అధికారి అటుచూడకుండా ఏవో కాగితాలు చూస్తూ "నీ డ్యూటీ గురించి అపనమ్మకంతో నిన్ను డిశార్జి చేయడం లేదు...."
శివరాంకి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. "మరి?"ఆశ్చర్యంగా అడిగాడు.
"నీవు నీ భార్యని హింసిస్తున్నావని, ఆమెని భార్యగా మర్యాదగా చూడటం లేదని నీ భార్య స్వయంగా వచ్చి కంప్లయింట్ చేసింది."
శివరాం మొహం ఎర్రబడిపోయింది. ఆఫీసరు చెప్పిన కారణం వినగానే తలకొట్టేసినట్లు అవమానం పొందాడు. ఈ శారద కెంత సాహసం. ఆఫీసరుతో కంప్లయింట్ చేస్తుందా? కోపంతో మొహం జేవురించింది. కాస్త ధైర్యం తెచ్చుకుని "సార్, అది నాపర్సనల్ మాటర్" అన్నాడు కాస్త పౌరుషంగా.
ఆఫీసరు తలెత్తి శివరాం వంక సూటిగా చూశాడు.
"అవచ్చు, కాని నీ మోరల్స్ ప్రిన్సిపల్స్ కాండక్టుతో మాకుపని వుంది. చదువుండి సంస్కారంలేని, ఇల్లాలిని హింసించే అనాగరికుడు, కుసంస్కారి మా కంపెనీలో పనిచేయడం మా కంపెనీకే అవమానం. మా కిష్టంలేని వారిని పనిలోంచి తీసివేసే అధికారం మాకుంది. ఇంక నీవు వెళ్ళవచ్చు" గంభీరంగా మూడునెలల జీతం, కాగితం ముందుకు జరిపాడు అధికారి.
"మిస్టర్ శివరాం! వన్ మోర్ థింగ్! ఇంతేగాదు. ఇంకా నీ భవిష్యత్తులో యింకే ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగం దొరకకుండా నిన్ను బ్లాకులిస్టు చేయగలను. నా పరపతి వుపయోగించి నాతోటి ఫరమ్స్ కి సర్కులర్ పంపగలను."
ఆ దెబ్బతో శివరాం జావగారిపోయాడు. ఏదో అనబోయేంతలో అధికారి ఒక కాగితం ముందుకు జరిపి "ఎవదర్ థింగ్. ఆ కాగితం ఒకసారి చూడు. ఆ కాగితం నేను పోలీసులకి హేండోవర్ చేస్తే నీగతి ఏమిటవుతుందో నేను చెప్పనక్కరలేదనుకుంటాను. నీభార్య ఆత్మహత్యచేసుకుంటూ తనని భర్త హింసిస్తున్న కారణంగా ఆత్మహత్యకి తలపడ్డానని రాసినది. పోలీసులకిస్తే నీమీద క్రిమినల్ కేసుపెడ్తారు. నీ భార్యకీశిక్ష పడుతుంది. అప్పుడు నీ పరువు ప్రతిష్ట నీ జీవితం ఏమవుతుందో ఆలోచించు..."
శివరాం నిస్సహాయంగా చూస్తూ తలదించుకున్నాడు. ప్రాధేయపడి ఆయన్ని ప్రసన్నుడిని చేసుకోవడం మినహా మరో గత్యంతరం లేదని అర్ధం చేసుకున్నాడు.
"సార్. ఇకపై ఇలాంటివి జరగవని హామీయిస్తాను. మీ ఆర్డర్ ఉపసంహరించుకోండి సార్! ప్రాధేయపూర్వకంగా అన్నాడు.
అధికారి కరగనట్టుగా గంభీరంగా చూసి "ఆర్డర్ యిచ్చాక కాన్సిల్ చేసుకోడం సామాన్యమైన విషయం గాదు. ఆర్డర్ ఉపసంహరించుకోవాలంటే నీవు వ్రాత మూలకంగా ఇకపై అలా జరగదని హామీయివ్వాలి. నీ భార్యని క్షమాపణకోరి తిరిగి ఆమెను తెచ్చుకున్నాక నీ ప్రవర్తన సరిగా వున్నట్టు నీ భార్య సంతకంతో ఉత్తరం జతపరచి అప్లికేషన్ పంపుకో, కమిటీ మీటింగ్ లో నీ కేసు పెట్టి దరఖాస్తు స్వీకరించేది లేనిది తేలుస్తాం. నౌ యూ కెన్ గో." అంటూ ఆఫీసరు ఓ ఫైలు లాక్కున్నాడు.
శివరామ్ నీళ్ళు నమిలాడు. "సార్. కానీ ఆమె ఎక్కడుందో నాకు తెలియదు. పుట్టింటికి వెళ్ళివుంటుంది. ఆమె రావడానికి ఆలశ్యం..."
"ఆమె ఎవరో డాక్టర్ విజయ అన్న ఆమెతో వచ్చింది. ఆమెదగ్గరికి వెళ్ళి వాకబుచెయ్యి..."
శివరామ్ నమస్కరించి, అవమానంతో కృంగిపోయినవాడిలా భారంగా అడుగులువేస్తూ వచ్చాడు. ఆఫీసులో ప్రతివాళ్ళు తననేచూస్తున్నట్లు అనిపించి అందరివంకా చూడలేనట్టు తలదించుకున్నాడు. ఓ హంతకుడిలా కొందరు చూస్తే, సానుభూతి చూపెడ్తున్నట్లు కొందరు చూశారు. చెవులు కొరుక్కున్నారు. శివరాం ఆ వాతావరణం భరించలేక ఎవరివంకా చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా గబ గబ బయటపడ్డాడు.
ఆలోచిస్తుంటే అతని వళ్ళు ఆవేశంతో దహించుకుపోసాగింది. ఈ శారద ఎంత పనిచేసింది. తననెలాంటి చిక్కుల్లో పడేసింది! దీనికంత ధైర్యం ఎలా వచ్చింది. ఆ డాక్టరుగాని నేర్పి పెట్టిందా? అతని వళ్ళు వుడికిపోయింది. ఏదో చెయ్యాలని కసిగా వుంది. గాని ఏం చెయ్యగలడు? పోతున్నాను అంటూ పోయిన భార్యని ఏ మగాడు మాత్రం ఏం చెయ్యగలడు? బలవంతంగా ఇంటికి తీసుకొస్తే మాత్రం ఎన్నాళ్ళు వుంచగలడు? అసలు ఉద్యోగానికే ఎసరు పెట్టిందే పోతేపోయిందీ వెధవ ఉద్యోగం అని లెక్క చెయ్యకుండా ఆ శారద రోగం కుదిరిస్తే బాగుండు? కాని ఎలా? ఉద్యోగం లేకుండా ఎలా? మరెవరూ కూడా ఉద్యోగం యీయకుండా చేస్తానని బెదిరించాడు? ఉద్యోగంమాట అటుంచి ఊర్లో అంతా ఏం అంటారు? పెళ్ళాం లేచి పోయిందంటే ఎంత అప్రతిష్ట? తమ పరువేంగావాలి! ఇప్పటికే అంతా తనని ఖూనీకోరుని చూసినట్టు చూస్తున్నారు. ఇరుగింటి పొరుగింటి వాళ్ళంతా మొహంమీదే శారద ఏది ఎందుకెళ్ళిపోయింది అని అడిగేస్తున్నారు. పాలవాళ్ళు, కూరలవాళ్ళు పనిమనిషి ప్రతీవెధవా అడిగేవాడు! ఇదంతా అలా వుంచి ఇంట్లో ఎంత ఇబ్బందిగా వుంది! శారద వుండగా ఏం తెలీలేదుగాని ప్రతీదానికి తడుముకున్నట్టే వుంది. పెళ్ళి కాకముందు ఏమోగాని ఒకసారి ఇల్లాలు అంటూ వచ్చాక ఇల్లాలులేని ఇంట్లో ఎంత ఇబ్బంది! ఛా ... పరిస్థితి ఇలా తయారవుతుందంటే, శారద ఇంతకి తెగిస్తుందంటే, కాస్త జాగ్రత్తగా వుండే వాడు? ఇప్పుడేం చెయ్యాలి. "నలుగురిలో తలెత్తుకోవాలంటే, ఉద్యోగం నిలబడాలంటే, శారదకి క్షమాపణ చెప్పుకోవాల్సిందేనా." ఆ మాట తలచుకోగానే అతని పురుషాహంకారం అడ్డు నిలిచింది. ఎంతసేపు ఆలోచించినా అంతకంటే గత్యంతరం కనపడలేదు.
* * *


