Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 42


                                   గురువుకు గురువు

    అపారమైన భక్తితో అమూల్యమైన యోగవిద్యను గురుదేవునికి సమర్పించిన రాజయోగి కేశిధ్వజుడు. కేశిధ్వజుడు రాజర్షియైన జనక చక్రవర్తి వంశంలో జన్మించాడు. అసమానమైన ప్రతిభతో ఆత్మజ్ఞానం సంపాదించాడు. నిస్తులమైన నియమంతో యోగవిద్య గ్రహించాడు. అవక్రమైన పరాక్రమంతో శత్రురాజులను జయించాడు. ప్రజలందరికీ శాంతిసౌఖ్యాలు ప్రసాదించాడు.
    కేశిధ్వజుని అన్న పేరు ఖాండిక్యుడు. ఖాండిక్యుడు సమస్త ధర్మాలూ సమగ్రంగా గ్రహించిన విజ్ఞానవేత్త. ఖాండిక్యుడికి రాజ్యభోగాలమీదకన్నా ధర్మకర్మలమీదనే ఎక్కువ మక్కువ ఉండేది. అందువల్ల అతడు ఎప్పుడూ యజ్ఞయాగాలతో దాన ధర్మాలతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు.
    అన్నదమ్ములిరువురూ మిథిలా రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నారు. అయినా ఖాండిక్యుడు భోగ భాగ్యాలవైపు మనస్సు పోనిచ్చేవాడు కాదు. అది చూచి శౌర్యధర్యుడైన కేశిధ్వజుడు అన్నయైన ఖాండిక్యుడి రాజ్యం మీద దండయాత్ర చేశాడు. ఖాండిక్యుడు రాజ్యమంతా కోల్పోయి విశ్వాసపాత్రులైన మంత్రులతో అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అతని రాజ్యాన్ని ఆక్రమించుకొని కేశిధ్వజుడు సువిశాలమైన మహాసామ్రాజ్యానికి చక్రవర్తియైనాడు. ఖాండిక్యుడు నిర్విచారంగా దైవధ్యానం చేస్తూ ముక్తి మార్గం వెదుకుతూ కానన మధ్యంలో కాలం గడుపుతున్నాడు.
    కొంతకాలానికి కేశిధ్వజుడు మిథిలా పట్టణంలో ఒక గొప్ప యజ్ఞం చేయాలని తలపెట్టాడు. క్రతుకలాపానికి కావలసిన ప్రయత్నం పూర్తిచేశాడు. భూమిని దున్నించాడు. హోమగుండాలు తీయించాడు. పెద్ద పెద్ద పందిళ్లు వేయించాడు. సమస్త వస్తువులూ సమకూర్చుకున్నాడు. బుత్విక్కులను పిలిపించాడు. పండిత వర్యులను ఆహ్వానించాడు. బంధుమిత్రులను రావించాడు. ప్రజలందరికీ తెలియపరచాడు. యజ్ఞదినం సమీపించింది. కానీ సరిగా ఆ రోజునే ఒక అనిష్టం సంభవించింది. అరణ్యప్రాంతంలో పచ్చిక మేస్తున్న యజ్ఞధేనువు పులి వాతబడి చచ్చిపోయింది. అందువల్ల క్రతుకలాపానికి ఆటంకం కలిగింది. దురదృష్టవశాత్తూ ఆ విధంగా ఆవు మరణించినందుకు దుఃఖపడ్డాడు కేశిధ్వజుడు.
    "యజ్ఞధేనువు చనిపోవటం మహా దోషం. అందువల్ల యజ్ఞకర్తకు భయంకరమైన నరకం ప్రాప్తిస్తుంది." కేశిధ్వజునికి ఏం చేయటానికి పాలుపోలేదు. అతని హృదయం చాలా ఆందోళన పడింది. వెంటనే ఆయన శాస్త్రవేత్తలైన పండితులను సమావేశపరచాడు. యజ్ఞధేనువు మరణించినందుకు ప్రాయశ్చిత్తం చెప్పమని ప్రార్థించాడు. కానీ పండితులెవ్వరికీ ఆ ధర్మసూక్ష్మం అర్థంకాలేదు. మహారాజు వివిధ శాస్త్రవిశారదుడైన శౌనక మహర్షిని ప్రార్థించాడు. శౌనక మహర్షి కొంచెంసేపు ఆలోచించి "రాజేంద్రా! ఈ భూమండలంలో కర్మకాండ బాగా తెలిసిన మహాపండితుడు ఖాండిక్యుడొక్కడే! అతనిని అడిగితే ఈ గోవధకు తగిన ప్రాయశ్చిత్త కర్మం ఉపదేశిస్తాడు. నీ యజ్ఞం నిర్విఘ్నంగా నెరవేర్చుకోవచ్చు. నీవు విరోధభావాన్ని విస్మరించి వినీత వేషంతో ఖాండిక్యుణ్ణి సందర్శించు. ఆచార్యభావంతో ఆరాధించు. అతడు నిన్ను శిష్యవాత్సల్యంతో చేరదీస్తాడు. నీకు ధర్మమార్గం నిర్దేశిస్తాడు. వెంటనే వెళ్లి అతనిని ఆశ్రయించు." అని ఆదేశించాడు.
    ఆ మాటలు పాటించి వెనువెంటనే కేశిధ్వజుడు ఖాండిక్యుణ్ణి కలుసుకోవడానికి కాననాలకు బయలుదేరాడు. కాని శత్రురాజు సమక్షానికి అతడు ఒంటరిగా వెళ్ళటానికి అమాత్యులు అంగీకరించలేదు. మంత్రులు కేశిధ్వజుణ్ణి చూచి "మాహారాజా! ఒక్క మనవి. మనచేత పరాజితుడై అరణ్య భూములకు పారిపోయిన ఖాండిక్యుడు పగబట్టిన త్రాచుపాము వంటివాడు. ఇప్పుడు మీరు నిస్సహాయంగా అతని దగ్గరకు వెళ్ళటం చాలా ప్రమాదకరం." అని పలికారు.
    కేశిధ్వజుడు నిర్భయంగా "అలా కాదు అమాత్యులారా! మీరు అపోహపడుతున్నారు. ఉదారహృదయుడైన ఖాండిక్యుడు విజ్ఞానార్థినై వెళుతున్న నన్ను తప్పకుండా విశ్వసిస్తాడు. అపారమైన ప్రేమతో ఆదరిస్తాడు. ఇప్పుడు నేను అతనిని గురుదేవునిగా భావిస్తున్నాను. గురుని మీద అవిశ్వాసం ప్రకటించడం అనుచితమైన విషయం. అందువల్ల నేను అతని దగ్గరకు నిర్భయంగా వెళ్ళివస్తాను. అతడు ఔదార్యభావంతో ప్రాయశ్చిత్త మార్గం ప్రదర్శిస్తే నా అభీష్టం ఫలిస్తుంది." అన్నాడు.
    కేశిధ్వజుడు వినీత వేషంతో జింకచర్మం కప్పుకొని, లేడి కొమ్ములు పట్టుకొని ఖాండిక్యుడి దర్శనం కోసం అరణ్యంలోకి వెళ్ళాడు. అనతి దూరంలోనే అతనిని చూచి ఖాండిక్యుడి మంత్రులు అతడు తమ రాజును హతమార్చటానికే అటువస్తున్నాడని అపోహపడ్డారు. ఒంటరిగా చిక్కిన ఆ తుంటరిని చంపి పగదీర్చుకోవాలని భావించారు. వెంటనే వాళ్లు ధనుర్బాణాలు ధరించి యుద్ధానికి సిద్ధమైనారు.
    కేశిధ్వజుడు అల్లంతదూరంలో యుద్ధసన్నద్ధులైన శత్రువీరులను చూచి "అమాత్యులారా! అలా సంభ్రమ పడకండి. ఇక్కడికి నేను విరోధభావంతో రాలేదు. విద్యార్థినై వచ్చాను. నా యజ్ఞధేనువు అరణ్యమధ్యంలో పులివాతబడి మరణించింది. అందువల్ల నా యజ్ఞకర్మకు విఘ్నం కలిగింది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తవిధి తెలుసుకోవాలని నేను ఇక్కడకు వచ్చాను. ఆర్యఖాండిక్యుని సమక్షంలో ఆవిధి విధానం గ్రహించి రమ్మని శౌనకమునీంద్రుడు ఆదేశించాడు. అందుకోసమే ఇక్కడికి వచ్చాను." అని పలికాడు. కాని అమాత్యులు ఆ మాటలు విశ్వసింపలేదు. వాళ్లు ఖాండిక్యుణ్ణి చూచి "మహారాజా! ఈ నక్కవినయాలను నమ్మకండి. ఇతడు మనకు ఆగర్భశత్రువు! అన్యాయంగా మనరాజ్యం అపహరించి మనలను కట్టుబట్టలతో కానలకు పంపిన కరుణా రహితుడు. ఈ కేశిధ్వజుడు ధర్మమర్మాలు గ్రహించటానికే వచ్చాడట! ఎంత అసంగతమైన విషయం! ఆజ్ఞాపించండి ప్రభూ! ఒక్కడై చిక్కిన ఈ పాపాత్ముని పరిమార్చి స్వరాజ్యం సంపాదించుకుందాము." అని పలికారు ఉద్రేకంగా.
    మంత్రుల మాటలు విని ఖాండిక్యుడు ప్రశాంతంగా "ఆవేశపడకండి అమాత్యులారా! మీరు చెప్పినట్లు ఈ కేశిధ్వజుణ్ణి పరిమార్చటం మహాపాపం! ధర్మవిరుద్ధమైన ఈ ఘోరకార్యం మన్నించరాని మహాపరాధం! నిరాయుధుడై నిస్సహాయంగా వచ్చిన శత్రురాజును సంహరించటం న్యాయం కాదు. చంపదగిన శత్రువు చేజిక్కినపుడు మన్నించి విడవటం మహోదాత్తమైన మానవధర్మం. అదీకాక అతడు పూర్వవైరాన్ని పాటించకుండా పరమపావనమైన గురుభావంతో నా దగ్గరకు వచ్చాడు. సాధువేషంతో మన సన్నిధికి చనుదెంచాడు. అందువల్ల మనం అతనిని సగౌరవంగా సత్కరించాలి! అతని క్రతువు సఫలం కావడానికి ప్రాయశ్చిత్తం ఉపదేశించాలి." అని పలికాడు.

 Previous Page Next Page