"ఏం అర్ధంకాలేదా -గీత ప్రభాకరం ప్రేమికులని - ఇద్దరూ విచ్చల విడిగా తిరిగారని, గీతకి బిడ్డపుట్టాడని చెప్పావు యిదంతా నిజం అని చెప్పించగలవా అతనిచేత?" మరింత తీక్షణంగా అడిగాడు - సరోజ మొహం పాలిపోయింది. ప్రభాకరం నమ్మలేనట్టు సరోజవంక చూశాడు. సరోజ వెర్రిదానిలా చూస్తూ - "నేను - నేను చెప్పానా" అంది.
"ఏం అప్పుడే నీళ్ళు నములుతున్నావు - అదంతా అబద్దమని తేలిపోతుందని భయమా - గీత నీకేం అపకారం చేసిందని ఉత్తి పుణ్యానికి యిలాంటి అబద్దాలు కల్పించావు. నాకాబోయే భార్య గురించి యింతనీచంగా కల్పించి చెప్పడానికి నీకెంత ధైర్యం" తీక్షణంగా అన్నాడు. సరోజ నల్లబడిన మొహంతో అయోమయంగా చూసింది. ప్రభాకర్ సరోజవంక ఆశ్చర్యంగా చూసాడు. ఆమె మొహం పాలిపోవడం జవాబు చెప్పలేక తత్తరపడడం చూసాడు.
"ఆగండి సరోజ చెప్పిందానిలో ఒక్క అక్షరం అబద్దంలేదు. ఆమెని అనవసరంగా ఏమీ అనకండి." తీక్షణంగా అన్నాడు ప్రభాకరం.
"ఓహో...అయితే ఆమె చెప్పింది నిజమని మీరు రుజువు చెయ్యగలరా" హేళనగా అన్నాడు. ప్రభాకరం తిరస్కారంగా, వ్యంగ్యంగా గీతవంక చూశాడు. గీత బెదురు చూపులు చూస్తూంది.
"ఋజువులు, సాక్ష్యాలు ఎందుకు -ఎదురుగా మనిషే వుందిగా, చెప్పమనండి ఆమెని. ఆవిడ నేను ప్రేమించుకోడం అబద్దమో, మేం యిద్దరం విచ్చలవిడిగా తిరగడం అబద్దమో, ఆమె గర్భం దాల్చిందన్న అనుమానం రాగానే తండ్రికి చెప్పి పెళ్ళికి వప్పిస్తానని చెప్పడం అబద్దమో - ఆ తండ్రి నన్ను అనరాని మాటలని అవమానపరిచి పొమ్మనడం అబద్దమో - మరో వూరు వెళ్ళి కూతురు మచ్చ కడిగేసుకుని ఆ కన్నబిడ్డని విసిరేసి - మళ్ళీ కన్యగా మీతో పెళ్ళికి సిద్ధపడడం అబద్దమో - ఇందులో ఏది అబద్దమో ఆవిడనే అడగండి" ఆవేశంగా ఒక్కొక్క మాట వత్తి పలుకుతూ కసిగా అన్నాడు ప్రభాకరం. కృష్ణమోహన్ కళ్ళు మెరిశాయి ఆ మాటలు వినగానే - గీత కోపం పట్టలేక "అబద్దం, అంతా అబద్దం - నమ్మకు మోహన్ యీ మాటలు - ఆ సరోజ యీ ప్రభాకరం యిద్దరూ తోడు దొంగలు" అరిచింది వణికిపోతూ.
"హా...అబద్దం...అవును నీ ప్రేమ అబద్దం - కానీ నీకు బిడ్డపుట్టడం అబద్దంగాదని సాక్ష్యం చెప్పడానికి మ అక్కవుంది. ఆ రోజు ఆమెనిచూసి మీరు పరిగెత్తడం కూడా అబద్దం అనగలవా - నీ ఉత్తరాలు నీ ఫోటో యివన్నీ నా దగ్గిరున్నాయి యింకా గీతా. తప్పు ఒప్పుకో. అంతేకాని యింకా బుకాయించాలని చూడకు. కృష్ణ మోహన్ గారూ మీకు కావలిస్తే ఆ ఉత్తరాలు చూపగలను...." స్థిరంగా అన్నాడు. నిజంగా ఉత్తరాలు ఎప్పుడో చింపేసినా ఆ క్షణంలో అబద్దం ఆడక తప్పలేదు అతనికి.
ఉత్తరాలు అనగానే ముందు గీత పట్టుబడిన దొంగలా తడబడిపోయింది. తరువాత ఆవేశంతో ఆమె గుండె ఎగిరిపడింది. కోపం పట్టలేక ఈడ్చి ప్రభాకరం చెంపమీద కొట్టింది "నీచుడా, నన్ను ప్రేమించానని కల్లబొల్లికబుర్లు చెప్పి నమ్మించి మోసగించి పెళ్ళి పేరెత్తేసరికి నా ఖర్మాన నన్ను వదిలేసి వెళ్ళిపోయి దగాచేసిన వాడిని, నా జీవితం నాశనం చేసింది చాలక మళ్ళీ యిప్పుడుకూడా నా బ్రతుకు బండలు చెయ్యాలని చూస్తున్నావా" మళ్ళీ చెయ్యి ఎత్తి కొట్టబోయింది ప్రభాకరం చటుక్కున ఆ చేయి పట్టుకున్నాడు చురుగ్గా-"ఏమిటీ నిన్ను నేను మోసం చేశానా నీవు నన్ను మోసంచేశావా? నాలాంటి బీదవాడు మీకు తగడనుకుని యింటికి పిలిపించి అవమానించి పంపించాడు మీ నాన్న..."
"అబద్దం" గట్టిగా అరచింది గీత మధ్యలోనే. "డాడితో మాట్లాడడానికి యింటికి రమ్మంటే మళ్ళీ కనిపించకుండా వూరువదలి పోయావు పిరికివాడిలా. నా జీవితంలోంచి అప్పుడు వెళ్ళిపోయినవాడివి మళ్ళీ యిక్కడికి దాపురించి నన్నెందుకిలా వెంటాడుతున్నావు" గీత గొంతు వణికింది.
ప్రభాకరం ఆశ్చర్యంగా "గీతా, నన్ను మీ నాన్న అవమానించి పొమ్మన్న సంగతి నీకు తెలియదా" అన్నాడు అనుమానంగా చూస్తూ "ఆ రోజు నీవు రమ్మన్న వేళకి వచ్చాను. నీవు లేవన్నారు. నన్ను నా తాహతేమిటో అంతస్థేమిటో ఆలోచించుకో నీవెక్కడ గీతెక్కడ. యీ యింటి గుమ్మం తొక్కే అర్హత నీకు లేదు. మళ్ళీ కనిపిస్తే చూడు అని నానామాటలు మీనాన్న అన్న సంగతి నీకు తెలియదా" గీత ఆశ్చర్యంగా చూసింది నమ్మలేనట్టు కృష్ణమోహన్, సరోజ ఆశ్చర్యంగా వింటున్నారు,
"నిజం గీతా, కావలిస్తే మీ నాన్నని అడుగు" ప్రభాకరం ఆవేశంగా అన్నాడు. "రా...నిజం మీ నాన్న చేత చెప్పిస్తాను....కృష్ణమోహన్ గారూ సరోజ చెప్పిందానిలో అబద్దం ఏం లేదని యిప్పటికయిన నమ్ముతారా. గీతా ఏం రమ్మంటావా..." అన్నాడు ప్రభాకరం. గీత ఏం మాట్లాడాలో తెలియనట్లు ఆలోచిస్తూంది. అంతా బయటపడ్డాక యింక బెదిరేందుకు ఏముంది. కృష్ణమోహన్ కి ఎలాగో తెలిశాక యింక దేనికి భయం? యింక యీ పెళ్ళి ఎలాగూ జరగదు. గీతలో మొండి ధైర్యం ప్రవేశించింది.
"గీతా, నిజా నిజాలు మీ నాన్నగారిని అడిగితే తెలుస్తుంది. దానికింత ఆలోచన ఎందుకు?" గాభీరంగా అన్నాడు కృష్ణమోహన్ గీత ఒకసారి అందరివంక చూసి మాట్లాడకుండా నడవడం ఆరంభించింది. కారు దగ్గర కెళ్ళి లోపల కూర్చుంది.
"నేను యింటికి వెళతాను ఏ రిక్షాలోనో" సరోజ నెమ్మదిగా అంది. కృష్ణమోహన్ కాదనపోయి మళ్ళీ ఆలోచించి "సరే" అన్నాడు. ముగ్గురూ ఎక్కిన కారు కదిలింది.