ఇప్పుడు అధికారంలో వున్న జనరల్ భోజాని, పదవీచ్యుతుడిని చేసి, పారిపోయి ఇండియాకి వచ్చి తలదాచుకుంటున్న భోజా ప్రత్యర్ధి జుగ్ నాద్ ని గద్దె ఎక్కిస్తే, అప్పుడింక పెంపుడుకుక్కలా తన కాళ్ళు నాకుతూ, తనేం చెయ్యమంటే అదిచేస్తాడు జుగ్ నాద్.
జుగ్ నాద్ కి చిత్రద్వీప్ దేశాధికారం అప్పగించే ముందు అక్కడ వున్న యురేనియం నిక్షేపాలు తనకు స్వాధీనం చేసేటట్లు ఒప్పందం చేసుకుంటాడు.
దేశంకాని దేశంలో తలదాచుకుంటున్న జుగ్ నాద్ తనకి పదవి వస్తుందన్న ఆశతో ఏ ఒప్పందానికైనా ఒప్పుకుంటాడు.
సన్నగా చెమటలు పోశాయి బాబూజీకి.
చిత్రద్వీప్ అధినేత జనరల్ భోజాని పదవీచ్యుతుడిని చెయ్యడం:
జుగ్ నాద్ ని ప్రెసిడెంట్ ని చెయ్యడం:
అనుకున్నంత సులభమా ఇది?
సులభం కాకపోవచ్చు. కానీ దుర్లభం కూడా కాదు.
తను ఇక్కడ పురుషోత్తం కేసులో చెయ్యబోతున్న పనినే అక్కడ చేస్తాడు.
ఇక్కడ లక్షలు ఖర్చు కావచ్చు:
అక్కడ కోట్లు ఖర్చవచ్చు:
కానీ ఫలితం ఎంత అద్భుతంగా వుంటుంది:
చిత్రద్వీప్ - జనరల్ భోజా - జుగ్ నాద్ ఎలా?
ఎవరివల్ల అవుతుంది ఆ పని?
* * * *
హాంగ్ కాంగ్...
హాంగ్ కాంగ్ అంటే రెండొందల ముప్ఫయ్ ఆరు ద్వీపాలసముదాయం అన్నమాట. ప్రస్తుతం బ్రిటన్ పాలనలో వుంది హాంగ్ కాంగ్: కొద్ది సంవత్సరాలలో లీజ్ గడువు తీరగానే తిరిగి చైనాలో కలిసిపోతుంది అది. జనాభాలో తొంభై ఎనిమిది శాతం చైనీయులు. వీళ్ళుకాక ఇండియన్లు, బ్రిటిష్ వాళ్ళు, అమెరికన్లు, జపనీయులు, ఫిలోపినోస్ వీళ్ళందరూ కలిసి మిగతా రెండు శాతం. ఈ రెండు శాతం జనాభానీ అక్కడి చైనీయులు 'గ్వాలియా' (విదేశీ పిశాచాలు) అని పిలుస్తారు.
అన్ని ద్వీపాలలోకీ ముఖ్యమైన హాంగ్ కాంగ్ ద్వీపంలోని ఒక ఎత్తయిన భవంతిలో నలభయ్యో అంతస్థులోని లగ్జరీఫ్లాట్ లో వుంటోంది ఇండస్ట్రియలిస్టు బాబూజీ కూతురు అప్సర: అక్కడనుంచే ఆమె తన తండ్రి బిజినెస్ సామ్రాజ్యభారాన్ని సగం తన భుజంమీద వేసుకుని నడిపిస్తూ వుంటుంది. దగ్గరలోనే వున్న మరో ద్వీపం కౌతాన్ లో ఆమె ఆఫీసు వుంది.
రోజూ పదినుంచి ఐదుదాకా పనిచేసేవాళ్లు అనేకమంది వుంటారు ఈ ప్రపంచంలో. తిండీతిప్పలూ మర్చిపోయి, తెల్లారిన మొదలుకుని రాత్రిదాకా పనిచేసేవాళ్ళు తక్కిన వాళ్ళకంటే ఎక్కువగా విజయాలు సాధిస్తూ జీవితంలో పైకి వస్తూ వుంటారు.
తిండీ తిప్పలతో బాటు, నిద్రకూడా వదిలేసి, ఇవాళ పొద్దున్నుంచి రేపు తెల్లవారుఝాముదాకా పని చెయ్యగలిగినంత ఓపికా, పట్టుదలా ఉండే మరోరకం మనుషులు వున్నారు.
వీళ్ళే ప్రతిరంగంలోనూ పొజిషన్లకి చేరుకుంటూ ప్రపంచాన్ని ఏలెయ్యగల స్థితిలో వుంటారు.
ఆ కేటగిరీకి చెందినదే అప్సర. రోజుకి ఇరవై నాలుగు గంటల చొప్పున, వారానికి ఏడు రోజులు నిర్విరామంగా పని చెయ్యగలదు తను. అలాగే చేస్తోంది యూనివర్సిటీ చదువు పూర్తయినప్పటినుంచి.
ఇవాళా అంతే -
సెక్రటరీ టైప్ చేసిన చివరి లెటరు చదివి. సంతకం పెట్టి, ఒళ్ళు విరుచుకుని రిస్టువాచ్ చూసుకునే సరికి తెల్లవారుఝామున నాలుగుంబావు అయింది.
మళ్ళీ సరిగ్గా ఆరింటికి ఒక అర్జెంటుపని ఉంది తనకి.
నిద్ర అన్నా మానుతుందిగానీ, ఎక్సర్ సైజ్ లు మాత్రం మానదు అప్సర. అందుకే ఎన్నిరోజులు గడిచినా తను ఒక్క కిలో బరువు పెరగదు. ఒక్క కిలోబరువు తరగదు కూడా.
తన ఎక్సెలెంట్ ఫిగర్ చెడిపోకుండా బహు జాగ్రత్తగా కాపాడుకుంటుంది ఆ అమ్మాయి. నాలుగున్నరకి బెడ్ మీద పడుకుంది అప్సర.
ఐదింటికల్లా మళ్ళీ లేచింది.
ఇరవై నిముషాలు యోగా -
ఇరవై నిమిషాలు ఎక్సర్ సైజ్ -
ఇరవై నిమిషాలు తను రెడీ కావటానికి.
ఆరింటికల్లా ఫ్లాట్ లోనే ఉన్న ఆఫీసు రూమ్ లోకి అడుగుపెట్టింది అప్సర. రాత్రంతా నిద్రలేని అలసట ఆమె కళ్ళలో అసలు కనబడటమే లేదు.
ఆరు నుండి ఏడు దాకా ఆఫీసులో పని.
ఏడు నుండి తొమ్మిది దాకా కౌతాన్ ఆఫీసులో పని.
తొమ్మిదిన్నరకి హాంగ్ కాంగ్ గవర్నర్ తో ఇంటర్వ్యూ.