ప్రభాకరాన్ని సుగుణని చూసిన క్షణం నుంచి రంగారావు మనసు మనసులో లేదు. ప్రతి క్షణం తన నీడ చూసి తనే బెదిరే స్థితికి వచ్చాడు. గీత ముందు కంగారుపడినా తరువాత అంతగా తెలిస్తే పెళ్ళి మానేస్తాడు. అంతకంటే ఏం చేస్తాడు అన్న మొండి ధైర్యం తెచ్చుకుంది. అన్నపూర్ణమ్మ అయితే ఈ పెళ్ళి గట్టెక్కించి మా పరువు నిలుపు దేవుడా అని ప్రతి క్షణం వేడుకుంటూనే వుంది. రంగారావు కాసేపు ప్రభాకరం దగ్గరకు వెళ్ళి నిజం చెప్పి క్షమాపణ కోరుదాం అనుకునేవాడు. మరుక్షణం అతను చూసికూడ వూరుకున్నప్పుడు తనెందుకు ఆ విషయం తిరిగి తవ్వడం అతనంతట అతను బైటపడితే చూద్దాం అని మరొకసారి అనుకునేవాడు.
"ఒకసారి వెళ్ళి ఆ ప్రభాకర్ తో జరిగింది చెప్పి క్షమాపణ చెప్పి గీత బ్రతుకు నాశనం చెయ్యవద్దని ప్రాధేయపడండి. వెళ్ళండి" అన్నపూర్ణమ్మ ఆఖరికి మనసులో వేదన అణచుకోలేక అంది.
"వెళ్ళమంటావా" సందిగ్ధంగా అన్నాడు రంగారావు.
"వెళ్ళండి కడుపునా దాచుకుని కుమిలి పోయేకంటే, తప్పుఒప్పుకుని క్షమించమంటే మనసు తేలిక పడుతుంది ఇలా ప్రతి క్షణం మన నీడచూసి మనమే బెదురుతూ ఎన్నాళ్ళు గడపగలం?" రంగారావు ఆలోచనలో పడ్డాడు.
అదే సమయంలో గీత, కృష్ణమోహన్ పబ్లిక్ గార్డెన్సులో వున్నారు. "మోహన్ నేచెపితే అబద్దాలులా కనిపిస్తాయి. నీవు నమ్మవుగానీ మళ్ళీ యివాళ సరోజ ప్రభాకరూ హోటల్లో నాకు కనిపించారు. తెలుసా!" అంది గీత నడుస్త్జూ.
"నిజంగానా, ఎక్కడ?" ఆశ్చర్యంగా అడిగాడు మోహన్.
"మా ఫ్రెండు, నేను టిఫిన్ తినడానికి హోటలికి వెడితే మేడమీదనుంచి యిద్దరూ దిగివస్తున్నారు. నన్ను చూసి ఎంతగాభరా పడిపోయిందో తెలుసా-ఏ టిఫినుకో అయితే మేడమీదనించి ఎందుకు వస్తారు. వాళ్ళిద్దరికీ ఏదో ఉంది మోహన్. నిన్న నీ వడిగితే ఏమంది?" ఆరాటంగా ఆరా తీసింది.
"ఏమంటుంది. ముందు బెదిరింది. తరువాత నీవబద్దం ఆడుతున్నావని బుకాయించింది. గీతకే మవసరం అబద్దం ఆడడానికి అని నిలేశాను. నీ రహస్యం తనకి తెలుసని నీవిలా అబద్దం పుట్టించావని! ఏమిటేమిటో చెప్పింది నీ గురించి" గీత మొహం పరిశీలిస్తూ అన్నాడు మోహన్. గీత మొహం వెలవెలబోయింది.
"అలా అందా తనకు తెలుసునా.....ప్రభాకరం చెప్పాడా-" పాలిపోయిన మొహంతో అంది.
"ఆ...ఎన్ని చెప్పిందో తెలుసా నీవు ప్రభాకరం ప్రేమికులట, నీవతన్ని బీదవాడని పెళ్ళిచేసుకోకుండా మోసం చేశావట....తరువాత ... అబ్బ....అవన్నీ నేను చెప్పలేను- వినలేకపోయాను. అందుకే నిన్ను అడుగుదామని యిక్కడికి రమ్మన్నాను" గీతని పట్టి పట్టి చూస్తూ అన్నాడు గీత ఒక్కక్షణం కలవరపడిపోయింది. గాభరాగా "అన్ని అబద్దాలు మోహన్, అన్నీ అబద్దాలు -నీవు నమ్మకు మోహన్ ఆ మాటలు....ఆ సరోజ.....నా మీద వున్నవి లేనివి పుట్టించి నీకు నాకు కాకుండా చెయ్యాలని దాని ప్లాను. దానిమాట నమ్మకు." కంగారుగా ఏదేదో అంది.
సరిగా అప్పుడు - దూరంగా ఓ చెట్టు దగ్గిర కూర్చున్న సరోజ, ప్రభాకర్ ని చూసి "చూడు - చూశావా నేచెబితే అబద్దాలనుకున్నావు -చూడు యిద్దరిని, యిప్పుడయినా నా మాట నమ్ముతావా - "గీత మరింత కంగారుగా కృష్ణమోహన్ చేయిపట్టుకులాగి అటువైపు చూపింది. కృష్ణమోహన్ అటే చూస్తూ కోపంగా వుండి "ఆ సరోజని నాలుగూ దులుపుతాను, నీ గురించి యిలాంటి అబద్దాలు యెందుకు చెప్పిందో అడుగుతాను. ఇన్నాళ్ళూ ఎంతో మంచిదనుకున్నాను. ఇంక ఇంట్లో వుండనీయను. రా, ప్రభాకర్ కూడా వున్నాడు. సరోజ మాటలన్నీ అబద్దాలని అతని చేతకూడా చెప్పిద్దాం" గీత చేయిపట్టుకుని అటువైపు తీసికెళ్ళడానికి ప్రయత్నించాడు. గీత చాలా ఉదారంగా "పోనిద్దూ - వాళ్ళతో మనకెందుకు, అనవసరం గొడవ - పద పోదాం. ఆ సరోజని యిప్పటికైనా యింట్లోంచి పంపేయి" అంటూ కృష్ణమోహన్ ని అటు వెళ్ళనీయకుండా మరోవైపు లాగింది. కాని అతను చాలా కోపంగా "అలా కాదు గీతా, నీ గురించి యిన్ని అబద్దాలు పుట్టించిన ఆ సరోజ మొహం దులపకుండా అంత సుళువుగా వదిలేయమంటావా. నా కాబోయే భార్య గురించి అంత నీచంగా మాట్లాడితే వింటూ వూరుకోవడానికి నేనేం పౌరుషం లేని వాడినికాదు. ఇన్నాళ్ళూ నా యింట్లో తిని యిప్పుడు నన్నే యింత అవమానిస్తుందా - పద అడుగుదాం - మనకేం భయం" గీత వారిస్తూన్నా, చేయి లాక్కుంటున్నా వినకుండా ఒక విధంగా బలవంతంగా గీతని బరబర లాక్కెళ్ళి నట్లే వెళ్ళాడు.
గీతని, కృష్ణమోహన్ ని చూసి సరోజ, ప్రభాకరం యిద్దరూ ఆశ్చర్యపడ్డారు. పలకరింపు ఉపోద్ఘాతం లెకుండానే కృష్ణమోహన్, సరోజవంక తీక్షణంగా చూస్తూ "సరోజా -నీవు గీత గురించి చెప్పిందంతా నిజమని ప్రభాకరం ముందు నిరూపించగలవా!" కరకుగా అడిగాడు. సరోజ అర్ధంకానట్టు తెల్లబోయి చూసింది -ప్రభాకరం ఆశ్చర్యంగా సరోజవంక, కృష్ణమోహన్ వంక, గీతవైపు మార్చి మార్చి చూశాడు - గీత బెదురు బెదురుగా చూస్తూంది.