Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 40


                                        పితృదేవోభవ

    అద్వితీయమైన శ్రద్ధతో, అనన్య సామాన్యమైన దీక్షతో, తన తల్లిదండ్రులను దైవస్వరూపులుగా భావించి సేవించిన పవిత్ర చరిత్రుడు ధర్మవ్యాధుడు. ధర్మవ్యాధుడు మిథిలానగరంలో నివసిస్తూ ఉండేవాడు. అతడు కిరాతక జాతిలో పుట్టినవాడైనా పూర్వజన్మ పుణ్యం వల్ల ధర్మబుద్ధినే అలవరచుకున్నాడు. సజ్జనులతో సహవాసం చేసి సన్మార్గాన్నే అవలంబించాడు. వృద్ధులైన తల్లిదండ్రులకు శ్రద్ధగా సేవలు చేస్తూ, వంశ పరంపరగా వస్తున్న కులవృత్తినే అనుసరిస్తూ హాయిగా జీవనం చేస్తున్నాడు ధర్మవ్యాధుడు.
    నిర్మల హృదయుడైన ధర్మవ్యాధుడు నిత్యమూ సత్యమే పలికేవాడు. పెద్దలతో వినయంగా పిన్నలతో స్నేహంగా కలసి మెలసి ఉండేవాడు. కలిగిన దానితో తృప్తిపడుతూ, బంధుమిత్రులను ఆదరిస్తూ, పేదసాదలను కనికరిస్తూ, అతిథులకు మర్యాదచేస్తూ ధర్మవంతుడని పేరుపొందాడు ధర్మవ్యాధుడు.
    ఒక రోజున ధర్మవ్యాధుడు అంగడి వీధిలో కూర్చుని మాంసఖండాలు అమ్ముకుంటున్నాడు. సరిగా ఆ సమయంలోనే అతని దర్శనం కోసం "కౌశికుడు" అనే మహాపండితుడు అక్కడికి విచ్చేశాడు. కాని దుర్గంధ దూషితమైన ఆ మాంసపు దుకాణాన్ని చూసేసరికి కౌశికుడికి చాలా అసహ్యం కలిగింది. ఆయనకు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్ళటానికి మనస్కరించలేదు. అందువల్ల ఆయన ఆ సమీపంలో ఉన్న ఒక అరుగుమీద కూర్చుని 'ఏమి చేయాలా' అని ఆలోచిస్తున్నాడు.
    "ఛీ ఛీ! ఇదేమిటీ! ఈ పాపిష్ఠి చోటికి వచ్చి పడ్డానేమిటీ? ఈ మాంసం అమ్ముకొని బ్రతికేవాడి దగ్గర ఏం మహత్వం ఉంటుందీ? ఇతడేదో మహాజ్ఞాని అనీ, మహానుభావుడనీ ఆ పతివ్రత అంతగా చెప్పిందే! మరి ఇటువంటి వాడికి ఏం ధర్మాలు తెలుస్తాయి? ఇతని దగ్గర నేను గ్రహించవలసిన ధర్మరహస్యాలు ఏముంటాయి?" అని తనలో తాను తికమకలు పడుతున్నాడు పండితకౌశికుడు.
    అంతలోనే ధర్మవ్యాధుడు అతని దగ్గరకు పరుగెత్తి వచ్చి "ఓహో! కౌశికస్వాములవారు దయచేశారా? రండి. రండి. మీ కోసమే వేయికళ్ళతో ఎదురు చూస్తున్నాను." అని అతనిని ఆదరంగా ఆహ్వానించాడు. అతని మాటలు వినగానే పండిత కౌశికుడికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. "అరే! నాకోసం ఎదురుచూస్తున్నానంటాడేమిటీ! నేను వస్తున్నానని ఇతనికెలా తెలిసిందీ! నాపేరు ఇతనికెవ్వరు చెప్పారు?" అనుకున్నాడు పండిత కౌశికుడు.
    ధర్మవ్యాధుడు చిరునవ్వు నవ్వుతూ "అలా ఆశ్చర్యపడకండి స్వామీ! రండి. మిమ్మల్ని ఆ బ్రాహ్మణకాంత ఇక్కడికి పంపిందని నాకు తెలుసు. నా దగ్గర ధర్మరహస్యం గ్రహించటానికి మీరు వచ్చారని నాకు తెలుసు. చాలా సంతోషం స్వామీ! రండి. మా ఇంటికి దయచేయండి." అన్నాడు ఆదరంగా.
    ఆ మాటలు విని మరింత ఆశ్చర్యపడ్డాడు పండిత కౌశికుడు. "ఓహోహో! ఇది మరీ విచిత్రంగా ఉన్నదే! ఎక్కడో జరిగే సంగతులన్నీ ఇట్టే గ్రహించే మహాప్రభావం ఆ పతివ్రతకు మాత్రమే ఉన్నదనుకున్నాను. కాని ఆ దివ్యజ్ఞానం నీకూ ఉన్నదన్న మాట! ఆమె కూడా ఇలాగే నా కోపాగ్నిలో భస్మమైపోయిన కొక్కెర సంగతి కూడా ఒక్క మాటుగా చెప్పేసింది. నీవు కూడా నా పేరేమిటో, నేను ఎక్కడినుండి వచ్చానో, ఎందుకు వచ్చానో ఇట్టే గ్రహించావు!" అన్నాడు పండిత కౌశికుడు.
    ధర్మవ్యాధుడు సవినయంగా "చిత్తం. స్వామీ! రండి. ముందు మా ఇంటికి వెళదాం రండి. నీడపట్టున తీరికగా కూర్చుని విశ్రాంతిగా అన్ని విషయాలూ మాట్లాడుకుందాం." అని వేడుకున్నాడు. పండిత కౌశికుడు అంగీకరించాడు. ధర్మవ్యాధుడు అతనిని వెంటబెట్టుకొని ఇంటికి చేరుకున్నాడు. పండిత కౌశికుడికి ఆదరంగా అతిథిమర్యాదలు చేశాడు ధర్మవ్యాధుడు.
    ధర్మవ్యాధుని వినయసంపదకూ శాంతస్వభావానికీ పరమానందం పొందాడు పండిత కౌశికుడు. ధర్మవ్యాధుడు అతనిముందు నిలిచి "ఆర్యా! మీ చరిత్ర ఏమిటీ? మీరు ఆ బ్రాహ్మణకాంతను ఎప్పుడు చూశారు! ఆమె మహత్వం ఎలా గ్రహించారు?" అని అడిగాడు.
    పండిత కౌశికుడు గంభీరమైన కంఠంతో "ధర్మవ్యాధా! నేను సమస్త శాస్త్రాలూ చక్కగా చదివిన మహాపండితుణ్ణి. నన్ను "పండిత కౌశికుడు" అంటారు. నాకు సంసార సౌఖ్యాలమీద అంతగా ఆసక్తి లేకపోవటంవల్ల చిన్నతనంలోనే తల్లిదండ్రులనూ బంధుమిత్రులనూ అందరినీ విడిచి చాలాకాలం ఏకాంత జీవనం గడిపాను. ఎంతోకాలం తపోదీక్షలో కదలకుండా కూర్చున్నాను. లోకకల్యాణానికి మార్గాలు వెదికాను. కాని మంచిమార్గం గోచరించలేదు. అందువల్ల నాకు మనశ్శాంతి లభించలేదు. ఒకనాడు నేను వేదపాఠాలు వల్లెవేస్తూ ఒకచెట్టుక్రింద కూర్చొని ఉన్నాను. ఆ సమయంలోనే ఆ చెట్టు మీద ఉన్న గ్రుడ్డికొక్కెర నామీద రెట్టవేసింది. నాకు పట్టరాని కోపం వచ్చింది. "ఛీ! ఈ కొక్కెర నాశనం గాను." అని నేను ఒక్కమాటు గ్రుడ్లెర్రజేసి పైకి చూశాను. ఆ మరుక్షణంలోనే కొక్కెర నేలమీదపడి గిలగిలకొట్టుకొని చచ్చిపోయింది. అప్పటినుంచీ నా తపోబలం మీద నాకు గట్టి నమ్మకం పుట్టుకొచ్చింది. నా ఆత్మశక్తి మీద చాలా విశ్వాసం ఏర్పడింది. నానోటిమాట ఎంత శక్తివంతమైనదా అని గర్వపడ్డాను. నేను సాక్షాత్తూ ఫాలనేత్రుడైన పరమశివుణ్ణే అని భావించాను.
    అంతులేని అహంకారంతో నేను భిక్షకోసం ఊరిలోనికి వెళ్ళాను. ఒక బ్రాహ్మణ గృహం ముందు నిలబడి "భవతి భిక్షాందేహి" అని అరిచాను కాని ఎవ్వరూ బదులు పలుకలేదు. ఆ ఇంటిలోని ఇల్లాలు నన్ను చూసి కూడా పతిసేవలో నిమగ్నురాలై లోపలనే ఉన్నది. ఎంతోసేపు నిలబడి నిరీక్షించాను. కాని ఆమె భిక్షతెచ్చి పెట్టలేదు. నాకు చాలా ఆగ్రహం కలిగింది. నా వంటి మహానుభావుణ్ణి అనాదరంగా బయటపెట్టి అవమానించినందుకు ఆమెను గూడా గ్రుడ్డికొక్కెరవలె నా శాపాగ్నిలో దగ్ధం చేద్దామనుకున్నాను.
    అంతలోనే ఆ ఇల్లాలు బయటకు వచ్చి భిక్ష పెట్టపోయింది. నేను మహాగ్రహంతో మండిపడుతూ "మూర్ఖురాలా! మహాతపశ్శాలి నైన నన్ను ఇంతసేపు ఇక్కడ నిలబెట్టి పతిసేవలో కాలం గడుపుతావా? సామాన్యుడైన నీ భర్త మహాద్భుతశక్తి మంతులమైన మా కంటె గొప్పవాడా? వెంటనే వచ్చి మాకు భిక్ష అర్పించకుండా ఇంత ఆలస్యం చేస్తావా? మమ్మల్ని అవమానిస్తావా? ఎంత దుర్మార్గం! ఎంత దుస్సాహసం! నేను కన్నులు తెరిచానా నీవు సర్వనాశనమైపోతావు తెలుసా?" అని గద్దించి పలికాను. నా గర్జనలకు ఆ ఇల్లంతా దద్దరిల్లిపోయింది. విన్నవారంతా గజగజలాడిపోయారు. కానీ ఆ సాధ్వీమణి మాత్రం తొణకలేదు. బెణకలేదు. ఆ పతివ్రత నిర్భయంగా అలాగే నిలబడి "ఆపవయ్యా! పిచ్చి బ్రాహ్మణుడా! నీ కోపతాపాలు కొంచెం కట్టిపెట్టు. నీకంటి మంటలో భస్మం కావటానికి నేనేమీ కొక్కెరను కానులే!" అన్నది నిర్భయంగా.

 Previous Page Next Page