Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 40


    అమ్మ బయట చేరిన మూడు రోజులు మా పాల పడేవాడు రమణ పాపం. మేం అంతా కూడబల్కొని అన్నం పెట్టమని అడుగుతాడో లేదోనని చూసి చూడనట్టు నటించేవాళ్లం. చూసి, చూసి అతనే కాళ్ళు కడుక్కు వచ్చి పీట వాల్చుకుని ఆకు కడిగి, నీళ్ల గ్లాసు పెట్టుకునేవాడు. మేం చూడనట్టు నటిస్తే బిక్కమొహం పెట్టేవాడు. అది చూసి ముసిముసి నవ్వులు నవ్వేవాళ్లం. "అబ్బాయి వచ్చాడు అన్నం పెట్టరేమర్రా" అని అమ్మ అరిస్తే "నువ్వు పెట్టు నువ్వు పెట్టు" అని అక్కా
చెల్లెళ్లం వాదులాడుకుని ఆఖరికి ఎవరో ఒకరం లేచేవారం. మారు అడిగేవాడు కాదు. అడుగుతాడో లేదోనని మేం పంతం. మజ్జిగ అన్నానికో, పప్పన్నంలోనో గుంట చేసుకుని చారో, పులుసో, మజ్జిగ వేయండన్నట్టు తల దించుకు కూర్చునేవాడు. మేం చూడనట్టు నటిస్తే ఆఖరికి పాపం ఉత్తన్నం తినడం మొదలుపెడితే అప్పుడు జాలేసి పోసేవాళ్లం. 'ఎంత బుద్ధిమంతుడో, కన్నెత్తి చూడడు, పన్నెత్తి మాట్లాడడు, చదువులో ఫస్టు పైకి వచ్చే లక్షణాలు' అని అమ్మ మెచ్చుకునేది. అన్నయ్య పాత నిక్కర్లు, షర్టులు ఇచ్చేది. ఓ చాప, పాతబొంత, దుప్పటి ఇచ్చింది. ఏడాదికి ఓ కొత్త జత బట్టలు స్కూలు తెరిచేముందు కుట్టించేది. ఆ అబ్బాయి మెట్రిక్ చదువుతుండగా నాన్నగార్కి ట్రాన్సఫరయింది. ఆ అబ్బాయి పాపం ఎంతో దిగులు పడిపోయాడు. "అమ్మగారూ నా దురదృష్టం కాకపోతే ఈ ఒక్క ఏడు గడిస్తే పై చదువుల మాట ఎలా ఉన్నా మెట్రిక్ అయ్యేది. మీరెళ్లి పోతున్నారు. మీరు అన్నపూర్ణలాంటివారు. ఇంతమంది పెడ్తున్నారు గాని మీలా దయగా, ప్రేమగా గౌరవంగా ఎవరూ పెట్టరు. మిగిలిన చద్దన్నాలు కాకుండా మీ పిల్లలతో సమంగా పెట్టేవారు. ఇంకో ఇల్లు వెతుక్కోవాలి" అని ఏడ్చేశాడు. అమ్మ జాలిపడి మా బంధువులకి చెప్పి వారం కుదిర్చింది. ఓ పాత ట్రంకుపెట్టె, ఓ బాల్చి చెంబూ, ఓ కంచం, గ్లాసు లాంటివన్నీ ఇచ్చింది పాత బట్టలతోపాటు. అమ్మ కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు రమణ. మాకు జాలేసింది అప్పుడు. ఇదంతా ఏభైయేళ్ల క్రితం సంగతులు. అదంతా ఇప్పుడు తల్చుకుంటే ఆ రమణని ఎలా ఏడిపించామో గుర్తొచ్చి సిగ్గుపడ్డాను. "మిమ్మల్ని మేము భలే ఏడిపించేవారం. మీరు అలా బుద్ధావతారంలా తల దించుకు కూర్చుని తింటుంటే మాకు వినోదంలా ఉండేది. మీరు భోజనం ముందు కూర్చుని ఏం కావాలన్నా అడగరు, ఎందుకడగడు అని పంతం మాది. మీరేం అనుకునేవారో అదంతా ఇప్పుడు తల్చుకుంటే"...నిజంగానే బాధపడ్తూ, సిగ్గుపడ్తూ అన్నాను. "భలేవారే, అప్పుడు మీకెంత వయసు, చిన్నతనంలో అలాంటి అల్లర్లు అంతా చేస్తారు. నాకేమో మీలాంటి అమ్మాయిల్ని కన్నెత్తి చూస్తే ఎవరేం అంటారోనని బిడియం, సిగ్గుగా ఉండేది. మీరంతా కల్సి నన్ను చూసి నవ్వడం. వేళాకోళం, చేయడం తెల్సినా పెద్దింటి పిల్లలు మీరు, మీతో ఎదురుపడగలనా" తేలిగ్గా నవ్వారాయన.
    "ఏమైనా అంత కష్టపడి మీరీనాడు ఈ స్థితికి వచ్చారంటే..."
    "అంతా భగవంతుడి కృప, మెట్రిక్ తర్వాత ఏ గుమస్తా ఉద్యోగమో చేద్దామనుకున్నా గాని స్కూల్ ఫస్ట్ వచ్చిన నన్ను హెడ్ మాస్టారుగారు ప్రోత్సహించి కాకినాడ కాలేజీకి పంపి స్కాలర్ షిప్ ఇప్పించి, అక్కడ పుస్తకాలు అవి కొనిచ్చి ఇంకో పెద్దవారి దగ్గర ఇంట్లో భోజన సదుపాయం చేసి చదివించారు. ట్యూషన్లు చెప్పుకుని, ఆ వ్యాపారి ఇంట్లో పద్దులు రాసిపెట్టి, ఈ పని ఆ పని చేసి నాలుగు డబ్బులు ఆర్జించుకుని చదువుకొని పైకి వచ్చాను. డబ్బు విలువ, చదువు విలువ తెల్సినవాడిని గనక మా పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ల ధ్యేయం అంతా చదువే అవ్వాలని నా చిన్నతనం అంతా ఎన్ని కష్టాలు పడింది చెప్పేవాడిని" అన్నారాయన.
    "ఏమిటో ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు, అన్ని వనరులు, సదుపాయాలూ కల్పించినా చదువుకోని పిల్లలు కొందరైతే, ఇక్కడ అక్కడా తిని చదువుకొని పైకి వచ్చినవారు కొందరు" అన్నాను.
    పెళ్లిచూపులయ్యాక అమ్మ దగ్గరికి తీసుకెళ్లాను. అమ్మని చూస్తూనే సాష్టాంగం పడిపోయి "అమ్మా, నన్ను గుర్తుపట్టారా, సాక్షాత్తూ అన్నపూర్ణమ్మగారేనమ్మా మీరు" అన్నారు జడ్జిగారు.
    అంత పెద్దమనిషి అలా కాళ్లమీద పడిపోతే అమ్మ గాభరా పడిపోయి "అయ్యో.. అదేమిటి బాబూ, లేవండి లేవండి, ఏమిటో పెద్దతనం గుర్తుకురావడం లేదు. ఎవరు బాబూ మీరు" అంది అమ్మ మొహమాటపడ్తూ.
    "నేనండి వెంకటరమణని. మీ ఇంట్లో వారం చేసుకున్న రమణనండి. గుర్తులేదా. రామచంద్రాపురంలో ఉండగా భోజనం పెట్టేవారు."
    "ఆ.. ఆ... ఆ రమణవా బాబూ. ఏమిటి జడ్జి అయ్యావా నాయనా..."
    ఉత్త జడ్జి కాదమ్మా, హైకోర్ట్ జడ్జి, ఈయన పిల్లలంతా డాక్టర్లు, ఇంజనీర్లయి విదేశాలలో ఉన్నారు. వీళ్ల అబ్బాయే శిల్పని చూడడానికి వచ్చిన పెళ్లికొడుకు" అమ్మకి కాస్త చెముడు వచ్చింది. గట్టిగా విడమర్చి చెప్పాను. వెంకటరమణ కొడుకుని పరిచయం చేసి ఆవిడకి దండం పెట్టించాడు.
    "సంతోషం బాబూ. పైకి వచ్చావు. నాకు తెలుసు ఏదో ఒకనాడు నీవు పైకి వస్తావని. చిన్నప్పుడు మా పిల్లలతో అనేదాన్ని. నీ బుద్ధిమంతనం చూసి నేర్చుకోమని."
    "అమ్మా! మా అబ్బాయికి మీ మనవరాలిని చేసుకుని మీరుణం కొంతైనా తీర్చుకునే అవకాశం ఇప్పించండి" దండం పెడ్తూ అన్నాడు. అంతా కాస్సేపు కూర్చుని లేచారు.
    పెళ్లివారు వెళ్లాక చిన్న చర్చ మొదలైంది. పెళ్లికొడుకు అందరికీ నచ్చినా అందరిలో ఏమూలో చిన్న అసంతృప్తిలాంటిది మెదిలింది. తాత ఆయవారపు బ్రాహ్మడు, తండ్రి వారాలు చేసుకుని వచ్చిన సామాన్య వంశం అన్నది అనిపించినా ఎవరూ ఆమాట అనలేదు. బ్రిటీష్ వాళ్ల హయాంలో లాయర్లు, డాక్టర్లు, ఐ.పి.ఎస్.లు అయిన తాతముత్తాతల వంశం నుంచి వచ్చిన పెళ్లికూతురు మరి. స్టేటస్ లో ఆంతర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
    "ఆ, వాళ్ల తాతలు ఏం చేస్తే మనకెందుకు, పెళ్లికొడుకు మంచి చదువు, ఉద్యోగం ఉంది" అన్నాడు మా అబ్బాయి.
    "అవుననుకో, సమాన వియ్య సమాన కయ్యం అంటారు. పిల్లనిచ్చినప్పుడు మనకంటే పైమెట్టువారికి, తెచ్చుకున్నప్పుడు కిందమెట్టునుంచి తెచ్చుకోవాలంటారు. ఇగో ప్రాబ్లమ్స్ తలెత్తకూడదు తరువాత" అన్నారాయన.
    "ఆ తండ్రి ఎప్పుడో ఏదో చేసినా ఇప్పుడు హైకోర్టు జడ్జిగా మన అంతస్థుకు సరిపోయేట్టే ఉన్నారు. అబ్బాయి బాగున్నాడు, బుద్ధిమంతుడు అన్నీ కుదరాలంటే ఎలా" అన్నాను.
    "ఏమో, నిర్ణయం శిల్పకే వదిలేద్దాం. దానికి అబ్బాయి ఫ్యామిలీ నచ్చితే మన అభ్యంతరం అనవసరం" అంది అమ్మాయి. "శిల్పా చెప్పు, నీకేం అభ్యంతరం లేదుగా" అల్లుడు అడిగాడు. "పిల్లాడు నచ్చాడా" తల్లి అడిగింది. శిల్ప తల ఊపింది. 'మరి ఫ్యామిలీ' తండ్రి అడిగాడు. శిల్ప ఒక్కక్షణం అందరివంక చూసి "మా తాతలు నేతులు తాగారు అని గొప్పలు చెప్పుకుంటూ డబ్బు, విలాసాల మధ్య బాధ్యతా రహితంగా పెరిగిన అబ్బాయిల కంటే కష్టం, సుఖం తెల్సి, చదువు విలువ తెల్సి స్వయంకృషితో పైకి వచ్చిన మనుష్యుల మెంటాలిటీ బెటర్ గా ఉంటుందనుకుంటాను. ఇంతకీ ఇప్పుడు వాళ్ళేం మనకి తగని అంతస్థులో లేరుగదా. మరెందుకు అభ్యంతరం వుండాలి. ఆ అబ్బాయి మంచివాడిలాగే, మానర్స్ తెలిసి, కల్చర్ ఉన్నవాడిలాగే ఉన్నాడు. సెన్సాఫ్ హ్యూమర్, ఇంటిలెజెన్స్ కనిపించింది మాటల్లో మాట్లాడిన కాసేపటిలో. మిగతాది మా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్, ఎడ్జస్ట్ మెంట్ బట్టి ఉంటుంది. మ్యారీడ్ లైఫ్ సాగాలంటే ఇద్దరం సర్దుకోవాలిగా మరి".
    'అమ్మ బాబోయ్! చిన్నపిల్ల అనుకున్న శిల్పలో ఇంత చక్కగా, ఇంతదూరం ఆలోచించే శక్తి ఉందా, మానోళ్ళు మూతపడేట్టు జవాబిచ్చింది. ఈ కాలం పిల్లలకి గతం గురించి చింతలేదు. వర్తమానంలో బతుకుతారు. భవిష్యత్తు గురించి బెంగలేదు. వాళ్లకి కావాల్సింది వర్తమానం. ఈ తరం పిల్లలు ఎంతైనా తెలివైనవారు మరి.

                                                                                        (ఆంధ్రప్రభ వీక్లీ - జూన్ 2002)

                                                                                        *  *  *  *  *

 Previous Page Next Page