పన్నెండున్నరకి తన ఫ్లాట్ కి వచ్చి ఫైళ్ళు అన్నీ చూసింది.... న్యూయార్కుకి ఫాక్స్ మెసేజెస్ పంపింది. లండన్ కి అర్జెంట్ కాల్ బుక్ చేసింది.
మళ్ళీ గంటన్నరకి అబర్డీన్ మెరీనా క్లబ్ లో (ఆ క్లబ్ లో ప్రవేశించాలంటే ఎంట్రన్స్ ఫి దాదాపు మూడు లక్షల పదిహేనువేల రూపాయలు అవుతుంది) అమెరికన్ బిజినెస్ మాన్ మైకేల్ తో లంచ్.
ఒంటిగంటకు ఇంకా అయిదు నిమిషాలుందనగా అబర్డీన్ మెరీనా క్లబ్ కి చేరుకుంది అప్సర.
సౌఖ్యంగా ఉన్న కుర్చీలో కూర్చున్న తర్వాత అప్పుడు మొదటిసారిగా అనిపించింది ఆమెకి.
ఏమిటి పరుగులు? పరుగుల జీవితం?:
ఎందుకీ స్పీడు? ఎందుకీ ఆరాటం? ఏం సాధించడానికి? యెవర్ని ఉద్ధరించటానికి?
ఒక్కసారిగా స్మశాన వైరాగ్యం లాంటిది ఆవరించింది.
డబ్బు సంపాదిస్తోంది తను అపారంగా, అనంతంగా:
కానీ దానికి పరమావధి ఏమిటి?
కంటికి నిద్రలేకుండా, మనసుకి విశ్రాంతి లేకుండా... డబ్బు... డబ్బు... ఇంకా ఇంకా డబ్బు... ఏం చేసుకోను?
హఠాత్తుగా ఆమెకి గుర్తువచ్చింది. ఇందాక తన డ్రైవరు ట్రాఫిక్ సిగ్నల్ కోసం కారుని ఆపినప్పుడు పక్కనుండి ఒక అరడజనుమంది స్కూలుపిల్లలు ఏదో పాటని అందరూ కలిసి లయబద్ధంగా పాడుతూ వెళుతున్నారు.
ఏమిటా పాట?
నుదురు చిట్లించి గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించింది అప్సర.
కొన్ని చరణాలు మాత్రమే గుర్తువచ్చాయి.
"హాపీనెస్... హాపీనెస్... హాపీనెస్ ఈజ్ ఫ్రీ..."
పదాలు సరిగా గుర్తులేకపోయినా, అర్థం మాత్రం ఎందుకో తనకి మనసుకి హత్తుకుపోయింది.
"సంతోషం అనేది డబ్బుతో కొంటే దొరికేదికాదు.
సంతోషం ఉచితంగా లభిస్తుంది.
ఎదుటి వాళ్ళకు సంతోషం కలగజేయుటలోనే
నీకు సంతోషం దొరుకుతుంది"
అలా సాగిపోయింది ఆ పాట:
అసలు ఆ పాట ప్రభావమేనేమో, ఇవాళ తనకు ఈ అసంతృప్తి:
వద్దనుకున్నా గుర్తువస్తూనే ఉంది ఆ పాట.... చెవుల్లో రింగుమని మోగుతున్నట్లు మాయామర్మం తెలియని ఆ చిన్నపిల్లల గొంతులు.
"హాపీనెస్... హాపీనెస్... హాపీనెస్ ఈజ్ ఫ్రీ..."
ఇప్పుడీ అమెరికన్ బిజినెస్ మాన్ ని ఎందుకు కలుసుకోబోతోంది తను?
బిజినెస్ ఇంకా పెంచుకోవడం కోసం.
డబ్బు ఇంకా సంపాదించడం కోసం.
అంతే:
డబ్బు... డబ్బు... డబ్బు...
కుర్చీలో అసహనంగా కదిలింది అప్సర. టైమ్ చూసుకుంది... ఇంకా రెండు నిముషాలు ఉంది మైకేల్ రావడానికి.
చటుక్కున ఒక నిర్ణయానికి వచ్చి, లేచి నిలబడింది అప్సర. అది గమనించిన స్టివార్డ్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని మొహంలో ఆదుర్దా కనబడుతోంది.
"ఏం మేడమ్: వెళ్ళిపోతున్నారు?"
"ఏమీలేదు. ఇంకేదో అర్జెంటుపని గుర్తువచ్చింది" అని చకచక బయటికి నడిచింది అప్సర. ఇరవై నిముషాల్లో తన ఫ్లాట్ చేరుకుంది.
తన ఫ్లాట్ శుభ్రంచేసే మెయిడ్ తను ఉన్నప్పుడు వచ్చి పనికి యిబ్బంది కలిగించదు.... తను లేనప్పుడు ఎప్పుడో వచ్చి గుట్టుచప్పుడు కాకుండా పని చేసుకుని వెళ్ళిపోతుంది.... డూప్లికేట్ వుంటుంది ఆమె దగ్గర.
ఫ్లాట్ కి వెళ్ళేసరికి మరియం బెడ్ రూమ్ ఊడుస్తోంది తను కేరళ అమ్మాయి. దాదాపు తన వయసే: తనలాగే వుంటుంది ఒడ్డూ పొడుగూ కూడా.
కాసేపు తదేకంగా మరియం వైపు చూసింది అప్సర. తరువాత అంది-
"మరియం: ఓపని చెబుతాను. చేస్తావా?"
వినయంగా అంది మరియం "తప్పకుండా మేడం:"
"అయితే నువ్వు వేసుకున్న బట్టలు విప్పేసి నాకు యిచ్చెయ్... వార్డ్ రోబ్ లో వున్న నా బట్టల్లో నీకు నచ్చినవి తీసుకుని వేసుకో ఇప్పుడే"
కళ్ళు పెద్దవి చేసి చూసింది మరియం.
"ఎందుకు మేడం?"
"అవన్నీ అడగకు: చెప్పినట్లు చెయ్:"
సందిగ్ధంగా తల పంకించింది మరియం. వార్డ్ రోబ్ తెరిచి పట్టుకుంది అప్సర. ఆశగా అన్ని డ్రెస్సులనీ పరికించాయి మరియం కళ్ళు.
"ఊఁ: నీకు ఏది కావాలంటే అది తీసుకో. సందేహించకు" అంది అప్సర.