Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 42


    ఆ తరువాత తరువాత చిన్నాన్న ఉన్నప్పుడే బాగుండేదనిపించింది చిన్నిగాడికి. తనని తిడ్తేనేంగాక, అమ్మ చిన్నాన్న కసురుతేనేంగాక రెండుపూటలా శుభ్రంగా ఇంత తినడానికి దొరికేది. నాన్న దగ్గరున్నప్పుడలా కాక రోజూ కూర అన్నీ వుండేవి తినడానికి. టీ కూడా తాగేవాడు. చిన్నాన్న చచ్చిపోయాక నెలరోజులు వాడి అమ్మెలాగో గడిపింది. తరువాత తరువాత ఒక పూటుంటే ఒకపూట ఏమి వుండేదికాదు. చిన్ని ఆకలి అని గోలపెడితే వాళ్ళమ్మ వాడ్ని కొట్టి, తరువాత ఏడ్చేది. నెల్లాళ్ళు వాళ్ళమ్మ వీళ్ళనీ వాళ్ళనీ డబ్బడిగి యింత గంజి కాచేది. తరువాత అదీ లేదు. చిన్నిగాడు ఆకలి అంటూ ఏడుపు. తరువాత వాడి అమ్మ కూలీ వెళ్ళడం ఆరంభించింది. ఒకరోజు కూలీ దొరికేది. మరో రోజు లేదు. ఎవరింట్లోనో పనికి కుదిరాక కాస్తనయం. రెండుపూటలా యింత గంజన్నా దొరికేది. బొద్దుగా వుండే చిన్నిగాడు పుల్లలా తయారయ్యాడు. ఆకలంటే అన్నం పెట్టని వాడమ్మ మీద వాడికి కోపం పెరిగిపోతూంది. "ఎందుకన్నం పెట్టవు" అని ఎగిరేవాడు. "నాకీ గంజి వద్దు అన్నం పెట్టు" అంటూ మొండికేసే చిన్నిగాడ్ని సముదాయించలేక వాడి అమ్మ వాడ్ని చావబాదేది.
    ఓరోజు సాయంత్రం చిన్నిగాడు బడినించి వచ్చేటప్పటికి వాడి అమ్మ వంట చేస్తూ ఏడుస్తూంది. వాడి అమ్మ చుట్టూ బియ్యం, పప్పు, కూరలు అన్నీ వున్నాయి. చిన్నిగాడికోసం బిస్కట్లూ వున్నాయి. అవి చూడగానే చిన్నిగాడు సంతోషంగా వురికి గుప్పెడు బిస్కట్లు తీసుకున్నాడు. వాడి అమ్మ కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బి ఉన్నాయి. పొయ్యి సెగకో, ఏడుపుకో మొహం అంతా ఎర్రబడిపోయింది. గబగబా బిస్కట్లు తింటున్న చిన్నిగాడిని - "తినరా వెధవా తిను. దరిద్రుడా మింగరా ఇవన్నీ కూడా మింగు - నన్ను కూడా మింగు - అప్పుడయినా నీ ఆకలి చల్లారుతుందేమో" అంటూ కోపంగా తిట్టి తరువాత ఏడవడం మొదలుపెట్టింది. "నీకోసంరా... నీకోసంరా, ఇదంతా చేశాను". వెక్కిళ్ళ మధ్య తల్లి అంటున్న మాటలు చిన్నిగాడికి అర్థంకాక తల్లి ఎందుకు తిడ్తుందో తన తప్పేమిటో తెలియక బిస్కట్లు తినడం మానేసి భయంగా చూస్తుండిపోయాడు.
    ఆ రోజునించి చిన్నిగాడు మరి ఆకలంటూ ఏడవకుండానే వాడి అమ్మ అన్నం పెట్టేది. చిన్నిగాడికి అన్నం మళ్లీ దొరుకుతున్నందుకు సంతోషంగా వుందిగాని, అమ్మతో మాట్లాడాలంటే భయంగా వుంది. వాడి అమ్మ అసలు మాట్లాడడం మానేసింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంటుంది. కూలిపని, పాచిపని మానేసింది. అయినా రోజూ అన్నం ఎలా వస్తుందో చిన్నికీ తెలియదు. అమ్మని అడగాలంటే దగ్గరకు వెడితేనే కసురుతుంది. "నన్ను విసిగించకు వెళ్ళు" అంటుంది. "నీకు కావల్సింది అన్నమేగా" అంటుంది చిన్నిగాడు అప్పటినుంచి వాళ్ళమ్మని ఏమీ అడగడం మానేశాడు. పెట్టిందేదో శుభ్రంగా తినేవాడు. "డబ్బెక్కడనించి తెస్తే నీకెందుకు" అనుకున్నాడు.
    ఆ డబ్బు వాళ్ళమ్మకి ఎక్కడినించి వస్తుందో కొద్దిరోజులలో చిన్నిగాడికి తెల్సిపోయింది. ఓరోజు మంచి నిద్రలో ఎందుకో మెలకువ వచ్చేసింది చిన్నికి. పక్కన అమ్మలేదు. ఆ పక్కగదిలో చిన్ని దీపం వెలుగుతూంది. రాత్రి అమ్మేం చేస్తూంది అనుకుని చిన్ని లేచి తడిక కన్నంలోంచి తొంగిచూశాడు. ఆ గుద్ది వెలుగులో వాడి అమ్మ ఏం చేస్తూందో చూసేసరికి చిన్నిగాడికి మొదట సిగ్గేసింది. ఆ తరువాత అసహ్యం వేసింది ఛీ అమ్మేంటిలాగ - సిగ్గు లేకుండా అసలు వాడెవడు అనుకున్నాడు. ఆ తరువాత కోపం వచ్చేసింది. "అమ్మా" అని కోపంగా ఒక్క అరుపు అరిచాడు. వాళ్ళమ్మ తుళ్ళిపడిలేచి చటుక్కున చీర సవరించుకుని దీపం బుడ్డి ఊదేసి తడిక తీసుకునివచ్చి చీకట్లో చిన్ని గాడ్ని పట్టుకుని "ఏరా లేచావేం" అంది ఏం తెలీనట్టు - చిన్నిగాడి కళ్ళు ఆ చీకట్లో మెరిశాయి. కోపంగా తల్లి చెయ్యి తీసేశాడు. "ఏం చేస్తున్నావు" అన్నాడు పెద్దవాడిలా అధికారంగా. ఏడేళ్ళ చిన్నిగాడి వాళ్ళమ్మ ఒక్కక్షణం తడబడి "ఏం చెయ్యడం లేదు. పద పడుకుందాం" అంటూ తీసికెళ్ళిపోయింది. "ఉహు నే పడుకోను - ఆ గదిలో వాడెవడు. ఎందుకొచ్చాడు. నన్నొదిలేసి వాడిదగ్గర నీవెందుకు పడుకున్నావు?" అన్నాడు కోపంగా. వాళ్ళమ్మకి కోపం వచ్చి నెత్తిమీద ఒక్కటేసి "పద వెధవా. పెద్ద కబుర్లాడకుండా వెళ్ళిపడుకో-" అంటూ బలవంతాన లాక్కెళ్ళి నులకమంచం మీద కూలేసి "ఇక్కడనించి కదిలావంటే చూడు - పడుకో - నేనిప్పుడే వస్తాను. లేచావో రేపు నీకన్నం పెట్టను." అంటూ బెదిరించి మళ్ళీ ఆ గదిలోనికి వెళ్ళిపోయింది. ఆ గదిలో మళ్లీ దీపం వెలగలేదు. చిన్నిగాడికి ఏం కనపడలేదు గాని ఏవేవో గుసగుసలు వినిపించాయి. ఓ అరగంటపోయాక వాళ్ళమ్మ వచ్చి నెమ్మదిగా వాడిపక్కన పడుకుంది. ఆ చీకట్లో కళ్ళు విప్పుకుని కోపంగా పడుకున్న చిన్నిగాడికి వాళ్ళమ్మని అంటుకోవాలంటే అసహ్యం వేసింది. వాళ్ళమ్మకి తగలకుండా అటు తిరిగి పడుకుండిపోయాడు కోపంగా.
    ఆతరువాత చాలా రాత్రులు చిన్నిగాడు నిద్రపోకుండా వాళ్ళమ్మ చేసే పనులన్నీ ఆ చీకట్లో పడుకొని గమనిస్తూనే వుండేవాడు. నిద్రలో మెలకువ వచ్చినా వాడి అమ్మ పక్కనే లేకపోయినా లేచి వెళ్ళి చూసేవాడు కాదు. వాడికిప్పుడు వాళ్ళమ్మ సంగతి తెల్సిపోయింది. ఛీ అనుకునేవాడు కోపంగా - ఆ తడిక చాటునించి వినవచ్చే మాటలు వింటూంటే వాడి ఒళ్ళు ఉడికిపోయేది.
    ఓ రోజు చిన్నిగాడికి ఏవో కేకలకి మెలకువ వచ్చింది. "దీపం వెలిగించు ఈ చీకట్లో సరసానికేటి పదిరూపాయలిచ్చుకున్నానా." పెద్దగా అంటున్నాడెవడో.
    "దీపం వద్దండి, పక్కన కుర్రాడు పడుకొన్నాడు చూస్తే బాగోదు" చిన్నిగాడి తల్లి గొంతు. "గానం వచ్చినాడు, సూస్తే బాగోదు."
    "సానిముండకి కొడుకొకడా - రంకుమొగుడికాడ తొంగోడానికి లేని సిగ్గు చూస్తే ఏం వచ్చిందిలే. సూస్తే ఆడే ఎల్లిపోతాడు సిగ్గుపడి ఊ దీపం వెలిగించు, ఈ సీకట్లో సయ్యాట నాకు బాగోదు, లేదంటే నా డబ్బు నాకు పడేయి. నీ బాబులాంటిది మరోత్తి దొరుకుతుంది. వాడెవడో గట్టిగా అరుస్తున్నాడు. మాట స్పష్టంగా లేదు. చిన్నిగాడికి అన్నీ అర్థం కాకపోయినా కొన్ని అర్థం అయ్యాయి. చిన్నిగాడి వళ్ళుడికింది. వాడి తల్లి మళ్ళీ గదిలోకి వచ్చేవరకు అలా కొయ్యముక్కలా మంచం మీద కూర్చున్నాడు నిద్రపోకుండా.
    వాడితల్లి లోపలికి వస్తూనే మంచంమీద కూర్చున్న చిన్నిగాడ్ని చూసి ఉలిక్కిపడింది. "ఏరా, ఎందుకు లేచావు" అంది కఠినంగా. చిన్నిగాడికి ఏవేవో అనాలని వున్నా అనలేక గుడ్లు మిటకరించి చూశాడు. ఆ చూపు చూసేసరికి చిన్నిగాడి తల్లి తిక్కరేగింది. విసురుగా వచ్చి దబదబ రెండు బాది "చచ్చినోడా, ఎందుకురా అలా మేకులా కూర్చున్నావు. రాత్రి అయినా నిశాచరుడిలా పడుకోవేం. ఈ సారి రాత్రి లేచావంటే గుడ్లు పీకేస్తాను. గుడ్డివెధవ్వి అయితే బతికిపోతాను ఉక్రోషంగా" అంటూ బాదింది. చిన్నిగాడు ఏడవకుండా కోపంగా చూశాడు.
    తరువాత నెల రోజులకి చిన్నిగాడు గుడ్డివాడయ్యాడు, వాడి కళ్ళు వాడి అమ్మ పీకలేదు - దేముడే పీకేశాడు.
    ఆరోజు చిన్నిగాడు చింతచెట్టెక్కి కాయలు కోస్తూ కాలుజారి పడ్డాడు. ఆ పడడంతో కింద బండరాయిమీద పడి వాడి తల చిట్లింది. చిట్లిన తలని డాక్టర్లు ఎలాగో బాగుచేశారుకాని, దెబ్బే తగలని వాడి కళ్ళకి మాత్రం చూపు తెప్పించలేకపోయారు. నెలరోజుల తరువాత చిన్నిగాడు గుడ్డివాడయి ఇంటికి వచ్చాడు - వాడమ్మ గుండెలు బాదుకుని ఏడ్చింది. "నాయనా చిన్నిగా, నా చీకటి బతుక్కి నీవే వెలుగనుకున్నానురా, ఎప్పటికయినా ఈ చీకట్లోంచి వెలుగులోకి తెస్తావనుకున్నానురా, నీ బతుకే చీకటయిపోతుందనుకోలేదురా-" అంటూ గొల్లుగొల్లున ఏడుస్తూ అంది. ఆ మాటలు చిన్నిగాడికి బోధపడవు. తల్లి అంతలా ఏడవడానికి ఏముందో వాడికి అర్థం కాలేదు. వాడు మాత్రం చక్కగా యిప్పుడే బాగుందనుకున్నాడు. బళ్ళోకి పోనక్కరలేదు. చదవక్కరలేదు. చక్కగా అమ్మ బువ్వ తినిపిస్తుంది. నీళ్ళు పోస్తుంది. పడుకో బెడ్తోంది. ఇదివరకులా తిట్టదు అమ్మ మంచిదయిపోయిందని వాడికి సంతోషంగా వుంది చీకటంటే వాడికిప్పుడు భయంలేదు.

                                                                                            (ఆంధ్రజ్యోతి వీక్లీ - 1970)

                                                  *  *  *  *  *

 Previous Page Next Page