అదృష్టదేవతకు తనంటే మిక్కిలి మక్కువ అని నమ్మకం కలిగింది జనరల్ భోజాకి.
* * * *
ఈ పదిరోజుల నుంచి బుర్ర పగిలిపోయేలా ఆలోచిస్తున్నాడు బాబూజీ.
అపారమైన, యురేనియం నిక్షేపాలు వున్నాయి చిత్రద్వీప్ లో. ఆ సంగతి ప్రస్తుతం తనొక్కడికే తెలుసు.
ఆ సంగతి తెలిసిన మరో వ్యక్తి రామనాధం ఏమయ్యాడో తెలియదు.
కానీ-
జనరల్ భోజాకి తెలియకుండా ఆ యురేనియం తన సొంతం చేసుకోవడం ఎలా?
ఇది ఎడతెగని ఆలోచన:
ఆ రోజుకూడా టెర్రస్ మీద కూర్చుని విస్కీ నెమ్మదిగా చప్పరిస్తూ ఆలోచిస్తూ ఉంటే వచ్చాడు మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరావు.
కుశలు ప్రశ్నలూ, మర్యాదలూ అయ్యాక అన్నాడు బాబూజీ.
"ఊరకరారు మహాత్ములు: చెప్పండి వచ్చిన పనేమిటో?"
"మీకు తెలియనిది ఏముంది? ఎన్నికలు దగ్గరికొస్తున్నాయ్" అన్నాడు పురుషోత్తమరావు.
చిన్నగా నవ్వాడు బాబూజీ. అతనికి తెలుసు. రాజకీయవేత్తలు ఎన్నికలు గెలవాలంటే తనలాంటి బడా పారిశ్రామికవేత్తల సహకారం కావాలి.
లేదా గూండాలను కలుపుకోవాలి.
ఈ ముగ్గురూ కలిస్తే ఇంక తిరిగే ఉండదు.
"ఇదివరకోసారి పదవిలో వుండి దేస్సేవ చేశారుగా? మోజు తీరలేదా:" అన్నాడు బాబూజీ విలాసంగా.
"ఒకసారి పవరు రుచి చూసిన తర్వాత ఇంక వదలడం సాధ్యమేనా బాబూజీసాబ్: అంతకుముందు గెలిచినా మొన్న ఎన్నికలలో ఓడి పోయాను నాకు బొత్తిగా గిట్టనివాడు వాడొకడు గెల్చాడు. నాకు తల కొట్టేసినట్లుంది ఈసారి నేను నిలబడకా తప్పదు. గెలవకా తప్పదు. గెలవాలంటే ఆశీర్వాదం కావాలి."
బాబూజీ ఆశీర్వాదం క్రితం ఎన్నికలలో తన ప్రత్యర్ధికి ఉండిందనీ అందువల్లనే అతను ఎలెక్షను గెలిచాడనీ పురుషోత్తమరావుకి తెలుసు.
బాబూజీ కింగ్ మేకర్: తల్చుకుంటే నందిని పంది చెయ్యగలడు.
కావాలంటే కోతిని తీసుకొచ్చి అయ్యవార్ని చెయ్యగలడు. అవసరమైతే అయ్యవారిని కాస్తా కోతిగా మార్చెయ్యగలడు.
ఆఘటనా ఘటనా సమర్థుడతను.
కాసేపు ఆగి, ఆనాడు బాబూజీ. "మొన్నటి ఎలక్షన్లలో మీ అపోజిషన్ వాడు వచ్చి నా చుట్టూ తిరిగిన మాట నిజమే అనుకో: వాణ్ని గెలిపించాను. కానీ నాకే ఎదురు తిరిగాడు వాడు. బాగా డబ్బు చేసుకున్నాడు ఈసారి గోదాలోకి దిగాడంటే ఎంతంటే అంత ఖర్చుపెట్టగలడు. కాబట్టి ఈసారి నేను ప్రచారానికీ, పంచిపెట్టడానికీ డబ్బు సరిపోదు. ఆ పని అవతలవాడు చేస్తాడు" అని ఆగాడు.
"మరి?" అన్నాడు పురుషోత్తమరావు ఆదుర్ధాగా.
ఒక్కొక్క అక్షరం విడివిడిగా పలుకుతూ అన్నాడు బాబూజీ "వాడిమీద బాంబువేయిస్తే పీడా విరగడవుతుంది. వాడు చస్తే, మళ్ళీ అంతగట్టి కేండిడేట్ మీ అపోజిషన్ పార్టీ వాళ్ళకి వెంటనే దొరకడం కష్టం:"
"బాంబు వెయ్యడమా? చాలా పెద్ద పనే:" అన్నాడు పురుషోత్తమరావు సంశయంగా.
తేలిగ్గా అన్నాడు బాబూజీ. "అది నీకు పెద్దపని కావచ్చు. కానీ నాకు కాదు. కానీ వాణ్ని చంపిస్తాను. నీకున్న అడ్డు తొలగించి నిన్ను గెలిపిస్తే నాకు ఒరిగేదేముంటుంది?"
తలవంచి వినయంగా అన్నాడు పురుషోత్తమరావు.
"నేను గెలిస్తే ఇంక మీ గులామునే అనుకోండి: సర్వదా మీ సేవకు సన్నిద్ధం:
"పురుషోత్తం: వెళ్ళు: నిన్ను గెలిపించే బాధ్యత నాది:" అన్నాడు బాబూజీ.
నమస్కరించి వెళ్ళిపోయాడు పురుషోత్తమరావు.
ఈసారి ఎలెక్షను తర్వాత అసెంబ్లీలో కనీసం పదిమంది ఎమ్మెల్ల్యేలు 'తనవాళ్ళు' వుంటారని లెక్కవేసుకున్నాడు బాబూజీ.
తను: కింగ్ మేకరు:
పదవిలో నుంచి దిగిపోయి, మూల కూర్చున్నవాడిని తీసుకొచ్చి పవరులోకి ఎక్కిస్తున్నాడు తను: అందుకు బదులుగా రెట్టింపులాభం చేసుకుంటాడు రేపు:
హఠాత్తుగా అతనికో ఆలోచన వచ్చింది.
నిటారుగా కూర్చున్నాడు.
అవును: ఇక్కడ లోకల్ గా కింగ్ మేకరు తను:
ఇవే ప్రయత్నాలు చిత్రద్వీప్ లో చేస్తే?