Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 41


    ఆ మాటలు వినగానే నేను అదిరిపడ్డాను. నా అహంకారం అంతరించి పోయింది. నా ఆగ్రహం చల్లారిపోయింది. నేను శాంత స్వరంతో "క్షమించు తల్లీ! నీ ప్రభావం తెలుసుకోలేక తొందరపడ్డాను. నీ మహత్వం గుర్తించలేక నిన్ను నిందించాను. నీవు మహా పతివ్రతవని గ్రహించలేకపోయాను. అయినా అక్కడ కొక్కెర భస్మమైపోయిన సంగతి నీకెలా తెలిసిందీ? అటువంటి దివ్యదృష్టి నీకెలా గలిగిందీ? నీవు ఏం తపస్సులు చేశావు? ఏం వ్రతాలు పట్టావు?" అని అడిగాను.
    అందుకా ఇల్లాలు మందహాసం చేస్తూ "స్వామీ! నేను ఏ తపస్సులూ చేయలేదు. ఏ వ్రతాలూ చేపట్టలేదు. నా ధర్మాన్ని మాత్రం నెరవేరుస్తున్నాను. దైవస్వరూపుడైన నా పతిదేవునికి పరిచర్యలు చేస్తున్నాను. నాకు పతికన్నా మించిన దైవం లేదు. పతిభక్తి కన్నా పరమ వ్రతం లేదు. నాకు సర్వస్వమూ నా పతి దేవుడే! పతిభక్తి మహత్వం సర్వశక్తులనూ సంపాదిస్తుంది. పతిభక్తి ప్రభావం వల్లనే నాకీ ఆత్మశక్తీ దివ్యదృష్టీ కలిగాయి." అని సమాధానం చెప్పింది.
    అప్పుడు నాకు ఒక సందేహం కలిగింది. "అయితే ఈ విధంగా స్వధర్మం నిర్వహించుకుంటూ ఉంటే మనశ్శాంతి లభిస్తుందా? లోకకల్యాణం కలుగుతుందా?" అని ఆమెను అడిగాను. ఆమె సవినయంగా "స్వామీ! మీ ధర్మసందేహాలు తీర్చే సామర్థ్యం నాకు లేదు. అందుకోసం మీరు మిథిలానగరంలో ఉన్న ధర్మవ్యాధుణ్ణి దర్శించండి. ఆయన మీకు ధర్మమర్మాలు వివరిస్తాడు. సందేహాలు తీరుస్తాడు." అని చెప్పింది. ఆమె మాట ప్రకారం మనశ్శాంతికి మార్గం తెలుసుకోవాలని నేను నీ దగ్గరకు వచ్చాను. ఇక్కడ నిన్నూ నీ మాంసపు దుకాణాన్నీ చూచేసరికి నాకు ముందు చాలా అసహ్యం కలిగింది. కానీ నీ సంభాషణ విన్న తరువాత నా మనస్సు మారిపోయింది. నీ సత్కారం చూసిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది. నీ దగ్గర ఏదో అద్భుతమైన మహాశక్తి ఉందని నాకు నమ్మకం ఏర్పడింది. మరి వేదశాస్త్రాలూ కావ్యపురాణాలూ అన్నీ చదివి చదివి మహాజ్ఞానులం అనుకుంటున్న మాకే మనశ్శాంతి కలగటంలేదే! ముక్తిమార్గం కనిపించటంలేదే! ఈ విధంగా మాంసం అమ్ముకొని బ్రతికే నీకు ఇంత మహత్వం ఇలా లభించిందీ? ఇంత ప్రశాంతి ఎలా ప్రాప్తించిందీ?" అన్నాడు పండిత కౌశికుడు.
    ధర్మవ్యాధుడు దరహాసం చేస్తూ "ఆర్యా! మీరనుకున్నట్లు నా దగ్గరేమీ మహాశక్తి లేదు. ఏ మంత్ర తంత్రాలు లేవు. కాని నేను నా కర్తవ్యాన్ని మాత్రం జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నాను. అంతే." అన్నాడు.
    పండిత కౌశికుడు విస్మయ పడుతూ "అయితే అసహ్యమైన ఆ దుకాణం ఎందుకు పెట్టావు? ఆ మాంసం ఎందుకు అమ్ముతున్నావు? అదేనా నీ కర్తవ్యం!" అని ప్రశ్నించాడు. ఆ మాటలు విని ధర్మవ్యాధుడు ప్రశాంతంగా "అవును స్వామీ! ఇదే నా కర్తవ్యం ఈ మాంస విక్రయం ఎంతోకాలం నుంచి పరంపరగా వస్తున్న నా వంశవృత్తి. నా కులధర్మం. దీనిని విడిచిపెట్టటం నాకు ఇష్టం లేదు. నా కుటుంబ పోషణం కోసం ఈ కులవృత్తినే నేను అనుసరిస్తున్నాను. నాకు కాగా మిగిలిన ధనం బీద సాదలకు దానధర్మాలు చేస్తున్నాను." అని సమాధానం చెప్పాడు.
    "అయితే అంత మాత్రం చేతనే నీకు ఇంత మహత్వం అబ్బిందా?" అని అడిగాడు పండిత కౌశికుడు.
    ధర్మవ్యాధుడు మృదు మధురకంఠంతో "అంతేకాదు స్వామీ! నేను నిత్య జీవితంలో శాంతి సత్యాలను ప్రధానంగా స్వీకరించాను. ఆత్మస్తుతీ పరనిందా పరిహరించాను. చేతనైనంత వరకు పరోపకారం చేస్తున్నాను. అయితే అన్నిటికన్నా పరమధర్మం మరొక్కటి ఉన్నది. ఆ ధర్మాన్ని పాలించటం వల్లనే నాకు శాంతి సౌఖ్యాలు లభించాయి. ఈ దివ్యజ్ఞానం చేకూరింది." అన్నాడు.
    కౌశికుని కన్నులలో ఆశాజ్యోతి వెలిగింది. "ధర్మవ్యాధా! నీవు నిర్వహిస్తున్న ఆ పరమధర్మం నాకూ ప్రబోధించు. నీకు దివ్యజ్ఞానం సమకూర్చిన ఆ సన్మార్గం నాకూ ప్రదర్శించు." అని ప్రార్థించాడు పండిత కౌశికుడు.
    ధర్మవ్యాధుడు చిరునవ్వు నవ్వుతూ "అలాగే స్వామీ! అయితే నా పరమధర్మం పరికింతురు గాని రండి. నా జీవనమార్గం దర్శింతురుగాని రండి." అంటూ ఇంటిలో లోపలిభాగానికి దారి తీశాడు. పండిత కౌశికుడు మౌనంగా అతనిని అనుసరించాడు.
    ఇల్లంతా లక్ష్మీవిలాసంతో కళకళలాడుతూ కన్నుల పండువు చేస్తున్నది. అక్కడే ఒక పరిశుభ్రప్రదేశంలో భగవద్ధ్యానం చేసుకుంటూ ఇద్దరు వృద్ధ దంపతులు కూర్చుని ఉన్నారు. ధర్మవ్యాధుడు వారి పాదపద్మాలకు భక్తి పూర్వకంగా నమస్కరించాడు. వృద్ధ దంపతులు "చిరంజీవివి కానాయనా!" అని ఆదరంగా కుమారుణ్ణి ఆశీర్వదించారు.
    ధర్మవ్యాధుడు వారిని పండిత కౌశికుడికి చూపిస్తూ "ఆర్యా! వీరే నా ప్రత్యక్ష దేవతలు! నన్ను గనిన జననీ జనకులు. నా ఆరాధ్య మూర్తులు. వీరిని సంతోస పెట్టటమే నా పరమధర్మం. వీరిని సేవించటమే నా కర్తవ్యం. వీరి పూజవల్లనే నా పుణ్యం వర్థిల్లుతున్నది. వీరి సేవలవల్లనే నాకు దివ్యదృష్టి సంప్రాప్తించింది. పరమశాంతి లభించింది. ఇలాగే గృహస్థుడైన ప్రతి మానవునికీ ప్రథమ ధర్మం మాతాపితల సేవ. తల్లిదండ్రులు దైవస్వరూపులు. వారిని పూజించటం అన్ని ధర్మాల కంటే ఉత్తమమైనది. అన్ని తపస్సులకంటే అధికమైనది. అందువల్లనే "మాతృదేవోభవ-పితృదేవోభవ" అన్నారు పెద్దలు. ఆ సత్యాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా వర్తించినవాడే ఆదర్శమూర్తి! అది తెలియకుండా మీరు అన్ని విద్యలూ నేర్చి ఆత్మధర్మం మరిచారు. అందువల్ల ఈ ధర్మమార్గం దర్శించటం కోసం ఆ పతివ్రత మిమ్మల్ని నా దగ్గరకు పంపింది. మూడు కాళ్ళ ముదుసళ్లైన మీ తల్లిదండ్రులను సేవించకుండా దివ్యజ్ఞానం కోసం యత్నాలు చేశారు! మీ ప్రయత్నాలు ఫలించలేదు. మీకు మనశ్శాంతి లభించలేదు. పాపం మీ తల్లిదండ్రులు మీకోసం ఎదురు తెన్నులు చూసి చూసి కళ్లుగూడా పోగొట్టుకున్నారు! ఇప్పటికైనా మీ కర్తవ్యం గుర్తించి ఇంటికి వెళ్లండి. మీ తల్లిదండ్రులను సేవించి సంతృప్తి పరచండి. అప్పుడే మీ చదువులన్నీ సార్థకమవుతాయి. మీ తపస్సులన్నీ ఫలిస్తాయి. మీ మనస్సుకు శాంతి సంతోషాలు సమకూరుతాయి." అని ప్రబోధించాడు ధర్మవ్యాధుడు.
    కౌశికుని మనస్సులో అనేకమైన ఆలోచనలు చెలరేగినాయి. "ధర్మవ్యాధా! మరి నీవు చెప్పినట్లు మాతాపితలను సేవిస్తూ ఉంటే లోక కల్యాణం కలుగుతుందా?" అని అడిగాడు పండిత కౌశికుడు. ధర్మవ్యాధుడు దరహాసం చేస్తూ, "అవును స్వామీ! ముందుగా మూలాన్ని రక్షిస్తే చెట్టుపెద్దదై ఫలిస్తుంది. ముందు మన తల్లిదండ్రులను సేవించటం నేర్చుకుంటే మన మనస్సులో సేవాభావం వృద్ధి పొందుతుంది. అదే క్రమంగా పరోపకారబుద్ధి కల్పిస్తుంది. అప్పుడు మనం లోకోపకారం చెయ్యవచ్చు. ఆ విధంగా జననీ జనకుల చరణసేవ లోకకల్యాణానికి మార్గం అవుతుంది." అన్నాడు. ఆ సువర్ణ సూక్తులు వినగానే పండిత కౌశికుని హృదయం పవిత్రభావ పరిపూర్ణమైంది. ఆయన ప్రశాంత స్వరంతో "ఆర్యా! ఇప్పటికి నా సందేహం తీరిపోయింది. నాకు ధర్మ స్వరూపం సాక్షాత్కరించింది. ముక్తి మార్గం గోచరించింది. కారు చీకట్లలో కలగిపోతున్న నా కన్నులు విప్పి కర్తవ్యం చెప్పిన కరుణమూర్తివి నీవు!" అని ధర్మవ్యాధుణ్ణి ప్రశంసించాడు.
    ధర్మవ్యాధుడు పండితకౌశికుడికి వీడ్కోలు చెపుతూ "స్వామీ! మీ మనస్సు మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరు గృహస్థులై తల్లిదండ్రులను పూజిస్తూ, ఆప్తులను ఆదరిస్తూ' పేదలను కనికరిస్తూ హాయిగా జీవయాత్ర సాగించండి." అని పలికాడు.
    పండిత కౌశికుడు ప్రేమపూర్వకంగా ధర్మవ్యాధుని అభినందిస్తూ "ఆర్యా! నీవు నాకు మంగళమయమైన దివ్యమార్గం ప్రదర్శించావు! ధర్మ మర్మం వివరించావు! సేవాభావం ప్రబోధించావు! నీవు నేర్పిన ఈ నూతన తపస్సులో సిద్ధిపొంది, శాంతి సౌఖ్యాలు సంపాదించుకుంటాను. ఇప్పుడే ఇంటికి వెళ్ళి నా జననీజనకుల చరణసేవలో నా జన్మ సార్థకం చేసుకుంటాను. సెలవు." అని పలికి చకచకసాగిపోయాడు.
    ధర్మవ్యాధుడు ఆనంద పరవశుడై పండిత కౌశికుని పరికిస్తూ అలాగే నిలబడిపోయాడు.

                                                                *  *  *  *

 Previous Page Next Page