Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 41


    కాసేపటికి వాళ్ళ అబ్బాయివచ్చి "అప్పలమ్మకి జ్వరమటండీ. రాలేనంది. నాన్నగారు ఈ మాత్రతో హార్లిక్స్ తాగమన్నారు. డాక్టరుగారు కాసేపట్లో వస్తారుట" అని హార్లిక్స్ ఇచ్చి వెళ్ళాడు!
    హార్లిక్స్ తాగాక కాస్త ఆకలి ఉపశమించింది శివరాంకి. కణతలు బద్దలయి పోతూంటే అమృతాంజనం రుద్దుకున్నాడు. అప్పుడే అప్రయత్నంగా క్రితంసారి జ్వరం వచ్చి నప్పుడు నానా హడావిడి చేసి శారద చేత సేవలు చేయించు కుంటూ అంత చేస్తున్నా కసురుకుంటూ, ఇది సరిగా లేదు, అది బాగుండలేదు అని తిట్టడం గుర్తువచ్చి అతనికి తెలియకుండానే నిట్టూర్పు వదిలాడు.
    పనిమనిషైనా రాలేదు, యిన్ని కాఫీనీళ్ళు తెచ్చిపెట్టడానికి. ఈ జ్వరం ఎన్నాళ్ళకి తగ్గుతుందో! మూర్తిగారు ఎన్నాళ్ళు చేస్తారు? ఏం చెయ్యడం అతని సమస్య అది.
    డాక్టరు వచ్చేసరికి జ్వరం 104 డిగ్రీలుంది. డాక్టరు ఇంజక్షను మందులు రాసిచ్చి ఈ జ్వరం ఎటుతేలేది మరో రోజయినా పోతేగాని చెప్పలేనని వెళ్ళాడు.
    'చాలా జ్వరమే. ఏంచేస్తారు యిప్పుడు. ఇంట్లో ఎవరూ లేరు. వంటరిగా కాఫీ అయినా యిచ్చేవారు లేకుండా ఎలా వుంటారు.' మూర్తిగారు ఆరాతీశారు.
    శివరామ్ ప్రశ్నఅదే! "మీ ఆవిడపేర టెలిగ్రాం ఇమ్మన్నారా ఇంతకీ ఆవిడ ఎక్కడికి వెళ్ళారు?"
    "తెలీదు. ఇంకెక్కడికి వెడుతుంది. పుట్టింటి కెళ్ళి ఉంటుంది."
    "అయితే టెలిగ్రాం యిస్తాను ఎడ్రసు యివ్వండి."
    తనని కాదని అంత అహంకారంతో వెళ్ళిపోయిన భార్యని యింత వెంటనే ప్రాధేయపడుతున్నట్టు రమ్మనడానికి శివరాంకి అహం అడ్డువచ్చింది. నీవు నా మొగుడివే కాదన్న దాన్ని. తను లెక్క కానట్టు పోయినదానిని తనే పిలవడమా? ఆత్మాభిమానం అంగీకరించలేదు. మొగుడంటే ఏమిటో తెలియ చెప్పాలి. పుట్టింట్లో వుండి బుద్ది వచ్చి తన దగ్గిరకి తప్పయిందంటూ ప్రాధేయపడ్తూరావాలి తనే. అంతేగాని ఇప్పుడు తను పిలిస్తే ఇంక తన మీద ఇంకేం గౌరవం భయం భక్తి వుంటాయి? లోకువయిపోడూ! ఇంక తన మాట లెక్క చేస్తుందా! శివరాం మనసులో అలజడి ఇది. అంత సుళువుగా భార్యముందు తేలికయిపోవడానికి అతని పురుషాహంకారం అడ్డు వచ్చింది. కాని ఇంట్లో ఎలా? అమ్మకి టెలిగ్రాం ఇచ్చి రమ్మంటే,  ఆ ఆలోచనరాగానే ప్రాణం లేచి వచ్చింది.
    అమ్మవస్తే, ఈ జ్వరం తగ్గాక, తరువాత సంగతి తరువాత... వెంటనే "మా అమ్మకి టెలిగ్రాం ఇస్తాను, ఆవిడ వస్తారు. కాస్త టెలిగ్రాం పంపించండి," అంటూ ఎడ్రసు చెప్పాడు శివరామ్.
    మూర్తిగారు ఏదో చెప్పబోయి విరమించుకుని అడ్రసు తీసుకు వెళ్ళిపోయారు.
    
                                          *    *    *
    
    శివరామ్ తల్లి మర్నాడు సాయంత్రానికి వచ్చింది. జ్వరంతో వళ్ళెరగకుండా పడుకున్న కొడుకుని, నిర్మానుష్యంగా వున్న ఇంటిని చూసి-
    "ఇంత జ్వరమే! శారద ఏదిరా?" అందావిడ ఆశ్చర్యంగా.
    శివరాం తల్లినించి చూపులు తప్పించి "లేదు" అన్నాడు ముభావంగా.
    "అదేమిటి, ఎక్కడికెళ్ళింది?" మరింత ఆశ్చర్యంగా అడిగింది సరస్వతమ్మ.
    "తెలీదు...." గొణిగాడు శివరాం.
    ఈ సారి ఆవిడ మరింత తెల్లబోయింది. "తెలీక పోవడం ఏమిటి? నీవింత జ్వరంలో పడుంటే ఎక్కడికి వెళ్ళింది?"
    శివరాం జవాబివ్వలేదు.
    కొడుకు వరస చూసేసరికి ఆవిడకి అనుమానం వచ్చింది. ఇంకా ఏదో జ్వరం అని కొడుకు చూడాలని ఉండి టెలిగ్రాం ఇచ్చి వుంటాడని అనుకుందావిడ. కాని ఇక్కడి పరిస్థితి చూస్తే వళ్ళెరగకుండా పడుకున్న కొడుకు. ఇంట్లో శారదలేదు. కాఫీ ఇచ్చే దిక్కన్నా లేదని తనని పిలిపించాడని తెలుసుకుంది ఆవిడ.
    "ఏం జరిగిందిరా-నిన్నిలా వదిలేసి ఎలా వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది. పుట్టింటికా?" కాస్తతీవ్రంగా అడిగింది.
    "ఏదో...ఏదో మాట మాట అనుకున్నాం. కోపం వచ్చి వెళ్ళిపోయింది" శివరాం చెప్పలేక చెప్పలేక ఏదో గొణిగాడు.
    "అయితే ఇలాంటి స్థితిలో నిన్నొదలి వెళ్ళిపోతుందా? మొగుడు పెళ్ళాం అన్నాక ఏదన్నా అనుకోరూ? అంత మాత్రానికి యిల్లు వదిలి పోతుందా?" తీక్షణంగా అంది.
    "హు? బాగుంది వరస. మొగుడిమీద అలిగి పుట్టింటికి పోయిందన్న మాట. చూద్దాం ఎన్నాళ్ళుంటుందో?" ఆవిడ పౌరుషంగా కోడల్ని నిందించింది.
    "అందుకే తనకి టెలిగ్రాం యివ్వకుండా నీ కిచ్చాను..." నీర్సంగా అన్నాడు శివరాం.
    తల్లి ఏమంటుందోనని భయపడ్డ శివరాం తల్లి తన పక్షం మాట్లాడడంతో నిశ్చింతగా నిట్టూర్పు వదిలి అప్పటికి ఆ గండం గడిచినందుకు సంతోషించాడు.
    శివరాం జ్వరం ఆరోజురోజుగాని తగ్గలేదు. ఏడోరోజు పత్యం తిన్నాడు. ఆరోజే అప్పలమ్మ జ్వరం తగ్గి పనిలో ప్రవేశించింది. అప్పలమ్మద్వారా కోడలు ఆత్మహత్య తలపెట్టడం, కొడుకు కోడలు తగువులాటల వివరాలు. కోడలు యింట్లోంచి పోవడం అన్నివింది సరస్వతమ్మ.

 Previous Page Next Page