ఇంకే ప్రభుత్వం వచ్చినా రెండు రూపాయలకి బియ్యం యివ్వగలదా? ఏభయ్ పైసలకి కరెంట్ ఇవ్వగలదా, మద్యం నిషేధం అమలుపర్చగలదా...ఇవన్నీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినవే. కాదనడం లేదు...చిత్తశుద్ధితో అమలు చెయ్యాలనే ప్రభుత్వం తలచింది. కాని కార్యాచరణలో అసాధ్యమని తేలాక, రాష్ట్ర ఆర్ధిక స్థితి దిగజారిపోయిన తరుణంలో అవి సడలించారన్నది ప్రజలు అర్థం చేసుకోవాలి.
బియ్యం బజార్లో నాలుగు రూపాయలున్నప్పుడు రెండు రూపాయలన్నారు౧ ఇప్పుడు పది రూపాయలున్నప్పుడు మూడున్నరకి ఇస్తున్నారంటే అప్పటికంటే నిజానికి ఇంకా తక్కువకిస్తున్నట్టే. ఉప్పు నాల్గు రూపాయలున్నప్పుడు బియ్యం ఏ ప్రభుత్వం మాత్రం రెండు రూపాయలకిచ్చి మానగలదు.
అక్రమ మద్యం ఏరులై పారుతూ ఎక్సైజ్ సిబ్బంది, కాంట్రాక్టర్లు కోటీశ్వరులై ప్రభుత్వ ఖజానాని గండి పడుతుంటే మద్యం నిషేధం సడలించడం తప్ప దారేది... రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అల్లకల్లోలం అయినపుడు సబ్సిడీలు తగ్గించకపోతే మనుగడ ఎలా...యివన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి.
మంచి చేద్దాం అనుకునే ప్రభుతాన్ని కొన్నాళ్ళు నిలుపుకోవాలి. వాళ్ళకి ఛాన్సు ఇచ్చి చూడాలి. పార్లమెంటరీ ఎన్నికలప్పుడు అధికార ప్రభుత్వానికి తక్కువ సీట్లు రావడానికి కారణం ముఖ్యమంత్రి పట్ల అవిశ్వాసం కాదు - ఆయన చేపట్టిన పనుల పట్ల అసంతృప్తికాదు. లోక్ సభలో ఎన్నికలంటే ప్రధానమంత్రి ఎన్నికలు అని పల్లె ప్రజలు కూడా అర్థం చేసుకుని దేశంలో సుస్థిర ప్రభుత్వ స్థాపనకు కాంగ్రెస్, బి.జె.పి.లకి ఎవరికో ఒకరికి ఇస్తే తప్ప ప్రభుత్వం నిలబడదన్నది ప్రజలకు తట్టింది. ఇవి అసెంబ్లీ ఎన్నికలు కావు. ఢిల్లీ ఎన్నికలు గదా యిప్పుడు ముఖ్యమంత్రికి ఓట్లు వేస్తే ఏం లాభం.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు వేస్తాం అన్నది వాళ్ళ మాట. నేను ఎందరినో పనిచేసే ముఖ్యమంత్రికి ఓట్లు ఎందుకు వేయలేదు అని ఆరా తీశాను. "బాబూ! ఇవి మన ముఖ్యమంత్రిగారి ఓటు కాదంట గదా! ఢిల్లీ ప్రధానమంత్రి ఓటు కదా. అందుకే అట్లా వేసాం. అసెంబ్లీ అప్పుడు మన బాబుకే వేస్తాం..." అన్నారు పల్లె ప్రజలు.
అంచేత యిది కేంద్రంలో సుస్థిరత కోసం వేసిన ఓట్లు తప్ప మన ముఖ్యమంత్రి పట్ల విముఖత కాదని నాకనిపించింది. ప్రజలు విజ్ఞులైతే పనిచేసే ముఖ్యమంత్రిని అసెంబ్లీ ఎన్నికలప్పుడు గెలిపించి తీరుతారు. ఇది ఎలక్షన్ మీటింగు కాదు కనుక ఇంతకంటే చెపితే బాగుండదు.
ఆఖరుగా ముఖ్యమంత్రిగార్కి చిన్న విన్నపం. ప్రతి ఎమ్మెల్యేకి వారి నియోజకవర్గం అభివృద్ధికి కొంత సొమ్ము కేటాయిస్తారు. అవి సద్వినియోగపడ్తున్నాయో లేదో అవి ఎంత మేరకు ఆచరణలో పెట్టారో, ఏ ఏ పనులకి ఎంత సొమ్ము ఖర్చుచేశారో ప్రతి మూడు నెలలకి ఒకసారి నియోజకవర్గాల వారిగా పరీక్షిస్తే తప్ప ఆ సొమ్ము సద్వినియోగం అవదు. పల్లెలు ఎక్కడ వేసిన గొంగళి మాదిరిగానే వుండిపోతాయని నా విన్నపం. పల్లెలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా రోడ్లు, నీరు, కరెంటు, ఆస్పత్రి, స్కూలు వుంటేతప్ప ఎవరూ పల్లెపట్టున వుండడానికి యిష్టపడటం లేదు.
విదేశాలలో జనం పట్టణాలకి దూరంగా ప్రశాంతంగా వుండాలని కోరతారు. అంటే అక్కడ పట్టణాలకి, పల్లెలకి సదుపాయాలలో తేడా వుండదు. అక్కడ పట్టణాల్లో ఉద్యోగం చేసేవారు కూడా పల్లెలలో వుండి ప్రతిరోజూ వెళతారు. అంటే అక్కడ రోడ్లు, ట్రాన్స్ పోర్టు సదుపాయాలున్నాయి. కార్లు చవక, పెట్రోలు చవక. ఇక్కడ కారులలో వెళ్ళే సదుపాయం మధ్యతరగతి వారికి లేదు కనక రోడ్లు బాగుచేయించి బస్సులు ఉదయం, సాయంత్రం ఎక్కువ సంఖ్యలో వేయాలి. ప్రతి గ్రామానికి ఒక మంచి స్కూలు, ఆస్పత్రి వుంటే జనం వారంతటవారే వస్తారు. జనం వుంటే షాపులు యితర వర్తకులు వారే చేరతారు. రైతుల బాధలు, రుణాలు, పంటకి తగిన ధర గిట్టుబాటు వంటి వాటిపట్ల ప్రభుత్వం శ్రద్ధ తీసుకోకపోతే కొన్నాళ్ళకి పండించే రైతులే మిగలరు. భూములు తెగనమ్మి పట్టణాలలో కూలిపనికి పోయే జనం రోజురోజుకీ ఎక్కువవుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తిండిగింజ లేక కరువవుతాయి. ఇదంతా మన ముఖ్యమంత్రిగారికి తెలియదనికాదు. గత ఏడాదిగా ఈ వూర్లో వుండి తెల్సుకున్న కొన్ని విషయాలు ఇవి. నాకు ఈ గ్రామం దత్తత తీసుకునే స్ఫూర్తినిచ్చిన ముఖ్యమంత్రిగారికి, అన్ని సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వాధికారులకి, ప్రజలకి, అందరికీ నా వందనాలు.
ఈ గ్రామం నాది. వీళ్ళు నా వాళ్ళు అని గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఇంకా ఈ గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానని సభాముఖంగా తెలియచెపుతున్నాను" చప్పట్లు ఆగకుండా కొట్టారు జనం.
ముఖ్యమంత్రి లేచి షేక్ హేండ్ యిచ్చారు. ఆయన మైకు ముందుకు రాబోతుంటే రాజేశ్వరి లేచి-
"ఒక్క నిముషం సార్" అంటూ మైక్ ముందుకు వచ్చింది.
"మేము అమెరికా నుంచి వచ్చేముందు మా శ్రీవారి నిర్ణయం విని భయపడ్డాను, గాభరా పడ్డాను. అమెరికాలో సుఖాలు, భోగాలు వదిలి, ఈ దేశం వచ్చి పల్లెటూరిలో వుంటానంటున్న ఆయన నిర్ణయాన్ని హర్షించలేకపోయాను. ఎన్నో అడ్లు చెప్పాను. కాని ఆయన వేటికీ చలించక, నన్ను నమ్మించి, తీసుకొచ్చి చూపించి యిక్కడ వుండడానికి ఒప్పించి ఒక సంవత్సరం చూద్దాం. నచ్చకపోతే వెళ్ళిపోదాం అని అంగీకరింపచేశారు. ఆయన మాట కాదనలేక వచ్చిన నేను ముందు యిల్లు చూసి సగం కుంగిపోయాను. తరువాత ఆయనతోపాటు వూరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాను. చిత్రంగా నాకు తెలియకుండానే యీ వూరిలో ఒకరినైపోయి, యిక్కడి వారితో కల్సిపోయి ఆయన సలహాతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంలో జారిపోయాను. ఇప్పుఉద్ నాకు అమెరికా జ్ఞాపకం రావడంలేదు. అక్కడి సుఖాలు గుర్తుకురావడం లేదు. ఈ వూరు నాది, ఈ దేశం నాది, ఈ ప్రజలు నావారు అన్న భావన వచ్చింది. మంచిపని చేసినప్పుడు దొరికే తృప్తి ఎంతటి ఆనందాన్నిస్తుందో అనుభవపూర్వకంగా తెల్సుకున్నాను. పరోపకారం చేసినప్పుడు కలిగే ఆనందం, గర్వం ఎంతటిదో అర్ధమైంది. నిస్వార్ధంగా మంచి పనులు చేయడంలో దొరికే తృప్తి ఏ డబ్బూ, సిరిసంపదలు, సుఖభోగాలు యివ్వలేవని అన్నింటిని మించిన తృప్తి పరులకి సాయపడ్డం అన్నది తెల్సుకున్నాను. నన్ను ఒప్పించి, నచ్చచెప్పి తీసుకొచ్చిన ఆయనకి నేను యిప్పుడు రుణబడ్డానన్న భావం కలుగుతుంది. ఇక్కడికి రాకపోతే జీవితంలో నేను ఏం కోల్పోయానో ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయేదాన్ని. ఈ అవకాశం నాకిచ్చిన డాక్టరుగారికి, మమ్మల్ని ప్రోత్సహించిన ఈ వూరి ప్రజలకి, దీనికి భీజం వేసిన ముఖ్యమంత్రిగారికి నా నమసుమాంజలులు. ఇందు మూలంగా స్త్రీలందరికీ, భార్యలందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే! మీ భర్త ఏదన్నా మంచి పని చేసేందుకు ముందుకువస్తే అడ్డుపుల్లలు వేయకండి. ఇలా ఎవరన్నా గ్రామాలలో వుండడానికి ముందుకువస్తే నిరుత్సాహపర్చకండి. మీరు చేయూతనిచ్చి, ఆ ఆనందం ఎలా వుంటుందో అనుభవించండి అని చెప్తున్నాను" రాజేశ్వరి మాట్లాడుతుంటే వూరంతా చప్పట్లు కొట్టారు.
ముఖ్యమంత్రి అభినందిస్తున్నట్లు చూశారు.
"నాకూ ఒక్క నిముషం కావాలి సార్" ముఖ్యమంత్రిని ఉద్దేశించి విక్రమ్ మైకు ముందుకు వచ్చాడు.
"ఈ రోజు యిక్కడ జరుగుతున్నది చూస్తుంటే వళ్ళు పులకరిస్తుంది. ఏదో ఎమోషన్ తో మాట్లాడుతున్నాననుకోకండి. మా నాన్నగారు చేపట్టిన ఈ కార్యక్రమాలు చూశాక ఆయన జన్మే కాదు, వారికి పుట్టినందుకు మా జన్మలూ సార్థకమయ్యాయి అనిపిస్తుంది. అమెరికా నుంచి నాన్నగారు వస్తానన్నప్పుడు మేము నిరుత్సాహపరిచయం, వెనక్కి లాగాం. కాని ఆయన ధృడ నిశ్చయంతో యిక్కడికి రాకపోయి వుంటే ఈ గొప్ప అనుభూతి మాకు దక్కేది కాదు.
గత వారంరోజులుగా ఈ వూర్లో ఉండి మేం అనుభవించిన మాధుర్యం "జన్మభూమిశ్చ సర్గాదపి దద్గతే" అన్నది అర్థం అయింది. భారతదేశం మా జన్మభూమి కాదు. కాని మేం భారతీయులం. మా తాత ముత్తాతల వూరు ఇదే. మాకే యింతటి మమకారం వారం రోజులకే కల్గితే యిక్కడ పుట్టి పెరిగిన మా నాన్నగారికి ఈ గ్రామంతో ఎంతటి అనుబంధం వుంటుందో అర్ధం అయింది. నేనూ మా నాన్నగారిని, ఆయన సాధించినదానికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మా నాన్నగారి "దత్తపుత్రిక" అయిన ఈ గ్రామం ఆయన తదనంతరం "అనాధ"గా మిగలనీయనని నేను ప్రమాణం చేస్తున్నాను. నా బరువు బాధ్యతలు నెరవేర్చుకుని నాన్నగారి తదనంతరం ఈ వూరు వచ్చివుంటానని నలుగురి ఎదుట తెలియచేస్తున్నాను.