Previous Page Next Page 
అహల్య పేజి 41


    'ఇప్పుడు కాకున్నా ఎప్పటికయినా నువ్వు ఆ ఇనకుల తిలకుడి పాదాక్రాంతుడివి కాకపోతే...'


    'నారదా!' గర్జించాడు రావణుడు. 'వైరి వీరులను పాదాక్రాంతులను చేయడం తప్ప, శత్రువుల శిరస్సులతో బంతాడటం తప్ప తుచ్ఛప్రాణాల కోసం శాత్రవ పాదాభివందనం ఎరుగడు ఈ రాక్షసేశ్వరుడు'


    నారదుడు మళ్ళీ నారాయణ స్మరణం కావించాడు 'నారాయణ! నారాయణ! ఇక నేను పోయి వత్తునా రావణా!'


    తర్జనితో దారి చూపుతూ నీదే ఆలస్యం అన్నట్లు చూశాడు రావణుడు.


    'తెలియని వారికి తెలియ చెప్పవచ్చు. తెలిసిన వారికి మరింత తెలియ చెప్పవచ్చు. కానీ తెలిసీ తెలియని మూర్ఖులకు తెలియ చెప్పడం ఈ బ్రహ్మ మానస పుత్రుడి తరంకాదు సరికదా! ఆ బ్రహ్మ తరం కూడా కాదు' అంటూ నిష్క్రమించాడు నారదుడు.


    అలా వెళుతున్న దేవర్షినే చూస్తూ ఉండిపోయాడు రావణుడు. అతని మనస్సులో ఏవేవో ఆలోచనలు. ఒక్కసారిగా ఆలోచనలను పారద్రోలి... శివస్తుతి చేయసాగాడు రావణుడు.


    శివనామ స్మరణతో అతని మనసు క్రమ క్రమంగా శాంతి చెందసాగింది. తిరిగి ఎప్పటిలాగే తన స్థిర చిత్తంతో పంచాక్షరి మంత్రం జప పరాయణుడయ్యాడు రావణుడు.


                                       28


    ఇంద్రుడు మందాకినిలో ఇంద్రాణితో విహరించి వచ్చాక శచీదేవి తన అంతఃపురం వైపు నడిచాక ఇంద్రుడొక్కడే తన భవనంలో ఒంటరిగా ఉన్న వేళ- ఇంద్రసఖి అక్కడికి మలయ మారుతంలా విచ్చేసింది.


    ఇంద్రసఖిని చూడగానే ఇంద్రుడికి ఉద్వేగం ఎక్కువైంది. ఏమేమో అడగాలని అనుకున్నాడు. కానీ ఆగలేక ఆపలేని తమకంలో తన మనసంతా ఆమె ముందు విప్పి అహల్యా సందర్శనానికి ఏర్పాటు చేయమని అడగాలనుకున్నాడు. మదిలో మెదిలే అన్ని ఆలోచనలూ ఒక దానిని ఒకటి తొందరించి ఏమీ అడగలేకపోయాడు.


    'ప్రభూ! వినయ విధేయతా పూర్వకంగా పిలిచింది ఇంద్రజ. ఏమిటన్నట్లు తలాడించాడు ముల్లోకాల ఏలిక.


    'ప్రభూ తమరిక్కడ యిలా విరహంతో వేగిపోతూ ఉండండి. అక్కడ కాలం గడిచిపోతూ ఉంటుంది. కాల ప్రవాహంలో కొట్టుకునిపోయే ఆ మానవులు మానవ సహజమైన మరుపుతో అన్నీ మర్చిపోతారు.


    అక్కడి ఆచారం ప్రకారం పెళ్ళయిన యువతికి అత్తవారిల్లే స్వర్గం. తమరు స్వర్గానికి రప్పించుకుందామనుకున్నా, స్వర్గ సుఖాలు అందిస్తామనీ ఉవ్విళ్ళూరించినా అవన్నీ అడవి కాచిన వెన్నెలే అయిపోతాయి.


    బ్రహ్మ కూర్చిన భర్తతో, బ్రహ్మ రాసిన బ్రతుకుతో సర్దుకునిపోయే ఆ స్త్రీలు సర్వం పతిదేవుడే అనుకుంటారు. పతియే ప్రత్యక్ష దైవం. కన్నవారికన్నా కట్టుకున్నవారే మిన్న. అతనితో జీవితమే కైవల్యం. అదే వైకుంఠం. ఆ ఇల్లే కైలాసం. సర్వం సంసారమే అనుకుంటారు వాళ్ళు. అది వారి ధర్మం. అది వారి నీతి. అది వారి నియమం. ఈ లోకానికీ ఆ లోకానికీ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత వ్యత్యాసం ఉంది. అందుకు వారిని తప్పుపట్టనవసరం లేదు. అది వారి జీవన రీతి'


    ఇంద్రుడు నిట్టూర్చాడు. లోక లోకానికీ ఒక నీతి ఉంటుంది. ఏ లోకం జీవన శైలి ఆ లోకానిది. ఒక దానితో మరొక దానికి పోలికేమిటి? స్వర్గలోక జీవన విధానం కైలాసంలో ఉంటుందా? అక్కడ కట్టే వస్త్రాలూ, తాగే అమృతం, ధరించే నగలూ...


    అక్కడ రమ్మంటే ఎలా వస్తాయి? కైలాసంలో విభూది వారికి విభూతి. అదే వారికి ఐశ్వర్యం. ఆ శివుడికి పాములే ఆభరణాలు. యముడి సామ్రాజ్యం గురించి అనుకోవడం ఎందుకూ?


    స్వర్గంలో కేరింతలు వినిపిస్తూ ఉంటాయి. నరకంలో ఎప్పుడూ అక్కడ హాహాకారాలు! ఆక్రోశాలూ! ఆక్రందనలూ! శోకాలూ!


    మరి భూలోకం విషయాలే వేరు. ఇంద్రుడి మనస్సులో తారాడుతున్న అభిప్రాయాలను పరేంగితజ్ఞలా కనుగొన్నదా అన్నట్లు అంది ఇంద్రసఖి.


    'అవును ప్రభూ! భూలోకంలో విషయాలే వేరు. వారి జీవిత కాలం పరిమితం. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం వారి జీవితాలను పాలించి చివరికి వారిని మృత్యువు నోట నెడతాయి.


    మనం అలా కాదు. మనం త్రిదశులం. మనం ఎప్పుడూ ముప్పది ఏండ్ల వయసులోనే ఉంటాం.


    మనకు అమృతపానం వలన వార్ధక్యం లేదు. మరణం లేదు. జరణమరణ బాధలననుభవించే మానవులు వారేది అనుభవించినా ఆనందించినా ఆ వృద్ధాప్యం వారిని ఆక్రమించుకుని, శరీరాన్ని లొంగదీసుకునే దాకానే.


    ఆ జర ప్రాప్తిస్తే యింకేం ఉంది? నవ యవ్వనంతో మిసమిసలతో అంగాంగపు పొంగులతో అలరించిన సౌందర్యం కాస్తా తొలగిపోతుంది. కేశ సంపద తన వైభవం కోల్పోయి ఫలితమవుతుంది. అంతవరకూ అందాన్నిచ్చిన అందాల పలు వరుస జారి భ్రష్టమై ఊడిపోయి నోరు బోసి నోరవుతుంది. యవ్వన సంపద తన ప్రౌఢణు కోల్పోయి మెత్తబారి జారి- ముడతలు పడుతుంది. నడుం వంగిపోతుంది. మందగమనంతో మందగించిన నడక ఇక శాశ్వతంగా మందగించి కుంటుబడుతుంది. ఊతలేనిదే నడవలేని స్థితి వస్తుంది.

    
    మిల మిల మెరిసే కనులలో కాంతి నశించిపోతుంది. చూపు తగ్గిపోయి అంధత్వం సంక్రమిస్తుంది. నిరాశా నిస్పృహలకు లోనై- నిరాదరణ పాలై- మరణం కోసం నిరీక్షిస్తారు సామాన్య జనం' ఆగింది ఇంద్రజ.


    అదంతా వినగానే ఇంద్రుడుకి మనస్సంతా చేదు తిన్నట్లయింది. అమృతం తాగిన నోట హాలాహలం చిందినట్లయింది. భూలోక జీవనం ఇలా ఉంటుందా? అప్పుడెప్పుడో యుగ యుగాల లక్షణాలు చెపుతూ కలియుగ లక్షణాలను వర్ణించారు మహర్షి. అంత భయంకరంగా ఉంది ఈ వర్ణన.

 Previous Page Next Page