్రికుడు కాదు - ముఖ్యమంత్రి. ఒక ప్రభుత్వం ఏర్పడ్డాక నిలదొక్కుకుని కొద్దో గొప్పో అభివృద్ధి చూపడానికి ఐదేళ్ళు చాలా తక్కువ సమయం. ప్రజలు అస్తమానం ప్రభుత్వాలు మార్చుతుంటే నష్టం ప్రజలకే అన్నది గుర్తించాలి.
    ఒక ప్రభుత్వానికి పట్టం కట్టాక - మరీ వారు అసమర్ధులు, లంచగొండులు అని ధృడపడితే తప్ప ప్రభుత్వాన్ని అస్తమానం మార్చకూడదు. కనీసం ఒక్కొక్క ప్రభుత్వానికి పదేళ్ళు సమయం యిస్తే తప్ప వాళ్ళేం చేస్తారన్నది తేలదు. ప్రతిపక్షాలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం గోరంతలు కొండంతలు చేసి చూపుతారు.
    అపోజిషన్ పార్టీ అంటే ప్రభుత్వంకి ప్రతి పనిలో అపోజిట్ యివ్వడం అనే భావించినట్టు ప్రతి చిన్నదానికి గోల చేస్తాయి. మంచి ప్రతిపక్షం అంటే ప్రభుత్వం మంచి చేసినప్పుడు అభినందించాలి. ప్రజా శ్రేయస్సుకి చేపట్టే కార్యక్రమాలకి చేయూతనివ్వాలి. జన్మభూమి, శ్రమదానాలు, ఆకస్మిక తనిఖీలు లాంటి వాటికి చేయూత నందించాల్సిందిపోయి ఏదైనా చేయడం తగదు.

 Previous Page Next Page