Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 40


    "చూడమ్మా తప్పకుండా నాకు చాతనయినంతగా నయాన భయాన లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీ ఫోను నెంబరు వుంటే యీయండి, ఏం జరిగిందీ తెలియపరుస్తాను."
    విజయ బ్యాగ్ తీసి విజటింగ్ కార్డు అందించింది. అంతలోనే గుర్తువచ్చి బ్యాగులోంచి ఒక కాగితంతీసి, "ఇది మీరు అతనిమీద ఉపయోగించవచ్చునేమో. కాస్త బెదిరించి ప్రయత్నించండి. ఇది శారద ఆత్మహత్యాప్రయత్నం తలపెట్టినపుడు ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చాక ఆమె చేతిలో చూశాను." అంటూ విజయ కాగితం యిచ్చింది.
    ఆయన ఆ కాగితం అందుకుని చూసి "ఎస్ యూ ఆర్ రైట్, అతన్ని లొంగదీసుకునే సాధనంగా దీన్ని ఉపయోగించవచ్చు." అన్నాడు సాలోచనగా.
    "థాంక్స్ సార్. మీరీ ఉపకారం చేస్తే మేము మీ కేప్పటికీ కృతజ్ఞులుగా వుంటాము. ఏం జరిగిందీ ఫోను చేయండి" విజయ శారద నమస్కరించి లేచి శలవు తీసుకున్నారు.
    
                                                                       *    *    *
    
    ఆ రోజు పడకవేసిన శివరాం ఆ పడక పడక వారం రోజులు వళ్ళు తెలియని జ్వరంతో పక్కనంటిపెట్టుకుని వుండి పోయాడు. ఆ రోజు ప్రయాణపు బడలికతో వళ్ళునొప్పులు, తలనొప్పులు అనుకున్నాడు. అసలే శరీరం చిరాకుకి తోడు ఆరోజు శారదతో జరిగిన గొడవతో అతని మనసు స్థిమితం కోల్పోయింది. ఏమి చెయ్యాలో తోచని నిస్సహాయస్థితిలో పక్కమీద అశాంతిగా వాలిపోయాడు.
    ఆ పడుకోవడం సాయంత్రం ఐదింటికి గాని కళ్ళు తెరవలేదు. దాహంతో గొంతు ఎండిపోతూంటే జ్వరం, వళ్ళు నొప్పులు, తలనొప్పితో మూలుగుతూ "శారదా మంచినీళ్ళు" అన్నాడు నీర్సంగా. శారద లేదన్న సంగతి, ఉదయం జరిగింది అతనికి గుర్తేలేదు. ఎంతసేపటికి శారద రాకపోవడంతో గట్టిగా అరిచాడు. అప్పటికీ జవాబు రాకపోవడంతో అవమానంగా, పక్కమీదనించి లేవబోయాడు, లేవగానే తలతిరిగినట్లయి మళ్ళీ తలగడమీద వాలిపోయాడు. కళ్ళకి చీకట్లు కమ్మినట్టయింది. కళ్ళు తెరవలన్నా బరువుగా అన్పించి తెరవలేకపోయాడు. మరో రెండు నిమిషాలకిగాని అతని స్థితి అతనికి అర్ధం గాలేదు. అది అర్ధం అయ్యాక నెమ్మదిగాఉదయం శారదతో జరిగిన ఘర్షణా, శారద వెళ్ళిపోవడం గుర్తువచ్చి ఒక్కసారిగా ఎందుకో గుండె ఝల్లుమంది. శారదలేదు, తనకు ఇంత జ్వరం ఎలా...ఏం చేయడం అన్న సంగతి తల్చుకోగానే అతనికి ఏదో తెలియని జంకుతో గుండె దడదడలాడింది. శివరాం దేహస్థితి, మనస్థితి ఆ ఒక్క అరగంటలో దిగజారిపోయి శారదతో తగవు తెచ్చుకున్నం దుకు మనసులో ఏదోమూల పశ్చాత్తాపంలాంటిది మెదిలింది. అంతకంటే ఆలోచించే ఓపిక లేకపోయింది ఆ క్షణంలో అతనికి. అలాగే నెమ్మదిగా లేచి ఎదిరింటివాళ్ళని గది పక్కింటివాళ్ళని కాని పంపడానికి వీధిలోకి వచ్చాడు. వీధిలో ఆడుకుంటున్న ఒక పిల్లవాడిని నెమ్మదిగా పిలిచి ఎదిరింటి ఆయన్ని ఒక్కసారి రమ్మని కబురంపాడు.
    ఆయన వస్తూ శివరాం స్థితిచూసి "అదేమిటలా వున్నారు!" అన్నాడు ఆశ్చర్యంగా.
    "జ్వరమండీ. పొద్దుటినించీ చాలా జ్వరంగా వుంది. కాస్త ఎవరినైనా పంపి డాక్టరు నెవరినైనా పిలిపించగలరా. అలాగే మా అప్పలమ్మకి కాస్త కబురు పంపండి. ఇంత కాఫీగాని హార్లిక్స్ గాని చేసియిస్తుంది. ఉదయంనించి ఏం తాగలేదు" నీర్సంగా అన్నాడు.
    "అయ్యో. అదేం మీ ఆవిడ ఊరినించి వచ్చినట్లు న్నారే. ఆవిడ లేరా ఏమిటి?" శారద ఉదయం మళ్ళీ వెళ్ళి పోవడం చూసీ ఏం తెలీనట్లు ఆరా తీసాడాయన.
    శివరాం జవాబు ఏం చెప్పాలో తెలియక తడబడి పోయాడు. "లేదు...లేదావిడ. ఊరికివెళ్ళింది." గొణిగాడు.
    ఆయన నమ్మలేనట్లు చూశాడు.
    "అదేం ఊరినుంచే వచ్చి మళ్ళీ వెళ్ళారు. అవును. ఉదయం ఆవిడా విసురుగా ఇంట్లోంచి వెళ్ళారు. మీరేదో కోపంగా అరుస్తున్నారు. మళ్ళీ తగవులాడారా..."
    ఆయన ఆరాలు చూస్తుంటే శివరాం వళ్ళు వుడికిపోసాగింది. కాని ఏమనలేని నిస్సహాయస్థితిలో పడిపోయాడు. "ఆ, ఏంలేదు. ఏదో గొడవ" గొణిగాడు.
    "చూడు నాయనా. నీవేం అనుకోకుగాని, ఉదయమే చెప్పానుగదా. ఇకపైనన్నా కాస్త జాగ్రత్తగా వుండాలని, ఆ అమ్మాయిని బాధపెట్టకు అని! ఇప్పుడేం అయిందో చూశావా. ఇలా వళ్ళు తెలియని జ్వరంలో వుంటే నీళ్ళిచ్చే దిక్కన్నా లేకుండా అయిపోయావు. ఇంటికి యిల్లాలు వుండాలి అబ్బాయి! ఎంతవున్నా, ఇల్లాలులేని లోటు తీరదు. చూడు, ఇప్పుడు నీ అవస్థచూడు! అయినా అంత తొందర ఆవేశం పనికిరాదు. ఎంత భార్య అయినా ఎంత కని వాళ్ళు మాత్రం సహిస్తారు."
    శివరాంని అవమానం. కోపం నిస్సహాయత ముంచెత్తాయి. అయినా అవతల పెద్దాయన! ఏమనగలడు! తన ద్వేషం కల్గింది. తనని కాదని ఎంత నిర్లక్ష్యంగా వెళ్ళి పోయింది! తనని నలుగురిలో లోకువ చేయడానికే కదా! లేకపోతే యీయన యింత ధైర్యంగా ఇలా విమర్శించగలిగేవాడా -
    నల్లబడిన శివరాం మొహం చూసి ఆయన ఉపన్యాసం ఆపి, "సరే జరిగిందేదో జరిగింది. ఆవిషయం తరువాత ఆలోచించవచ్చు. ముందుకాస్త హార్లిక్స్ పంపిస్తాను మాఇంట్లోంచి తాగండి. తరువాత డాక్టరుకి కబురు పెడ్తాను" అన్నారు సీతారామమూర్తిగారు.
    "అప్పలమ్మకి కూడా కాస్త కబురు పెట్టండి."
    మూర్తిగారు తలఊపి వెళ్ళారు.

 Previous Page Next Page