చీకటి
చీకటి! కటిక చీకటి! కారు చీకటి - అలాంటి చీకటంటే చిన్నికి చాలా యిష్టం! వెలుగంటే చిన్నికి అసలు ఇష్టంలేదు. వెలుగొస్తుందంటే భయం! వెలుగొస్తేచాలు - లేరా, లేరా అంటూ అమ్మ లేపేస్తుంది. నిద్రొస్తూంటే పదుకోనీయదు రెక్కపట్టుకు లాగి కూర్చో పెడ్తుంది. పళ్ళు తోముకో, నీళ్ళోసుకో, చలిది తిని బడికెళ్ళు - చదువుకో - పగలంతా ఇదే గొడవ. స్కూలు కెళితే చదువంటాడు మాష్టారు. అంకెలంటూ ప్రాణం తీస్తాడు. చేయకపోతే బెత్తంతో కొడ్తాడు. గోడకుర్చీ వేయమంటాడు. పగలంతా చదువు - వెలుగున్నంతసేపూ ఆడుకోనీయరు.
ఇవన్నీ ఒక ఎత్త - చిన్నికి యింట్లో తండ్రిని చూస్తే భయం. చిన్నికే కాదు వాళ్ళమ్మకి తండ్రి చేతిలో చావు దెబ్బలు తప్పవని ఐదేళ్ళ చిన్నికి కూడా అర్ధం అయిపోయింది. తండ్రి పగలే ఇంటికొస్తాడు - రాత్రిళ్ళు ఎక్కడికోపోతాడట. "ఏ ముండ దగ్గరో పడుంటాడు" యిరుగు పొరుగు అనే ఆ మాటలు చిన్నికి అర్థంకాక పోయినా ఆ "ముండ" వల్లే తండ్రి రాత్రి ఇంటికి రాడని. ఆ ముండ వల్లే తల్లి చచ్చే దెబ్బలు తింటూందన్నది చిన్నికి తెల్సిపోయింది. "అమ్మా, ఆ ముండెవరే అమ్మా" అన్నాడు ఓ రోజు. తల్లి జవాబు చెప్పకుండా చిన్నిని దగ్గరికి లాక్కుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. "అమ్మా ఆ ముండని చంపేస్తాను నేను. అలా అయితే నాన్న నిన్ను కొట్టడు" అన్నాడు - "నా బాబే నా తండ్రే - నీవేరా నాకు బతుకులో ఆశ -" అంది ఏడుస్తూ తల్లి. తండ్రి ఇంటికొచ్చాడంటే పిల్లి కూనలా ఏ తడిక చాటో నక్కుతాడు చిన్ని. తండ్రి వస్తూనే తల్లిని బండ బూతులు తిడ్తాడు - తంతాడు. వండిందంతా మెక్కి పోతాడు. చిన్నికి కూడా ఏమీ మిగలకుండా. తల్లి డబ్బడిగితే మరో రెండు తగిలిస్తాడు - అదంతా బితుకు బితుకుమని చూస్తాడు చిన్ని. అందుకే చిన్నికి వాళ్ళ నాన్నంటే కోపం, భయం, అసహ్యం! అందుకే చిన్నికి పగలంటే భయం!
చక్కగా చీకటి పడితే అమ్మ వేడినీళ్ళు పోస్తే. వేడి బువ్వ తిని, అమ్మ పొట్ట కరుచుకుని వెచ్చగా పడుకోవచ్చు - రాత్రయితే నాన్న రాడు. అమ్మని కొట్టడు. అమ్మ ఏడవడం చూడక్కరలేదు. ఆకలి వెయ్యదు. బడికెళ్ళక్కరలేదు, చక్కగా ఏ గొడవా లేకుండా వెచ్చగా పడుకోవచ్చు. అంచేత చిన్నికి ఎప్పుడూ చీకటయితేనే బాగుండుననిపిస్తుంది.
అలాంటి చీకటి రాత్రే నిద్రపోతున్న చిన్నిగాడ్ని తీసుకుని లారీ ఎక్కి వాళ్ళమ్మ ఎటో తీసుకెళ్ళడం వాడికి కొంచెం గుర్తుంది. ఆ పగలు వాడి నాన్న రోజూ కంటే ఎక్కువగా చావదన్నాడు వాళ్ళమ్మని, "చావు నంజా" ఆ రాఘవులు ఎందుకొస్తాడే, ఆడు నీ రంకు మొగుడా, ఆడితోటే పోవే ముండా" అంటూ ఏవేవో తిట్టి, గోడకేసి తలబాది, కాలితో తన్ని. కుళ్ళబొడిచి కసితీరేదాకా చితకతన్నాడు. స్కూలు నించి అప్పుడే వచ్చిన చిన్నిగాడు అదంతా చూసి. తల్లి పడిపోయి, లేవకపోవడం చూసి బావురుమని ఏడ్చేశాడు. "నోర్మూయ్ గుంటెదవా" అంటూ వాడ్ని ఓటి తగిలించి తూలుకుంటూ వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న. చిన్నిగాడి ఏడ్పుకి, ఆ కేకలకి యిరుగు పొరుగు వచ్చారు. తెలివి తప్పిపోయిన విడి అమ్మ మొహం మీద నీళ్ళు చల్లి లేవదీసి కూర్చోపెట్టారు. "ఇంక నేనీ బాధలు పడలేనత్తా" అంటూ రాములమ్మని పట్టుకు ఏడ్చింది వాడమ్మ. "ఏం జన్మే మనది. ఊరెకోయే ఆడబడుకింతేనే" అంటూ ఓదార్చారు అందరూ. ఈ పాటి తిండి రెండిళ్ళల్లో పాచిపని చేసుకున్నా దొరుకిద్ది, ఈడి సేతుల్లో దెబ్బలు తిని సావడమెందుకు, ఎటన్నా ఎల్లిపో అన్నారందరూ ఓదారుస్తూ.
అంతా వెళ్ళాక రాఘవులు చిన్నాన్న వచ్చి చిన్నిగాడి అమ్మ వంటిని దెబ్బలు చూసి వాడి నాన్నని. చెడామడా తిట్టి. "పద నిన్నింక ఈ నరకంలో ఒక్క క్షణం వుండనీయను" అంటూ ఏవేవో చెప్పాడు. రాఘవులు చిన్నాన అంటే చిన్నికి ఎంతో యిష్టం. ఎప్పుడొచ్చినా మిఠాయిలు, పూలు, గాజులు ఏవో తెస్తాడు. చిన్నిగాడ్ని ఎత్తుకుంటాడు. బిళ్ళలు, బుంగలు ఏవో ఏవో యిస్తాడు. చిన్నిగాడి నాన్నంటే చిన్నానకి ఎంతో కోపం. ఎప్పుడొచ్చినా తాగుబోతు లంజా కొడుకు అంటూ తిడ్తాడు. అందుకే చిన్నాన్న అంటే చిన్నికి ఎంతో యిష్టం.
ఆ చీకటి రాత్రి చిన్నాన్న లారీ ఎక్కి చిన్నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు చిన్నిగాడు, వాళ్ళమ్మ.
ఆరోజునించే చిన్నిగాడికి వెలుగంటే భయం పోయి చీకటంటే భయం పట్టుకుంది! చీకటి పడితే చిన్నికి భయం. చీకటిపడితే చీకటి గదిలో ఒంటరిగా పడుకోవాలంటే చిన్నికి చచ్చే భయం. ఒంటరిగా తనని వేరే పడుకోబెట్టి అమ్మ, చిన్నాన్న తడికల గదిలో పడుకుంటారు. వూరికే గుసగుసలాడుకుంటారు. కిసకిస నవ్వుకుంటారు. ఒంటరిగా పడుకోవాలంటే చిన్నికి చచ్చే భయంగా వుంది. "అమ్మా నీదగ్గిర పడుకుంటానే" అంటే చిన్నాన్న కోపంగా చూసి "పోరా ఇంకా అమ్మని కౌగిలించుకుని తొంగోడానికి సిన్నోడివేంటి - ఎల్లు భయమేటి" అని కసిరాడు. చిన్నిగాడికి ఇక్కడికి వచ్చిం దగ్గరనించి చిన్నాన్న అంటే వళ్ళు మండిపోతుంది. ఇన్నాళ్ళూ చిన్నిగా చిన్నిగా అంటూ ముద్దు చేసేవాడు. అన్నీ కొనేవాడు. ఇక్కడికొచ్చిం దగ్గరనించి తనని చూస్తేనే మొహం చిట్లింస్తాడు. ఎప్పుడూ ఎందుకో విసుక్కుంటాడు. కసురుతాడు గాడిదా చదువుకో, వెధవాపో. అంటూ ఏదో తిడ్తూనే వుంటాడు. అమ్మెప్పుడన్నా ఏదన్నా అనబోతే "వాడ్ని అలా ముద్దుచేసి పాడుచేయకు. ఏడేళ్ళొచ్చాయి ఇంకా పసికూన అనుకుంటున్నావేటి" అంటాడు కోపంగా-చిన్నాన్న ఇలా మారిపోతాడని తెలిస్తే చచ్చినా వచ్చేవాడిని కాను, అనుకుంటాడు కోపంగా చిన్నిగాడు, ఈ చిన్నన్న కంటే నాన్నే నయం, అమ్మని కొట్టేవాడుగాని నన్ను కొట్టలేదు. ఛీ - చిన్నన్న మంచివాడుకాదు. ఉక్రోషంగా అనుకుంటాడు చిన్నిగాడు. ఈ చిన్నాన్న అమ్మని కూడా పాడుచేశాడు. అమ్మ కూడా చిన్నాన్నతో కల్సిపోతుంది. ఇదివరకు ఎంతో ముద్దుచేసేదీ తనని, కౌగిలించుకొని ఏడ్చేది, నీవేరా నాకు మిగిలావు అనేది. ఎంత బాగా చూసేది ఎప్పుడూ తిట్టేదికాదు, ఇక్కడికొచ్చాక అసలు తన గొడవే పట్టించుకోదు. ఎంతసేపు చిన్నాన్న వెనకాలే తిరుగుతుంది, చిన్నాన్నకి చంటిపిల్లాడికి పోసినట్టు నీళ్ళు పోస్తుంది. సిగ్గులేకుండా చిన్నాన్న చిన్నిపిల్లాడిలా ముద్దలు తినిపించమంటాడు. తల దువ్వించుకుంటాడు. ఇద్దరూ వూరికే కిచకిచలాడతారు. అదోలా చూసుకుంటారు.. చిన్ని గాడికి అదంతా చూస్తుంటే ఏదో కసిగా వుంది. చిన్నిగాడ్ని అలాంటప్పుడు "పోరా వెధవా ఎప్పుడూ ఇంట్లో ఏడుస్తావేం పోయి ఆడుకో" అని తిడ్తాడు చిన్నాన్న. "అబ్బబ్బ ఏమిటిరా చిన్నిగా ఎప్పుడూ నా కొంగుపట్టుకు ఏడుస్తావేం ఆడుకో పోయి" అని అమ్మ కసురుతుంది. చిన్నిగాడికి ఉక్రోషంతో ఏడుపు వస్తోంది, ఏదో చెయ్యాలని వుంటుంది, ఏం చెయ్యలేక కోపంగా వీధిలోకి పోయి అరుగుమీద కూర్చుంటాడు.
పోనీ పగలయితే అనుకోవచ్చు. రాత్రి చీకట్లో ఒంటరిగా పడుకోవాలంటే ఎంతో భయం వేస్తుంది. అమ్మ పక్కలో పడుకోపోతే నిద్రే రాదు. చీకటి చుట్టూ చీకటి - కటికచీకటి. ఆ చీకటి రాక్షసుడిలా భయపెడుతూంటే చిన్ని ప్రాణం బిక్క చచ్చిపోతుంది. అరుస్తే, ఏడిస్తే చిన్నాన్న వింటారని భయం - కళ్ళు గట్టిగా మూసుకుంటే మరింత చీకటి - ఏడుపు వస్తుంది. కళ్ళంట కారే నీటిని తుడుచుకోకుండా అమ్మా, అమ్మా అని లోలోపల ఏడుస్తాడు చిన్నిగాడు నిద్రపట్టదు. పక్కనించి వినవచ్చే నవ్వులు వింటూ కసిగా, కోపంగా "ఈ చిన్నాన్న చచ్చిపోవాలి, ఈ చిన్నాన్నని చంపెయ్యాలి, చిన్నాన్న చచ్చిపోతే చక్కగా మళ్ళీ అమ్మా, తాను హాయిగా వుండవచ్చు, చక్కగా అమ్మని కౌగలించుకుని భయం లేకుండా పడుకోవచ్చు" అనుకుంటాడు.
చిన్నిగాడి ప్రార్థన విన్నట్టు దేముడు చిన్నిగాడి కోరిక త్వరలోనే తీర్చాడు. లారీ ఏక్సిడెంటులో రక్తం ముద్దయిన రాఘవుల్ని తీసుకొచ్చి పడేశారు. చిన్నిగాడి అమ్మ కెవ్వున కేకేసి పడిపోయింది. చిన్నాన్న నిజంగా చచ్చిపోయినందుకు చిన్నిగాడి మనసులో సంతోషం అన్పించినా వాడి అమ్మ ఏడుస్తున్నందుకు వాడూ ఏడ్చాడు.
చిన్నాన్న చచ్చిపోతే తను, అమ్మ మళ్ళీ ఎంచక్కా హాయిగా వుండొచ్చు అనుకున్న చిన్నిగాడి ఆశ రోజులు గడుస్తున్నకొద్ది అడియాస అయిపోయింది. చిన్నాన్న చచ్చిపోయిం దగ్గరనుంచి అమ్మని చూస్తే భయమేస్తుంది చిన్నికి. కొన్నాళ్ళు నాన్నంటే భయం, తర్వాత చిన్నాన్నంటే భయం, యిప్పుడు అమ్మంటే భయం! అమ్మ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం. అమ్మ అసలు మాట్లాడడం మానేసింది. ఎప్పుడూ ఏడుస్తుంది పడుకుని. లేదంటే ఎటో చూస్తూ ఆలోచిస్తుంది. చిన్నిని అసలు పలకరించదు. దగ్గిరికి తీసుకోదు. నీళ్ళు పోయదు, వంట చేయదు, అన్నం పెట్టదు. చిన్నిగాడిని కసురుతుంది. తిడ్తుంది. "నా ప్రాణానికి నీవొకడవురా దౌర్భాగ్యుడివి. నీ మూలంగా చావాలన్నా చావలేక పోతున్నానురా-" అంటూ ఏడుస్తుంది. "దరిద్రగొట్టు వెధవా నీది దరిద్రజాతకంరా, లేకపోతే చిన్నాన్న ఎందుకు చచ్చిపోతాడు. మనం ఇలా దిక్కులేనివాళ్ళం ఎందుకవుతాం" అంటూ చిన్నిగాడ్ని కొట్టి తన బుర్ర బాదుకుంటుంది. తల్లి అలా అంటే తను కోరడం మూలంగానే చిన్నాన్న చచ్చిపోయాడని అందుకే అమ్మ తిడుతూందని చిన్నిగాడికి ఏడుపు వచ్చేది. దిక్కులేనివాళ్ళం అయ్యాం అని తల్లి అంటే, ఆ మాటలకి అర్థం అప్పుడు బోధపడలేదు గాని తరువాత అర్థం అయింది.