Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 42


    అప్పలమ్మ వెళ్ళగానే "అవ్వ! ఇదేమిటిరా. మీ రిద్దరూ యిలా నలుగురి నోళ్ళలోనూ పడ్డారా?" నీవు తిట్టడం, కొట్టడం ఏమిటి? తను చావడానికి మందు మింగడం ఏమిటి? ఏమిటిరా యీ గొడవ? మన పరువేమిటి? మర్యాదేమిటి? ఇలా ఊరువాడా చెప్పుకునేటట్లు తయారయ్యారా! మతి పోయిందేమిటి నీకు కూడా-"
    ఆవిడకి కోడలు ఆత్మహత్య తలపెట్టడం కొడుకు కాపురంకంటే యీ గొడవలవల్ల తమ వంశానికి వచ్చే అప్రతిష్ట ఎక్కువగా కనపడింది.
    "అసలేమిటి మీమధ్య గొడవలు! ఎందుకొచ్చాయి? నీవు కొట్టేవరకు ఎందుకెళ్ళావు?" నిలేసింది ఆవిడ కొడుకుని.
    "కొత్తగా వచ్చిన గొడవేమిటి-పాతవే. కట్నాలు, కానుకలు గొడవే. అవే అలా అలా పెరిగాయి" విసుగ్గా అన్నాడు శివరాం. అతనికీ వ్యవహారం అంతా తలనొప్పిగా తయారయింది.
    "బాగుందిరా! ఏదో పెళ్ళిలో ఏదో అనుకుంటాం. దానికోసం కాపురాలు పాడు చేసుకుంటారా ఎవరైనా?" సాగదీసింది ఆవిడ.
    శివరాంకి నీర్సంమీద బక్క కోపం వచ్చింది."మీ ఆడవాళ్ళకి రెండు నాలుకలుంటాయి. ఈ గొడవలన్నీ ఆరంభించిందీ, నా మనసు విరిచిందీ మీరే. ఈవెధవ ఆడవాళ్ళ గొడవలతో నా బుర్ర పాడుచేశారు అందరూ కల్సి. పైగా యిప్పుడు నన్నంటావేం?" తల్లిమీద చూపించాడు ఆకోపం.
    "అయితే నీ పెళ్ళాన్ని కొట్టు, తిట్టు అని మే మే చెప్పామా ఏమిటి? ఏదో అనుకున్నవి పట్టుకుని కాపురం పాడుచేసుకుని మామీద విరుచుకుపడతావేం! అంత పెళ్ళాం అంటే అభిమానం వున్నవాడివయితే మా మాటలు ఎందుకు లెక్క చేస్తావు?" ఆవిడ అంతకంటే తీక్షణంగానే అంది.
    "అవునవును. అందరూ నన్నే అనండి. తప్పంతా నాదే." ఉక్రోషంగా అన్నాడు.
    బాగుంది గొడవ! అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు తిడితే కొడితే పడతారా-ఏదో కొన్ని విషయాలు చూసి చూడనట్లు వూరుకోవాలిగాని, తెగేవరకు లాక్కుంటారా? ఇప్పుడు చూడు మనం వాళ్ళకి ఎంత లోకువ అవుతామో-తప్పు మనదయింది. పిలిస్తే వాళ్ళదే పైచేయి అయి, నానా మాటలు అంటారు. మీ నాన్నగారికి తెలిస్తే ఏమిటి గొడవలు మన పరువేంగాను అని తిడ్తారు. రేపు పొద్దున నలుగురికి ఈ వ్యవహారం తెలియకముందే, అందరినోళ్ళల్లో పడక ముందే శారదని రమ్మని ఉత్తరం రాయడం మంచిది. ఆలోచించు."
    శివరాం మాట్లాడలేదు. మామూలుగా ఎప్పుడూ ఏదో అన్నట్టే తనన్న మాటలని పట్టుకుని శారద యింత తెగిస్తుందని, ఎదురుచూడని అతనికి ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్ళాక ఏం చెయ్యాలో అర్ధంగాని విషయం అయింది. ఛా...యింత గొడవ జరుగుతుందని తెలిస్తే...అనుకున్నాడు విసుగ్గా. ఆలోచన తోచలేదు.
    రెండు రోజులు పత్యం తిన్నాక మర్నాడు ఆఫీసుకి వెళ్ళడానికి నిశ్చయించాడు శివరాం.
    "మరయితే. రేపు నేను బయలుదేరి వెళ్ళిపోతారా శివా!" అంది ఆ సాయంత్రం సరస్వతమ్మ.
    శివరాం గతుక్కుమన్నాడు. ఇన్నాళ్ళు యింట్లో తల్లి వుండబట్టి శారద లేని లోటు అర్ధంగాలేదు. రేపటినించి యింట్లో ఎలాగ!
    "అదేమిటమ్మా అప్పుడే వెళ్ళిపోతావా? కొన్నాళ్ళుంటావనుకున్నాను" బేలగా అన్నాడు.
    "ఎలా వుంటానురా. అక్కడ యిబ్బందిగదూ?"
    "ఇబ్బంది కేముంది? అక్కడ వంటావిడ వుందిగా నీవు చేసేది ఏముంది? కొన్నాళ్ళు వుండమ్మా!"
    "బావుందిరా! వంటావిడ వుంటే మటుకు నాసంసారం యిల్లువాకిలి చూచుకోవద్దూ! కమలకి పరీక్షల రోజులు కూడా...మీ నాన్నగారు విసుక్కుంటారు వుండిపోతే" అందావిడ.
    శివరాంకి ఇంకేమనాలో తోచలేదు. "నీ ఇష్టం" అన్నాడు మొహం మాడ్చుకుని.
    "నే వెళ్ళగానే మీ నాన్నచేత మీ మామగారికి రాయిస్తాలే శారదని పంపమని ఆ-రాక ఎక్కడికి పోతుందిలే! మొగుడు పెళ్ళాం కోపాలు ఎన్నాళుంటాయి!" మాడిపోయిన కొడుకు మొహం చూసి ఓదార్పుగా అందావిడ.
    
                                                                 *    *    *
    
    "మిస్టర్ శివరాం! ఇది ప్రైవేట్ ఫరమ్ అని - ఇందులో పనిచేసేవారిని మూడు నెలల నోటీసుతోగాని, మూడు నెలల జీతంతో గాని ఉద్యోగంలోంచి తీసేహక్కు ఉన్నదని నీకు తెలుసను కుంటాను..." అధికారి గంభీరంగా అన్న మాటలు శివరాంకి అర్ధం బోధ పడీ పడక గంభీరంగా వున్న ఆయన మొహం చూసి శివరాం గతుక్కుమన్నాడు.
    వారం రోజుల శలవు తర్వాత తొమ్మిదో రోజు పనిలోకి రాగానే పై అధికారినించి రమ్మన్న కబురు అందుకోగానే ఎందుకోనని, శలవు గురించి అడుగుతాడు కాబోలని అనుకుని వెళ్ళాడు శివరాం కాస్త జంకుతూనే-వెళ్ళగానే ఆఫీసరు ఉపోద్ఘాతం లేకుండా అన్నమాటలు వినగానే కలవరపడిపోయాడు.
    "ఎస్ సార్!" అనగలిగాడు అతి ప్రయత్నంమీద.
    "మిస్టర్ శివరాం! నీ ప్రవర్తన సరిగా లేని కారణంగా నీ ఉద్యోగం టెర్మినేట్ చేస్తూ నీకు మూడు నెలల జీతం ఇచ్చి నిన్ను ఉద్యోగం నించి తొలగిస్తున్నాను" మరింత గంభీరంగా అన్నాడు అధికారి.
    శివరాం మొహం నల్లగా మాడిపోయింది. హఠాత్తుగా అనుకోని సంఘటనతో అతను పిడుగు పడ్డవాడిలా నిశ్చేష్టుడయి నోట మాట రాక గుడ్లప్పగించి చూడసాగాడు. తనని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. అంటే ఉద్యోగం పోయింది. వెయ్యి రూపాయలొచ్చే ఉద్యోగం పోయింది. ఇప్పుడేం చేసేట్టు-హఠాత్తుగా మళ్ళీ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? దొరికినా ఎన్నాళ్ళు తిరగాలి. ఏడాదిపాటు ఎంత ప్రయత్నిస్తే యీ ఉద్యోగం దొరికింది. ఇప్పుడిది పోతే?-శివరాంకి భయంతో చెమట పట్టింది. "సార్!" నిర్జీవంగా అన్నాడు. "సార్!"మీ కెవరు చెప్పారో ఏం చెప్పారో కానీ అంతా అబద్దం సార్! నా పని గురించి కావలిస్తే నా ఇమీడియట్ బాస్ ని అడగండి. మరెవరినైనా కొలీగ్స్ ని అడగండి. నా డ్యూటీ నిర్వహణలో లోపం ఎన్నడూ చెయ్యలేదు. ఈ శలవైనా విపరీతంగా జ్వరం వచ్చి పెట్టాను. కావలిస్తే డాక్టర్ సర్టిఫికెట్ తెస్తాను" మాటల కోసం తడుముకుంటూ సంజాయిషీ యీయసాగాడు.

 Previous Page Next Page