"మీ ప్రయత్నం అంతా వృధా అయిందని అసలే మీరు విచారిస్తున్న వేళ పానకంలో పుడకలాగా నేనొచ్చాను. మీరు కరాటేలో ఎర్రబెల్టు సంపాదించి వున్నారు....
"... రెడ్ బెల్టుకాదు బ్రౌన్ బెల్టు." మధ్యలో అడ్డుతగిలి దీక్ష చెప్పింది.
"అదేలేండి ఏదో ఒక బెల్టు. అది సంపాదించారు కదా! మీరు చెప్పిన మంచిమాటలు ఎవరికీ ఎక్కలేదు. మీరు మంచి పని చేస్తానంటే ఎవరికీ నచ్చలేదు. మీ ప్రదర్శన చూశారు. మీరు చెప్పింది విన్నారు, ఏం లాభం? మీ శ్రమ బూడిదలో పోసిన పన్నీరులా అయింది. మీరా బాధలో వుండగా నేను జోక్స్ వేయటం తప్పా తప్పున్నరా..."
"ఆగండాగండి! నేను బాధలో వున్నానని ఎవరు చెప్పారు?" దీక్ష అడిగింది.
"పని గట్టుకుని ఎవరూ చెప్పలేదు. నేను గ్రహించాను. నేను కూడా చాలాసార్లు మంచి పనులు చేయబోయాను. ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ బాధ ఎంత తీవ్ర ఆవేదనకి గురి చేస్తుందో అనుభవపూర్వకంగా నాకు తెలుసు."
"బాధపడేటంత నిరాశలో నేను లేను. నాకింకా ఆశవుంది.'
"మీ నమ్మకం ఫలించాలని మంచి మిత్రుడిగా హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను. పైగా మీ పేరులోనే బలంవుంది."
"ఈ సంగతంతా ఎవరు చెప్పారు?"
"మీరు నాకుకూడా పాంప్లెట్లు యిచ్చారు. అయితే యిది పురుషులకి కాదు అన్నారు. మీ కరాటే ప్రదర్శన చూడటం, స్పీచ్ వినటం నిషిద్ధం కావచ్చు. ఎందుకంటే ఆహ్వానం స్త్రీల కని మాత్రమే వుంది. నేను మీ గురించి మొత్తం తెలుసుకున్నాను. ఆనోటా ఆనోటా. ఇది తప్పుకాదుగా!"
"తప్పే"
"తప్పా!"
"తప్పా తప్పున్నరా! నా అనుమతి లేకుండా నా గురించి తెలుసు....."
"తప్పెలా అవుతుంది! మీరు పాంప్లెట్ లో వేయించాల్సింది. నా అనుమతి లేనిదే నా గురించి ఎవరు తెలుసుకోరాదని." నవ్వుతూ అన్నాడు పృధ్వీరాజ్.
"నేను పంచిన పాంప్లెట్ లో రాతలకన్నా మీ మాటలు బాగున్నాయి." దీక్ష నవ్వుతూ అంది.
"థాంక్స్!" అన్నాడు పృధ్వీరాజ్.
"కాఫీ కలుపుకు వచ్చాను."
"ఇప్పుడు వద్దులేండి."
"అదేమి తాగరా! నేను కూడా తాగొచ్చుకదా మీకు ఓ కప్పు కాఫీ యిచ్చి.... అని ఆశపడ్డాను."
"నిజం చెప్పమంటారా?"
"చెప్పండి."
"నేను కాఫీ ప్రాణినే. మీ చేతి కాఫీ తాగాలనికూడా వుంది. మీకు శ్రమ అని.... ఇప్పుడు వద్దులేండి అన్నాను." సిన్సియర్ గా ముఖంపెట్టి చెప్పాడు పృధ్వీరాజ్.
దీక్ష నవ్వుతూ లేచి లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటిలోనే కాఫీ కలుపుకుని వచ్చింది. ఒకటి పృధ్వీరాజ్ కిచ్చి తనొకటి తీసుకుంది.
"కాఫీ చాలా బాగుంది." సిప్ చేస్తూనే చెప్పాడు పృధ్వీరాజ్.
"మామూలుగానే కాఫీ తయారు చేశాను. అమృతం కలపలేదు."
"అఫ్ కోర్స్! ఇచ్చింది మీరు కదా!"
దీక్ష పెదవి బిగింపులో చిరునవ్వు చిందించి మిన్నకుండి పోయింది.
నెమ్మదిగా కాఫీ సిప్ చేస్తూ ఆలోచనలో పడిపొయ్యారు.
'పృధ్వీరాజ్ చూపుల్లో కల్మషం ఉండదు. కూర్చునే తీరు మన్ననగా వుంటుంది. నడక చూడబోతే రారాజులా నడుస్తాడు. కావాలని నటిస్తాడో అమాయకతో వుత్త బబ్లూలగా ముఖం పెడతాడు. మాటలు తడుముకోడు. చనువుగా జోక్స్ పేలుస్తూ ఆత్మీయతతో దగ్గర స్నేహుతుడిలాగా అనిపిస్తాడు....'
దీక్ష ఇటు కాఫీ తాగటం పూర్తిచేసి అటు ఆలోచన చాలించి చూసే సరికి పృధ్వీరాజ్ వినయంగా కూర్చుని వున్నాడు. "మీరు మీరు... మాట్లాడకుండా అలా కూర్చున్నారేమిటి?" కంగారు కప్పి పుచ్చుకుంటూ అడిగింది.