Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 43


    ఇంతలో కేశిధ్వజుడు చనుదెంచి వినయ వినమ్ర భావంతో ఖాండిక్యుని పాదపద్మాలకు నమస్కరించాడు. ఖాండిక్యుడు ఆదరంగా అతనిని కౌగిలించుకొని కుశల ప్రశ్నలతో గౌరవించాడు. అనంతరం ఖాండిక్యుడు కేశిధ్వజుడికి శాస్త్రోక్తమైన ప్రాయశ్చిత్తం ఉపదేశించాడు. ధర్మమార్గం సూచించాడు. క్రతువిధానం వివరించాడు. యజ్ఞకర్మ నిర్విఘ్నంగా నెరవేరాలని దీవించాడు. కేశిధ్వజుడు ఖాండిక్యుడి దగ్గర శలవు దీసుకొని తన పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు.
    రాజధానిలో కేశిధ్వజ మహారాజు సక్రమంగా క్రతుకార్యం నిర్వహించాడు. ఋత్విజులకూ పండితులకూ సముచితంగా దక్షిణలిచ్చి సన్మానించాడు. పేదసాదలకు పుష్కలంగా ధనధాన్యాలు దానం చేశాడు. యజ్ఞం జయప్రదంగా పూర్తి అయింది. కానీ కేశిధ్వజుడికి మాత్రం ఏదో అసంతృప్తిగా ఉంది. అతని మనస్సులో ఏదో అర్థం కాని ఆందోళన బయలుదేరింది. ఆలోచించగా అతనికి తన అశాంతికి కారణం గోచరించింది.
    "తాను ఖాండిక్యుడు చూపిన ధర్మమార్గంలో నిర్విఘ్నంగా యజ్ఞం నిర్వహించాడు. ఖాండిక్యుడు తన పాపానికి ప్రాయశ్చిత్తం ఉపదేశించిన గురుదేవుడు! తాను ఖాండిక్యుడికి ప్రియశిష్యుడు! అందువల్ల అతనికి తప్పకుండా గురుదక్షిణ సమర్పించాలి! విద్యాభ్యాసం తరువాత తగిన గురుదక్షిణ సమర్పించటం శాస్త్ర సమ్మతమైన సంప్రదాయం. కనుక ఖాండిక్యుణ్ణి దర్శించి ఆయన కోరిన కానుక సమర్పించి రావాలని నిశ్చయించుకున్నాడు కేశిధ్వజుడు. వెంటనే అతడు రాజవేషంతో రథారూఢుడై గురుదేవుడైన ఖాండిక్యుడి దగ్గరకు బయలుదేరి వెళ్ళాడు.
    అరణ్యంలో ఖాండిక్యుడి అనుచరులు ధనుర్బాణాలు ధరించి వస్తున్న కేశిధ్వజుణ్ణి చూచి చాలా ఆందోళన పడ్డారు. "చూశారా ప్రభూ! పాముకు పాలుపోసి పెంచినా విషం విరగదంటారు! అలాగే దుర్మార్గుడైన ఆకేశిధ్వజుడు దుష్టబుద్ధితో ఇక్కడకు వస్తున్నాడు. ఆ విరోధిని విశ్వసించగూడదు. అతడు మొన్న ముని వేషంలో వినీతుడై వచ్చాడు. ఇప్పుడు వీరవేషం ధరించి ప్రభువులను పరిమార్చటానికి బయలుదేరాడు. కృతఘ్నుడు! లేవండి ప్రభూ! యుద్ధానికి సిద్ధంకండి." అని పలికారు అమాత్యులందరూ.
    మంత్రుల మాటలు విని ఖాండిక్యుడు మౌనంగా ఒక్క మందహాసం చేశాడు. అంతలో కేశిధ్వజుడు ఖాండిక్యుణ్ణి సమీపించి సవినయంగా అతనికి ప్రదక్షిణం చేసి ప్రణామం కావించాడు. "గురుదేవా! మీరు నాకు జ్ఞాన భిక్ష ప్రసాదించారు. ధర్మమార్గం ప్రదర్శించారు. మీ దగ్గర నేను ధర్మరహస్యం గ్రహించాను. మీ అనుగ్రహం వల్ల ప్రాయశ్చిత్తం చేసి పాపం పరిహరించుకొన్నాను. నా యజ్ఞం నిరాటంకంగా నెరవేరింది. అందువల్ల మీరు నాకు ఆచార్యులైనారు! ఇంతవరకూ మీకు గురుదక్షిణ ఇవ్వకపోవటం వల్ల నా మనస్సంతా అశాంతిగా ఉంది. ఇప్పుడు మీరు కోరిన దక్షిణ సమర్పించాలని నేను మీ సన్నిధికి వచ్చాను. నా కోరిక మన్నించి మీ అభీష్టం తెలియజేయండి." అని వేడుకున్నాడు కేశిధ్వజుడు.
    ఆమాటలు వినగానే ఖాండిక్యుడు విస్మయ విభ్రాంతుడైనాడు. అతడు చిరునవ్వు నవ్వుతూ మంత్రులవంక చూచాడు. మంత్రులు "మహారాజా! మనం ఈ సదవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి! పూర్వం ఈ కేశిధ్వజుడు శౌర్య గర్వంతో మిమ్మల్ని జయించి మీ రాజ్యం అపహరించాడు. ఇప్పుడు మళ్ళీ మీకు సామోపాయంతో సమస్తరాజ్యాన్నీ సంపాదించుకొనే చక్కని అవకాశం వచ్చింది. అందువల్ల మీరు కేశిధ్వజుని సమస్త సామ్రాజ్యమూ గురుదక్షిణగా పుచ్చుకోండి." అని విన్నవించుకొన్నారు.
    కాని ఖాండిక్యుడు దాని కంగీకరించలేదు. "అమాత్యులారా! నాకు సామ్రాజ్యపాలన మీద కాంక్షాలేదు. రాజ్యభోగాలకై ఆకాంక్షా లేదు. నేనెప్పుడూ విరక్తిభావంతో ముక్తిదాయకమైన యోగశక్తినే అభిలషిస్తూ ఉంటాను. అందువల్లనే ఆనాడు కేశిధ్వజుడు నన్ను సులభంగా జయించి నారాజ్యం ఆక్రమించుకున్నాడు. వీరాధివీరులైన మహారాజులకు రాజ్యవిస్తరణం విధ్యుక్తధర్మం. ఆ ధర్మానికి అనుగుణంగానే కేశిధ్వజుడు సర్వరాజులనూ జయించి సార్వభౌముడైనాడు. అందువల్ల పవిత్రమైన ఆ క్షత్రియధర్మాన్ని నేను గౌరవిస్తాను. ఆ శౌర్యసంపదను నేను అభినందిస్తాను. ఇప్పుడు గురుదక్షిణ నెపంతో అతని రాజ్యం అపహరించటం ధర్మసమ్మతం కాదు. అట్లాచేస్తే అన్యులరాజ్యాన్ని అర్థించి తెచ్చుకున్నానన్న అపకీర్తి మాత్రమే నాకు వస్తుంది. అందువల్ల నేను కేశిధ్వజుడి సామ్రాజ్యాన్ని గురుదక్షిణగా కోరలేను." అని తన అభిప్రాయం తెలిపాడు ఖాండిక్యుడు.
    ఖాండిక్యుడు మంత్రుల మాటలు మన్నించలేదు. అతడు కేశిధ్వజుణ్ణి చూచి "రాజా! నీ గురుభక్తి తత్పరతకు నేను పరమానందం పొందాను. నీవు సమర్పించే పారితోషికం నేను సంతోషంగా స్వీకరిస్తాను." అని పలికాడు.
    కేశిధ్వజుడు ఆనందంతో "మహాప్రసాదం. గురుదేవా! మీకు గురుదక్షిణగా ఏం కావాలో ఆజ్ఞాపించండి. వస్తువాహనాలు వాంఛిస్తారా? ధనకనకరాసులు అర్థిస్తారా? భూమండలం కాంక్షిస్తారా? సామ్రాజ్యపాలనం స్వీకరిస్తారా? మీ అభీష్టం ఏమిటో అడగండి. సంతోషంగా సమర్పిస్తాను." అని గురుదేవునితో మనవి చేసుకున్నాడు.
    ఖాండిక్యుడు మధురంగా మందహాసం చేస్తూ "రాజేంద్రా! ఆ ధనకనకాలతో నాకు పనిలేదు. రాజ్యభోగాలతో నాకు అవసరం లేదు. అంతకంటే అమూల్యమైన దక్షిణ నిన్ను అడగదలచాను. నీవు యోగవిద్యాప్రవీణుడవు విజ్ఞాన పారీణుడవు! శాస్త్ర కోవిదుడవు! ఆత్మజ్ఞానివి! అందువల్ల నిన్ను నేను అమూల్యమైన విద్యా ధనం గురుదక్షిణగా కోరుతున్నాను. నీవు నాకు "యోగవిద్య" ప్రసాదించు. ముక్తిమార్గం ప్రదర్శించు. అదే నా అభీష్టం" అని పలికాడు.
    ఖాండిక్యుడి మాటలు విని కేశిధ్వజుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఖాండిక్యుడు గురుదక్షిణగా తన ఐశ్వర్యమంతా అడుగుతాడనుకున్నాడు కేశిధ్వజుడు. కాని ఖాండిక్యుడు జ్ఞానభిక్ష కోరుకున్నాడు. కేశిధ్వజుడు ఆశారహితుడైన ఖాండిక్యుణ్ణి చూచి "మహానుభావా! మీ విచిత్రకాంక్ష నాకు విస్మయం కలిగిస్తున్నది. మీరు భోగభాగ్యాలు వాంఛించకుండా ఈ యోగవిద్య కోరుకున్నారు. సురక్షితమైన సామ్రాజ్యం కంటే సుక్షత్రియులు కోరదగినదే లేదే! మరి మీరు ఇలా ఎందుకు అడిగారా అని నాకు ఆశ్చర్యంగా ఉంది." అన్నాడు.
    ఖాండిక్యుడు గంభీరమైన కంఠంతో "రాజా! ఇందులో ఆశ్చర్యం ఏముందీ? నీవు తలచిన ఆ భోగభాగ్యాలు అస్థిరమైనవి. ఆ రాజ్యవైభవాలు అశాశ్వతమైనవి. ఆ సిరిసంపదలవల్లనే అహంకారం తల ఎత్తుతుంది. అజ్ఞానం అధికమవుతుంది. ఆ భాగ్యాలన్నీ ఎప్పటికైనా ఇతరుల చేతులలో పడిపోక తప్పదు. అన్ని ధనాలకన్నా అమూల్యమైనది విద్యాధనం. దానిని దొరలు దోచుకోలేరు. దొంగలు ఎత్తుకుపోలేరు. అందువల్లనే నేను నిత్య సత్యమైన జ్ఞానధర్మాన్ని కోరుకున్నాను. సౌఖ్యకారకమైనదీ, ముక్తిదాయకమైనదీ, విముక్తి ప్రాయకమైనదీ జ్ఞానం ఒక్కటే! జ్ఞానవంతుడైన మానవుడికి పరమశాంతి లభిస్తుంది. పరమానందం సిద్ధిస్తుంది. అందువల్ల అశాశ్వతమైన రాజ్యభోగం కన్నా శాశ్వతమైన జ్ఞాపసంపదనే నేను అమూల్యంగా భావించాను. మహత్తరమైన యోగవిద్యనే నాకు గురుదక్షిణగా ప్రసాదించమని కాంక్షిస్తున్నాను." అని తన అభిప్రాయం వివరించాడు.
    కేశిధ్వజుడు ఆనందపరవశుడై ఖాండిక్యుడికి 'యోగవిద్య' ఉపదేశించాడు. ఆత్మజ్ఞానం అందించాడు. ఆ విద్యాప్రభావం వల్ల ఖాండిక్యుడికి పరమశాంతి లభించింది. అతని మనస్సు మహాదేవుని మీద లగ్నమైంది. ప్రశాంతమైన ఆ వనాంతరంలో, అఖండమైన ఆనందంతో పరమేశ్వరధ్యానం చేసుకుంటున్నాడు ఖాండిక్యుడు. కేశిధ్వజుడు గురుదేవునికి గురుదేవుడై కృతార్థుడైనాడు. అతడు సంతుష్టహృదయంతో ఖాండిక్యుడి దగ్గర సెలవుదీసికొని మిథిలా నగరానికి ప్రయాణమైనాడు.

                                                                   *  *  *  *

 Previous Page Next Page