'ఆ దిక్పాలురు, ఆ విష్ణువు - ఆ బ్రహ్మ - మా మహేశ్వరులు నియమిస్తే పదవిని దక్కించుకున్న పిరికి పందలు.'
'ఆ మహేశ్వర భక్తితో అఖిల లోకాధిపత్యం సాధించుకోవచ్చు కదా రావణా!'
'ఇప్పుడు నేనే కదా సర్వలోకాధినేతను'
'మరి త్రిమూర్తులు...'
'పరమేశ్వరుడు మాకు పరమ పూజ్యుడు. బ్రహ్మ... ముక్కు మూసుకుని నాలుగు ముఖాలతో వేదాలు పఠిస్తూ లోకసృష్టి చేసే ఆ విధాతతో మాకు చిక్కులేదు'
'ఉన్నదల్లా మా చేతికి చిక్కక మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టే ఆ నారాయణుడి వల్లనే కదా!'
'అవును...'
'నారాయణ! నారాయణ! పిలిస్తే పలికే ఆ శ్రీహరితోనా మీ వైరం! భక్తజన నులభుడు ఆ వైకుంఠునీతోనా మీ వైరం! రావణా! ఒక్కసారి ఓం నమోనారాయణాయ అంటే...'
'చాలించు నారదా! అసందర్భ ప్రలాపం! వైరి నామ శ్రవణమే మాకు కర్ణకఠోరం... అలాంటిది నువ్వు పనిగట్టుకుని ప్రస్తుతించడం క్షమార్హం కాదు! పితామహ వర్గంలోని వాడినని మన్నించి వదిలేస్తున్నాం. ఇక వచ్చిన పనేమిటో చెప్పి తక్షణం వెళ్ళిపో. మమ్మల్ని రెచ్చగొట్టి మా కోపానలంలో భస్మం కావద్దు'
'ఈ కనరు- వినరు- మూర్కొనరు- అని ఆంధ్ర దేశంలో అంటూ ఉంటార్లే!'
'ఆ ఆంధ్రులు విశ్వామిత్రుడి సంతతి కదా! తామస గుణంలో తమంతవారే వారూనూ. కదిలిస్తే కత్తి దూస్తారో.. పలకరిస్తే పైబడి కొడతారో అన్నట్లుగా వుంటార్లే!...'
'మళ్ళీ దారి తప్పుతున్నావు దేవర్షీ!'
'నిన్ను దారికి తెచ్చుకోవాలనే ఈ జడదారి తపన!'
'ఊ!'
'ముక్కోటి దేవతలు కట్ట కట్టుకుని వైకుంఠం వెళ్ళిన విషయం నీకెరుకేనా రావణా!'
'అదెప్పటి మాత౧ కృతయుగం నాటి మాట ఈ త్రేతా యుగంలో చెపుతున్నట్టు వుంది'
'కాలం విలువ తెలియని వారికి అలాగే ఉంటుందిలే!'
'సరే! ఆ విషయం ప్రహస్థుడి ద్వారా తెలుసు! అయితే?'
'ఆ శ్రీమన్నారాయణుడు నరుడిగా అవతరించి...'
'నా అవతార పరిసమాప్తి చేస్తానని వారికి చెప్పి ఊరట కల్గించాడు సరే! అదీ తెలుసు! అయితే...'
'అతడు దశరధుడి కుమారుడిగా కౌసల్య గర్భవాసాన జన్మించనున్నాడు'
'ఊ!'
'ప్రతి అవతారమూ దుష్ట శిక్షణకూ శిష్ట రక్షణకూ...'
'చాలు... చాలు... మీ దృష్టిలో దుష్టులంటే రాక్షసులు. శిష్టులంటే దేవతలూ... అంతేనా?'
'కానీ ఈ అవతారం నీకోసమేనట రావణా!'
పగలబడి నవ్వాడు రావణుడు.
లంకేశ్వరుడి నవ్వును చూస్తుండిపోయాడు నారదుడు.
నవ్వి నవ్వి అలిసినట్లు ఆగి అన్నాడు రావణుడు 'నాకు నరుల వల్లా, వానరుల వల్లా తప్ప మరెవరి వల్లా మరణం లేదని నీకు తెలీదా నారదా?'
'అందుకే శ్రీమహావిష్ణువు నరుడిగా అవతరిస్తున్నారు'
'నరుడు... హూ! నరులు. దానవ సందర్శన మాత్రాన పై ప్రాణాలు పైనే పోయే పిరికిమానసులు. వారా... సమస్త లోకాలనూ నిజ భుజ బలంతో నిర్ధూమధామం చేయగలిగిన యీ దశకంఠుడ్ని నిర్జించేది.
కలగంటున్నారా మీ దేవతలు నారదా! ఆ వైకుంఠుడు ఒక్క నరుడిగా కాదు. వేలవేల నరులుగా వచ్చినా ఈ పౌలస్థ్యుని జయించలేడు. ఆ విషయం మరువద్దు...'
'గత వైభవాన్ని తలుచుకుని ప్రకృతాన్ని మరిచేవాడు అవివేకి రావణా! గతం వేరు. ఇప్పటి విషయం వేరు...'
'హూ! నీకు ఎంత చెప్పినా యీ రావణుడి బలం, బలగం విషయం అవగతం కాదులే! సరే! మీ దేవుడూ నరుడిగా పుట్టబోతున్నాడు. అందుకు దశరధుడు యజ్ఞం చేస్తున్నాడు. ఋష్యశృంగుడు విచ్చేసి పుత్ర కామేష్టి చేయిస్తున్నాడు. నారదా! ఈ విషయాలన్నీ నా చారుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాను. నీవు యిప్పుడు చెప్పేదేమిటో చెప్పు?'
'శరణాగత వత్సలుడు ఆ శ్రీమన్నారాయణుడు....'
'అయితే ఆ పుట్టబోయే శిశువుని యిప్పటి నుంచే ప్రస్థుతించి శరణం తవ చరణం అని భజన చేయమంటావా?'
'అది అన్ని లోకాలకూ శుభ దాయకం రావణా!'
'అలా కాకపోతే...'
'లంకా నాశనం, రాక్షస సంహారం...'
'కానీ విధికృతం అదే అయితే అలాగే కానీ...'
'కానీ నువ్వు పట్టిన కుందేటికి మూడే కాళ్లంటావు కదా!'
రావణుడు జవాబివ్వలేదు.